శరీరం దృఢంగా ఉండాలంటే చికెన్‌, మటన్‌ తినాలని చాలా మంది భావిస్తారు. కానీ.. కూరగాయలు తిన్నా అంతే బలం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ముఖ్యంగా చిక్కుడు జాతి కూరగాయలు మరింత మంచిదని, వాటిలో కూడా బీన్స్‌ తింటే మరింత ఆరోగ్యంగా, బలంగా ఉంటారని అంటున్నారు. బీన్స్‌ను ‘పేదోడి మటన్‌’ అని అంటారు.మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు బీన్స్‌లో ఉంటాయి. బీన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌లో లభించే మెగ్నీషియం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చబుతున్నారు. ఐరన్‌ లోపం రాకుండా కాపాడతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. బీన్స్‌లో ఐరన్‌, మెగ్నీషియంతో పాటు విటమిన్లు, కాపర్‌, మాంగనీసు, ఫాస్పరస్‌, జింక్‌ కూడా ఉంటాయి. బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. శరీర బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. రక్తాన్ని పరిశుభ్రం చేసే మూలకాలు బీన్స్‌లో పుష్కలంగా ఉంటాయి. అధిక పీచు పదార్థం యాంటీ ఆక్సిడెంట్ల వల్ల క్యాన్సర్‌ కారకాలను అణచివేస్తుంది. పీరియడ్స్‌ సరిగా ఉండని మహిళలు బీన్స్ తింటే ఔషధంలా పనిచేస్తుంది. దీంట్లో కొవ్వు పదార్థాలు చాలా తక్కువ. ఇలాంటి బీన్స్‌ను టెర్రస్‌ మీద కుండీల్లో ఎలా సాగుచేయాలో చూద్దాం.చాలా సులువుగా పంచుకునే కూరగాయల జాతిలో బీన్స్‌ ఒకటి. నేల మీదే కాకుండా చిన్న చిన్న కుండీల్లో కూడా బీన్స్‌ సాగు చేయడం ఎంతో సులువు. బీన్స్‌ చాలా రుచిగా ఉంటుంది. త్వరగా పంట చేతికి వస్తుంది. బీన్స్‌ మొక్కలకు చీడ పీడల బాధ కూడా అంత ఎక్కువగా ఉండదు. నిజానికి బీన్స్ చలికాలపు పంట. మామూలుగా అయితే.. ఆగస్టు నుంచి ఫిబ్రవరి నెలల మధ్యలో బీన్స్‌ దిగుబడి వస్తుంది. అయితే.. వేసవి కాలం అంటే ఏప్రిల్‌, మే నెలలో కూడా దిగుబడి కోసం కూడా కుండీల్లో సాగు చేసుకోవచ్చు. అయితే.. కొద్దిగా నీడ ఉండే చోట బీన్స్‌ నాటిన కుండీలను పెట్టుకోవాల్సి ఉంటుంది.బీన్స్ విత్తనాలను ఎర్రమట్టి, దేశీ ఆవు ఎరువు సరిసమాన పాళ్లలో కలిపి, కుండీల్లో నింపుకోవాలి. లూజుగా ఉండే ఈ మట్టి మిశ్రమంలో బీన్స్ విత్తనాలను ఒక్కో కుండీలో మూడు లేదా నాలుగు పెట్టి, పైన కొద్దిగా మట్టితో కప్పాలి. అవి మూడు నుంచి ఐదు చోజుల్లో మొకలకెత్తుతాయి. వారం రోజులకు కూడా మొలకలు రాకపోతే అవి మట్టిలోనే కుళ్లిపోనట్టు భావించాలి.మూడు రోజులకే మొలకలు వచ్చిన బీన్స్‌ మొక్కలను పదిహేను రోజులకే మొక్క మొదటి మట్టితో సహా మరో కుండీలోకి మార్చుకుంటే దాని ఎదుగుదల మరింత వేగంగా, బలంగా వస్తుంది. ఎర్రమట్టి, ఆవు ఎరువు సమానంగా కలిపిన మిశ్రమంలో కిచెన్‌ వేస్ట్‌ను కుండీ అంచుల వద్ద వేసి, దానిపై మట్టిని సర్దాలి. తర్వాత మొక్కలను కుండీ మధ్యలో నాటుకుంటే బాగుంటుంది. మరీ చిన్న మొక్కలైతే కిచెన్‌ వేస్ట్‌ కంపోస్టు వేయకూడదని టెర్రస్ గార్డెనింగ్‌ అనుభవజ్ఞురాలు బొడ్డేపల్లి అరుణ సూచించారు. ఈ విధంగా నాటుకున్న కుండీల్లో నీళ్లు పోస్తూ ఉంటే మట్టి మిశ్రమంతోని పోషకాలతో పాటుగా కిచిన్ కంపోస్ట్‌ కుళ్లిపోయి, దాన్నుండి కూడా పోషకాలు మొక్కల వేళ్లకు బాగా అందుతాయి. దీంతో మొక్కలు వేసవి కాలంలో కూడా మరింత బలంగా, పచ్చగా ఎదుగుతాయి.రెండు మూడుసార్లు వచ్చే బీన్స్‌ దిగుబడికి మట్టి మిశ్రమం, కిచెన్ వేస్ట్ కంపోస్ట్‌తో పోషకాలు సమృద్ధిగా సరిపోతాయి. ఆ పైన మరి ఇంక ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. బీన్స్‌ మొక్కలు రెండు, మూడు సార్లు దిగుబడి ఇస్తాయి. తర్వాత వాటిని తీసేసి, మళ్లీ సిద్ధం చేసుకున్న కొత్త నారును నాటుకోవాల్సి ఉంటుంది. ముందరి బీన్స్ మొక్కల నుంచి దిగుబడి నిలిచిపోయే సమయానికి కొత్త నారును సిద్ధం చేసుకుంటే పంటను నిరంతరం తీసుకోవచ్చు.