సపోటా పండు అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సపోటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కనుక కంటికి మేలు చేస్తుంది. దీంట్లో గ్లూకోజ్‌ కూడా ఎక్కువే. సపోటాలో యాంటి ఆక్సిడెంట్లు, టానిన్లు ఉన్నాయి. ఇవి వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. సపోటాలో లభించే ఎ, బి, ఇ విటమిన్లు చర్మం ఛాయను మెరుగు పరుస్తాయి. సపోటాలోని విటమిన్ ఏ ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ నుంచి రక్షిస్తుంది. దీంట్లో ఉండే కాల్సియం, ఫాస్పరస్‌, ఐరన్‌ ఎముకలను బలంగా ఉంచుతాయి. సపోటాలో ఉండే డైటరీ ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీనిలో కార్బొహైడ్రేట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి గర్భిణులకు ఆహారంగా ఇస్తే ఉపయోగం. సపోటా రక్తస్రావాన్ని నివారిస్తుంది. విరేచనాన్ని నిరోధించే లక్షణాలు ఉన్నాయి. ఫైల్స్ ఉన్నవారు సపోటా తింటే చాలా ఉపయోగంగా ఉంటుంది. సపోటాలోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది.ఇన్ని ప్రయోజనాలు ఉన్న సపోటా సాగులోని మెళకువలు, చీడ పీడలు, ఆదాయం, ఖర్చు గురించి తెలుసుకుందాం.

సపోటా జాతి చాలా మొండి రకం. చీడ పీడలు దీన్ని ఇబ్బంది పెట్టలేవు. సాగు నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువే. కేవలం తయారైన కాయలను కోయడానికి మాత్రమే కూలీల ఖర్చు అవుతుంది. ఎరువులు అంతగా వేయాల్సిన అవసరం ఉండదు. సపోటా మొక్కలు నాటే ముందు పొలాన్ని దుక్కి దున్ని దాంట్లో సేంద్రీయ ఎరువు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత సపోటా మొక్కల నుంచి రాలే ఆకులే భూమిపై ఆచ్ఛాదనగా ఉపయోగపడతాయి. తద్వారా భూమిలో తేమ ఆరిపోకుండా రక్షిస్తాయి. అవే ఆకులు నీటితో తడిసి, కుళ్లిపోయి సపోటా మొక్కలకు ఎరువుగా కూడా పనికి వస్తాయి. సపోటా చెట్టు కింద నీడ ఉంటుంది కాబట్టి కలుపు కూడా పెరగదు. సరైన సాగు పద్ధతి అవలంబిస్తే ఏడాది పొడవునా సపోటా మొక్కలు లేదా చెట్ల నుంచి ఫలసాయం అందుతూనే ఉంటుంది.సపోటా చాలా సులువుగా చేసుకునే సాగు. అయినా సరే ఎందుకో మరి చాలా మంది రైతులు దీని సాగు పట్ల అంతగా మొగ్గు చూపరు. సపోటాలో పాల సపోటా, కాలాపత్తి రకాలు చాలా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ఉండే రుచి, తియ్యదనం అలాంటివి మరి. కాలాపత్తి సపోటా కాయ చెట్టు నుంచి కోసిన తర్వాత వారం, పదిరోజుల పాటు పాడైపోకుండా నిల్వ ఉంటుంది. సపోటా సాగులో ఎవ్వరూ రసాయనాలు వాడరు. ఇది మొండిజాతి చెట్టు కాబట్టి పురుగు మందులు వాడాల్సిన అవసరం రాదు. అయితే… వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ మధ్య కాలంలో బోరాన్‌ లోపం వల్ల కాయ మీద అక్కడక్కడా పగుళ్లు వస్తున్నాయి. మిగతా పండ్ల మాదిరిగా సపోటాకు ఫ్రూట్ ఫ్లై ఇబ్బంది కూడా ఉండదు.సపోటా పిందెలు మొదలైనప్పటి నుంచీ చెట్ల మొదళ్లకు నీళ్లు క్రమపద్దతిలో ఇచ్చుకోవాలి. అప్పుడే సపోటా కాయల సైజు ఎక్కువగా వస్తుంది. నీటిని ఎంత ఎక్కువగా ఇస్తే.. కాయ సైజు అంత బాగా పెరుగుతుంది. చిగుర్లు కూడా అంతే మోతాదులో ఎక్కువగా వస్తాయి. సపోటా కాయలు తెంపుకున్న తర్వాత చెట్లకు చాలా మంది రైతులు నీటి సరఫరా నిలిపేస్తారు. అలా కాకుండా నిరంతరం చెట్టుకు నీళ్లు ఇస్తే.. దాన్నుండి కొత్త చిగుర్లు, పూత, పిందెలు, పండ్లు ఎక్కువగా వస్తాయి. సు నందనం ఫార్మ్‌ యజమాని సునంద అయితే.. వారానికి ఒకసారి సపోటా చెట్లకు నీరు సరఫరా చేస్తామని తెలిపారు. సపోటా చెట్ల కింద నీడ ఉంటుంది కాబట్టి తేమ త్వరగా ఆరిపోదన్నారు. ఒక వేళ సపోటా తోటలో భూమిలో తేమ ఆరిపోతే వారానికి రెండు సార్లు నీరు సరఫరా చేస్తే సరిపోతుంది.సపోటా చెట్లకు క్రిమి సంహారకాలు స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. కానీ.. చెట్టు ఆరోగ్యంగా ఉండడం కోసం, దాన్నుంచి అధిక ఫలసాయం పొందడం కోసం బయో ఎంజైమ్స్‌, మట్టి ద్రావణం, మొలకెత్తిన విత్తనాలతో తయారు చేసిన బయో ఎంజైమ్స్‌ ద్రావణాన్ని స్ప్రే చేస్తే.. సపోటా సైజు పెరుగుతుంది. తద్వారా దిగుబడి, రుచి కూడా బాగా వస్తుందని సు సునంద తెలిపారు. మొలకల బయో ఎంజైమ్స్‌ను తాము బాగా ఫెర్మంట్ చేసి ఇస్తామన్నారు. ఈ మొలకల బయో ఎంజైమ్స్‌ కొద్దిగా తయారు చేసుకున్నా చాలా మొక్కలకు సరిపోతుందన్నారు. సపోటా సాగు చాలా సులువైనది. కేవలం బయో ఎంజైమ్స్‌, మట్టి ద్రావణం, మొలకల బయో ఎంజైమ్స్‌ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది.సపోటా మొక్కలను నాటుకున్న తర్వాత రెండు మూడేళ్ల వరకు నత్రజని, పొటాషియం, భాస్వరం అందించేందుకు సేంద్రీయ ఎరువు ఇస్తే సరిపోతుంది. ఆపైన క్రమం తప్పకుండా నీటి సదుపాయం కల్పిస్తే సరిపోతుంది. దీంతో పాటు బయో ఎంజైమ్స్‌ వేస్తే మొక్కలు ఆరోగ్యంగా చాలా ఎక్కువగా ఉంటుంది. బయో ఎంజైమ్స్‌ స్ప్రే విషయానికి వస్తే.. మట్టి ద్రావణంతో పాటు ఒకసారి స్వీట్‌ బయో ఎంజైమ్స్‌, మరోసారి పుల్లని బయో ఎంజైమ్స్‌, ఇంకోసారి మొలకలతో తయారు చేసిన బయో ఎంజైమ్స్‌ ఇస్తామని సునంద వెల్లడించారు. దాని వల్ల కాయసైజు పెద్దగా వస్తోందని, కొత్త పూతలు కూడా బాగా వస్తున్నాయన్నారు. సపోటా చిగురు, పూత, పిందె, కాయలు కంటిన్యూగా ఉంటాయన్నారు.సపోటా కాయలను పక్వానికి రాక ముందే కొందరు రైతులు, లేదా లీజుకు తీసుకున్న వారు కోసేస్తారు. అలాంటి కాయలు మెత్తగా అయ్యేందుకు పండ్లు అమ్మే వారు రసాయనం కలిపిన నీటిలో ముంచుతారు. దాని వల్ల సపోటా మెత్తగా అవుతుంది కానీ దాని సహజసిద్ధమైన రుచి రాదు. సపోటా కాయలు పక్వానికి వచ్చిన తర్వాత కోస్తేనే చాలా రుచిగా ఉంటుంది. అది మెత్తబడడానికి ఎలాంటి కెమికల్స్‌ వాడాల్సిన అవసరం ఉండదు. సపోటా కాయలను చెట్టు నుంచి కోయడానికి మాత్రమే కూలీల ఖర్చు అవుతుంది. మిగతాదంతా జీరో ఇన్వెస్ట్‌మెంట్‌ అనే చెప్పాలి. సపోటాకాయ పచ్చ రంగులో ఉన్నప్పుడు తెంపకూడదు. లైట్‌ యెల్లో కలర్ వచ్చినప్పుడు కోసుకోవాలి. సపోటా కాయను గోరుతో గీకితే లైట్‌ గోల్డ్ కలర్ కనిపించినప్పుడు పక్వానికి వచ్చిందని తెలుసుకోవాలి. ఇలాంటి సపోటా పండు తిన్న వారికి చాలా తృప్తిగా ఉంటుంది.సపోటా పంట దిగుబడి వర్షాకాలం పూర్తయినప్పటి నుంచి మొదలై ఏడాది పొడవునా వస్తూనే ఉంటుంది. అయితే.. సాగు మేనేజ్‌మెంట్ సక్రమంగా చేసుకోవాల్సి ఉంటుంది.  తయారైన కాయలు కోసుకుంటూ ఉంటే.. చెట్టుకు కొత్త చిగుర్లు వచ్చి దాన్నుంచి గుత్తులు గుత్తులుగా పూతలు, పిందెలు, కాయలు, పండ్లు పెరుగుతాయి. తద్వారా ఆదాయం నిరంతరం వస్తూనే ఉంటుంది. అందుకే తోటలో సపోటా సాగు చేస్తే.. ఇతర పంటలకు పెట్టే ఖర్చుల కోసం ఆదాయం ఇస్తుంది.