కలం యోధుడు… వైఎస్‌ఆర్‌ అని అందరం ఆప్యాయంగా పిలుచుకునే దివంగత సీనియర్ జర్నలిస్టు యెన్నా శ్రీనివాసరావు గతించి అప్పుడే మూడేళ్లు ముగిసిపోయింది. కీర్తిశేషుడు వైఎస్‌ఆర్‌ మనందరికి మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం అందరి మదిలో పదిలంగా అలాగే నిలిచి ఉన్నాయి. మన కాలంలో మన ముందే నడయాడిన వైఎస్‌ఆర్‌ది జర్నలిస్టు సమాజంలో ప్రత్యేకం అనే చెప్పాలి. అపర మేధావి, అనంత జ్ఞాన సంపన్నుడైన వైఎస్‌ఆర్‌ గురించి ఏ కొంచెం తెలిసిన వారైనా ఆయనను సందర్భం వచ్చినప్పుడల్లా స్మరించకుండా ఉండలేం. అలా ఆయనను ప్రతి నిత్యం స్మరించుకునే వారిలో సీనియర్ జర్నలిస్టు, వీఈఆర్‌ ఆగ్రోఫార్మ్స్‌ అధినేత వర్రే గంగాధర్‌ ప్రముఖుడనే చెప్పాలి.వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్‌ వెబ్‌సైట్‌ వ్యవస్థాపక ఎడిటర్‌గా బాధ్యతలను ఆయన శివైక్యం పొందే వరకు నిర్వహించడం గర్వకారణం. ఆయన చేతిలో వీఈఆర్‌ ఆగ్రోఫార్మ్స్‌ వెబ్‌సైట్ ఎంతో సర్వాంగ సుందరంగా, వ్యవసాయ సంబంధ విషయాలతో మరీ ముఖ్యంగా ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంలో పలు విశ్లేషణాత్మక వ్యాసాలను ఆయన అందించారు. సుభాష్ పాలేకర్‌ సహజసిద్ధ వ్యవసాయంలో సిద్ధహస్తులైన ఎందరో రైతుల గురించిన ఆయన వివరణాత్మకంగా వ్యాసాలు అందించారు.వైఎస్ఆస్‌ తృతీయ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ దీప్తిశ్రీ నగర్‌లో ఉన్న షిరిడీ సాయి వృద్ధాశ్రమంలో వంద మందికి పైగా వృద్ధులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. వర్రే గంగాధర్‌తో ఆయన సన్నిహిత మిత్రులు కూడా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులకు వారంతా తమ చేతులతో వృద్ధుల మంచాల వద్దకే భోజనం తీసుకువెల్లి స్వయంగా అందజేశారు. భోజనం స్వీకరించే సమయంలో వృద్ధులంతా వైఎస్‌ఆర్‌ గురించి తెలుసుకుని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. వైఎస్‌ఆర్‌ ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని వేడుకున్నారు.అన్న ప్రసాద వితరణకు ముందుగా దివంగత వైఎస్‌ఆర్ చిత్రపటానికి గంగాధర్‌, వారి మిత్రులు, కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ పెంపుడు కుమార్తె పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించారు.