సాంప్రదాయ పద్ధతిలో ఎప్పుడూ వేసే మూస పంటలు పండించే రైతన్నలకు అప్పుడప్పుడూ నష్టాలు కూడా రావొచ్చు. దాని కంటే కాస్త కొత్తగా ఆలోచించి, అరుదైన, అందరికీ అవసరమైన పంటలు వేస్తే.. లాభాలు పొందవచ్చు. అలాంటి పంటల్లో జెరీనియం సాగు ఒకటి ఉందనే విషయం చాలామంది రైతులకు తెలియకపోవచ్చు. జెరేనియం పంటను దక్షిణాఫ్రికాలో సాగుచేస్తారు. మన దేశంలోని ఉత్తరప్రదేశ్‌ రైతులు వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇప్పపుడిప్పుడే తెలంగాణలో కూడా కొందరు రైతుల దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. దిగుబడి తక్కువ ఉన్నా జెరేనియం ఆయిల్‌ ధర ఎక్కువ కాబట్టి లాభాలకు కొదవ ఉండదు. మార్కెట్లో ఈ ఆయిల్ ధర రూ.10 నుంచి రూ.16 వేల వరకు పలుకుతుంది.జెరేనియం మొక్కల ఆయిల్‌ తీపి, తాజా సువాసన కలిగి ఉంటుంది. జెరేనియంలోయాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాలు ఉన్నాయని నిపుణులు కనిపెట్టారు. జెరేనియం ఆయిల్‌తో పలు రకాల ఆరోగ్య సమస్యలను సులువుగా నయం చేయవచ్చు. సువాసన, సౌందర్య సాధనాల్లో ఈ ఆయిల్‌ను వినియోగిస్తారు. జెరేనియం ఆయిల్‌ ఒత్తిడి, ఆందోళన, వాపు, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. సెల్‌ డ్యామేజ్‌ను ఆపుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ముఖ వర్చస్సు పెంచేందుకు, జుట్టు సమస్యలను దూరం చేసేందుకు జెరేనియం ఆయిల్‌ పనికి వస్తుంది. జెరేనియం పంట దిగుబడి సుమారు మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి వస్తుంది. ఒక ఎకరంలో సాగు చేసిన జెరేనియం మొక్కల నుంచి 8 నుండి 10 లీటర్ల ఆయిల్‌ లభిస్తుంది. మేలైన పద్ధతిలో పంట సాగు చేస్తే 12 నుంచి 15 లీటర్ల వరకు దిగుబడి రావచ్చు.జెరేనియం మొక్కల సాగుకు ఎక్కువ నీరు అవసరం ఉండదు. అయితే.. వర్షాకాలంలో మాత్రం జెరేనియం మొక్కను నీటి ముంపు నుంచి రక్షించుకుంటే సరిపోతుంది. ఇందు కోసం పోలీ షెల్టర్‌ వేసుకుంటే సరిపోతుంది. 8 నుంచి 10 రోజులకు ఒకసారి మాత్రమే నీరు అందిస్తే చాలు. జెరేనియంను వర్షాధార పంటగా వేసుకోవచ్చు. సాధారణ నేలల్లో కూడా దీన్ని సాగు చేయొచ్చు. జెరేనియం మొక్కల్ని నీరు తక్కువ ఉండే నేలల్లో కూడా పెంచుకోవచ్చు. అయితే.. ఇసుక, బంకమట్టి, సిల్ట్‌ సమానంగా కలిసి ఉండే లోమి నేలలైతే మరింత అనుకూలం. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ పంట సాగుకు అనుకూలమైనది. వాతావరణ పరిస్థితులను ఈ మొక్క తట్టుకుంటుంది. నేల పీహెచ్‌ స్థాయి 5 నుంచి 8 మధ్య ఉంటే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రత 25 నుండి 35 డిగ్రీల మధ్యలో ఉంటే ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. ఎకరం నేలలో 10 నుండి 17 వేల మొక్కలు నాటుకోవచ్చు.సంగారెడ్డి జిల్లా మొగుదంపల్లి మండలం గోపన్‌పల్లిలో జెరేనియం పంట సాగు చేస్తున్న రైతు రామకృష్ణారెడ్డి అనుభవాలను తెలుసుకుందాం. సాంప్రదాయ పంటల నుంచి కాస్త వెరైటీగా కొత్త పంట ఏదైనా సాగుచేద్దామనే ఆలోచనతో తాను మహారాష్ట్రలో పలుచోట్ల జెరేనియం సాగుచేస్తున్న క్షేత్రాలను పరిశీలించినట్లు రామకృష్ణారెడ్డి చెప్పారు. ముంబై, పుణె, నీలాంగే, షాజహాన్‌పూర్‌లలో కొన్ని జెరేనియం ఆయిల్‌ యూనిట్లు, క్షేత్రాలను అధ్యయనం చేశారాయన. ముంబైలో ఉండే ఎస్‌ఎస్‌ ఖేల్కర్ కంపెనీతో ఒప్పందం చేసుకుని తాము పంట సాగుచేస్తున్నట్లు చెప్పారు. జెరేనియం ఆయిల్‌ పూర్తిగా కొనేలా ఈ కంపెనీతో అగ్రిమెంట్‌ చేసుకున్న తర్వాతే సాగు ప్రారంభించినట్లు తెలిపారు. అగ్రిమెంట్‌ సమయంలో లీటర్ ఆయిల్‌ రూ.10 వేలకు కొంటామని, మార్కెట్‌లో అంతకు తక్కువ ఉన్నా అదే ధరకు కొనేందుకు ఖేల్కర్ సంస్త ఒప్పందం చేసిందన్నారు. మార్కెట్‌ రేటు ప్రకారం తాము తొలిసారి ఉత్పత్తి చేసిన 40 నుంచి 45 లీటర్ల ఆయిల్‌ను రూ.10,500కు కొన్నట్లు రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఆయిల్ కొన్న తర్వాత 15 రోజులకు డబ్బులు తమ ఖాతాలో వేశారని చెప్పారు.రామకృష్ణారెడ్డి మొత్తం 10 ఎకరాల్లో జెరేనియం పంట సాగు చేశారు. జెరేనియం ఆయిల్ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు షెడ్‌ కాకుండా రూ.16 లక్షల వరకు ఖర్చయింది. షెడ్‌, బేస్‌మెంట్‌, గోడలకు మరో రూ.6 లక్షలు ఖర్చు చేశారు. యూనిట్‌ కోసం 55 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తులో షెడ్‌ వేశారు. ఎకరంలో జెరేనియం మొక్కలు నాటేందుకు రూ.70 వేలు అయింది. ముంబైలో ఒక్కో మొక్కను రూ.7 రూపాయలకు కొని, రవాణా, నాటుకునే ఖర్చులన్నీ కలిపితే ఆ ఖర్చు వచ్చిందని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. డ్రిప్‌కు రూ.15 వేలు అయింది. దుక్కితో సహా అన్నీ కలిపి ఎకరానికి లక్షా 20 వేల వరకు డబ్బు ఖర్చు అయింది. ఎకరం నేలలో 10 వేల మొక్కలు నాటుకోవచ్చు. జెరేనియం పంట వర్షాకాలంలో కోస్తే ఎకరానికి 10 నుంచి 11 లీటర్ల ఆయిల్‌ వస్తోందని, శీతాకాలంలో అది మరింత పెరిగే అవకాశం ఉందని రామకృష్ణారెడ్డి చెప్పారు. వర్షాకాలంలో వర్షానికి జెరేనియం మొక్కల కింది ఆకులు పాడైపోవడం వల్ల దిగుబడి తగ్గుతుంది.జెరేనియం మొక్కలు నాటిన తర్వాత నాలుగు నెలలకు తొలి క్రాప్ వస్తుంది. ఆ తర్వాత రెండున్నర మూడు నెలలకు ఒకసారి క్రాప్ తీసుకోవచ్చు. జెరేనియం మొక్కలు కత్తిరించిన తర్వాత కింద నుంచి మళ్లీ కొమ్మలు వస్తాయి. జెరేనియం పంటకు తెగుళ్లు రావు కాబట్టి పురుగుమందులు పిచికారి అక్కర్లేదు. మొక్కలకు డీఏపీ లేదా 20:20, మూడు 18లు కానీ డ్రిప్‌ ద్వారా వేసుకోవచ్చు. ఒకసారి జెరేనియం మొక్కలు నాటుకుంటే నాలుగేళ్ల వరకు పంట ఇస్తూనే ఉంటుంది. జెరేనియం ఆయిల్‌ తయారు చేసే ఒక్క సిలిండర్‌లో టన్ను వరకు మొక్కలు పడతాయి. వాటి నుంచి లీటరు నుంచి ఒకటిన్నర లీటర్ల జెరేనియం ఆయిల్ వస్తుంది. ఎకరంలో పది టన్నుల పంట వస్తుంది. అంటే 10 నుంచి 15 లీటర్ల జెరేనియం ఆయిల్‌ దిగుబడి వస్తే.. లీటర్‌కు కనీసం ధర రూ.10 వేలు వచ్చినా లక్ష నుంచి లక్షన్నర వరకు ఒక పంటకు ఆదాయం వస్తుంది.జెరేనియం ఆయిల్ యూనిట్‌కు పొలంలోని మొక్కలను కత్తిరించి, సిలిండర్లలో వేసేందుకు లేబర్‌ ఖర్చు ఉంటుంది. జెరేనియం సాగు చేసేందుకు ముగ్గురు లేబర్ పర్మినెంట్‌గా, మరో 8 నుంచి 9 మంది కోత కోసేందుకు అవసరం అవుతారు. కూలీల ఖర్చు, రవాణా అంతా కలిపి ఐదారు వేలు ఖర్చు అవుతుంది. జెరేనియం మొక్కలను కట్‌ చేసినవి చేసినట్లు పచ్చివే ఆయిల్ తయారీ యూనిట్‌లో వేసుకోవాలి. మొక్క ఎండితే ఆయిల్ రాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయాల్ తయారీ యూనిట్‌ ఒక రోజులో 8 నుంచి 9 గంటలు నడిస్తే మూడు లీటర్ల జెరేనియం ఆయిల్‌ ఉత్పత్తి అవుతుంది. టన్ను సామర్ధ్యం ఉన్న యూనిట్‌ ద్వారా 35 ఎకరాల జెరేనియం మొక్కలను ప్రాసెస్ చేపి, ఆయిల్ ఉత్పత్తి చేయవచ్చు. జెరేనియం యూనిట్ ఖర్చు, మొక్కల ఖరీదు, కూలీలు, కరెంట్, కట్టెలు అన్నీ కలిపి అయిన ఖర్చు ఆరు నెలల నుంచి ఏడాది లోపు తిరిగి వచ్చేస్తుందని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆ తర్వాత మూడేళ్లు వచ్చే ఆదాయం అంతా లాభం అనుకోవాలన్నారు.అయితే.. ఔత్సాహిక రైతులు జెరేనియం ఆయిల్ కొనే సంస్థలతో ముందుగా పకడ్బందీ ఒప్పందం చేసుకున్న తర్వాతే పాగుచేస్తే మంచిది. యూనిట్ పెట్టించి మోసం చేసేవారి విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం జెరేనియం ఆయిల్ కొనే సంస్థలు అంతగా లేవని గుర్తుపెట్టుకోవాలి.