బీట్‌రూట్‌ వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దీనిని సాగు చేస్తే కూడా ఆదాయ ప్రయోజనాలు కలుగుతాయి. బీట్‌ ఆహారంగా తీసుకుంటే రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. బీట్‌రూట్‌లోని నైట్రేట్లు, నైట్రిక్‌ ఆక్సైడ్‌ అధిక రక్తపోటు, గుండె సంబంధ వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. బీట్‌రూట్‌లో అనేక పోషకాలు ఉంటాయి. బీట్‌రూట్ తిన్నవారిలో రక్తాన్ని పెంచుతుంది. రక్తంలో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. డయాబెటిస్‌ ఉన్నవారు దీన్ని ఆహారంగా తీసుకుంటే కాలేయ సంబంధ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు తెలిపారు. పచ్చిగా తిన్నా, జ్యూస్‌ తీసుకుని తాగినా, ఉడికించి, కూర చేసుకుని తిన్నా బీట్‌రూట్‌లో పోషకాలు తగ్గకపోవడం విశిష్టత.మన శరీరంలోని అవయవాలన్నింటికీ ఆక్సిజన్‌ అందించడంలో, శరీరానికి కావాల్సిన ఐరన్‌ సమకూర్చి రక్తహీనత రాకుండా చేస్తుంది. బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్‌, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. బీట్‌రూట్‌లోని నైట్రేట్‌ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీనిలోని పవర్‌ఫుల్‌ లైకోనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ వృద్ధాప్యం ఛాయలు మన దరిచేరకుండా రక్షిస్తుంది. బీట్‌రూట్‌కు ఎరుపురంగు కలిగించే బీటా సయానిన్‌ పెద్దపేగుల్లోని క్యాన్సర్‌ కణాలతో పోరాడుతుంది. బీట్‌రూట్‌లోని కెరోటినైట్స్‌ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. వంద గ్రాముల బీట్‌రూట్ తిన్నా మన శరీరంలో అతి తక్కువ కేలరీలు వస్తాయని న్యూట్రిషనిస్ట్‌ సూరపనేని లహరి చెప్పారు.మనిషికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే బీట్‌రూట్ సాగు విధానం, లాభనష్టాల గురించి తెలుసుకుందాం.

బీట్‌రూట్‌ సాగు చేసే ఎకరం భూమిని దున్నేందుకు రూ.5 వేలు వరకు ఖర్చు వస్తుంది. డీఏపీ, పొటాష్‌ ఎరువులు వేసుకోవచ్చు. ఈ ఎరువులు వేయకుండా కూడా బీట్‌రూట్‌ సాగుచేసే రైతులు ఉన్నారు. ఎకరం నేలలో 150 గ్రాములు ఉండే 9 నుంచి 10 ప్యాకెట్ల విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుందని 15 ఏళ్లుగా బీట్‌రూట్ సాగుచేస్తున్న కర్ణాటక రైతు తెలిపాడు. ఒక్క ప్యాకెట్‌ విత్తనాలకు రూ. 900 నుంచి రూ.930 వరకు ఉంటుంది. అంటే విత్తనాలకు సుమారుగా రూ.9 వేలు ఖర్చు అవుతుంది. బీట్‌రూట్ విత్తనాలను భూమిలో చల్లుకోవచ్చు. లేదా భూమిలో జానెడు దూరంలో పూడ్చిపెడితే ఒక క్రమపద్ధతిలో మొక్కలు ఎదుగుతాయి. దుంప పెద్దగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. విత్తనాలు మూడు నుంచి నాలుగు రోజుల్లో మొలకెత్తుతాయి. విత్తనాలు నాటిన  మూడు రోజులకు చీమల మందు చల్లుకోవాలి. దీని ఖరీదు రూ.600 నుంచి రూ.650 వరకు ఉంటుంది. బీట్‌రూట్‌ పంట భూమిలో కలుపుగడ్డి సమస్య ఎక్కువగా వస్తుంది. దాని నివారణకు ఫాస్ట్‌ మిక్స్‌ పేరిట వస్తున్న ఆయిల్‌ మందును ఆరు సిమెంట్‌ బస్తాల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ఈ మందు పవర్ తగ్గిన తర్వాత మరోసారి ఫాస్ట్‌ మిక్స్‌ను చల్లితే సరిపోతుందని రైతు వివరించాడు. ఫాస్ట్‌ మిక్స్‌ మందు చల్లిన వెంటనే నీరు పెట్టుకోవాలి. లేదా బీట్‌రూట్ విత్తనాలు నాటిన 14 నుండి 18 రోజుల లోపల క్రోప్‌క్విజా అనే లిక్విడ్‌ మందును స్ప్రేచేసుకుంటే కలుపుగడ్డి నివారణ అవుతుంది. ఈ మందు లీటర్ ఖరీదు రూ.1,200 ఉంటుంది. మొక్కలు వచ్చిన 45 రోజులకు భూమిలోని కలుపు తీసేసి 19 గానీ 10:26 గాని ఎరువు వేసుకోవాలని కర్ణాటక రైతు తెలిపారు. బీట్‌రూట్ ఆకులకు ఎర్రమచ్చ తెగులు వస్తుందని, దాని నివారణకు సాఫ్‌ మందు స్ప్రేచేస్తే సరిపోతుంది.బీట్‌రూట్ పంట రెండు నుండి రెండున్నర నెలల్లో సాగు పూర్తవుతుంది. ఒక ప్యాకెట్‌ బీట్‌రూట్ విత్తనాలకు 4 లేదా 5 టన్నులు దిగుబడి వస్తుంది. బీట్‌రూట్‌ పంట ఎకరాకు కనీసంలో కనీసం 24 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఒకే రోజు బీట్‌రూట్ పంట కటింగ్‌కు వచ్చేస్తుంది. తక్కువలో తక్కువ దిగుబడి అంటే రెండు నుంచి మూడు టన్నులకు తక్కువ ఉండదని రైతు చెప్పాడు. ఎకరం నేలలో బీట్‌రూట్ సాగుకు రూ.30 నుంచి 40 వేల మధ్య పెట్టుబడి అవుతుంది. టన్ను బీట్‌రూట్‌కు రూ.10 వేలు ధర పలుకుతుంది. అంటే 24 టన్నుల దిగుబడి వచ్చినా రూ.2,40 లక్షల ఆదాయం కచ్చితంగా వస్తుందని రైతు వెల్లడించాడు. బీట్‌రూట్ సాగులో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉండదు. పెట్టుబడి, రైతు కష్టం తప్పకుండా తిరిగి వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు.పంట మార్పిడి విధానం పాటిస్తే.. నేల సారవంతంగా ఉంటే ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి గ్యారంటీగా వస్తుందని రైతు తెలిపాడు.బీట్‌రూట్‌ పంటను ఒకసారి వేస్తే.. తర్వాత మూడు నాలుగేళ్ల వరకూ అదే భూమిలో సాగు చేయకూడదని రైతుల వివరించాడు. బీట్‌రూట్‌ పంట సాగు చీప్ అండ్ బెస్ట్‌. అందుకని రైతులు భూమికి రెస్ట్‌ ఇవ్వకుండా ఇదే పంట వేస్తే.. వైరస్‌ దాడి చేస్తుంది. సాగు సరిగా అవదు. బీట్‌రూట్‌ దుంప సైజు చాలా చిన్నగా వస్తుంది. దిగుబడి రాదు. నష్టాలు వస్తాయి. బీట్‌రూట్‌ పంట తీసేసిన తర్వాత కనీసం రెండు మూడు పంటలు వేరేవి సాగు చేసుకుంటే మేలు. పంట తీసే కూలి ఖర్చులు కూడా వ్యాపారులే భరిస్తారన్నాడు. ఏడాది క్రితం అయితే. తాను బ్రీట్‌రూట్‌ను టన్ను 28 వేలకు అమ్మినట్లు చెప్పాడు. బీట్‌రూట్‌ పంట అమ్మకానికి సమస్య ఉండదు. ఎక్కడ బీట్‌రూట్‌ పంట ఉంటే అక్కడికే వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు కాబట్టి మార్కెటింగ్ సమస్య కూడా ఉండదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుంది కనుక రైతులు బీట్‌రూట్‌ చేస్తే కనీస ఆదాయానికి లోటు ఉండదు.