సాంప్రదాయ రైతులు సాధారణంగా సాగు ఎలా చేస్తారు? తమ పొలంలో తోచిన, లేదా చుట్టుపక్కల వారు చేస్తున్న సాగు పద్ధతుల్లో చేస్తుంటారు. కొందరు రైతులు ఏడాదికి ఒక పంట లేదా రెండు మరికొందరు మూడేసి పంటలు పండిస్తుంటారు. ఆధునిక రైతు ఆలోచనా విధానం మారింది. అధిక దిగుబడి సాధించేందుకు కొత్త కొత్త విధానాలు ఆలోచిన్నాడు.. ఏడాదిలో ఒకటి, రెండు మూడు దిగుబడులు, ఆదాయాలు తీసుకునే దానికన్నా ఏడాది పొడవునా పంటలు ఇచ్చే మొక్కలు, చెట్ల రకాలు ఉన్నాయి. మన వాతావరణాన్ని తట్టుకుని ఏడాది పొడవునా దిగుబడులు, ఆదాయం ఇచ్చే మొక్కలపై అధ్యయం చేసి, అమేయ కృషి విజ్ఞాన వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నారు. ఆ వివరాలను యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ రైతు జిట్టా జ్యోతిరెడ్డి చెప్పిన విషయాలు తెలుసుకుందాం.అమేయ కృషి విజ్ఞాన కేంద్రం తరఫున ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు సంస్థ నిర్వాహకులలో ఒకరైన జ్యోతిరెడ్డి. కోళ్లు, గొర్రెలు, ఆవులు, చేపలు, కూరగాయలు, పండ్ల మొక్కలు, ఆకుకూరలు వీటన్నింటినీ ఏక కాలంలో సాగుచేస్తే లాభంగా ఉంటుందన్నారు. మార్కెట్‌ ఆధారంగా ఒకే పంటపై దృష్టి పెడితే లాభం రావచ్చు. నష్టం కూడా కలగవచ్చు. ఉదాహరణకు టమాటా పంటను చూసుకుంటే అయితే.. కిలో 2 వందల రూపాయలు ఉంటుంది. లేదంటే అర్ధ రూపాయికి కూడా ధర పడిపోతుంది. రైతన్న ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోవాలంటే మనం ఎన్నుకునే రకాలు, పంట విధానాలను మార్చుకోవాలంటారు జ్యోతిరెడ్డి. ఈ ఆలోచనతోనే ఆమేయ కృషి విజ్ఞానకేంద్రం నర్సరీలో ఏడాది పొడవునా పండ్లు, కాయలు కాసే రకాల మొక్కలను పెంచుతున్నారు.అలాంటి వాటిలో థాయ్‌ సపోటా రకం ఏడాది పొడవునా కాయలు కాస్తూనే ఉంటుంది. దీని కాయలు చాలా తియ్యగా ఉంటాయి. అయితే.. థాయ్‌ సపోటా కాయ పక్వానికి వచ్చిన తర్వాత చెట్టు నుంచి తెంపి ముగ్గబెట్టుకోవాల్సి ఉంటుంది. ముగ్గబెట్టినప్పుడే థాయ్‌ సపోటా సహజసిద్ధమైన రుచి తెలుస్తుంది. క్యాటిమోని అనే రకం మామిడిమొక్క సంవత్సరం పొడవునా కాయలు కాస్తూనే ఉంటుంది. గుత్తులు గుత్తులుగా కాసే క్యాటిమోని మామిడిలో తీపి ఎక్కువగా ఉంటుంది. దీంట్లో థాయ్‌త్రి, బారీ లెవన్‌, ఆమ్రపాలి ఆల్‌టైమ్‌, వియత్నాం ఆల్‌టైమ్‌, కచ్చా మీటా ఆల్‌టైమ్‌ లాంటి రకాలు 365 రోజులూ కాయలు కాస్తూనే ఉంటాయి. వీటితో పాటు ఏడాదికి రెండు మూడుసార్లు దిగుబడి వచ్చే దోఫల, వస్త్ర, పందిరిమామిడి, రాయల్ స్పెషల్‌ లాంటివి కూడా మంచి ఫలసాయం అందిస్తాయి. రాయల్‌ స్పెషల్‌ మామిడి పునాస రకం పేరుతో అందరికీ తెలిసిన రకం. దోఫలలో గ్రీన్‌, రెడ్‌ రకాలు ఉంటాయి. ఇవన్నీ జన్యు మార్పిడి చేసిన మొక్కలు కావు కాబట్టి వీటితో మనిషి ఆరోగ్యానికి హాని ఏమీ ఉండదన్నారు.ఆల్‌టైమ్‌ రకాల్లో చిన్న చిన్న ఆకులతో కూడిన నిమ్మ, థాయ్‌ ఆల్‌టైమ్‌ నిమ్మ రకాలు ఉన్నాయి. థాయ్‌ ఆల్‌టైమ్‌ నిమ్మకాయ పెద్దగా ఉంటుంది. రసం ఎక్కువ వస్తుంది. చెట్టు నుంచి కోసిన తర్వాత వారం రోజులైనా కాయ పాడవకుండా నిల్వ ఉంటుంది. థాయ్ నిమ్మకాయను చేతులతో పిండితే ఎక్కువ రసం రాదు. హ్యాండిల్‌ అంటే లెమన్‌ జ్యూసర్‌తో పిండితే బాగా రసం వస్తుంది. థాయ్‌ ఆల్‌టైమ్‌ నిమ్మ ఫంక్షన్లు చేసుకునేవారు, సలాడ్‌లలో వినియోగించేవారు, హొటళ్లలో వాడకానికి ఎక్కువగా తీసుకుంటారు. నిమ్మ పచ్చళ్లకు కూడా ఈ రకం చాలా బాగుంటుంది. చిన్న ఆకులతో ఎదిగే రకం నిమ్మకాయలు మీడియం సైజులో అంటే బాలాజీ నిమ్మ సైజులో ఉంటాయి. వీటిలో రసం ఎక్కువగా ఉంటుంది. ఏడాది పొడవునా దిగుబడి ఇచ్చే టీ ఫైవ్‌ జామ రకం గురించి తెలుసుకుందాం. గింజలు తక్కువ ఉండే దీని కాయలు రుచిగా.. క్రిస్పీగా ఉంటాయి. ఈ జామకాయ తినే వారికి  కొబ్బరి తిన్న అనుభూతి కలుగుతుంది. ఇలాంటి రకాలు రైతులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.ఇక ఆల్‌టైమ్‌ పనస రకం ఏంటో చూద్దాం. ఈ రకం పనస చెట్టు మొదట్లో పెద్దకాయలు ఉంటాయి. ఆ పైన మీడియం సైజులో ఉంటాయి. ఆ తర్వాత పైన చిన్న కాయలు వస్తాయి. చివరిలో పూత ఉంటుంది. అంటే ఈ రకం పనసచెట్టు అంచెలంచెలుగా కాయలు కాస్తూనే ఉంటుంది. రెండున్నర ఏళ్ల వయస్సు  నుంచి ఇది కాయలు కాస్తుంది. అంత కంటే ముందు వచ్చే పిందెలు రాలిపోతాయి. ఈ చెట్టు తన కాయలను తాను నిలుపుకునేలా బలంగా తయారైనప్పుడు మాత్రమే కాలయ నిలబడతాయి. వాస్తవానికి ఈ చెట్టుకు వచ్చిన పిందెలన్నీ కాయలుగా మారితే చెట్టు వాటి బరువును తట్టుకోలేదు. ఈ పనస కాయలను కూర కోసం వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు. పెద్ద కాయలు పండ్లుగా మారి నిరంతరం ఆదాయం ఇస్తూనే ఉంటాయి. ఆల్‌టైమ్‌ ఆరెంజ్‌లో వియత్నాం మాల్టా ప్రత్యేకమైనది. ఈ ఆరెంజ్‌ ఏడాదిన్నర నుంచే కాపు కాస్తుంది. దీని కాయలు పెద్ద సైజ్‌ వచ్చి ముగ్గినప్పుడు పసుపురంగులోకి మారుతాయి. దీన్నుంచి ఎక్కువగా వచ్చే రసం చాలా బాగుంటుంది. మాల్టా రకం ఆరెంజ్‌ తిన్న వారికి ఎంతో సంతృప్తిని ఇస్తుంది.సంవత్సరం పొడవునా పంట వస్తే.. ఒక నెలలో తక్కువ ధర పలికినా మరో నెలలో అధిక రేట్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో రైతు నష్టపోయే పరిస్థితి ఉండదు. ఈ ఆల్‌టైమ్‌ రకాల పండ్ల చెట్లకు పంచగవ్య ఇస్తే కాయలు చాలా రుచిగా ఉంటాయి. పూలు కూడా ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి.

ఆల్‌టైమ్‌ పండ్ల మొక్కల గురించి, సాగు విధానం గురించి, నర్సరీ మొక్కల లభ్యత గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే భువనగిరి సమీపంలోని అమేయ కృషి విజ్ఞాన కేంద్రంలో 7993315405లో సంప్రదించవచ్చు.