ఈ భూగోళాన్ని, భూమ్మీద ఉన్న జనాన్ని పీడిస్తున్న అన్ని రోగాల్నీ నయం చేయగల ఒకే ఒక్క మొక్క ఉంది. అదే మునగ (Moringa). ఘాటు వాసనతో మన పెరట్లో కూడా సులువుగా పెరిగే మొక్క మునగ. ఫెర్న్‌ జాతికి చెందిన మొక్క ఇది. మునగ మొక్క పెరిగేందుకు ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు. నిస్సారంగా మారిన నేలను కూడా సారవంతం చేయడం మునగ మొక్క దిట్ట.

మునగమొక్క ద్వారా భూమికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నీటిని పరిశుభ్రం చేస్తుంది. అడవులు అంతరించిపోకుండా కాపాడుతుంది. భూసారాన్ని పెంచుతుంది. పోషకాహార సమస్యను పోగొడుతుంది. రైతులకు మంచి ఆదాయ వనరుగా ఉంటుంది. మునగ వల్ల ఆహార, ఆరోగ్య భద్రత కలుగుతుందని వృక్ష శాస్త్రజ్ఞుడు, తోటల పెంపకంలో ఔత్సాహికుడు కస్తూరి వెంకట్ అంటారు. క్యాన్సర్‌ రాకుండా మునగ కాపాడుతుంది. జీర్ణకోశ సంబంధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఊబకాయాన్ని తగ్గించే గుణం మునగలో ఉంది. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుతున్న ఇమ్యూనిటీ మునగ వల్ల బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ లాభాలన్నీ మనకు మునగా ఆకుతో లభిస్తాయి.మునగ ఆకులో 46 రకాల విటమిన్లు, మినరల్స్, ఎమినో యాసిడ్లు ఉన్నాయి. మునగ ఆకులో 110 రకాల పోషకాలు ఉన్నాయి. మునగ ఆకును సూపర్ ఫుడ్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఐరోపా, నార్త్ అమెరికా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మునగాకుకు మంచి గిరాకీ ఉంది. మునగాకును కారప్పొడి మాదిరిగా చేసుకుని అల్పాహారాల్లో నంజుకోవచ్చు. సలాడ్స్, ఆహార పదార్థాలపైన, పిజ్జా పైన డ్రెస్సింగ్ కింద మునగాకును వినియోగిస్తున్నారు. మునగాకుతో రెడీ టు డ్రింక్ బేవరేజెస్ చేస్తున్నారట. హెర్బల్ టీలు, గ్రీన్ టీలలో కూడా మునగాకు పొడిని విరివిగా వినియోగిస్తున్నారు.

భారతదేశంలో కూడా మునగ ఆకు విశిష్టతను ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. నిజానికి మునగాకులో గొప్పదనాన్ని మన పూర్వీకులు నాలుగైదు వందల ఏళ్ల క్రితమే గుర్తించారు. ఆధునిక సమాజంలో మునగాకు ప్రాశస్త్యం గురించి చెప్పేవాళ్లు కూడా ఎవరూ లేరు.మునగ ఆకును ప్రాసెస్ చేసి, పొడిగా మార్చి ఎగుమతి చేస్తే విదేశీ మారకద్రవ్యం ఇబ్బడిముబ్బడిగా వస్తుంది. పైగా ఇతర పంటలన్నింటి కంటే మునగాకు పంటకు పెట్టుబడి తక్కువ. ఆదాయం ఎక్కువ. ఒకసారి మునగాకు విత్తనం భూమిలో నాటితే 30 ఏళ్ల వరకు రెండు నెలలకోసారి పంట వస్తూనే ఉంటుంది.

అనేక లాభాలతో పాటు సర్వరోగ నివారిణి మునగాకు సాగుచేసేందుకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరు యువకుడు అమర్ ఉత్సాహంగా ముందడుగు వేశారు. మొత్తం 80 ఎకరాల్లో మునగ మొక్కల సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు అస్సలు వాడకుండా పూర్తి ఆర్గానిక్ విధానంలో మునగాకు పంట పండిస్తున్నారాయన. అంతర్జాతీయ మార్కెట్లో ప్రమాణాలకు నిలబడాలంటే మునగాకు పొడిలో ఎలాంటి రసాయన మూలకాలు ఉండకూడదట. తాము పండించే మునగాకును బయటికి అమ్మబోమని, వాల్యూయాడెడ్ ప్రాసెస్ చేసి, అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా పౌడర్ గా తయారుచేస్తామంటున్నారాయన. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలువురు రైతులను ఉత్సాహపరిచి 600 ఎకరాల్లో మునగాకు పంట వేయించామన్నారు. మునగాకు పంట పండించేందుకు ముందుకు వచ్చే చిన్న కమతాల రైతులకైనా, పెద్ద కమతాల రైతులకైనా తామే ప్రత్యేకంగా ఆర్గానిక్ విధానంలో తయారు చేసిన మునగ విత్తనాలు ఉచితంగా అందజేస్తామన్నారు. ఆ విత్తనాలు కేవలం మునగాకు పంట కోసం మాత్రమే తాము రూపొందిస్తామన్నారు. విత్తనాలు ఇచ్చిన రైతుల వద్ద బై బ్యాక్ కాంట్రాక్టుతో తాజా మునగాకును కిలో ఐదు రూపాయలకు తామే కొనుగోలు చేస్తామన్నారు. ఆర్గానిక్ మునగ విత్తనాలను తాము 20 ఎకరాల్లో ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తున్నామని అమర్ తెలిపారు. తమ ఫాంలో 60 ఎకరాల్లో హై ఇంటెన్సిటీ, హై డెన్సిటీతో మునగాకును పండిస్తున్నామన్నారు.

తమ పొలంలో పండిన, బై బ్యాక్ కాంట్రాక్టు రైతుల నుంచి తీసుకున్న తాజా మునగాకును శుభ్రంగా కడిగి, డీ హైడ్రేట్ చేసి, స్టెరిలైజ్ చేసి, ప్రపంచస్థాయిలో హైజినిక్ విధానంలో పౌడర్ చేస్తామని అమర్ చెప్పారు.

మునగాకు మొక్క వరుసల మధ్య ఐదు అడుగుల దూరం పెట్టాలని యువరైతు అమర్ చెబుతున్నారు. మొక్కల మధ్య అడుగున్నర దూరం ఉండాలన్నారు. ఇలా చేస్తే ఒక ఎకరం భూమిలో 5,500 మునగ మొక్కలు నాటవచ్చన్నారు. మొక్క నాటిన 100 నుంచి 110 రోజుల్లో మొదటి పంట చేతికి వస్తుందని, ఆపైన ప్రతి 55 నుంచి 60 రోజులకోసారి మునగాకు పంట వస్తుందన్నారు. ఒక్కో మొక్క నుంచి రెండు నెలలకోసారి కిలో ఆకు వస్తుందని, అంటే ఒక ఎకరంలో సుమారుగా 5 టన్నులు తాజా మునగాకు వస్తుంది. మొక్కలు నాటిన తొలి ఏడాది ఐదుసార్లు పంట చేతికి వస్తుంది. తొలి ఏడాది 25 టన్నుల తాజా మునగాకు వస్తుంది. ఆ తర్వాతి సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఆరుసార్లు మునగాకు పంట వస్తుంది. దాంతో ఏటా 30 టన్నుల తాజా మునగాకు పంట వస్తుంది. బై బ్యాక్ కాంట్రాక్టు చేసుకున్న రైతుల నుంచి తాము తాజా ఆకును కిలో 5 రూపాయలకు కొంటామన్నారు. ఆ రేటులో 30 టన్నులకు ఏటా 1.5 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది.

నూటికి నూరుశాతం ఆర్గానిక్ విధానంలో సాగుచేసే వారికి మాత్రమే తాము ఉచితంగా ఆర్గానిక్ మునగ విత్తనాలు సరఫరా చేస్తామని అమర్ చెప్పారు. రసాయన అవశేషాలు, పురుగు మందుల అవశేషాలు, ఫంగస్ అవశేషాలు, సింథటిక్ పాలిటైజ్డ్ అవశేషాలు అస్సలు లేకుండా మునగాకు పంటలో ఉండాలన్నారు. నూరు శాతం ఆర్గానిక్ విధానంలోనే మునగాకును తాము ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఆర్గానిక్ విధానంలో మునగాకు వ్యవసాయం ఎలా చేయాలి? సమగ్ర ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలో తమతో టై అప్ అయిన రైతుల్లో సెమినార్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. మామూలుగా పండించే మునగాకు పంట కంటే ఆర్గానిక్ పద్ధతిలో చేసే పంటకు ఖర్చు కూడా బాగా తక్కువ అవుతుందన్నారు. ఆర్గానిక్ వ్యవసాయ విధానంలో ఒక ఎకరాకు ఏడాది పాటు మునగాకు పంట పండించడానికి 30 నుంచి 40 వేల రూపాయల ఖర్చు అవుతుంది. ఏడాదికి ఒక ఎకరా మునగాకు పంట ద్వారా వచ్చే ఆదాయం 1.5 లక్షల నుంచి ఖర్చు 30 నుంచి 40 వేలు తీసేస్తే లక్షా పది వేల నుంచి 20 వేల దాకా నికర ఆదాయం వస్తుందని అమర్ వివరించారు.

ఒక ఉద్యోగికి ప్రతి నెలా ఆదాయం వచ్చే మాదిరిగా మునగాకు పంటతో ప్రతి రెండు నెలలకు ఒకసారి రైతుకు ఠంచనుగా ఆదాయం వస్తుంది. ఏడాదికి రెండుసార్లు వరి పంట చేతికి వస్తే.. ప్రత్తి, చెరుకు పంటలు సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఆదాయం వస్తుంది. మునగ కాయల పంట కంటే 70 నుంచి 80 శాతం వరకు పంటపై క్రిమి కీటకాల బెడద ఉండదు. పైగా ఆర్గానిక్ విధానంలో మునగాకు పండించడం చాలా సులువు కూడా.

తమ మునగాకు ప్రాసెస్ ఫ్యాక్టరీకి గంట, గంటన్నర ప్రయాణ దూరంలో ఉన్న పొలాల సన్న చిన్నకారు రైతులు మునగాకు పంట వేసుకుంటే మంచిదని అమర్ సలహా. హైజినిక్ విధానంలో తాము మునగాకు ప్రాసెస్ చేయడానికి ఆకు కోసిన తర్వాత గంట, గంటన్నర సమయం లోపు తమకు అందేలా ఉండాలన్నారు. అంతకు మించి సమయం దాటితే ఫర్మంటేషన్ తదితర రకాలుగా మునగాకు పాడయ్యే అవకాశం ఉందన్నారు. అందుకే తమ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలోని రైతులను చిన్న కమతాలైనా, పెద్ద కమతాలైనా ప్రోత్సహిస్తున్నామని అమర్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2 వేల 400 పైచిలుకు ఎకరాల్లో మునగాకు పంటను ఆర్గానిక్ విధానంలో రైతులు పండిస్తున్నారని సంగారెడ్డి జిల్లా హార్టీకల్చర్ అధికారిణి వెల్లడించారు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో ఇప్పుడు బాగా అవగాహన పెరిగిందన్నారు. మునగాకు సూపర్ ఫుడ్ అని అనడంతో దీని పట్ల క్రేజ్ బాగా పెరిగిందన్నారు. 2014-15 సంవత్సరంలో మునగాకు ఎగుమతి ద్వారా సుమారు 12 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యం వచ్చిందన్నారామె. 2015-16 సంవత్సరంలో దాదాపు 16 నుంచి 17 కోట్ల మేరకు మునగాకు ఉత్పత్తుల ఎగుమతి ద్వారా విదేశీ మారకద్రవ్యం వచ్చిందట. మునగాకు ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా ఏడాదికి 26 వేల కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యం సంపాదించే అవకాశం ఉందంటున్నారు హార్టీకల్చ్ అధికారిణి.

రంగారెడ్డి జిల్లాలోని ప్రగతి రిసార్ట్స్ ఆవరణలో 400 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా ఆర్గానిక్ విధానంలో మునగాకు పంట పండిస్తున్నట్లు ఆ సంస్థ సీండీ డాక్టర్ జీవీకే రావు తెలిపారు. అనేక పోషక విలువలున్న మునగాకును మనం మర్చిపోయామని డాక్టర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము పండిస్తున్న మునగాకు పంట మొత్తం విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, స్థానిక మార్కెట్ ను నెమ్మది నెమ్మదిగా పెంచుతామని డాక్టర్ రావు అన్నారు. ప్రతి వ్యక్తికి రోజుకు 6 మిల్లీ గ్రాముల మునగాకు ఆహారం అందిస్తే ఏడాదికి 6 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని రావు విశ్లేషణ.

తెలంగాణ రాష్ట్రంలో మునగాకు పంటను విరివిగా పండించేందుకు, వినియోగించేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర వ్యవసాయాధికారి వెల్లడించారు. ప్రతి వ్యక్తి రోజుకు 6 గ్రాముల మునగాకు పౌడర్ వినిగించేలా చేస్తే ఒక్క తెలంగాణలోనే 6 లక్షల ఎకరాల్లో మునగాకు సాగు చేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. ఆయిల్ ఫాంలో అంతర పంటగా మునగాకు మొక్కలు పెంచవచ్చన్నారు. స్థానికంగా వినియోగించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఏటా 80 వేల కోట్ల రూపాయల ఆదాయం పొందవచ్చని చెప్పారు. ఆ మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.

చూశారుగా..! సర్వరోగ నివారిణి, వందల పోషకాలతో నిండి ఉండి, దేశీయ, అంతర్జాతీయ ఆదాయాన్ని సంపాదించిపెట్టే మునగాకు పంట వైపు అన్నదాతలు అడుగులు వేస్తే అందరికీ మేలు. మున్నూరు లాభాలు తెచ్చే మునగతో ఆరోగ్య సమాజాన్ని ఏర్పాటు చేసుకుందాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here