విజేతలు ఎక్కడి నుండో రారు.. మనలోనే ఉంటారు.. మన మధ్యలోనే పుడతారు.. మన మధ్యనే తిరుగుతారు.. మన మధ్యనే ఎదుగుతారు.. మన సమాజం గుర్తించే లోపు వారు ఎంతో ఎత్తుకు ఎదిగిపోతారు. అలా మన మధ్యనే పుట్టి, పెరిగి, మంచి స్థాయికి ఎదిగిన ఓ విజేత గురించి, అతను సాధించిన విజయాలు, ఆ వెనక కథ తెలుసుకుందాం..! సాగుబడిలో ఆ విజేత చేసిన ఆవిష్కరణ ఏంటో చూద్దాం..!

మట్టి అవసరం లేకుండానే మొక్కల సాగు చేసిన ఆ విజేత హైదరాబాద్ వాసి. కాంక్రీట్ జంగిల్ లో ఇలాంటి అద్భుతాన్ని సృష్టించారు..! మట్టి లేకుండా పంటలు పండిస్తున్నారు. మట్టి అవసరం లేని వ్యవసాయంలో విజయం సాధించారు. తద్వారా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫోర్బ్స్ జాబితాలో మన విజేత స్థానం దక్కించుకున్నారు. అతనే హైదరాబాద్‌ వాసి విహారి కనుకొల్లు.. అసన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో కామర్స్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత సీఏ కూడా చేశారు. తాను చదివింది భిన్నమైన కోర్సు అయినా.. వ్యవసాయం మీదే విహారికి ఎక్కువ ఆసక్తి. దీంతో అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయడమెలా..? అనే అంశాలపై బాగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ‘హైడ్రోపోనిక్స్’ విధానం విహారి మనసును బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే 2017లో డాక్టర్ సాయిరాం పలిచెర్ల, శ్రీనివాస్ చాగంటితో కలిసి ‘అర్బన్ కిసాన్’ (UrbanKisaan) అనే స్టార్టప్‌ ఏర్పాటు చేశారు. హైడ్రోపోనిక్స్ ద్వారా రకరకాల పంటలు పండించడం మొదలుపెట్టిన విహారి విజయం సాధించారు.ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు కాంక్రీట్ జంగిల్స్ లా మారిపోతున్న రోజులివి. ప్రజలు నివసించేందుకు కూడా స్థలం దొరకని కాలం ఇది. తినేందుకు నాణ్యమైన తిండి లభించడం లేదు. రసాయనాలు వేసి పండించిన కూరగాయలు, ఆకుకూరలే మనకు దిక్కయ్యాయి. దీంతో అనారోగ్యాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. మరోవైపు క్రిమి సంహారక మందులతో పంటలు పండిస్తుండడం వల్ల రోజురోజుకీ నేల నిస్సారం అయిపోతోంది. నీటి వినియోగమూ ఎక్కువై పోయింది. దీంతో పంటలకు నీరందించడం కూడా కష్టం అయిపోయింది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ.. విహారి చేసిన ప్రయోగం విజయవంతం అయింది.

రసాయనాలు అస్సలు వాడకుండా.. పూర్తి సేంద్రీయ పద్ధతిలో.. సాధారణ పంటల కన్నా చాలా తక్కువగా నీరు వాడుతూ చేసేదే ‘హైడ్రోపోనిక్స్’ వ్యవసాయ విధానం. హైడ్రోపోనిక్స్ అంటే.. మట్టి అవసరం లేకుండా కేవలం నీటితోనే మొక్కల్ని పెంచడం. కానీ.. మొక్కలకు పోషకాలు అందాలంటే.. మట్టి ఉండాలి అనేది మనందరికీ తెలిసిన విషయం.. ఆ సమస్యను ఎలా అధిగమిస్తారు..? అనే సందేహం మనకు రావచ్చు. దానికి హైడ్రోఫోనిక్స్ విధానంలో చక్కని పరిష్కారం ఉంది. మొక్కలకు మట్టి నుంచి అందాల్సిన పోషకాలు నీటిలో వేసి అందించాలి. మొక్కల వేళ్లు నిరంతరమూ నీటిలోనే ఉంటాయి కనుక.. ఆ నీటిలో పోషకాలు కలిపితే వాటిని మొక్కలు తీసుకుంటాయి. సరైన సమయంలో మొక్కలకు నీళ్లు, పోషకాలు అందిస్తే చాలు.. మట్టితో పని లేకుండానే మొక్కలు పెరుగుతాయి. సాధారణ పరిస్థితుల్లో పండించిన పంట కన్నా.. హైడ్రోపోనిక్స్ విధానంలో పండించిన పంటలకు దిగుబడి కూడా ఎక్కువే. అదే ఈ విధానంలో ఉన్న విశేషం. ఇలా పండించిన పంటల్లో అత్యధిక న్యూట్రిషన్ కూడా లభిస్తుంది.హైడ్రోపోనిక్స్ విధానంలో పంటలు పండించడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. నగరాల్లో నివసించేవారు.. అపార్ట్‌ మెంట్లలో ఉండేవారు కూడా తమకు ఉండే కొంచెం స్థలంలోనే విభిన్న రకాల మొక్కల్ని పెంచుకోవచ్చు. హైడ్రోఫోనిక్స్ సాగు చేయాలనుకునే వారికి సహాయ, సహకారాలు అందించేందుకు అర్బన్ కిసాన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మొక్కల్ని పెంచేందుకు అవసరమై కిట్లు, ఫ్రేమ్‌లను అర్బన్ కిసాన్ అందజేస్తుంది. ఆ ఫ్రేమ్‌లలో మొక్కల్ని పెంచుకోవచ్చు. ఆ ఫ్రేమ్ లు 5 అరల్లో ఉంటాయి. ఒక్కో అరలో 6 చొప్పున మొత్తం 30 మొక్కల్ని పెంచవచ్చు. ఈ ఫ్రేమ్‌లకు పైప్ ద్వారా నీరు వెళుతుంది. ఫ్రేమ్ కింద (పక్కన) ఉంచి ఓ బకెట్ ద్వారా నీటి పైపు కనెక్షన్ ఇవ్వాలి. దాని నుంచి ఫ్రేమ్‌లలో నీరు ప్రవహిస్తుంది. అలా వెళ్లిన నీరు మొక్కలకు అందుతుంది. ఒక చిన్న మోటార్‌ పెట్టుకుంటే ఫ్రేమ్‌లకు నీరు ప్రవహించేలా చేయవచ్చు. బకెట్‌లోని నీటిలో పోషకాలు వేస్తే.. అవి నీటి ద్వారా మొక్కలకు చేరుతాయి. హైడ్రోఫోనిక్స్ వ్యవసాయ విధానంలో వారానికి ఒక్కసారి బకెట్‌లో నీరు పోస్తే సరిపోతుంది. దీంతో ఎంతో నీరు ఆదా అవుతుంది. సాధారణంగా పండించే పంటకు కావాల్సి నీటిలో 95 శాతం నీటిని ఈ విధానం ద్వారా మిగల్చుకోవచ్చు. కేవలం 5 శాతం నీటితోనే హైడ్రోపోనిక్స్ ద్వారా పంటలు పండించవచ్చు.హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లో తొలుత ఓ భవనం పైఅంతస్థు అద్దెకు తీసుకుని వీరు హైడ్రోపోనిక్స్ విధానంలో పంటలలు సాగు చేసేవారు. ఇలా వీరు 1.25 ఎకరాల్లో సాగు చేసే పంటను భవనంలో కేవలం 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సాగు చేస్తుండడం విశేషం. ఈ కొద్దిపాటి స్థలంలో వీరు పాలకూర, తోటకూర, గోంగూర, పుదీనా తదితర ఆకుకూరలు సహా మొత్తం 40 రకాల ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. సాధారణ స్థితిలో పండే పంట కన్నా హైడ్రోపోనిక్స్ విధానంలో పండే పంట చాలా త్వరగా చేతికొస్తుంది. దిగుబడి కూడా సాధారణ పంట కన్నా ఎక్కువ ఉంటుంది. తొలుత అర్బన్ కిసాన్ సంస్థలో ఒక సైంటిస్టు, 5 మంది పీహెచ్‌డీ చేసిన వారితో సహా మొత్తం 25 మంది వరకు పనిచేసేవారు. ఇప్పుడు అర్బన్ కిసాన్ సంస్థ హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల 8 చోట్ల తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మణికొండ, బేగంపేట, కూకట్ పల్లి, హిమాయత్ నగర్, సైనిక్ పురి, నల్లగండ్లలో అర్బన్ కిసాన్ సంస్థ కార్యాలయాలు నడుస్తున్నాయి.

నగర వాసులు తమ బాల్కనీల్లో కూడా హైడ్రోపోనిక్స్ విధానంలో పంటలు సాగు చేసుకునేందుకు కావల్సిన సదుపాయాలు అర్బన్‌ కిసాన్ సంస్థ అందిస్తోంది. దానికి అవసరమయ్యే ఫ్రేములు, పంటలకు కావల్సిన పోషకాల కిట్లు, ఇతర సామగ్రిని అందజేస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలో అనేక మంది హైడ్రోఫోనిక్స్ విధానంలో పంటల సాగు చేస్తున్నారు.

కాంక్రీట్ జంగిల్స్‌ గా మారిన నగరాలు, పట్టణాల్లో స్థలం లేక ఇబ్బంది పడేవారు హైడ్రోపోనిక్స్ విధానంలో చాలా తేలికగా తమకు అవసరమైన కూరగాయలు పండించుకోవచ్చని విహారి కనుకొల్లు తెలిపారు. ఈ విధానం నూరు శాతం సహజసిద్ధమైందని, పంటలకు కృత్రిమ ఎరువుల అవసరమే లేదని, చీడ పీడలు రావని, నీరు కూడా చాలా తక్కువగా అవసరం అవుతుందని చెప్పారు.నగరాల్లో ఉండే చాలా మందికి తమ ఇళ్లలో మొక్కలు పెంచుకోవాలనుకుంటారు. అందుకు అవసరమైనంత స్థలం లేక మొక్కల పెంపకానికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారు హైడ్రోపోనిక్స్ విధానం ద్వారా తమ కోరిక నెరవేర్చుకోవచ్చు. హైడ్రోపోనిక్స్ పంటల సాగు కేవలం హాబీగా మాత్రమే కాకుండా నిత్యం మనం తినే కూరగాయలు, ఆకుకూరల కోసం కూడా మొక్కలు పెంచుకోవచ్చు. దీంతో సహజసిద్ధమైన కూరగాయలు మనకు లభిస్తాయి. తద్వారా మన ఆరోగ్యమూ బాగుంటుంది.

హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కల పెంపకం ప్రక్రియను స్మార్ట్‌ ఫోన్ యాప్ ద్వారా కూడా పర్యవేక్షించవచ్చు. మొక్కలకు ఎప్పుడు నీళ్లు పోయాలి? పోషకాలు ఎప్పుడు, ఏ మేరకు వేయాలి? పంట దిగుబడి ఎప్పుడు వస్తుంది?.. ఇలాంటి వివరాలు ఆ యాప్ ద్వారా మనకు తెలుస్తాయి. ఒక రకంగా ఇది అధునాతన వ్యవసాయ విధానమే అయినా.. పూర్తి సహజసిద్ధంగా ఈ విధానంలో మొక్కల పెంపకం ఉంటుంది.

హైడ్రోపోనిక్స్ ను నగరవాసులకు పరిచయం చేస్తూ ఈ రంగంలో దూసుకుపోతున్న అర్బన్‌ కిసాన్ కో ఫౌండర్ విహారి కనుకొల్లు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. విహారి 2020 సంవత్సరానికి గాను ఆసియా ఇండస్ట్రీ, మాన్యుఫాక్చరింగ్ అండ్ ఎనర్జీ రంగాల్లో టాప్ 30 ఎంటర్‌ ప్రిన్యూర్‌లలో ఒకరిగా చోటు సంపాదించారు. అతి కొద్ది సమయంలోనే విహారి కనుకొల్లు ఈ ఘనత సాధించడం గమనార్హం..!

మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాల్లో సంప్రదించవచ్చు

Urban kisaan
Jublee Hills, Gachibowli, Manikonda, Begumpet, Kukatpally, Himayat Nagar, Sainikpuri, Nallagandla

Phone: +91 8430200200
www.urbankisaan.com

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here