పంటల సాగులో రైతులంతా సర్వ సాధారణంగా ఏమి ఆలోచిస్తారు? పొలం అంతా శుభ్రంగా, ఎలాంటి చెత్తా చెదారం లేకుండా ఉంటే పంటకు మేలు అనుకుంటారు. అయితే.. ఓ రైతు మాత్రం అందుకు కాస్త విభిన్నంగా ఆలోచించారు. పొలంలో ఎంత చెత్త, లేదా తుక్కు లేదా పచ్చని ఆకులు, మొక్కలు ఎక్కువ ఉంటే ప్రధాన పంట అంత అధికంగా వస్తుందని అనుభవపూర్వకంగా చెబుతున్నారు. తాను ఆలోచించిన విధానంలోనే ఆయన ఐదేళ్లుగా అరటి తోట పెంచుతున్న కళ్లం శ్రీనివాసరెడ్డి ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నారు. తన పొలాన్నంతా ఒక విధంగా అడవి మాదిరిగా పెంచుకుని, దాంట్లో ప్రధాన పంట అరటిని పండిస్తున్నారు. పైగా ఖర్చు కూడా చాలా అంటే చాలా తక్కువే అవుతుందంటున్నారు. పైగా రసాయన ఎరువులు, సేంద్రీయ ఎరువులు వాడిన పొలంలో వచ్చే దిగుబడి కన్నా ఎక్కువ రాబడుతున్నారు.పంటలు పండించే భూమిని లోతుగా దుక్కి దున్నాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఎందుకంటే.. భూమిలోప ఎంత గుల్లగా ఉంటే పైరు లేదా మొక్కలు అంత ఏపుగా ఎదుగుతాయని వారు చెప్పే మాటల వెనుక అంతరార్థం. అలాగే రైతులు వరిపొలంలోనే కుప్ప నూర్చిన తర్వాత ధాన్యం పొల్లు ఆ చుట్టుపక్కల ఉండిపోతుంది. తర్వాత అక్కడ నాటిన వరి మొక్కలు ఏపుగా పచ్చగా ఎదగడం ప్రతి రైతు గమనించే ఉంటారు. సరిగ్గా ఈ రెండు అంశాలను రైతు శ్రీనివాసరెడ్డి కరెక్ట్‌గా పట్టుకున్నారు.

అరటి మొక్కలు నాటేందుకు కొన్ని నెలల ముందే శ్రీనివాసరెడ్డి జీలుగు, జనుము, పెసర, పిల్లిపెసర, జనుము, అలసంద, ఆవాలు, నువ్వులు లాంటి విత్తనాలు చల్లుతారు. ఆ విత్తనాలు వర్షానికే మొలుస్తాయి. అవి కొద్దిగా ఎదిగిన తర్వాత భూమిని సాళ్లుగా చేసి అరటి మొక్కల్ని నాటుకుంటారు. అరటి మొక్కల మొదట్లోని పచ్చిరొట్ట మొక్కల్ని భూమి పైభాగానికి కోసి దాని చుట్టూనే ఆచ్చాదనగా వేస్తారు. అంటే పచ్చిరొట్ట భూమిలో తేమ త్వరగా ఆరిపోకుండా ఆచ్ఛాదనగా పనికి వస్తుంది. దాంతో పాటు పచ్చిరొట్టలోని సారం క్రమేమీ భూమిలోపలికి చేరుతుంది. తద్వారా అరటి దిగుబడి అధికంగా వచ్చేలా చేస్తుంది. అలాగే.. జీలుగు మొక్క వేర్లు భూమి లోపల ఒకటి నుంచి ఒకటిన్నర అడుగుల మేర చొచ్చుకుపోతాయి. జీలుగు వేర్లు భూమిలో ఉన్నంత మేరకు భూమి గుల్లబారుతుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పే లోతుగా దుక్కి దున్నాలనే మాటకు అర్థం ఇదే. అంటే భూమి గుల్లగా ఉండాలనడం అన్నమాట.శ్రీనావసరెడ్డి కొన్నేళ్లుగా ఇదే విధానంలో పంటల్లో అధిక దిగుబడి సాధిస్తున్నారు.  తన పొలాన్ని ఒక సహజ అడవి మాదిరిగా మార్చివేశారు. పొలంలో ఎలాంటి ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండానే మంచి ఫలితాలు రాబడుతున్నారు. పంటకు ఒక్కసారి మాత్రం శ్రీనివాసరెడ్డి ఘనజీవామృతం వినియోగిస్తారు. పంట కోసం బయటి దుకాణాల నుంచి రూపాయి పెట్టి ఏదే కొనే పని లేకుండా విజయవంతంగా ఆయన సాగుచేస్తున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి. తాను సాధించిన విజయాలను ఇతర రైతులకు కూడా వివరించేందుకు ముందుకు వచ్చారు. ఈ రైతు చేసే పూర్తి ప్రకృతితో మమేకమై చేస్తున్న ఈ వ్యవసాయ విధానంలో ఖర్చు తగ్గిపోతుంది. దిగుబడి ఎక్కువగా వస్తుంది.శ్రీనివాసరెడ్డి ఈ ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలి మూడేల్లు ఘన జీవామృతాన్ని తమ పొలంలో వాడారు. ఆ తర్వాతి నుంచి దాన్ని కూడా ఆయన వినియోగించడం లేదు. జీ నైన్‌ రకం అరటి మొక్కలు నాటక ముందే పచ్చిరొట్ట పెంచుతారాయన. శ్రీనివాసరెడ్డి వేసే జీ నైన్‌ అరటి మొక్కలను ఎకరానికి 1100 నాటుకుంటారు. టిష్యూ కల్చర్‌ ద్వారా తయారు చేసిన ఒక్కో అరటి మొక్కను ఆయన 13 రూపాయలకు కొంటారు. అరటి మొక్కకు మొక్కకు మద్య దూరం ఆరు అడుగులు ఉండేలా ఆయన నాటారు. పచ్చిరొట్టను కోసి, భూమి మీద వేసినప్పుడు హ్యూమాస్‌ తయారవుతుందని అనుభవపూర్కంగా చెబుతున్నారాయన. అరటి మొక్కల మధ్య ఉన్న పచ్చిరొట్టను భూమి పైభాతానికి కోసి సాలుపై మందంగా వేస్తారు. ఆ పచ్చి రొట్టపై డ్రిప్ ద్వారా నీరు చల్లే ఏర్పాటు చేస్తారు. దీంతో పచ్చిరొట్ట నుంచి సారం భూమిలోపలికి దిగడమే కాకుండా ఆచ్చాదనగా కూడా పనికి వస్తుంది. భూమి లోపలి తేమ త్వరగా ఆరిపోకుండా కాపాడుతుంది.

అలాగే జీలుగ, పెసర, పిల్లిపెసర, అలసంద మొక్కలు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి, భూమి లోపన నిల్వ చేస్తాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తద్వారా ప్రధాన పంటకు కావాల్సినంత నత్రజని అందుతుందన్నారు. అంటే ఎకరం అరటి తోటకు రైతులు 8 బస్తాల వరకు యూరియా వాడుతుంటారు. పచ్చిరొట్ట వల్ల 8 బస్తాల యూరికాయు అయ్యే ఖర్చు మిగిలిపోయినట్లే. అన్ని రకాల విత్తనాలు కలిపి ఎకరం భూమిలో 20 కిలోల పచ్చిరొట్టకు సంబంధించిన విత్తనాలు చల్లుతామన్నారు. పచ్చిరొట్ట వేస్తే పొటాషియం, భాస్వరం, నత్రజని ఇలా ఏ ఒక్క ఎరువును పంటకు వేయాల్సిన పనే ఉండదు. అవన్నీ పచ్చిరొట్ట ద్వారా ప్రధాన పంట మొక్కలకు అందుతాయి.శాస్త్రవేత్తలు చెప్పినట్లు భూమి లోపలి వరకు దుక్కి దున్నినా వర్షం పడిన తర్వాత మళ్లీ బిగిసిపోతుంది. అయితే.. పచ్చిరొట్ట మొక్కలు వేసిన భూమి లోపల వాటి వేర్లు ఉన్నంత వరకు అంటే సుమారు 9 అంగుళాల మేర ఆ భూమి గుల్లగా మారుతుంది. జీలుగ మొక్క వేరు అయితే.. సుమారు అడుగున్నర వరకూ భూమి లోపలికి వెళుతుంది. తద్వారా వర్షపు నీరు కూడా భూమి లోపలికి సులువుగా ఎళ్లిపోతాయి. పైగా భూమి పైభాగానికి ఆ మొక్కలను కోసి ఆచ్చాదనగా వేస్తాం. భూమి లోపల ఉండే పచ్చరొట్ట మొక్కల వేర్లు, మొదళ్లను వానపాములు తినేస్తాయి. అందు కోసం భూమిని వానపాములు గుల్లగా చేస్తాయి. వేర్లు, మొదలు కూడా కుళ్లిపోయి భూమికి బలాన్నిస్తాయి. దీంతో ప్రధాన పంట మొక్కల వేర్లు భూమిలోపల బాగా విస్తరించుకుంటాయి. తద్వారా మొక్కలు ఏపుగా ఎదగడమే కాకుండా పంట దిగుబడి బాగా పెరుగుతుంది. పచ్చరొట్ట ఎంత ఎక్కువ పెరిగితే.. ప్రధాన పంట దిగుబడి అంత అధికంగా వస్తుందని రైతు చెప్పారు.

రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా పైరు సాగు చేస్తున్నప్పుడు పొలంలో మిత్ర పురుగులు ఎక్కువగా ఉంటాయి. పంటను పాడుచేసే పురుగులు వచ్చి గుడ్లు పెట్టే లోగానే వాటిని మిత్ర పురుగులు తినేస్తాయి. దీంతో పంటకు ఎలాంటి చీడ పీడలు, పురుగుల బెడద ఉండదు. అదే నేలను శుభ్రం చేసినపప్పుడు మాత్రం కచ్చితంగా నష్టం చేసే పురుగులు వస్తాయన్నారు శ్రీనివాసరెడ్డి. సేంద్రీయ వ్యవసాయం సక్సెస్ కావాలంటే పచ్చిమొక్కల తుక్కు ఎక్కువగా ఉంటాలంటారు రైతు శ్రీనివాసరెడ్డి. భూమిపైన ద్రవ జీవామృతం పోస్తే.. మనం అనుకున్న దాంట్లో 10 శాతమే పనిచేస్తుందని, అదే పచ్చరొట్ట తుక్కు మీద ద్‌రవజీవామృతం పోస్తే.. మనం అనుకున్న దాని కంటే పదిరెట్టు ఎక్కువ ఫలితం ఇస్తుంది. తుక్కు ఉన్నంత కాలమూ దాని కింద బ్యాక్టీరియా బతికే ఉంటుంది.సహజ సాగు విధానంలో శ్రీనివాసరెడ్డి ఎకరానికి జీనైన్‌ రకం అరటి ఎకరానికి 30 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. కిలో 13 రూపాయల చొప్పున అరటి కాయలను అమ్మారు. అంటే ఎకరంలో నాటిన 1100 అరటి చెట్ల నుంచి 3 లక్షల 90 వేల రూపాయల ఆదాయం సంపాదించారు. ఇందుకు ఆయన ఖర్చు చేసింది పచ్చిరొట్ట విత్తనాలు, మొక్కలు నాటేందుకు, పచ్చరొట్ట కోసి బూమిపైన వేసే పని చేసే కూలీల ఖర్చు, దుక్కి, డ్రిప్‌ వేయడానికి మాత్రమే. అంటే అతి తక్కువ ఖర్చునే ఆయన చేశారన్నమాట.

సహజసిద్ధ సేంద్రీయ విధానంలో శ్రీనివాసరెడ్డి వ్యవసాయం చేయడంలో నూటికి నూరు శాతం విజయం సాధించానని చెప్పారు. అంతకు ముందు 20 ఏళ్ల క్రితం తాము కూడా రసాయనాలు వాడేవారం అన్నారు. ఆ తర్వాత రసాయనాలు మరికాస్త ఎక్కువగానే వినియోగించామన్నారు. దాంతో పాటు తమకు తొలి నుంచి సేంద్రీయ ఎరువుల వాడకం అలవాటు ఉందన్నారు. పూర్తి స్థాయిలో సేంద్రీయ విధానంలోకి మారిన తర్వాత తమ భూమి సారం బాగా పెరిగిందని, పంట దిగుబడులు, లాభాలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఈ విధానంలో పెంచిన అరటి మొక్కలకు తెగులు అనే సమస్యే రాలేదన్నారు.రసాయన మందులతో అయినా పంటను కాపాడామనుకోవడం భ్రమ అంటారాయన. ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రృతిలో ఉండేవే మన పంటలను కాపాడతాయన్నారు శ్రీనివాసరెడ్డి. భూమికి బలమైన ఆహారం ఇస్తే.. చెట్టుకు తెగులు రాదన్నారాయన. రైతు దృష్టి అంతా భూమిని చెడిపోకుండా కాపాడుకోవడం పైనే ఉండాలని సలహా ఇచ్చారు.