చిక్కుడుకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చిక్కుడుకాయల వంటలు తిన్న వారికి కణాలు డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది. పలు రకాల రోగాలు రాకుండా కాపాడుతుంది. అలాగే వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను, రక్తపోటును తగ్గిస్తుంది. చిక్కుళ్లలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. తక్కువ కొవ్వు కలిగి ఉండి అధిక ప్రోటీన్లను అందిస్తుంది. చిక్కుళ్లలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌, కేలరీలు తక్కువ ఉంటాయి. చిక్కుళ్లు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. మన ఆరోగ్యానికి ఇలా ఎన్నో ప్రయాజనాలు చేకూర్చే చిక్కుడు పంట గురించి, ముఖ్యంగా ఆముదపు చెట్ల నీడలో తీగ చిక్కుడు పంట సాగు గురించి తెలుసుకుందాం.చిక్కుడు విత్తనాలను అక్టోబర్‌లో నాటుకుంటే పంట దిగుబడి ఫలితాలు బాగా ఉంటాయి. ధర కూడా బాగా వస్తుంది. కాకపోతే పురుగుల బెడద కాస్త ఎక్కువ ఉంటుంది. అయితే.. డిసెంబర్‌లో విత్తనాలు నాటితే పురుగుల బెడద తక్కువ ఉంటుందని, పంట దిగుబడి కాస్త తగ్గినా ఖర్చు తక్కువ వల్ల లాభసాటిగానే ఉంటుందని తీగజాతి చిక్కుడును వినూత్న రీతిలో సాగు చేస్తున్న నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేట రైతు మ్యాకల లక్ష్మీనారాయణ తన అనుభవంతో చెబుతున్నారు.లక్ష్మీనారాయణ చిక్కుడు సాగు విధానం అందరి రైతుల కన్నా కాస్త భిన్నంగా ఉంది. తీగ చిక్కుడు తోటలో ఆయన ఆముదం చెట్లు పెంచుతున్నారు. ఆముదం చెట్లు చిక్కుడు తోటలో లక్ష్మీనారాయణ ఎందుకు పెంచుతున్నారో విన్నప్పుడు ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా చిక్కుడు పంట చల్లని వాతావరణం లేదా ఎండ బాగా ఎక్కువ తగలని సమయంలో బాగా ఉంటుంది. దిగుబడి కూడా ఆ విధంగానే ఇస్తుంది. తీగ చిక్కుడుకు చల్లదనం కోసం, ఎండ ఎక్కువ తగలకుండా షేడ్‌ నెట్‌ వేసి కొందరు సాగు చేస్తారు. కానీ లక్ష్మీనారాయణ ఆముదం చెట్ల పెంపకం ఆలోచన అందరికీ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే.. ఆముదం చెట్ల నుంచి కూడా దిగుబడి వస్తుంది. దాంతో పాటు చిక్కుడు తీగకు చక్కని నీడ ఇస్తుంది. చిక్కుడు తీగ పైకి పాకేందుకు ఆధారంగా కూడా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. చిక్కుడు తీగకు పురుగుల బెడద కాస్త ఎక్కువనే చెప్పాలి. పురుగుల వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. కానీ… ఆముదం చెట్ల మధ్య తీగ చిక్కుడు పెంచితే.. చిక్కుడు తీగను ఆశించే పురుగులు ఆముదం ఆకుల మీద గుడ్లు పెడతాయి. పురుగుల నివారణ కోసం ఆముదం చెట్ల మీద పురుగు మందు చల్లుకుంటే సరిపోతుంది. చిక్కుడు తీగకు పురుగుల బెడద తగ్గిపోతుంది. పంట దిగుబడి కూడా పెరుగుతుంది.చిక్కుడు విత్తనాలను సాలుకు సాలుకు ఆరు అడుగుల దూరం ఉండేలా పాదులు చేసుకోవాలి. చిక్కుడు విత్తనాలను ఒకటిన్నర నుంచి రెండు అడుగుల దూరంలో నాటుకోవాలి. ఇలా నాటుకుంటే ఎకరం నేలలో 800 గ్రాముల తీగ చిక్కుడు విత్తనాలు సరిపోతాయి. రైతు లక్ష్మీనారాయణ డబుల్‌ లైన్ డ్రిప్‌ వేసి చిక్కుడు సాగు చేస్తున్నారు. వాతావరణం చల్లగా ఉంటే మూడు నాలుగు రోజులకోసారి రెండు మూడు గంటల పాటు నీరు పారిస్తే సరిపోతుందన్నారు. అదే కాస్త ఎండలు ఎక్కువ ఉంటే రెండు రోజులకోసారి నీరు సరఫరా చేయాల్ని ఉంటుందన్నారు. చిక్కుడుతీగ ఏప్రిల్‌, మేనెలలో కాయలు కాదు. మిగతా 10 నెలల పాటు తీగచిక్కుడు దిగుబడి ఇస్తూనే ఉంటుంది.చిక్కుడు విత్తనాలు అక్టోబర్‌లో నాటుకుంటే ఆ వాతావరణానికి పురుగులు ఎక్కువ వస్తాయని లక్ష్మీనారాయణ తెలిపారు. అక్టోబర్‌లో నాటిన చిక్కుడు పంటకు ధర కాస్త ఎక్కువగాను వచ్చినా, పురుగుల నివారణ కోసం మందుల వినియోగం, తద్వారా ఖర్చు కూడా ఎక్కువే ఉంటుందన్నారు. అదే డిసెంబర్‌లో నాటితే పంటకు ధర కొద్దిగా తక్కువ వచ్చినా.. పురుగుల బెడద నివారణ ఖర్చు తగ్గుతుంది కాబట్టి అంతే లాభం ఉంటుందన్నారు. చిక్కుడు తీగను ఎక్కువగా పండు ఈగ ఆశిస్తుందని, కాయను గుచ్చుతుందని, గుడ్లు పెడుతుందని చెప్పారు. వారానికి ఒకసారైనా పురుగుమందు కొడితేనే చిక్కుడు కాయలు మంచిగా వస్తాయన్నారు. మధ్యలో ఒక వారం కనుక పురుగుమందు కొట్టకపోతే.. చిక్కుడు కాయలను పురుగులు బాగా నష్టం చేస్తాయన్నారు. పురుగుల నివారణ కోసం తాము ఎండో సల్ఫాన్‌, క్లోరో ఫైరిపాస్‌, లద్దిపురుగు నివారణ కోసం బెంజిన్‌ కొడతామన్నారు. రెక్కల పురుగుల నివారణ కోసం సోలార్ ట్రాప్‌ కూడా పెడతామన్నారు. టబ్‌లలో బెల్లం కలిపిన మందు నీళ్లు తోటలో అక్కడక్కడా పెడతామని, బెల్లం వాసనకు పురుగులు ఆకర్షణకు గురై టబ్‌లో పడి చనిపోతాయన్నారు.  తాటికల్లు, ఈత కల్లు పెట్టినా వాటి వాసనకు పురుగులు వచ్చి పడిపోతాయని చెప్పారు. వాటితో పాటు అర ఎకరంలో పది నుంచి 15 వరకు గమ్‌ కవర్లను అక్కడక్కడా పెడతామన్నారు. ఈ విధంగా పురుగులను ఎక్కడికక్కడ అరికట్టుకుంటే పంట దిగుబడి బాగా పెరుగుతుందని తెలిపారు.తీగ చిక్కుడు విత్తనం నాటిన 60 రోజులకు తొలి కాపు వస్తుందన్నారు రైతు లక్ష్మీనారాయణ. అప్పటి నుంచి మూడు నెలల వరకు తీగచిక్కుడు పంట బాగా ఉంటుందన్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో పంట ఉండదు. మళ్లీ నీళ్లు పెట్టి సరిగా మెయింటెయిన్‌ చేస్తుఏ మళ్లీ జూన్‌, జులై నెలల్లో పంట దిగుబడి వస్తుంది. తొలిసారిగా పంట అర ఎకరంలో తమకు 15 కిలోల బరువుండే ఆరు నుంచి ఏడు బ్యాగుల వరకు అంటే సుమారు క్వింటాల్‌ దిగుబడి వచ్చిందని రైతు తెలిపారు. ఆ తరువాత రెండు మూడు రోజులకు ఒకసారి రెండు క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుందని చెప్పారు.  జనవరి; ఫిబ్రవరి నెలల్లో చిక్కుడు కిలో 50 రూపాయలు పలుకుతుందన్నారు. అదే అక్టోబర్‌లో నాటిన చిక్కుడు పంటకు రూ.70 నుంచి రూ.80 వరకు ధర వస్తుందని లక్ష్మీనారాయణ తెలిపారు. చిక్కుడు కాయలను రోజు మొత్తంలో ఏ సమయంలో అయినా తెంపుకోవచ్చు. కాకపోతే.. పాలిథిన్ సంచుల్లో వేసి మూసి పెట్టుకుంటే కాయలు వాడిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి.తీగ చిక్కుడ పంటకు లక్ష్మీనారాయణ ముందుగా దుక్కిలో పశువుల ఎరువు, కొద్దిగా కోళ్ల ఎరువు వేశారు.  ఆ తర్వాత డ్రిప్‌ ద్వారా తమ అర ఎకరంలో మూడు 19లు, 13-00-45 లాంటి ఎరువులు వారం రోజులకోసారి కిలో చొప్పున ఇస్తామని తెలిపారు. తీగ చిక్కుడు ఎక్కువ పెరిగితే పంట తగ్గుతుందని, తక్కువ పొడవుతో బలంగా పెరిగితే దిగుబడి పెరుగుతందని లక్ష్మీనారాయణ వివరించారు. తీగచిక్కుడు తోటలో తక్కువ తక్కువ నీరు ఇస్తుంటే.. కలుపు అంతగా రాదని, వారం పది రోజులకు ఒకసారి కలుపు తీసుకుంటే పంట ఏపుగా బలంగా వస్తుందన్నారు.ఆముదం విత్తనాలను 8 అడుగుల దూరంలో నాటినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. దాంతో పాటు చిక్కుడు తీగా పైకి ఎగబాకేందుకు 8 అగుడుల దూరంలో సర్వేచెట్టు కర్రలు నాటి వాటికి నైలాన్ తాడు పందిరి మాదిరిగా కట్టామన్నారు. చిక్కుడు తీగ కాస్త పైకి రాగానే చివరన కత్తిరించామని, అలా వారానికి ఒకసారి మూడు నాలుగు సార్లు కత్తిరించినట్లు చెప్పారు. దీంతో చిక్కుడు తీగకు కొమ్మలు బాగా ఎక్కువ వచ్చాయని, అవన్నీ ఒక్కసారిగా నైలాన్ పందిరి పైకి గుబురుగా వచ్చాయన్నారు. చిక్కుడు తీగ పైకి పాకించడం వల్ల తక్కువ మంది కూలీలతో ఎక్కువగా కాయను తెంపుకుంటున్నట్లు చెప్పారు. అదే చిక్కుడు నేలపై పాకితే కూలీల ఖర్చు ఎక్కువ అవుతుందని, పాములు కూడా ఉండే ప్రమాదం ఉందన్నారు. చిక్కుడు తీగ పందిరి మీద ఉంటే ఒక కూలీ రోజుకు క్వింటాల్ వరకు తెంపుతారన్నారు. తీగచిక్కుడును తన పద్ధతిలో మెయింటెయిన్ చేస్తే అర ఎకరంలో కనీసం 30 క్వింటాళ్ల వరకు దిగుబడి తీయొచ్చని లక్ష్మీనారాయణ చెప్పారు.తీగ చిక్కుడుకు ఎర్రనేల చాలా అనుకూలమని రైతు తెలిపారు. తీగ చిక్కుడు పంటను ఎప్పటికప్పడు జాగ్రత్తగా గమనించుకుని, సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే లాభసాటిగా ఉంటుందని రైతు లక్ష్మీనారాయణ తన అనుభవంతో చెప్పారు.

 

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here