ఒక పరిశోధనాత్మక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందంటారు. ప్రకృతి వ్యవసాయ విధానాల్లో, పండించిన పంటను సరిగా వినియోగించడంలో ఆధునికులు అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. పండించిన పంటకు సరిగా మార్కెటింగ్ అవకాశాలు లేనప్పుడు, ఆ పంట నిల్వచేసే వీలు లేకుండా పాడైపోయే ఇబ్బంది ఉన్నప్పుడు సరికొత్త మార్గం వెదుకుతూనే ఉంటున్నారు. అలాంటి ఫలవంతమైన ఆలోచనే కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన రైతు కే.గంగాధర్ చేశాడు. ఆ ఆలోచనే ఇప్పుడు ఆ రైతును నష్టాల నుంచి లాభాల పంట వైపు అడుగులు వేయించింది.

తాను పండించిన అరటిపళ్లు కరోనా సమయంలో అమ్ముడు కాలేదు. దీంతో వాటిని ఎండబెట్టి… డ్రై ఫ్రూట్ బనానాగా మార్చాడు. లాక్ డౌన్ వేళ ఆ రైతు అద్భుతమే సృష్టించాడు. అరటిపళ్లు అమ్ముడవలేదని చెత్తకుప్పలో వేయలేదు. వాటిని ఎంతో శ్రద్ధగా ఎండబెట్టాడా రైతు. అరటిపళ్ల పోషకాలు నిండిన డ్రైఫ్రూట్  ​గా మార్చి ఇప్పుడు లాభాలు సంపాదిస్తున్నాడు.

డ్రైఫ్రూట్స్​ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో వైద్యులు చెబుతూనే ఉంటారు. ఇన్నాళ్లుగా మనం ఎండు ద్రాక్ష, ఎండిన అప్రికాట్​, ఎండబెట్టిన అంజీరా, జీడిపప్పు, బాదం.. ఇలా డ్రైఫ్రూట్స్  ​లో పలు రకాలుగా తింటున్నాం. కానీ.. ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఎండు అరటిపండును ఈ జాబితాలోకి చేర్చేశాడు కర్ణాటక రైతు.

అవసరం నుంచి ఆలోచన!

కర్ణాటకలోని బళ్లారి జిల్లా కంపిలి తాలూకా రామసాగరానికి చెందిన కే.గంగాధర్​ ఓ సాధారణ రైతు. లాక్​ డౌన్ వేళ సుగంధి రకం అరటిని ఆ రైతు సాగు చేశాడు​. కానీ.. కరోనా మహమ్మారి కారణంగా అరటిపళ్లకు మార్కెట్​ పడిపోయి గిట్టుబాటు ధర పొందలేకపోయాడు. దీంతో తాను పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరైందని గంగాధర్ తొలుత దిగులు చెందాడు​.

మనిషి తలచుకుంటే ఎంతటి విపత్తులో అయినా ఏదో ఒక మార్గాన్ని అన్వేషించవచ్చని ఆ రైతు గుర్తించాడు. ఆ వెంటనే అరటిపళ్లు పాడైపోకుండా ఏం చేయొచ్చని ఆలోచించాడు.ఆ క్రమంలో విదేశాల్లో ఎండు అరటిపళ్లకు ఉన్న డిమాండ్​ గురించి గంగాధర్ తెలుసుకున్నాడు. భారతదేశం​లో తనలా అరటిపళ్లు పండించే రైతులు పలువురిని సంప్రదించాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నెల రోజులకు పైగా అరటిపళ్ళను ఎండబెట్టి, ఓ డబ్బాలో ప్యాక్​ చేసి జిల్లాలోని హోల్ ​సేల్​, రిటైల్​ దుకాణాలకు అమ్మడం ప్రారంభించాడు. ఎండబెట్టి ప్యాక్ చేసిన అరటిపళ్లకు మంచి గిరాకీ రావడంతో ఇప్పుడు లాభాలు చవిచూస్తున్నాడు.

ఎండబెట్టిన అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, డ్రైఫ్రూట్ బనానా తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని రాయ్ ​చూర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ధ్రువీకరించింది. ప్రభుత్వం సహకరిస్తే… ఈ డ్రై బనానా ఉత్పత్తిని మరింత వృద్ధి చేయాలని కర్ణాటక రైతు ప్రయత్నిస్తున్నాడు.

నిజానికి ఈ డ్రై బనానా విధానం ఇప్పటికే థాయ్ లాండ్ లాంటి దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది. కొన్ని దేశాల్లో ఢ్రై బనానా తయారీ విధానం కాస్త డిఫరెంట్. పండించిన అరటిపళ్ల తొక్కను తీసేసి, పండును పల్చని చాప్స్ గా చేస్తారు. వాటిని వెదురు చాపల మీద ఎండబెడతారు. కొద్దిరోజులు అరటిపళ్ల ముక్కలు ఎండిన తర్వాత పాలిథిన్ కవర్ లో చుట్టి, ఆపైన దాన్ని మరో కవర్ లో పెట్టి పూర్తిగా సీల్ వేసేస్తారు. అలా చేసిన అరటిపళ్ల చాప్స్ ని నెల రోజుల నుంచి ఆరు నెలల వరకు వినియోగించే విధానం ఆయా దేశాల్లో ఉంది. థాయ్ లాండ్ లో ముగ్గిన అరటిపళ్ల తొక్కలు తీసేసి, పండును నీటిలో ఉడకబెడతారు. ఉడికించిన అరటిపళ్లను టిష్యూ పేపర్ లాంటి దాంట్లో పెట్టి పూర్తిగా చెమ్మ ఆరిపోయేలా చేస్తారు. వాటిని వెదురు చాపలపై వేసి ఎండలో ఆరబెడతారు. అవి బాగా ఎండిన తర్వాత ప్యాకింగ్ చేసి అమ్మకానికి పెడతారు. తద్వారా ముగ్గిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండని అరటి పళ్లను డ్రై బనానాగా చేసి, నష్టాల నుంచి తప్పించుకోవడమే కాకుండా లాభాలు పొందుతారు.

కాగా.. ఈ విధానం గుడ్ ఇనిషియేటివ్ ఐడియా అని, మన దగ్గర పండే అరటిపళ్లు ఎండబెట్టడానికి పనికిరావనేది కలూరి హరీందర్ నాయర్ అభిప్రాయం. కేరళ, కర్ణాటక, తమిళనాడు లాంటి కొన్నిచోట్ల పండించే చిన్న రకం అరటిపళ్ల రకాలు కేరళ చిన్నరకం, ముకిరీ, కర్పూరం, ఆంధ్రప్రదేశ్ లో పండే చక్కెరకేళీలను ఎండబెట్టి తినొచ్చట. నిజానికి అరటి చిప్స్ కు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉందనేది సర్వత్రా తెలిసిన విషయమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here