ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు పరుగులు తీస్తోంది. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రకృతి పంటలు పండించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఆహార ధాన్యాల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. రసాయన మిళిత ఆహారంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల్లో ఈ  మార్పు సహజంగానే వస్తోంది. స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే కాన్సెప్ట్ అందరిలోనూ వస్తోంది.

ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రక్రుతి వ్యవసాయం, ప్రకృతి పంటల సాగు ఓ వెల్లువలా ముందుకు వస్తోంది. ప్రకృతికి దూరంగా వెళ్లిపోయిన మనిషి మళ్లీ ఆ ప్రకృతి ఒడిని చేరాలని, సేదదీరాలని కోరుకుంటున్నాడు. అందుకే పలువురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ఇతర ఉన్నత పదవుల్లో సుఖవంతమైన జీవితాన్ని పక్కనపెట్టి ప్రకృతి వైపు పరుగులు తీస్తున్నారు. నెలనెలా లక్షల్లో జీతం వస్తున్నా వారిలో ఎక్కడో ఏదో వెలితి.. మరేదో కోల్పోయామనే దిగులు. అలాంటి జీవితాల్ని వదిలేసి ఎందరో ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.

పెరుగుట విరుగుట కొరకే అనే నానుడిని రసాయనాలతో కూడిన పంటలు ఇప్పుడు నిజం చేస్తున్నాయి. ఈ పంటలే ఇప్పుడు మన జీవితాలను ఆరోగ్య సమస్యల సుడిలోకి నెట్టేస్తున్నాయి. ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలంటే ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి పంటలు, ప్రకృతి ఆహారం ఒక్కటే దారి అని పలువురు అనుభవశాలులు చెబుతున్నారు.

ప్రకృతి వ్యవసాయం దిశగా మనం ప్రేరణ పొందటానికి ప్రపంచం అంతా వెదికే పనేలేదు. మన చుట్టూ ఉన్న వారిని పరిశీలిస్తే మన మధ్యలోనే ఎందరో కనిపిస్తారు. దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ, స్వచ్ఛమైన పంటలు పండించే వారు మన పరిసరాల్లోనే ఉంటారు. అలాంటి వారి నుంచి ప్రేరణ పొంది ప్రకృతి వ్యవసాయం, పంటల వైపు మన సమాజం నడిస్తే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పల్లెలను సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాలుగా మారిస్తే.. భవిష్యత్ తరాన్ని ఆరోగ్య సమాజంగా నిలబెట్టవచ్చు.

ప్రకృతి వ్యవసాయం కాన్సెప్ట్ తో ముందుకొచ్చిన అనేక మంది ఇప్పుడు ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో గ్రూపులుగా ఏర్పడ్డారు. తాము పండించే ఆర్గానిక్ పంటలేంటో.. వాటిని ఎలా నిర్వహిస్తున్నారో ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అమెరికాలోని మన తెలుగు వాళ్లు కొందరు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అడుగులు వేశారు. అమెరికా మాల్స్ లో కూడా ఆర్గానిక్ పండ్లు, కూరగాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతున్నారు. ఆరోగ్యమే మహా భాగ్యం అని భావించే ఎందరో ఇప్పుడు ఆర్గానిక్ ఆహారం మాత్రమే వినియోగిస్తున్నారు.

మన దేశంలోనూ ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోంది. ఆర్గానిక్ విత్తనాలు, సేంద్రీయ ఎరువులను తయారుచేసే సంస్థలు అనేక చోట్ల కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి పలు నగరాల్లో కూడా ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అందుబాటులో ఉన్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here