మనం తినే కూరగాయలు మనమే ఆర్గానిక్ పద్ధతుల్లో పండించుకుంటే ఎంత బాగుంటుందీ! పెరట్లో కాసింత స్థలం ఉంటే కిచెన్ గార్డెన్ సాధ్యమే. నగరాల్లోనైతే మిద్దెపంటలు అందుకు ఒక మార్గం. కానీ మిద్దె పంటలు వేసుకోవడం అద్దె ఇళ్లలో కుదరదు. కొన్నిసార్లు సొంతింటిలో కూడా ఆ పని చేయలేం. ఎందుకంటే అంటుకు కాస్త శ్రమపడాల్సి ఉంటుంది. టైము కేటాయించాల్సి ఉంటుంది. కానీ అదే ఎక్కడైనా ఎవరైనా మన కోసం కాసింత స్థలం అద్దెకిచ్చి మనకి ఇష్టమైన కూరగాయలు పండించుకునే వెసులుబాటు కల్పిస్తే ఇక చెప్పాల్సిందేముంటుందీ! సరిగ్గా అలాంటి అవసరం తీర్చడానికి మొలకెత్తిందే చిన్న వ్యవసాయక్షేత్రాల (farmlets) ఆలోచన.
గుజరాత్‌కు చెందిన కపిల్ మండావేవాలా ఏర్పాటు చేసిన ‘ఎడిబుల్ రూట్స్’ (Edible Routes) అనే సంస్థ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ తరహా ‘ఫామ్‌లెట్‌’లను అద్దెకిస్తోంది. ‌ఢిల్లీకి సమీపంలో అభివృద్ధి పరచిన మూడు వ్యవసాయక్షేత్రాల్లో సుమారు 200 ఫామ్‌లెట్‌లను ఈ సంస్థ లీజుకు ఇస్తోంది. farmlets అంటే మన ఇంటికి దూరంగా ఉన్న మన కిచెన్ గార్డెన్ అన్నమాట. ఇంట్లోనే కిచెన్ గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవాలనుకున్నవారికి ఈ సంస్థ అవసరమైన శిక్షణ ఇస్తుంది. కావలసినవన్నీ సమకూర్చుతుంది.

మన కోసం మినీ వ్యవసాయక్షేత్రాలు…

ఇక మినీ వ్యవసాయక్షేత్రాలకు సంబంధించి Edible Routes సంస్థ కనిష్ఠంగా 1,200 చదరపు అడుగుల స్థలంలో farmletలను అందిస్తోంది. నెలకు రూ. 5,500 చెల్లిస్తే చాలు, ప్రత్యేకంగా మీ కోసం ఈ సంస్థ తమ వ్యవసాయక్షేత్రంలో 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆర్గానిక్ కూరగాయలు పెంచుతుంది. అదే 1,800 చదరపు అడుగుల విస్తార్ణంలోనైతే నెలకు రూ.7000, 2,400 చదరపు అడుగుల్లోనైతే రూ. 8000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ farmlets విధానంలో భాగస్వాములు కావాలనుకుంటే ముందుగా ఆరునెలల అద్దె చెల్లించాలి. అద్దెకు తీసుకున్న స్థలంలో కూరగాయలను వారే పండిస్తారు. లేదా మనకి ఓపిక ఉంటే ఈ స్థలంలో మనమే స్వయంగా కూరగాయల వంటివి సాగు చేసుకోవచ్చు. అందుకు అవసరమైనవాటిని ఈ సంస్థ సమకూర్చుతుంది. మన స్థలానికి మన పేరుతోనే బోర్డు పెడతారు. మన స్థలంలో పండిన కూరగాయలను సంస్థ మన ఇంటికే పంపిస్తుంది. లేదా మనమే వెళ్లి తెంపుకోవచ్చు కూడా. అంటే మనం పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో పండిన కూరగాయలను ఇంటికి తెచ్చుకుంటున్నామన్నమాట.
ఢిల్లీ కాబట్టి నెలకి కూరగాయల ఖర్చు 5,500 రూపాయలంటే చౌక కిందే లెక్క. అందుకే ఈ ఆహార ఉద్యానవనాలకి మంచి ఆదరణ లభిస్తోంది. వందలాది మంది వినియోగదారులు ఇందులో భాగస్వాములయ్యారు. వేలాది మంది ఆర్గానిక్ సాగు పద్ధతుల్లో శిక్షణ పొందుతున్నారు. సేంద్రియ కూరగాయల సాగుపై ఎడిబుల్ రూట్స్ సంస్థ వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తోంది. మనకి భూమి కనుక ఉంటే ఎడిబుల్ రూట్స్‌ సంస్థ అందులో మనకి కావలసిన రీతిలో ఆర్గానిక్ వ్యవసాయం కూడా చేసిపెట్టడం మరో విశేషం.

Kapil Mandawewala

ఆర్గానిక్ మార్గంలో కపిల్ ప్రస్థానం…

పెద్దయెత్తున మినీ వ్యవసాయక్షేత్రాలను నిర్వహిస్తున్న కపిల్ మండావేవాలాకు సేంద్రియ సాగుపై స్పష్టమైన పరికల్పన ఉంది. తొలుత 1999-2003 మధ్య ఆయన అమెరికాలోని టెక్సస్ యూనివర్సిటీలో చేరి మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ ఫైనాన్స్‌లో పట్టా పొందారు. ఆ తర్వాత శాన్‌ ఫ్రాన్సిస్కోలో డెలాయిట్ కంపెనీలో చేరి సీనియర్ కన్సల్టెంట్‌గా పని చేశారు. ఆ కార్పొరేట్ జీవితం విసుగు తెప్పించింది. దీంతో 2008లో ఇండియా తిరిగి వచ్చిన కపిల్ గుజరాత్‌లోని తమ 22 ఎకరాల పొలంలో ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెట్టారు. 2011లో ఆయన ప్రకృతి వ్యవసాయ వైతాళికుడు భాస్కర్ సావే వ్యవసాయక్షేత్రంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని తాలేగావ్‌లో ఉన్న హార్టికల్చర్ సెంటర్‌లో చేరి గ్రీన్‌హౌస్ వ్యవసాయ పద్ధతులను నేర్చుకున్నారు. వ్యవసాయంపై పట్టు చిక్కాక సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు.

ఆ క్రమంలోనే కపిల్ స్థానికులు నేరుగా పొలం నుండి తమకు అవసరమైన తాజా కూరగాయలను, పండ్లను కొనుగోలు చేసే విధంగా ఒక వ్యవస్థ (Community Supported Agriculture -CSA)ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆయన 2016లో ఎడిబుల్ రూట్స్ సంస్థను స్థాపించారు. 2012-14 సంవత్సరాల మధ్య ఆయన ఆహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్ అనిల్ గుప్తా ఆధ్వర్యాన మిజోరం, మణిపూర్, పంజాబ్‌లలో సాగిన శోధ్ యాత్రల్లో పాల్గొన్నారు. 2014లో పెర్మాకల్చర్ డిజైన్ సర్టిఫికేట్ పొందారు. అలా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో నైపుణ్యం సంపాదించిన కపిల్ ఢిల్లీ చుట్టుపక్కల 15 వ్యవసాయక్షేత్రాలను అభివృద్ధి పరిచారు. 500లకు పైగా ఆహార ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. ఫామ్‌లెట్‌లతో పాటు Edible Routes Foundation అనే స్వచ్ఛంద సంస్థను కూడా కపిల్ నడుపుతున్నారు. సేంద్రియ సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వడం, నగరవాసులకు ఆర్గానిక్ ఆహారంపై అవగాహన కల్పించడం ఈ ఫౌండేషన్ లక్ష్యం. పర్యావరణానికి చేటు తెచ్చే రసాయనాల వ్యవసాయాన్ని ఈ సంస్థ బలంగా వ్యతిరేకిస్తుంది. ఈ సంస్థ పలు ఆర్గానిక్ ఉత్పత్తులను కూడా అందిస్తోంది.
ఆసక్తిగలవారు మరిన్ని వివరాల కోసం ఈ చిరునామాను సంప్రదించవచ్చు.
Edible Routes
C-5, FF RIGHT SIDE MALVIYA NAGAR South Delhi
New Delhi – 110017
+919811071751, 8587087886 +91 95998 06387
shop@edibleroutes.com, info@edibleroutes.com

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here