మారుతున్న ఈ ఆధునిక కాలంలో ప్రతి మనిషి ప్రకృతి వైపు పరుగులు పెడుతున్నాడు. ప్రతి ఒక్కరిలోనూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరింతగా పెరుగుతోంది. ఈ కోవలోకే మన తెరవేల్పులు (సినీ నటులు) కూడా వస్తున్నారు. నటీనటులు అనేక మంది కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా గ్రామాలను ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఫాంహౌస్‌లు ఏర్పాటు చేసుకుని ఖాళీ సమయాల్లో ప్రకృతితో మమేకం అవుతున్నారు. మరికొందరు నటీనటులు ఫాంహౌస్‌ ఆవరణలో ప్రకృతి సిద్ధంగా పంటలు పండించుకుని వాటినే వినియోగించి ఆనందంగా గడుపుతున్నారు. ఇలా చేస్తున్న వారిలో బహుభాషా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఒకరు. శంషాబాద్‌ సమీపంలో తన ఫాంహౌస్‌ ‘లైఫ్‌ ఎట్‌ ప్రకాశం’లో లాక్‌డౌన్‌ సమయాన్ని తన భార్య పోనీ వర్మ, కొడుకు వేదాంత్‌తో ఆనందంగా గడిపారు.ప్రకాశ్‌రాజ్‌ ఫాంహౌస్‌లో మామిడి, జీడిమామిడి, ఉసిరి లాంటి ఎన్నెన్నో పండ్లు, ఇతరత్రా ఫలసాయాన్నిచ్చే అనేక మొక్కలు పెంచుతున్నారు. సొర (ఆనప) కాయలు, కాయగూరలు, రకరకాల ఆకుకూరలు పండిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌ ఫాంహౌస్‌లో వేసే ప్రతి పంట సహజ వ్యవసాయ సాగు విధానంలో పండిస్తుండడం గమనార్హం.

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ అప్పుడప్పుడూ ప్రకృతితో మమేకం అయిపోతుంటారు. ఒక్కోసారి ఒంటరిగానే లాంగ్ డ్రైవ్ వెళ్లిపోతారు. పూర్తి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే ప్రకృతి మధ్యలోకి వెళ్లిపోతారు. అక్కడే ఓ టెంట్ వేసుకుని తనకు నచ్చినన్ని రోజులు ప్రకృతితో మాట్లాడుతూ గడిపేస్తారు.ప్రకాశ్‌రాజ్ తన ఫాంహౌస్‌లో కొన్ని దేశీ ఆవులను పెంచుతున్నారు. తాజా తాజా ఆవు పాలనే వినియోగిస్తుంటారు. కొడుకు వేదాంత్‌తో కలిసి ఆవుల మధ్య ఆనందంగా గడుపుతుంటారు. ఆవులకు స్వయంగా దాణా వేసి లాలనగా చూసుకుంటారు. తన ఫాంహౌస్‌లో పండిన మామిడి కాయలతో ఆవకాయ పచ్చడిని ప్రకాశ్‌రాజే స్వయంగా పెట్టుకుంటారు.

సహజసిద్ధంగా తాను పండించే పంటల ఫొటోలను ప్రకాశ్‌రాజ్ అప్పుడప్పుడు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేస్తుంటారు. నిజానికి సహజ పంటల సాగులో పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నుంచి ప్రకాశ్‌రాజ్‌ స్ఫూర్తి పొందారట. పవన్ కళ్యాణ్‌ కూడా తన ఫాంహౌస్‌ రకరకాల పంటల్ని సహజ వ్యవసాయ సాగు విధానంలో పండిస్తుంటారు. పలు ఆవులను కూడా పవన్ కళ్యాణ్ పెంచుతున్నారు. ఆవుల్ని, వాటి దూడల్ని కూడా పవన్ కళ్యాణ్ ఎంతో ప్రేమగా సాకుతుంటారు.విశేషం ఏమిటంటే ప్రకాశ్‌రాజ్ తాను పండించిన పంటల్ని తాము వినియోగించుకోడానికి కావల్సినవి ఉంచుకుని మిగతావి మార్కెట్‌కు వేస్తారు. మామిడికాయలు కోసి, తన కొడుకు వేదాంత్‌ను వాటి దగ్గర నేలపై కూర్చోపెట్టి, వాటిని వేదాంత్ అమ్ముతున్నాడంటూ ప్రకాశ్‌రాజ్ పెట్టిన పోస్టు పలువురిని ఆకట్టుకుంది.

ప్రకాశ్‌రాజ్ ఓసారి తన ఫాంహౌస్‌లో పండిన జీడిమామిడి కాయల్ని కోస్తున్న ఫోటో ఒకటి ట్విట్టర్‌లో పెడితే మంచి స్పందన వచ్చింది. జీడిమామిడి పళ్లు, మామిడికాయలు ఓ బల్లపై పెట్టి, వేదాంత్‌ను ఓ కుర్చీలో కూర్చోబెట్టిన అమ్ముతున్నట్లు ఓ ఫొటోను ప్రకాశ్‌రాజ్‌ ట్విట్టర్‌ పెట్టారు.ప్రకాశ్‌రాజ్‌  అప్పుడప్పుడూ కొడుకు వేదాంత్‌ను ట్రాక్టర్‌పై ఎక్కించుకుని ఫాంహౌస్‌ అంతా సరదాగా తిరుగుతారు. తాము పండించిన కాయగూరలు, పళ్లను స్వయంగా కోస్తారు. వ్యవసాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని ప్రకాశ్‌రాజ్‌ చెబుతుంటారు. అందుకే షూటింగ్‌ విరామ సమయాల్లో తప్పకుండా ఫాంహౌస్‌లో వాలిపోయి వ్యవసాయం చేసే ప్రకాశ్‌రాజ్‌ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here