వ్యవసాయంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం మితి మించడంతో మనం తినే ఆహారం విషతుల్యంగా మారింది. దీంతో క్యాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో రసాయనాలతో నిమిత్తం లేని ప్రకృతి వ్యవసాయం వైపు క్రమంగా పలువురు ఆకర్షితులవుతున్నారు. ఇంతకీ ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? దానిని మౌలిక సూత్రాలేమిటి? ప్రకృతి సాగు ఎలా చేయాలి? దాని వల్ల కలిగే లాభాలేమిటి? ఈ అంశాలను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
రసాయన ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు అవసరం లేకుండా ఒక్క దేశీ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగుచేయవచ్చు అన్నది ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు సుభాష్ పాలేకర్ గారి పాలేకర్ పద్ధతి. దీన్ని మొదట్లో జెడ్‌బిఎన్ఎఫ్ (Zero-Budget Natural Farming) అని పిలిచేవారు. కానీ ఆ తర్వాత ఇప్పుడు సుభాష్ పాలేకర్ నేచురల్ ఫామింగ్‌ (Subhash Palekar Natural Farming) అని వ్యవహరిస్తున్నారు. పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో 4 చక్రాలుంటాయి. అవి 1.బీజామృతం (Seed Dresser), 2.జీవామృతం (Fertilizer), 3.అచ్ఛాదన (Mulching), 4.వాఫ్స (Water Management).

ఈ వ్యవసాయానికి మొదట ప్రతి 30 ఎకరాలకి ఒక దేశవాళీ గోవు అవవసరం. ఈ వ్యవసాయానికి ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రియ ఎరువులు, బీజామృతం వంటి విత్తన శుద్ధి రసాయనం, నీమాస్త్రం, అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కీటక నాశనులు తయారు చేసుకొవాలి. ప్రకృతి వ్యవసాయంలో కేవలం దేశీ విత్తనాలనే విత్తుకొని సొంత విత్తన భాండాగారాలను ఏర్పాటు చేసుకోవాలి.
(1) బీజామృతం:-
కావాల్సిన పదార్ధాలు – బోరు/బావి/నది నీరు 20 లీటర్లు, నాటు ఆవు మూత్రం 5 లీటర్లు, నాటు ఆవు పేడ 5 కిలోలు (7 రోజులలోపు సేకరించినది), పొడి సున్నం 50 గ్రాములు, పాటిమట్టి/పొలం గట్టు మన్ను దోసెడు.
తయారీ విధానం : ఆవు పేడను ఒక పల్చటి గుడ్డలో మూటగా కట్టి 20 లీటర్ల నీరు ఉన్న తొట్టెలో 12 గంటలు ఉంచాలి. ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకొని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. రెండవ రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేతితో పిసికి ద్రవసారాన్ని నీటి తొట్టెలో కలపాలి. పేడ నీళ్ళున్న తొట్టెలో పొలం గట్టు మట్టిని పోసి కర్రతో కుడి వైపునకు కలియ తిప్పాలి. 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని, సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి కలిసిపోయే వరకూ కుడివైపునకు కలియ తిప్పాలి. అన్నీ కలిపిన తర్వాత 12 గంటలపాటు ఉంచాలి.
ఈ బీజామృతాన్ని ఒక రాత్రి అలాగే ఉంచి మరునాడు ఉదయం నుంచి 48 గంటలలోపే వాడుకోవాలి. విత్తనాలకు బాగా పట్టించి, వాటిని నీడలో ఆరబెట్టుకొని నాటడానికి సిద్ధం చేసుకోవాలి.
(2) జీవామృతం:-
జీవామృతాన్ని సహజమైన ఎరువుగా చెప్పవచ్చు. ఇది ద్రవ రూపంలోను, ఘన రూపంలోను రైతులు తమంతట తాము తయారుచేసుకోవచ్చు.
ద్రవ రూపం: కావాల్సిన పదార్ధాలు – దేశీ ఆవు పేడ 10 కేజీలు (వారంలోపు సేకరించినది), దేశీ ఆవు మూత్రం 5 నుండి 10 లీటర్లు, బెల్లం / నల్ల బెల్లం / చెరుకు రసం 4 లీటర్లు, ద్విదళ పప్పుల పిండి (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) 2 కేజీలు, బావి/బోరు/నది నీరు 200 లీటర్లు, పాటి మన్ను / పొలంగట్టు మన్ను దోసెడు.
తయారీ విధానం : తొట్టెలో గానీ డ్రమ్ములో గానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్ధాలన్నిటినీ కలిపి నీడలో 48 గంటలపాటూ ఉంచాలి. ప్రతి రోజు రెండు మూడు సార్లు కర్రతో కుడివైపునకు త్రిప్పాలి. (ఇది కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతుంది. ఇలా తయారైన జీవామృతాన్ని 48 గంటల తర్వాత ఒక వారం రోజులలోపే వాడేయాలి. అవసరమైతే ఎక్కువ మోతాదులో మళ్లీ తయారుచేసుకోవాలి). పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే చాలు. జీవామృతం వాడితే పొలానికి ఎటువంటి ఎరువుల అవసరం ఉండదు.

ప్రకృతి వ్యవసాయం మెళకువలు వివరిస్తున్న శ్రీ సుభాష్ పాలేకర్

ఘనరూపం: కావాల్సిన పదార్ధాలు – దేశీయ ఆవు పేడ 100 కేజీలు, దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు, బెల్లం 2 కేజీలు లేదా చెరుకు రసం 4 లీటర్లు, పప్పు ధాన్యం (శనగ, మినుము, పెసర, ఉలవ) 2 కేజీలు, పొలం గట్టు మన్ను 1/2 కేజీ.
తయారీ విధానం : పై పదార్ధాలన్నింటినీ చేతితో బాగా కలిపి 10 రోజులు నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత బాగా చీకిన ఆవు పేడలో కలిపి 1 ఎకరం పొలంలో వెదజల్లి దున్నాలి. దీన్ని తయారు చేసిన 7 రోజులలోపే వాడుకోవాలి. పంటకాలం మధ్యలో కూడా ఎకరానికి 100 కేజీల ఘన జీవామృతం వేసి మొక్కలకు అందించాలి.
మరో ఘన రూపం: కావాల్సిన పదార్ధాలు – 200 కేజీల బాగా చివికిన ఆవు పేడ, తయారుచేసుకున్న 20 లీటర్ల జీవామృతం.
ముందుగా పేడ ఎరువును పలుచగా పరచాలి. తర్వాత జీవామృతాన్ని పరచిన ఎరువుపై చల్లాలి. దీనిని బాగా కలియబెట్టి ఒక కుప్పలా చేసి దానిపై గోనె పట్ట కప్పాలి. 48 గంటలు గడచిన తర్వాత దీనిని పలుచగా చేసి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోనె సంచులలో నిల్వచేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ఘన జీవామృతం 6 నెలల వరకూ నిల్వ వుంటుంది.
(3) అచ్ఛాదన (Mulching) :-
పొలంలో మట్టిని ఎండనుండి, వాననీటి కోత నుండి, గాలినుండి రక్షించుకోవాలి. దీన్నే అచ్ఛాదన కల్పించడమనీ, మల్చింగ్ చేయడమనీ అంటారు. అచ్ఛాదన వల్ల భూమిలో తేమ నిరంతరం కొనసాగుతుంది, భూమి సారవంతమవుతుంది. పదేపదే నీరు పెట్టవలసిన అవసరం కూడా వుండదు. కుళ్ళిపోయి నేలలో కలిసిపోయే గడ్డి, ఆకులు వంటి ఏ వ్యర్ధ పదార్ధంతోనైనా అచ్ఛాదన చేసుకోవచ్చు. భూమికి అచ్ఛాదన మూడు రకాలుగా కల్పించవచ్చు.
1. మట్టిని రెండు అంగుళాల లోతున గొర్రుతో దున్నాలి. దీనిని మట్టితో అచ్ఛాదన అంటారు. 2. ఎండు గట్టి, కంది కట్టెలు, చెరకు పిప్పి, చెరకు ఆకు, రెమ్మలు, రాలిన ఆకులు – వీటితో నేలను అచ్ఛాదన చేయవచ్చు. పంటకోత తర్వాత వీటిని కాల్చడం సరికాదు. 3. నేలపై తక్కువ ఎత్తులో వ్యాపించే పంటలు వత్తుగా వేసుకోవడం లేదా వివిధ రకాల మొక్కలను వాటంతటవే పెరగనివ్వడం ద్వారా నేలకు అచ్ఛాదన కలిగించవచ్చు. దీన్నే సజీవ అచ్ఛాదన అంటారు.
(4) వాఫ్స (Water Management) :-
వాఫ్స అంటే నీరుపెట్టే విధానం, సూక్ష్మ వాతావరణం కల్పించడం. పొలం భూమిలో మట్టికణాల మధ్య 50% నీటి ఆవిరి, 50% గాలి ఉండేలా చేయడమే వాఫ్స ఉద్దేశం. పంట మొక్కలకు కావాల్సింది నీరు కాదు, నీటి ఆవిరి. మొక్క అవసరాన్ని గుర్తెరిగి సాగునీటిని అందిస్తేనే భూమిలో వాఫ్స ఏర్పడుతుంది. వాఫ్స క్రియ నిరంతరం జరుగుతూ వుంటుంది. మధ్యాహ్నం వేళలో చెట్టు/పంట మొక్క నీడ పడే చోటులో వరకూ వేళ్లు విస్తరించి వుంటాయి. ఆ పరిధికి వెలుపలికి నీరందిస్తే వాఫ్స ఏర్పడి నీరు సద్వినియోగమవుతుంది.

కీటక నాశనులు:-

1. నీమాస్త్రం
నీమాస్త్రం అనగా వేప (Neem) ప్రధాన ఔషధంగా కలిగిన ద్రావణం.
కావాల్సిన పదార్ధాలు : 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు, 1 కేజీ నాటు ఆవు పేడ, 5 లీటర్ల నాటు ఆవు మూత్రం, 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు.
తయారీ విధానం: ఈ పదార్ధాలన్నింటినీ ఒక తొట్టెలో లేదా డ్రమ్ములో వేసి బాగా కలియ త్రిప్పాలి. తర్వాత 24 గంటలపాటు నీడలో పులియబెట్టాలి. గోనె సంచి కప్పివుంచాలి. రోజుకు రెండుసార్లు చొప్పున ఉదయం, సాయంత్రం 2 నిముషాలపాటు కుడివైపునకు కలియతిప్పాలి. 24 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోసుకోవాలి. ఇదే నీమాస్త్రం. ఇలా తయారైన నీమాస్త్రాన్ని ఒక డ్రమ్ములో నిల్వచేసుకోవాలి. ఈ ద్రావణాన్ని నీటిలో కలుపకుండా నేరుగా పంటలపై సాయంత్రం పూట పిచికారి చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల, ఇతర చిన్న చిన్న పురుగుల నివారణకు ఉపయోగపడే ఈ ద్రావణాన్ని తయారుచేసుకొన్న వారం రోజులలోపు వాడేసుకోవాలి.
2. అగ్నిఅస్త్రం
కావాల్సిన పదార్ధాలు : నాటు ఆవు మూత్రం 20 లీటర్లు, దంచిన మిరపకాయలు 500 గ్రాములు, దంచిన పొగాకు (Tobacco) 1 కిలో, దంచిన వెల్లుల్లి (Garlic) పేస్టు.
తయారీ పద్ధతి: పై పదార్ధాలన్నింటినీ బానలో వేసి బాగా మరగ కాయాలి. 5 సార్లు పొంగు వచ్చే వరకూ మరగబెట్టి చల్లార్చాలి. 48 గంటలు పులియబెట్టిన తర్వాత పల్చటి గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే అగ్నిఅస్త్రం. ఎకరానికి 2 నుండి 2.5 లీటర్ల అగ్నిఅస్త్రాన్ని 100 లీటర్ల నీళ్ళతో కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత పురుగు, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగు, వేరు పురుగుల నివారణకు ఉపయోగపడే అగ్నిఅస్త్రం 3 నెలలపాటు నిల్వ వుంటుంది.
3. బ్రహ్మాస్త్రం
కావాల్సిన పదార్ధాలు : 2 కిలోల మెత్తగా నూరిన వేపాకు ముద్ద, 2 కిలోల శీతాఫలం ఆకుల ముద్ద, 2 కిలోల పల్లేరు (Tribulus Terrestris) / మారేడు (Aegle Marmelos) ఆకుల ముద్ద, 2 కిలోల ఉమ్మెత్త ఆకుల ముద్ద, 20 లీటర్ల నాటు ఆవు మూత్రం.
తయారీ విధానం : ముందుగా వేప, శీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను ముద్దగా నూరి సిద్ధం చేసుకోవాలి. నూరిన ఆకు ముద్దను 20 లీటర్ల ఆవు మూత్రంలో బాగా ఉడికించాలి. 4 పొంగు వచ్చే వరకూ కాచి 24 గంటలపాటు చల్లారనివ్వాలి. తర్వాత ఆ ద్రవాన్ని పల్చటి గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే బ్రహ్మాస్త్రం. దీన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో 6 నెలల వరకూ నిల్వ చేసుకోవచ్చు. ఎకరానికి 2 నుండి 2.5 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని 100 లీటర్ల నీళ్ళతో కలిపి పంటకు పిచికారీ చేసుకోవచ్చు.
ఇతర కీటక నాశన కషాయాలు:
1. దశపర్ణి కషాయం:
కావాల్సినవి : 200 లీటర్ల నీరు, దేశీ ఆవు పేడ 2 కేజీలు, దేశీ ఆవు మూత్రం 10 లీటర్లు, పసుపు పొడి 200 గ్రాములు, శొంఠి పొడి 200 గ్రాములు లేదా 500 గ్రాముల అల్లం పేస్టు, పొగాకు 1 కేజీ, పచ్చిమిర్చి పేస్టు / కారంపొడి 1 కేజీ, వెల్లుల్లి పేస్టు 1 కేజీ, బంతి పువ్వులు – ఆకులు – కాండం 2 కేజీలు.
తయారీ పద్ధతి: వీటిని ముందుగా ఒక డ్రమ్ములో వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ దిగువ పేర్కొన్న పది ఆకులను కలుపుకోవాలి.
వేపాకు 3 కేజీలు, కానుగ (Indian Beech) ఆకులు 2 కేజీలు, ఉమ్మెత్త ఆకులు 2 కేజీలు, జిల్లేడు ఆకులు 2 కేజీలు, సీతాఫలం ఆకులు 2 కేజీలు, మునగ ఆకులు 2 కేజీలు, ఆముదం ఆకులు 2 కేజీలు, బేలిఆకు/లేంతెనా (Lantana) 2 కేజీలు, తులసి/అడవి తులసి 1/2 కేజీ, వావిలి (Vitex Negundo) ఆకులు 2 కేజీలు.
పైన పేర్కొన్న వాటన్నింటినీ డ్రమ్ములో వేసి కలుపుకోవాలి. డ్రమ్ములో వేసిన పదార్ధాలను రోజుకు 3 సార్లు కుడిచేతి వైపునకు మూడు నిముషాల పాటు తిప్పాలి. ఇలా 40 రోజులపాటు ప్రతిరోజు 3 నిమిషాలు కలియతిప్పాలి. ఇదే దశపర్ణి కషాయం. ఈ కషాయాన్ని 41వ రోజున పల్చటి కాటన్ గుడ్డతో వడబోసుకోవాలి. ఈ కషాయాన్ని 6 నెలలవరకూ వాడుకోవచ్చు. 200 లీటర్ల నీటిలో 6 నుండి 10 లీటర్ల కషాయాన్ని కలిపి వాడుకోవాలి. ఈ మోతాదు ఒక ఎకరానికి సరిపోతుంది. దశపర్ణి కషాయం వరిలో రసం పీల్చే పురుగులను, మామిడిలో బూడిద తెగులును నివారిస్తుంది.

శీలీంధ్ర/ఫంగస్ (Fungus) నాశనులు:

1. గోబాణం :- 100 లీటర్ల నీటిలో 6 లీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి ఒక ఎకరం పంటపై పిచికారి చేస్తే పంటను ఫంగస్ బెడద నుండి కాపాడుకోవచ్చు. దీన్ని గోబాణం అని అంటారు.
2. శొంఠిపాల కషాయం :- 200 గ్రాముల శోంఠి పొడిని 2 లీటర్ల నీటిలో కలిపి ఒక లీటరు మిగిలేవరకూ మరగబెట్టాలి. వేరే పాత్రలో 5 లీటర్ల దేశీ ఆవుపాలు/గేదె పాలను తీసుకొని 2 లీటర్ల పాలు మిగిలేవరకు మరగకాయాలి. ఈ పాలలో పై మీగడను తీసివేయాలి. తర్వాత 200 లీటర్ల నీటిలో ముందుగా పాలను కలిపి, తర్వాత శొంఠి కషాయాన్ని కలిపి 3 నుండి 5 నిముషాలు కుడివైపునకు కలియతిప్పాలి. ఇలా తయారైన శొంఠి అస్త్రాన్ని 48 గంటలలోపు ఒక ఎకరం పంటపై పిచికారీ చేయాలి.
20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటితో కలిపి ఒక ఎకరం పంటపై చల్లుకుంటే కీటకాలను నిరోధించవచ్చు.
బాగా ఎండిన 5 కేజీల దేశీ ఆవు పేడను పొడి చేసి గుడ్డలో మూటకట్టి 200 లీటర్ల నీటిలో వేలాడగట్టి ఉంచాలి. 48 గంటల తర్వాత పేడ మూటను బాగా పిండాలి. సారం అంతా నీటిలో దిగుతుంది. ఆ నీటిని వడబోసి 1 ఎకరం పంటపై చల్లుకోవాలి.
పంటల నాణ్యత పెంచే ద్రావణం:
1. సప్త ధాన్యాంకుర కషాయం :-
నువ్వులు 100 గ్రాములు, పెసలు 100 గ్రాములు, మినుములు 100 గ్రాములు, ఉలవలు 100 గ్రాములు, బొబ్బర్లు (అలసందలు) 100 గ్రాములు, శెనగలు 100 గ్రాములు, గోధుమలు 100 గ్రాములు.
వీటన్నంటినీ మొలకలు వచ్చేలా తడిగుడ్డలో కట్టుకోవాలి. మొలకలు వచ్చిన తర్వాత తీసి రోటి పచ్చడిలా రుబ్బుకోవాలి. 200 లీటర్ల నీళ్ళు, 5 లీటర్ల దేశీ ఆవుమూత్రం కలిపిన డ్రమ్ములో ఈ పచ్చడిని వేసి 24 గంటలపాటు నీడలో ఉంచి మూడుపూటలా 3 నిముషాలపాటు కుడి వైపునకు తిప్పాలి. తర్వాత గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే పంటల నాణ్యత పెంచే ద్రావణం.
పంటను కోసే 2 లేదా 3 వారాల ముందుగా ఈ ద్రావణాన్ని 1 ఎకరం పంటపై పిచికారీ చేస్తే గింజల్లో తాలు ఉండదు. ధాన్యం నిగనిగలాడుతూ ఎక్కువ బరువు తూగుతుంది. మామిడి కాయలు కోతకు వారం ముందు ఈ ద్రావణాన్ని కాయలపై పిచికారీ చేస్తే కాయలు నిగనిగలాడుతూ వుండి ఎక్కువ కాలం నిల్వవుంటాయి. ఈ విధానంలో చేసే ప్రకృతి సాగు వల్ల అధిక దిగుబడితో పాటు ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి. భూసారం పెరుగుతుంది. వ్యవసాయం మళ్లీ నిజమైన పండుగగా మారుతుంది.

– A D REDDY,
Ph. 9885955999

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here