జూన్ నెలాఖరుకు మామిడి పంట కోత దాదాపు పూర్తవుతుంది. మళ్లీ మామిడిచెట్లకు పూత వచ్చే వరకు చాలా మంది రైతులు తోటల్లో సస్యరక్షణ చర్యల పట్ల అంతగా శ్రద్ధ చూపించరనే చెప్పాలి. అయితే.. వర్షాకాలం మొదలైన జూన్ నెల నుంచే కొన్ని జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు తీసుకుంటే సీజన్ కన్నా ముందే పూత వస్తుంది. పంట దిగుబడి బాగా పెరుగుతుంది. దీంతో ప్రతి సంవత్సరం కాపు నిలకడగా ఉంటుంది. తొలకరి సమయంలో మామిడితోటలో చేపట్టే యాజమాన్య పద్ధతి బాగా లాభం చేకూరుస్తుంది.మామిడి కాయల కోత పూర్తయ్యే సరికి మామిడిచెట్టును నిస్సత్తువ ఆవరిస్తుంది. చెట్లు కళ తప్పినట్లు కనిపిస్తాయి. వర్సాకాలంలో మామిడిచెట్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన సమయం. కాపు పూర్తయిన పదిహేను రోజుల నుంచి చెట్లకు సరికొత్త జవసత్వాలు వచ్చేందుకు యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. వర్షాకాలంలో చెట్లకు కొత్త చిగుర్లు వచ్చేందుకు, చీడపీడల బాధ లేకుండా చేసేందుకు కొన్ని పద్ధతులు పాటించాలని ఖమ్మం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆకుల వేణు చెప్పారు.మామిడి కోత పూర్తయిన తర్వాత తోటలోని చెట్ల మధ్య దుక్కి దున్నడం ముఖ్యమైన పద్ధతి. కోత కోసిన తర్వాత చెట్లకు 20 రోజులు విశ్రాంతి ఇచ్చి, గుబురుగా ఉన్న లేదా గొడుగులా ఉన్న కొమ్మలను కత్తిరించాలని వేణు చెప్పారు. గుబురుగా ఉన్న చెట్ల మొదళ్లకు గాలి ప్రసరణ బాగా జరగదు. అందుకే కొమ్మల్ని కత్తిరించాలంటారు ఆకుల వేణు. దుక్కిదున్నడం వల్ల కలుపు నివారణ అవుతుంది. దీంతో మనం అందించే పోషకాలను మామిడిచెట్టు పూర్తిస్థాయిలో వినియోగించుకోగలుగుతాయి. దున్నడం వల్ల వర్షపునీరు భూమిలోకి బాగా ఇంకుతుంది. చెట్లకు అవసరమైనంత తేమ అందుతుంది. గుబురు చెట్ల కొమ్మల్ని కత్తిరించడం ద్వారా సూర్యరశ్మి బాగా సోకుతుంది. చీడపీడల నుంచి రక్షణ కూడా మామిడి దిగుబడిలో కీలక పాత్ర పోషిస్తుంది. మామిడికాయలు కోయగా మిగిలి తొడిమలను, వ్యాధి సోకిన ఆకులను, ఎండిన కొమ్మలను పూర్తిగా చెట్టు నుంచి తొలగించాలి. వాటన్నింటినీ కుప్పగా పోసి తగలబెట్టాలి. దీంతో కాయతొలిచే పురుగును 80 శాతం దాకా నివారించుకోవచ్చు. ఈ కార్యక్రమం జూన్ నెలలో పూర్తిచేసుకోవాలని వేణు చెప్పారు.దుక్కి దున్నటం వల్ల వర్షాధార భూములు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దున్నకుండా వదిలేస్తే.. కలుపు పెరిగిపోతుంది. భూమి పైభాగం గట్టిగా అవుతుంది. దీంతో వర్షపు నీరు పల్లపు ప్రాతాంలకు వెళ్లిపోతుంది, భూమిలో తేమ తగ్గుతుంది. భూమిలో సరిపడినంత తేమ లేకపోతే చెట్టుకు పూత చాలా తక్కువ వస్తుందని వేణు వివరించారు. అందుకే మామిడి తోటలో భూమిని దున్నడం చాలా ముఖ్యం అన్నారు వేణు. పూత వచ్చినప్పుడు కాకుండా ముందు నుంచే మేనేజ్‌మెంట్ చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది. కలుపు నివారణ అయితే.. మామిడి చెట్టుకు పోషకాలు పూర్తిస్థాయిలో అందుతాయి. దాంతో పాటు పండు ఈగ, కాయపుచ్చు పురుగులు తొలిదశలోనే బయటపడి చనిపోతాయి.మామిడితోటలో జూన్ నెలలో ఒకసారి దుక్కి దున్నాలని ఆకుల వేణు తెలిపారు. ఆగస్టులో రెండోసారి, అక్టోబర్‌లో మూడోసారి ఇలా ఏడాదికి మూడుసార్లు దుక్కి దున్నాలి. జూన్ నెలలో దున్నడం వల్ల ఎక్కువ వర్షపు నీటిని భూమి పీల్చుకొనే సామర్ధ్యం పెరుగుతుంది. ఆగస్టులో దున్నడం వల్ల కలుపు నివారణ అవుతుంది. అక్టోబర్‌లో దున్నడం వల్ల మొక్క పరిసరాల్లో తేమ శాతం పెరిగి పూత బాగా వచ్చే అవకాశం ఉటుంది. దుక్కి దున్నిన తర్వాత ప్రతి 15 చెట్లకు మద్య చిన్న చిన్న కాంటూరు బండ్లు కట్టుకుంటే పడిన వర్షపునీరు వాటిలో నిల్వ ఉంటుంది. దీంతో మామూలు కన్నా ముందుగానే చెట్లకు పూత వస్తుంది.మామిడి చెట్లు నీరసించి ఉన్న దశలో పోషకాలు అందిస్తే తేరుకుంటాయి. ఎరువులతో పాటు సూక్ష్మపోషకాలు అందించాలి. కోత కోసిన వెంటనే లీటరు నీటిలో 5 గ్రాముల జింక్ సల్ఫేట్, 10 గ్రాముల యూరియా కలిపి చెట్లపై పిచికారి చేయాలని వేణు సూచించారు. జూన్, జులై నెలల్లో ఎకరానికి 10 కిలోల జీలుగులు కానీ జనుము విత్తనాలు 25 కిలోలు కాని చల్లుకోవాలి. జనుము, జీలుగు మొక్కలకు 40 నుంచి 50 రోజులకు పూత వచ్చే దశలో తోటలో కలియ దున్నాలి. దీంతో భూమికి పోషకాలు సమృద్ధిగా అందుతాయి. పచ్చరొట్ట వల్ల కలుపు నివారణ అవుతుంది. ఎక్కువ వర్షాలు పడినప్పుడు భూమి గట్టిగా అయిపోకుండా పచ్చిరొట్ట మొక్కలు రక్షిస్తాయి. పచ్చిరొట్టను కలియదున్నడంతో భూమిలో సూక్ష్మధాతు పోషకాలు పెంపొందుతాయి. జనుము లేదా జీలుగు విత్తనాలు చల్లిన తర్వాత పదేళ్లు దాటిన మామిడి చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. లేదా 10 కిలోల వర్మి కంపోస్టు వేసినా చెట్టు బలిష్టంగా, పచ్చగా తయారవుతుంది.అలాగే జూన్, జులై నెలల్లో పదేళ్లు దాటిన చెట్టుకు 2 కిలోల యూరియా, 5 కిలోల సూపర్ ఫాస్పేట్, కిలోనర పొటాష్ వేసుకుంటే దృఢంగా ఉంటుందని వేణు వివరించారు. సూక్ష్మధాతు పోషకాలైన 75 గ్రాముల బోరాక్స్, 150 గ్రాముల జింక్ సల్ఫేట్, 150 గ్రాముల మెగ్నీషియం వేసుకుంటే చెట్లకు ధాతు లోపాల సమస్యలు తలెత్తవు. ఈ ఎరువులను చెట్టు మొదలుకు 2 నుంచి రెండున్నర మీటర్ల దూరంలో వేసుకోవాలి.మామిడి సాగులో రైతులు ఎక్కువగా ఎదుర్కొనేది చీడ పీడల బెడద. ఆకుగూడు పురుగు మామిడి చెట్లను ఏడాది పొడవునా ఉంటోంది. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. తేనెమంచు పురుగు, ముడ్డిపుచ్చు పురుగు సమస్యలు మామిడి తోటలను బాగా పీడిస్తున్నాయి. వీటి నివారణకు తొలకరి సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు తప్పకుండా చేపట్టాలని ఉద్యానవనశాఖ అధికారి ఆకుల వేణు సూచించారు. జనవరి నుంచి మార్చి నెల వరకు తేనెమంచు పురుగు మామిడి చెట్లను ఆశిస్తుందన్నారు. మామిడి కాయలు కోసిన తర్వాత తేనె మంచు పురుగు చెట్టు బెరళ్లలో దాక్కుంటుంది. తోటలో కలుపు ఉన్నా కూడా తేనెమంచు పురుగు ఎక్కువ అవుతుందన్నారు. తేనె మంచు పురుగు నివారణకు కలుపు తీసుయాలి. మామిడిచెట్టు బెరళ్ల మీద లీటరు నీటిలో ఇమడాక్లోప్రిడ్ అర మిల్లీలీటర్, లేదా లామ్డా సైక్లోత్రిన్ ఒక మిల్లీ లీటర్ కలిపి పిచికారి చేస్తే సరిపోతుందన్నారు. మామిడి చెట్టుకు లేత చిగుర్లు వచ్చినప్పుడు తామరపురుగు దాడి చేస్తుంది. దీంతో మామిడి లేత ఆకులు ఎదుగుదల తగ్గిపోయి చిన్నవి అవుతాయి. తామరపురుగు నివారణ కోసం లీటరు నీటిలో పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు కలిపి స్ప్రే చేస్తే సరిపోతుందన్నారు. గూడు పురుగులు, బాక్టీరియా మచ్చల నివారణకు బావిస్టిన్ పిచికారి చేస్తే ఆకులు నీట్‌గా పచ్చగా తయారవుతాయి. ఇలాంటి తెగుళ్లు ఏవీ లేనప్పుడు కూడా పైన చెప్పుకున్న మందులు పిచికారి చేస్తే.. పూత, పిందెలు అధికంగా వస్తాయని వేణు వెల్లడించారు.
తొలకరిలోనే మామిడి చెట్లకు మేలైన యాజమాన్య పద్దతులు, సస్యరక్షణ చర్యలు చేస్తే.. దిగుబడి చాలా ఎక్కువగా వస్తుందని రైతులు గమనించి చేస్తే లాభాల పంటలు అందుకుంటారు.