కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా చిత్రీకరణలు నిలిచిపోవడంతో కొందరు సినీ తారలు తమకిష్టమైన వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. అలాంటివారిలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. లాక్‌డౌన్ సమయాన్ని గడిపేందుకు ఆయన తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. తన పెరటి తోటలో తీరికగా కాలం గడుపుతున్న దృశ్యాలను తాజాగా ‘దృశ్యం 2’ స్టార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తను సమయాన్ని ఎలా గడుపుతున్నదీ వివరిస్తూ మోహన్ లాల్ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియో పోస్టు చేశారు. కొచ్చిలోని ఎలమక్కారాలో తన ఇంటి పక్కనే ఉన్న తన ఆర్గానిక్ పెరటితోటలో మోహన్ లాల్ కలియదిరగడం ఇందులో చూడొచ్చు. మూడున్నర నిమిషాల నిడివి గల ఈ వీడియోలో మోహన్ లాల్ తన తోటమాలితో సంభాషించడం, చలాకీగా తోటపనులు చేయడం కనిపిస్తుంది.

అడ్డపంచెలో ఉన్న మోహన్ లాల్ లేత నీలం రంగు షర్టు ధరించి, తలకు రుమాలు చుట్టి అచ్చం రైతులా తోటపనులు చేయడం ఆసక్తి కలిగిస్తుంది. మోహన్ లాల్ స్వయంగా మొక్కలకు నీరు పెట్టడం, సొరకాయలు, బీరకాయలు, కాకరకాయలు, టమాటాలు కోయడం, కుండీల్లో మొక్కలు నాటడం ఇందులో కనిపిస్తుంది. నేపథ్యంలో హృద్యంగా అరుణ్ విజయ్ ట్యూన్ వినిపిస్తుంది. సూపర్ స్టార్ సేంద్రియ వ్యవసాయం ప్రయోజనాలను ఈ వీడియోలో పంచుకున్నారు. తమ ఇంటి పెరడులో లేదా డాబాలపై కూరగాయల వంటివి పెంచాలని ఆయన తన అభిమానులను కోరారు. అలాగే తాను ఇక్కడ ఆర్గానిక్ పద్ధతుల్లో పండిన కూరగాయలను మాత్రమే తింటానని మోహన్ లాల్ ఈ వీడియోలో తెలిపారు. కాకర, టమాటా, సొర, బీర, మొక్కజొన్న వంటివి ఇక్కడ సాగు అవుతున్నాయి. “లాక్‌డౌన్ సమయంలో నా ఇంటి దగ్గర ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను. ఈ లాక్‌డౌన్ వీడియోల వెనుక ఉన్న నా బృందానికి ధన్యవాదాలు” అని మోహన్ లాల్ తన వీడియోకు కాప్షన్ ఇచ్చారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఉన్ని కృష్ణన్ బి దర్శకత్వం వహించిన ఆరట్టు (Aaraattu)లో మోహన్ లాల్ హీరోగా కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్ కొన్ని వారాల క్రితం ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఇందులో తమ సూపర్ స్టార్‌ను మాస్ హీరోగా చూపించడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మిస్టర్ ఫ్రాడ్, విలన్ సినిమాల తర్వాత ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించడం ఇది మూడవ సారి. మోహన్ లాల్ మళయాళ నటుడైనా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. దక్షిణాదిలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆర్గానిక్ వ్యవసాయం వీడియో

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here