కరోనా పట్టి పీడించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా డ్రైఫ్రూట్స్ వినియోగం బాగా పెరిగింది. ప్రకృతి మనకు అనేక రకాల డ్రైఫ్రూట్స్‌ను అందిస్తోంది. అయితే..డ్రైఫ్రూట్స్‌లోనే అత్యంత విలువైన డ్రైఫ్రూట్ ఏంటో తెలుసా? ఆ డ్రైఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దాని పంట సాగుచేస్తే వచ్చే లాభాలు గురించి తెలుసుకుందాం.మకాడమియా.. అత్యంత ఖరీదైన ఈ డ్రైఫ్రూట్ పెద్ద పెద్ద డ్రైఫ్రూట్స్ షాపుల్లో మాత్రమే లభిస్తోంది ఇప్పుడు. మకాడమియా డ్రైఫ్రూట్ కిలోకు రూ.వెయ్యి నుంచి రూ.4 వేలు పలుకుతుంది. ఇది ఎక్కువగా చైనా, ఆస్టరేలియా దేశాల్లో పండుతుంది. ఇప్పుడిప్పుడే దీని విలువ, ప్రయోజనాల గురించిన తెలిసిన ప్రపంచ దేశాలు కూడా మకాడమియా పంట సాగు చేస్తున్నారు. మకాడమియా గింజలు చాలా తియ్యగా, కమ్మగా ఉంటాయి. ఈ గింజలపై పెంకు చాలా గట్టిగా ఉంటుంది. మకాడమియా గింజ ఎన్నాళ్లైనా చెడిపోదు. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కొన్ని ఇతర గింజల మాదిరిగా పంట కోసిన కొద్ది రోజుల్లోనే వినియోగించాలి, లేదా అమ్ముకోవాలనే భయం ఏమాత్రం మకాడమియా గింజల వల్ల ఉండదు. మకాడమియా గింజలు అమెజాన్, ఆర్గానిక్ మంత్ర, మోర్, రిలయన్స్ లాంటి చోట్ల అమ్ముతున్నారు. మకాడమియా గింజలు కిలో రూ.6 నుంచి రూ.10 వేలు వరకు అమ్ముతున్నారు. రైతుకు వచ్చేసరికి కిలోకు కనీసంలో కనీసం వెయ్యి రూపాయలు లభిస్తుంది. ఒక్కో చెట్టు నుంచి తొలుత వచ్చే పంటకు కనీసంలో కనీసం 20 కిలోలు దిగుబడి వస్తే… 20 వేలు ఆదాయం లభిస్తుంది. ఆ తర్వాత దిగుబడి పెరిగే కొద్దీ దాని రాబడి కూడా అధికం అవుతుంది.మకాడమియా గింజలను తింటే 713 క్యాలరీల శక్తి లభిస్తుంది. బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ కంటే మకాడమియాలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. మకాడమియా గింజల్ని తిన్నవారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మకాడమియా గింజలో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ 13 గ్రాములు ఉంటాయి. డయాబెటిస్ రోగులు మకాడమియా తింటే మంచి ఫలితం వస్తుంది. షుగర్ స్థాయిలు పెరగకుండా శరీరానికి అవసరమైనంత శక్తిని మకాడేమియా గింజలు ఇస్తాయి. మకాడమియా గింజలను పై పెంకు తీసేసి యధావిధిగా తినొచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ గింజలను నానబెట్టి తింటే మేలు. మకాడమియా గింజలలో విటమిన్ బీ 1 పుష్కలంగా లభిస్తుంది. అలాగే వీటిలోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెపోటు రాకుండా కాపాడుతుంది. బరువును నియంత్రిస్తుంది. కేన్సర్ నివారణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటి ఆక్సిడెంట్లు మనలోని ఆక్సీకరణ వత్తిడి, వాపు నుండి రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన, అందమైన చర్మం కోసం మకాడమియా గింజ నూనె వాడితే మేలు. అద్భుతమైన మాయిశ్చరైజ్‌గా పనిచేసే మకాడమియా ఆయిల్‌ను లిప్‌స్టిట్‌లు, స్కిన్ కండిషనర్లు, జుట్టు సంరక్షణ, ఇతర అనేక సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారని డాక్టర్ సిద్దార్థ్ గుప్తా వివరించారు. రక్తనాళాల్లో బ్లాక్‌లను తగ్గించి, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా రక్షిస్తుంది మకాడమియా గింజ.డ్రైఫ్రూట్స్‌లో రారాజు మకాడమియా అంటారు. ఈ పంట సాగు ఎలాగో చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడలో మకాడమియా మొక్కల్ని అమృత నర్సరీ ద్వారా కుడుముల మధు అందిస్తున్నారు. మకాడమియా చెట్లు నీటి ఎద్దడిని తట్టుకుని పెరుగుతాయి. నీరు అంతగా లభించని ప్రాంతాల్లో కూడా మకాడమియా చెట్లను పెంచుకోవచ్చు. మన దేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో కూడా మకాడమియా చెట్లను పెంచుతున్నారు. మకాడమియా సాగు ఆస్ట్రేలియాలో కొన్ని శతాబ్దాలుగా జరుగుతోందని మధు తెలిపారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, చైనా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ దేశాల్లో విరివిగా సాగు చేస్తున్నారు. మకాడమియా గింజలను అత్యధికంగా అమెరికా, చైనా, జపాన్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.
ఆఫ్రికా ఖండంలోని ఐదారు దేశాల్లో మకాడమియా పంట సాగు చేస్తున్నారు. మకాడమియా చెట్టు 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకుని ఎదుగుతుంది. ఆఫ్రికా దేశాల్లో బీమౌంట్, కేట్, కీన్ రకాలు ఉన్నాయని మధు వెల్లడించారు. మన దేశంలో 8 నుంచి 10 నెలల వయస్సు ఉన్న గ్రాఫ్టింగ్ బీమౌంట్ మకాడమియా మొక్కల్ని సరఫరా చేస్తున్నామని చెప్పారు. మన దేశంలో సీల్డింగ్ మకాడమియా మొక్కలు లభిస్తున్నాయి.మకాడమియా చెట్లు మూడో ఏట నుంచే వాణిజ్యపరంగా దిగుబడి ఇస్దుందని మధు తెలిపారు. ఒక్కో మకాడమియా చెట్టు నుంచి మొదట్లో 20 కిలోల వరకు గింజల దిగుబడి ఇస్తుంది. బీమౌంట్ రకం మకాడమియా గింజ పెద్ద ఉసిరికాయ సైజులో ఉంటుంది. మధు కుడుముల గ్రాఫ్టింగ్ చేసిన మకాడమియా మొక్కల్ని రైతులకు అందిస్తున్నారు. ఈ గ్రాఫ్టింగ్ మకాడమియా మొక్కకు మొక్కు మధ్య దూరం 5 మీటర్లు అంటే 15 అడుగుల దూరం, సాలుకు సాలుకు మధ్య దూరం 4 మీటర్లు అంటే 12 అడుగులు ఉండేలా నాటుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నాటుకుంటే ఎకరం నేలలో 250 నుంచి 300 మొక్కలు నాటుకోవచ్చని మధు వివరించారు. మకాడమియా విత్తనాలను నాటుకోవాలనుకునే వారు గింజ పరిమాణానికి రెట్టింపు పరిమాణంలో నేలలో గుంత తవ్వి దాంట్లో వేసుకోవాలి. విత్తనం నాటే ముందు ఆ గుంతలో సేంద్రీయ ఎరువు లేదా బాగా కుళ్లిన ఎరువు వేయండి. నర్సరీ కంటైనర్‌లో ఉన్న మకాడమియా మొక్క నాటుకునేవారు కంటైనర్ సైజులో గొయ్యి తవ్వి దాంట్లో వేసుకోవాలి. మకాడమియా మొక్క నాటిన తర్వాత బాగా నీళ్లు పోసి, నేలలో తేమ నిల్వ ఉండేందుకు మల్చింగ్ చేయాల్సి ఉంటుంది.మకాడమియా పంట చేతికి వచ్చే వరకు బొప్పాయి. మునగ, రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమలు, నువ్వులు, అల్లం, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల పంటలు పండించుకోవచ్చని చెప్పారు. మకాడమియా చెట్లు మూడో ఏట నుంచి పూర్తిస్థాయిలో పంట దిగుబడి ఇస్తాయి కాబట్టి అప్పటి నుంచి అంతర పంటల అవసరం అంతగా ఉండదన్నారు. మకాడమియా గింజలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. అవి నిల్వ ఉండే కొద్దీ మరింతగా డ్రై అయితుంది. నాణ్యత పెరుగుతుంది. ఖరీదు కూడా అదే స్థాయిలో వస్తుంది.మకాడమియా మొక్కలకు పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్, వేప పిండి, వేస్ట్ డీకంపోజర్, జీవామృతం, హ్యూమిక్ యాసిడ్ లాంటి వాటిని డ్రిప్ ద్వారా అందించవచ్చు. మల్చింగ్ చేయడం ద్వారా నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా మకాడమియా చెట్లను పెంచుకోవచ్చు. మల్చింగ్ చేయడం ద్వారా మకాడమియా చెట్లకు ప్రతిరోజూ నీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉండదు. వారానికి రెండు సార్లు డ్రిప్ ద్వారా నీరు సరఫరా చేస్తే సరిపోతుంది. పెస్ట్ మేనేజ్‌మెంట్ విషయానికి వస్తే.. మకాడమియా మొక్కలకు ప్రతి 15 రోజులకు ఒకసారి లీటర్ నీటిలో 5 మిల్లీ లీటర్ల వేపనూనె కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా పలు రకాల కీటకాలు మొక్కలను ఆశించకుండా నివారించవచ్చని మధు వివరించారు. మకాడమియా పంటకు కోతుల బెడద అస్సలు ఉండదు. ఎందుకంటే మకాడమియా గింజపైన ఉండే పెంకు చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి కోతులు వాటిని కొరికి తినే అవకాశం ఉండదు. మకాడమియా ఆకులకు చిన్న చిన్న నూగు లాంటి ముళ్లు ఉంటాయి. కనుక వీటి ఆకులను పశువులు కూడా తినే అవకాశం ఉండదు.ప్రపంచవ్యాప్తంగానూ, మన దేశంలో కూడా ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరిగింది. అనేక రకాల ఆరోగ్యపరమైన లాభాలు ఇచ్చే మకాడమియా గింజల వినియోగం కూడా బాగా పెరిగింది. వినియోగం అయితే.. పెరిగింది కానీ ఆ మేరకు పంట సాగు ప్రస్తుతం జరగం లేదని మధు కుడుముల చెప్పారు. అందుకే మకాడమియా సాగును రైతులు మరింత ఎక్కువ మంది చేసుకుంటే.. ఫలితం, లాభం అద్బుతంగా ఉంటుంది. మకాడమియా పంట సాగులో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు, తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో మకాడమియా సాగును నిస్సందేహంగా రైతులు వాణిజ్యపరంగా చేసుకోవచ్చని మధు సలహా ఇచ్చారు.