మగజొన్నలు లేదా తెల్లజొన్నల్లో మన శరీర నిర్మాణానికి అవసరమయ్యే మాంసకృత్తులు, శక్తిని ఇచ్చే పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇనుము, కాల్షియం, విటమిన్ బీ 1, బీ 2, బీ3, బీ 5, ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం లాంటి ఖనిజ లవణాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. మెగ్నీషియం, కాపర్, జింక్ కూడా బాగా ఉన్నాయి. తెల్లజొన్న వంటకాలు తరచూ తీసుకుంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు ఆరోగ్య నిఫుణులు. జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంటే జొన్న ఆహారం ఎవరికైనా మంచిదనే చెప్పాలి. జొన్నల్లో ఫైబర్ అధికం. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో పాటు మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తెల్ల జొన్న ఎముకల ఆరోగ్యాన్ని బాగా కాపాతుంది. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధుల ముప్పు తప్పుతుంది. జొన్న రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జొన్నల్లో ఉండే బీ 6 విటమిన్ మనం తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణం అయ్యేలా చేసి, శక్తిగా మారుస్తుంది. బాలింతలకు జొన్నలు మంచి ఆహారం. వీటిలోని ప్రోటీన్లు పిల్లల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి తెల్లజొన్నలు పండించే నంద్యాల జిల్లాలోని పెద్దకొట్టాల రైతు ఐబత్తుల వెంకటేశ్వరరావు అనుభవాలు, లాభనష్టాలు, సాగు విధానం గురించి తెలుసుకుందాం.వెంకటేశ్వరరావు సుమారు 50 ఏళ్ల నుంచి తెల్లజొన్న పంట సాగు చేస్తున్నారు. ఎకరం నేలలో తెల్లజొన్న సాగు కోసం ఏడున్నర కిలోల విత్తనం అవసరం అవుతుంది. భారీ మొత్తంలో సాగు చేసేవారు ట్రాక్టర్‌కు సీడ్ డ్రిల్ పెట్టి విత్తనాలు నాటుకోవాల్సి ఉంటుంది. వెంకటేశ్వరరావు. ఆరు చెక్కల గొర్రుతో సాలు మార్చి సాలులో విత్తనాలు వేస్తారు. కిలో విత్తనాలకు రూ.100 ఖరీదు ఉంటుంది. విత్తనాలు వేసేందుకు ట్రాక్టర్‌కు ఎకరాకు వెయ్యి రూపాయలు కిరాయి అవుతుంది. ఎకరం నేలలో దుక్కి దున్నేందుకు రూ.12 వేల దాకా ఖర్చు అవుతుంది. మొక్కల మధ్య బోదెలు వేసుకుని, వాటి ద్వారా నీరు పారిస్తే మొక్కలకు సమృద్ధిగా అందుతుందన్నారు.రైతు వెంకటేశ్వరరావు ప్రతి ఏటా సెప్టెంబర్ 10 వ తారీఖున విత్తనాలు వేస్తారు. అంతకు ముందరి పంటగా మొక్కజొన్న వేస్తారు. ఆ పంట తీసిన తర్వాత మళ్లీ తెల్లజొన్న కొసం భూమిని సిద్ధం చేసుకుంటామని చెప్పారు. తెల్ల జొన్న పంట 90 రోజులకు చేతికి వస్తుంది. డిసెంబర్ నెలాఖరుకు తెల్లజొన్న పంట కోత పూర్తయిపోతుంది. జనవరిలో పంట అమ్మకం అవుతుంది.తెల్లజొన్న పండించే భూమిలో డీఏపీ, యూరియా, కాంప్లెక్స్ ఎరువులు ఒక ఎకరానికి 8 బస్తాలు వేస్తామని వెంకటేశ్వ రరావు తెలిపారు. అంటే 10 నుంచి 12 వేల రూపాయల ఖర్చు ఎరువులకు అవుతుంది. పురుగు మందుల కోసం రూ.5 వేలు ఖర్చవుతుందన్నారు. పంట చేతికి వచ్చే లోగా మూడు నాలుగుసార్లు పురుగుమందులు కొడితే తెల్లజొన్న కంకులు ఏపుగా, గింజలు బలంగా వస్తాయి. పురుగుమందులు కొట్టకపోతే కంకులకు బంకలాంటి వచ్చి సరగి దిగుబడి తగ్గుతుందన్నారు రైతు వెంకటేశ్వరరావు. పురుగు మందులు కొట్టకపోతే రసం పీల్చే పురుగు ఆశించి, కంకులు సన్నగా వస్తాయి. దిగుబడి తగ్గిపోతుందని వెంకటేశ్వరరావు అనుభవపూర్వకంగా తెలిపారు. అంటే ఎకరం నేలలో విత్తనాలు, దుక్కి, ఎరువులు, పురుగు మందుల కోసం సుమారు రూ.32 వేలు వరకు ఖర్చు అవుతుంది.తెల్లజొన్న పంట బాగా పండాలంటే మూడుసార్లు నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుందని వెంకటేశ్వరరావు వివరించారు. 20 రోజుల వ్యవధిలో తెల్లజొన్న పంటకు నీటిని అందించాలన్నారు. తెల్లజొన్న కోత కోసే కూలీలకు 2 క్వింటాళ్ల జొన్నలు కూలి రేటుగా ఇస్తామన్నారు. తెల్లజొన్నలను కంకుల నుంచి గింజలను వేరుచేసే మిషన్‌కు రూ.2 వేలు కిరాయి అవుతుందని వెంకటేశ్వరరావు తెలిపారు. జొన్న చేను పొట్ట దశకు వచ్చినప్పుడు నీటితడి ఇస్తే.. కంకి పోడవుగా, గింజలు బలంగా పెద్దగా వస్తాయన్నారు. పొట్ట దశలో నీరు ఇవ్వకపోతే కంకులు చిన్నగా, గింజలు సన్నగా ఉంటాయని తెలిపారు. పొట్ట దశకు పైరు వచ్చే సరికే అంటే 40 రోజుల లోపలే ఎరువులు వేయడం పూర్తి చేయాలన్నారు. ఆ తర్వాత ఇక ఎరువులు వేసే అవసరం ఉండదన్నారు. అక్కడి నుండి కంకులకు బంక తెగులు రాకుండా పురుగుమందులు మాత్రం చల్లుకుంటే సరిపోతుందని చెప్పారు. ఎకరానికి తెల్లజొన్న పంట విత్తనం మొదలు పంట చేతికి వచ్చే వరకూ రూ.35 వేలు ఖర్చవుతుందన్నారు.రైతు చేసుకునే కష్టాన్ని బట్టి, ప్రతిరోజు పైరును పరిశీలించుకోవడాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి తెల్లజొన్న పంట దిగుబడి హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాగే ఒక్కోసారి తెల్లజొన్న గింజలకు పురుగులు కూడా పట్టే అవకాశాలు ఉంటాయని రైతు వెంకటేశ్వరరావు వెల్లడించారు. కంకి లోపల ఉండే గింజలను అవి తింటాయన్నారు. అలాంటప్పుడు కూడా ఎకరానికి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందన్నారు.తెల్ల జొన్న పండించే రైతు మార్కెట్ కోసం వెతికే పనే ఉండదని రైతు వెంకటేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్, నంద్యాల లాంటి చోట్ల నుంచి వ్యాపారులు జనవరిలో పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తారని చెప్పారు. తెల్లజొన్న సాగులో తక్కువ కష్టం ఎక్కువ ఆదాయం ఉందని వెంకటేశ్వరరావు వెల్లడించారు. మిగతా పంటలతో పోల్చుకుంటే తెల్లజొన్నకు పెట్టుబడి ఖర్చు తక్కువ అన్నారు. తెల్లజొన్న కంకి పాలుపోసుకునే దశలో పిట్టల బెడద ఉంటుందన్నారు. పాలుపోసుకునే సమయంలో తెల్లజొన్న గింజలు తియ్యగా ఉంటాయి కాబట్టి పిట్టలు వచ్చి తింటాయన్నారు.తెల్లజొన్న సాగు కాస్త శ్రద్ధపెట్టి చేసుకుంటే ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని రైతు తెలిపారు. నాణ్యమైన తెల్లజొన్నలు క్వింటాలుకు రూ.3 నుంచి రూ.4 వేల వరకు ధర పలుకుతుంది. తెల్లజొన్న చొప్పను పశువుల మేతగా అమ్మితే ఎకరానికి రూ.5 వేల వరకు వస్తుంది. తక్కువలో తక్కువ ఎకరంలో 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. క్వింటాలు రూ. 3 వేలు ధర పలికితే.. మొత్తం రూ.75 వేల ఆదాయం వస్తుందని రైతు వెంకటేశ్వరరావు వెల్లడించారు,. అంటే పంట పండించే రైతు లాభనష్టాల గురించి బేరీజు వేసుకోడు కానీ.. రూ.35 వేలు ఖర్చు చేసిన రైతుకు అతి తక్కువగా చూసుకున్నా మూడు నెలల్లో రూ.40 వేలు మిగులుతుంది. దిగుబడి, ధర ఎక్కువ అయ్యే కొద్దీ రైతుకు ఆదాయం, మిగులు కూడా పెరుగుతుంది.