సాంప్రదాయ రైతులు సాధారణంగా చేసే సాగు విధానం ఎలా ఉంటుంది? ఏదో ఒక పంట వేస్తారు. ఆ పంట దిగుబడి ఎక్కువ వచ్చి, లాభసాటిగా ఉంటే సంతోషిస్తారు. కాలం కలిసిరాక ఆ పంట దెబ్బతిన్నా, సరైన దిగుబడి లేకపోయినా, మార్కెట్‌లో మంచి ధర రాకపోయినా తమకు ఇంతే ప్రాప్తం అనుకుంటారు. మళ్లీ వేసే పంట అయినా బాగా రావాలని కోరుకుంటారు. కానీ ఇలా దైవాధీనం సర్వీసు మాదిరిగా ఏదో ఒక పంట కాకుండా మల్టీ లేయర్ పంటలు వేస్తే.. దిగుబడులు, లాభాలు తప్పకుండా వస్తాయనే సూత్రాన్ని సహజ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ పేర్కొన్నారు. జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ అంటే జేబీఎన్‌ఎఫ్‌ను ఆయన బాగా ప్రాచుర్యంలోకి తిసుకువచ్చారు.సుభాష్‌ పాలేకర్‌ చెప్పిన మల్టీలేయర్‌ సాగు విధానాన్ని చక్కగా అనుసరించి ఎవరూ ఊహించని ఫలితాలు పొందుతున్నారు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కొండపాలెం అగ్రహారంలో రిటైర్డ్‌ ఉద్యోగి పేరి రామకృష్ణమూర్తి. తమ పొలం ఎర్రమట్టి నేల అని, దానిలో 200 అడుగుల లోపలి దాకా బోరు వేస్తే గాని నీరు లభించని పరిస్థితి ఉండేదని తెలిపారాయన. తాను మల్టీ లేయర్‌ పంటల సాగు చేస్తున్నానని, దానితో పాటు క్షేత్రంలో ఐదు అంచెల ఉద్యానవన పంటలు వేశారాయన. పండ్ల మొక్కల మధ్యలో కందకాలు తవ్వి పంటలు సాగు చేస్తున్నారు. పొలంలో కందకాలు తవ్వడం ద్వారా మొక్కలు లేదా చెట్లకు 365 రోజులు సమృద్దిగా నీరు అందుతోందన్నారు. అందువల్లే మొక్కలు ఏపుగా ఎదగడంతో పాటు చక్కని దిగుబడులు కూడా వస్తున్నాయన్నారు.రామకృష్ణమూర్తి మొక్కలకు నాలుగైడు అడుగుల దూరంలో 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతులో కందకాలు తవ్వించారు. రెండు కందకాల మద్యన 15 అడుగులతో బెడ్‌‌ ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఆయన మూడు రకాలుగా కందకాలను ఏర్పాటు చేశారు. రెండు కందకాల మధ్యన 15 అడుగుల దూరం, రెండో విధానంలో మొక్కకు మొక్కకు మధ్య 5 అడుగుల దూరంలో కందకం, మూడో పద్ధతిలో మొక్కల వరుసలోనే కందకం అనే మూడు విధానాల్లో ఆయన తవ్వించారు. ఈ కందకాల కారణంగా వర్షం నీరు పూర్తిగా భూమిలో ఇంకిపోయి, చెట్లకు అవసరమైన నీరు సమృద్ధిగా అందుతోందన్నారు. దాంతో పాటు తోటలోని వ్యర్థాలు, కలుపు, ఎండిన చెట్ల ఆకులు, మొదళ్లు వంటి వ్యర్థాలను కందకాలలో వేసి కుళ్లబెడుతున్నారు. అలా వేసిన వ్యర్థాలన్నీ కుళ్లిపోయి వాటి నుంచి చెట్లకు అవసరమైన పోషకాలు అందుతున్నాయని అన్నారు.క్షేత్రంలో మనం ప్రధానంగా వేసుకునే మొక్కలకు ఫ్రెండ్లీగా ఉండే ఇతర మొక్కల్ని మల్టీలేయర్‌ విధానంలో నాటుకోవాలన్నారు. ఉదాహరణకు మామిడి ప్రధాన పంటగా వేసుకుంటే.. అక్కడ కొబ్బరి వేయకూడదన్నారు. మామిడికి నీటి సరఫరా చేయక్కర్లేదు. కానీ కొబ్బరికి నీరు ఇవ్వాల్సి ఉంటుంది. నీరు ఇస్తే మామిడి దెబ్బతింటుంది. నీరు సరఫరా చేయకపోతే కొబ్బరిమొక్క పాడవుతుంది. అందుకే ఏ చెట్టుకు ఏ మొక్క ఫ్రెండ్లీగా ఉంటుందో ఆలోచించుకుని నాటుకోవాలన్నారు. సీజనల్‌గా ఏయే మొక్కలకు నీరు అందించాలో వాటిని ఒక వరసలో నాటుకుంటే మేలు అన్నారు. అలాగే పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోసం కొన్ని మొక్కలను కూడా తోటలో పెట్టుకోవాలని చెప్పారు. వాటితో పాటు నైట్రోజన్‌ ఫిక్సేషన్‌ మొక్కల్ని కూడా ఆ వరుసల్లో వేసుకోవాలని తెలిపారు. ప్రధాన పంట ఏది? దానికి సూటబుల్‌ పంట ఏదనేది ఒక ప్రణాళిక ప్రకారం వేసుకోవాలన్నారు.ఎర్రమట్టి నేలల్లో ఏ రైతు అయినా ముందుగా నీటిని పొదుపుగా వాడుకునే విధానాలపై దృష్టిపెట్టాలని రామకృష్ణమూర్తి చెప్పారు. కందకాల పక్కన టేకు, ఉసిరి, ఎర్రచందనం, కొబ్బరి మొక్కలు నాటుకోవాలన్నారు. అంటే నీరు సరఫరా చేయకపోయినా బతకగలిగే మొక్కలు నాటాలన్నమాట. మనం వేసుకునే ప్రధాన పంటగా మామిడిని తీసుకుంటే మొక్కలు 36X36 అడుగుల దూరంలో నాటుకోవాలన్నారు. కొబ్బరి మొక్కల్ని కూడా అంతే దూరంలో నాటుకోవాలన్నారు. కందకానికి నాలుగైదు అడుగుల దూరంలో మొక్కల్సి నాటుకోవాలి. ప్రధాన పంట మొక్కల మధ్యలో కమలా, సపోటా, నిమ్మ, ఉసిరి, జామ మొక్కల నాటుకోవచ్చన్నారు. మామిడి మొక్కలకు 8 అడుగుల దూరంలో బెడ్‌లకు రెండు వైపులా తెగుళ్లను అడ్డుకునే సీతాఫలం మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. తర్వాత మరో బెడ్‌లో కొబ్బరి ప్రధాన పంటగా తీసుకుంటే.. వాటితో పాటు నిమ్మ, జామ, సపోటా మొక్కల్ని నాటుకోవలని రామకృష్ణమూర్తి వివరించారు. కొబ్బరి సహా ఈ మొక్కలన్నింటికీ నీరు సరఫరా చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటిని ఒక వరసలో వేసుకోవచ్చు. బెడ్లకు రెండు చివరల్లో మొక్కలు నాటుకున్న తర్వాత బెడ్ మధ్యలో దుక్కి దున్ని పప్పు ధాన్యం పంటలు వేసుకోవచ్చు. దీనితో ప్రధాన మొక్కలకు కావాల్సిన నైట్రోజన్‌ బాగా అందుతుంది.నీరు ఇవ్వాల్సిన అవసరం లేని, నీరు తప్పనిసరి మొక్కల మధ్య అయినా సరే నైట్రోజన్ ఫిక్సేషన్‌ చేసే మునగ మొక్కలు నాటుకోవాలని రామకృష్ణమూర్తి తెలిపారు. ప్రతి 10 లేదా 15 ప్రధాన మొక్కల మధ్య మునగమొక్క వేసుకోవాలన్నారు. తవ్విన కందకాల్లో పశువుల మేత కోసం కొర్రలు, చిరుధాన్యాలు, గడ్డి విత్తనాలు చల్లుకోవాలన్నారు. కొర్రలు, చిరుధాన్యం పంటలు మనం కోసుకున్న తర్వాత ఆ మొక్కల్ని పశువుల మేతగా వినియోగించవచ్చన్నారు. గడ్డిని, కొర్రలు, చిరుధాన్యపు మొక్కలను వేళ్లతో సహా తీసేయకుండా భూమి పైభాగానికి కోసుకోవాలన్నారు. ధాన్యాలు మనకు ఉపయోగపడతాయి. గడ్డి పశువులకు ఆహారం అవుతుంది. నేల లోపల మిగిలిన మొక్కల వేళ్లు, కాండం కుళ్లి భూమికి బలాన్నిస్తాయి.క్షేత్రంలో కందకాలు తవ్వడం వల్ల వర్షపునీటిని బాగా ఒడిసిపట్టుకుని భూగర్భ జలాలను బాగా పెంచుతాయి. దీంతో ఎండాకాలంలో కూడా పొలంలోని మొక్కలకు నీరు అందుతుంది. ఒకసారి పూర్తిగా వర్షం పడితే ఎకరం నేలలో కోటీ 50 లక్షల లీటర్ల నీటిని కందకాలు భూమిలోకి ఇంకిస్తాయని రామకృష్ణమూర్తి తెలిపారు. కందకాలు తవ్వక ముందు తాము రెండు అంగుళాల బోరు వేస్తే అర అంగుళం నీరు మాత్రమే వచ్చేదని, కందకాలు తవ్విన తర్వాత పూర్తిగా రెండు అంగుళాల నీరు పోస్తోందన్నారు. నీరు ఎక్కడ లభిస్తుందో అక్కడి వరకు మొక్కల వేరు వ్యవస్థ విస్తరిస్తుంది. దీంతో నేల గుల్లబారుతుంది. మొక్కలు బలంగా తయారవుతాయి. బెడ్‌ మీద కొబ్బరి పంటను ప్రధానంగా వేసుకుంటే.. కందకాల పక్కన ఆరు అడుగుల దూరం ఉండేలా బొప్పాయి, జామ మొక్కలు నాటుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. బొప్పాయి జీవితకాలం మూడేళ్లయితే.. జామ జీవితకాలం ఉంటుందన్నారు రామకృష్ణమూర్తి. కొబ్బరి మొక్కలను బెడ్లకు అటు చివర ఇటు చివర నాటుకోగా మధ్యలో ఉండే స్థలంలో భూమికి మంచి సారం అందించే, మనకు దిగుబడి ఇచ్చే పప్పుదినుసుల పంటలు వేసుకోవచ్చు. సీజనల్‌గా వచ్చే నువ్వులు, పెసలు, మినుములు, పసుపు పండించుకోవచ్చు.కొబ్బరి లేదా మామిడి మొక్కల్ని నాటిన వరుసలోనే కందకాలు తవ్వే విధానం ఒకటి వివరించారు రామకృష్ణమూర్గి. కందకం ద్వారా మొక్కలకు కావాల్సిన పోషకాలు ఎలాగూ అందుతాయి. దాంతో పాటు అటు ఇటు ఉన్న బెడ్లపై ఎక్కువ మొత్తంలో సీజనల్ పంటలు పండించుకోవచ్చు. తోటలోని ప్రతి మొక్క మొదట్లో తప్పనిసరిగా ఎంతో కొంత గడ్డి కానీ, ఎండు ఆకులతో ఆచ్ఛాదనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో మొక్క మొదట్లో తేమ ఎక్కు కాలం నిల్వ ఉంటుంది. తద్వారా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. దీంతో మొక్కలు ఆరోగ్యంగా తయారవుతాయి.  మంచి ఫలాలు ఇస్తాయి. గడ్డి లేదా ఆకులను ఆచ్ఛాదనగా వేసిన తర్వాత ఘన జీవామృతం పైన వేసుకుంటే మొక్కలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి.సహజ వ్యవసాయం కానీ, సుభాష్ పాలేకర్‌ విధానంలో కానీ, గో ఆధారిత వ్యవసాయంలో కానీ తప్పనిసరిగా వాడాల్సింది బీజామృతం, జీవామృతం, మల్చింగ్‌, వాప్సా అన్నారు రామకృష్ణమూర్తి. మొక్కల మొదట్లో నాలుగైదు అంగుళాల ఎత్తు వచ్చేలా ఎండు ఆకులు, పచ్చి ఆకుల బయోమాస్‌ తప్పకుండా వేసుకోవాలి. మల్టీ క్రాప్ విధానంలో పెస్ట్‌ మేనేజ్‌మెంట్ చాలా సులువు అవుతుంది. వర్షాకాలానికి ముందు తోటలో ఖాళీ ఉన్న చోటల్లా దుక్కి దున్ని సజ్జలు వేసుకుంటే.. ఆ గింజల్ని తిన్న రకరకాల పక్షులు చెట్ల మీద కూర్చొని సేదతీరతాయి. ఆ చెట్ల మీద ఉండే పురుగులను అవి తినేస్తాయి. తద్వారా ప్రధాన పంటలకు పురుగుల బెడద తప్పుతుంది. క్షేత్రంలో ఎలాంటి రసాయనాలు వాడని కారణంగా రకరకాల పక్షులు వస్తాయి. వైరస్‌ లేదా బాక్యీరియా ఆశిస్తే.. పూత వచ్చే సమయంలో లేదా ముందుగా వేపనూనె లేదా పుల్ల మజ్జిగను వారం మార్చి వారం స్ప్రే చేసుకోవాలి.మల్టీ లేయర్ ఫార్మింగ్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవుతుంది. మొక్కలు ఒక క్రమపద్ధతిలో పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మల్టీ లేయర్ ఫార్మింగ్‌లో ఒక రకం పంట దిగుబడిలో నష్టం వచ్చినా, మరో పంట ద్వారా ఆ నష్టం పూడిపోతుంది. అయితే.. ఏ చెట్టుకు ఎంత స్థలం అవసరం అవుతుందో ముందుగా అంచనా వేసుకోవాలి. అందుకు అనుగుణంగా మొక్కల మధ్య దూరం పెట్టుకోవాలి. కలుపు మొక్కల్ని సాధారణంగా వేళ్లతో సహా పీకిపారేస్తారు. కానీ.. భూమిలో ఏ ధాతువు లోపం ఉంటుందో దాన్ని పూరించేందుకు కలుపు మొక్కలు మొలుస్తాయని ప్రయోగాల్లో నిర్ధారించారు.అందుకే కలుపు మొక్కలను పీకేయకుండా భూమి పైభాగానికి కత్తిరించుకోవాలన్నారు రామకృష్ణమూర్తి. ప్రకృతిని సమతుల్యం చేయడానికే ఇలా కలుపుమొక్కలు వస్తాయని తెలుసుకోవాలన్నారు. కలుపు మొక్కని కోసేయకపోయినా.. కొన్ని రోజుల తర్వాత దానికదే సహజంగా వంగిపోయి కిందకు పడిపోతుంది. తద్వారా భూసారాన్ని పెంచుతుంది. కలుపుమొక్కలు ప్రధాన పంటను మించి పెరిగినప్పుడు కత్తిరించుకోవాలి. కలుపుమొక్కలు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రధాన పంట మొక్కలు నిండు వేసవిలో కూడా ఏపుగా, బలంగా, పచ్చగా పెరుగుతాయని గుర్తించాలి.