రసాయన రహిత వ్యవసాయం.. ఇదే ఇప్పుడు ‘ఆర్గానిక్ అగ్రికల్చర్‘గా ప్రసిద్ధి చెందింది. దీన్నే ప్రక్రుతి వ్యవసాయ పద్ధతి అంటున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా తయారు చేసిన ఎరువులు, క్రిమిసంహారకాలను మాత్రమే వినియోగించడం ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రత్యేకత. పశువుల పేడ, ఆవు మూత్రం, పచ్చి రొట్ట, వర్మీ కంపోస్టు లాంటి వాటిని మాత్రమే వాడి పంటలు పండించే విధానం ఇది. మన పూర్వీకులు ఈ విధానంలోనే వ్యవసాయం చేసేవారు. అలాంటి ఆహారం తినడం ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేవారు. ఆ రోజుల్లో జనాభా పరిమితం. దాంతో పంట ఏమాత్రం వచ్చినా వారికి ఆహరం లోటు ఉండేది కాదు.

కానీ.. రాను రాను ప్రపంచంలో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో ఆహార పదార్థాల కొరత ఏర్పడింది. పెరుగుతున్న జనాభాకు సరిపడినంతగా ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. దీంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు అధిక దిగుబడులనిచ్చే వంగడాలను కనిపెట్టారు. ఎక్కువ దిగుబడి సాధించే క్రమంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తప్పనిసరి అయింది. రసాయనాలు వాడిన ఆహార పదార్థాలు తిన్న మనిషి ఆరోగ్యంలో ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో మన శరీరం జబ్బుల నిలయంగా మారిపోయింది. బతుకే భారంగా మారిపోయింది.

ఈ నేపథ్యంలోనే ఆధునిక సమాజం సహజసిద్ధ పంటల సాగు వైపు అడుగులు మొదలెట్టింది. అడుగులే కాదు.. వడివడిగా నడకలు, పరుగులూ ప్రారంభించింది. ప్రక్రుతిసిద్ధమైన వ్యవసాయం, పంటల సాగును ఉద్యమంలా కొనసాగిస్తోంది. ఎందరెందరో ఆరోగ్యాభిలాషులు, ఉన్నత విద్యావంతులు, నెలనెలా లక్షల్లో జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా ప్రక్రుతి వ్యవసాయమే బెస్ట్ అంటూ ముందుకు వచ్చారు. ఇంకా ఎందరెందరో వస్తున్నారు.

మనం పిలుచుకునే ప్రక్రుతి వ్యవసాయానికి నీతి ఆయోగ్ ‘నేచురల్ ఫార్మింగ్‘ అనే పేరు సూచించింది. అత్యాధునిక సమాజంలోని నాగరీకులుగా చెప్పుకునే వారు దీన్నే ‘ఆర్గానిక్‘ లేదా ‘నేచురల్‘ ఫార్మింగ్ అంటున్నారు. ఆర్గానిక్ వ్యవసాయంలో స్థానికంగా లభించే బయో ఫెర్టిలైజర్లు, వర్మీ కంపోస్ట్ ఎరువుల్ని మాత్రమే వాడుతుండడం విశేషం.

నేచురల్ ఫార్మింగ్ (ప్రక్రుతి వ్యవసాయం) అనేది భారతదేశానికే సొంతం. ప్రక్రుతి మిత్రుడిగా ఆ నాటి రైతు ప్రవర్తించేవాడు. మిశ్రమ వ్యవసాయం, మిశ్రమ పంటల విధానాన్ని మన పూర్వీకులు ఆనాడే అనుసరించారు.

ప్రక్రుతి వ్యవసాయ విధానాన్ని విరివిగా అనుసరిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఈ తరువాత హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కూడా ప్రక్రుతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం 2020 మార్చి నాటికి ఏపీలో 0.62 మిలియన్ల రైతులు (మొత్తం రైతుల్లో 10.5 శాతం) ప్రక్రుతి వ్యవసాయం ప్రోగ్రాంలో నమోదయ్యారు. వారిలో 0.44 మిలియన్ల (7.5 శాతం) రైతులు 0.45 మిలియన్ ఎకరాల్లో ప్రక్రుతి వ్యవసాయాన్ని ఇప్పుడు చేస్తున్నారు.

ప్రక్రుతి వ్యవసాయం ఉద్యమాన్ని గత కొన్ని దశాబ్దాలుగా రైతులు, ప్రజా సంఘాలవారు బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. తద్వారా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ ప్రక్రుతి వ్యవసాయ విధానం అమలులోకి వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో లక్ష మందికి పైగా రైతులు ప్రక్రుతి వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రం ఇటీవలే 2,000 ఎకరాల్లో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF) విధానాన్ని 10 ఆగ్రో క్లైమేట్ జోన్లలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ZBNF విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. ఇదే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. హిమాచల్ ప్రదేశ్ కూడా 2022 నాటికి ZBNF విధానాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానాన్ని మరిన్ని రాష్ట్రాల్లో, అధిక సంఖ్యలో రైతులు కూడా అనుసరించేందుకు సమాయత్తం అవుతుండడం గమనార్హం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here