వానలు లేక భూములు బీడువారిపోయిన ఆ ప్రాంతం ఇప్పుడు పచ్చటి పొలాలతో కళకళలాడుతోంది. నీరు లేక వ్యవసాయానికి నోచుకోని ఆ గ్రామం నేడు ఏడాదికి రెండు మూడు పంటలతో అలరారుతోంది. ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి కృషి ఫలితంగా అక్కడి భూములు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఇది కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమలోని మల్లేపల్లి కథ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేసిన ఎస్ వెంకటేశ్వర రెడ్డి తమ కుటుంబ వారసత్వవృత్తి అయిన వ్యవసాయాన్ని చేపట్టాలనుకున్నారు. అయితే, సాగు నీరు సదుపాయం లేకపోవడం ఆయన ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు. దుర్భిక్షపీడిత రాయలసీమ ప్రాంతంలోని వందలాది గ్రామల్లాగే కర్నూలు జిల్లాలోని ఆయన గ్రామమైన మల్లేపల్లికి కూడా నీటి పారుదల సౌకర్యాలు సరిగా లేవు.
అప్పుడు, హంద్రీ-నీవా కాలువ తమ పొలానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలోనే పారుతోందని ఆయన గమనించారు. ఆపై ఆయన ఒక సర్వే చేశారు. హంద్రీ-నీవా కాలువ నీటిని తన పొలందాకా తీసుకురావాలంటే 160 ఎకరాలున్న 30 మంది రైతులను ఒప్పించాల్సి వస్తుందని ఆయనకు అర్థమైంది. నిజానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రైతులను ఒప్పించడం అంత సులభమేం కాదు.
“కానీ పైపులు వేసుకోడానికి నాకు కాస్త దారి ఇవ్వమంటూ నేను వారిని కోరాను. ఇలా చేయడం ద్వారా ఆ రైతులకు కూడా సాగు నీరు లభిస్తుంది. దాంతో వారు అందుకు ముందుకు వచ్చారు” అని వెంకటేశ్వర రెడ్డి వివరించారు.
“మొదట్లో మాలో 17 మంది మాత్రమే ఈ ప్రయత్నంలో భాగం పంచుకునేందుకు అంగీకరించారు. తరువాత, మరో 13 మంది వచ్చి చేరారు” అని అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కె. జయరాముడు గుర్తు చేసుకున్నారు. జయరాముడుకు చెందిన ఆరు ఎకరాలకు ఇప్పుడు ఆ కాలువ నుండి నీరందుతోంది.
బ్యాంకులో పనిచేసి ఉండడంతో వెంకటేశ్వర రెడ్డి త్వరగా బ్యాంకు రుణాల కోసం ఏర్పాట్లు చేశారు. మొత్తానికి పివిసి పైపుల కొనుగోలుకు, కందకాలు తవ్వేందుకు రూ. 30 లక్షల రుణం మంజూరైంది. అన్ని రుణాలకూ వెంకటేశ్వర్ రెడ్డే హామీదారుగా నిలబడ్డారు.
“పైపులు వేశాక తమ భూములు పచ్చగా మారడంతో రైతులంతా సంతోషంగా ఉన్నారు. మేమిక్కడ ప్రధానంగా పత్తి పండిస్తాము. కొందరు కంది, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, కూరగాయలు కూడా సాగు చేస్తారు.”అని వెంకటేశ్వర రెడ్డి చెప్పారు.
గ్రామస్థులు కాలువ నుండి నీరు పొందడం ప్రారంభించిన తరువాత 2021 ఖరీఫ్ నాల్గవ పంట. “మేము ఇప్పటికే రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభించాము. వార్షిక EMI రూ. 8.70 లక్షలు. కాగా, మేము ఇప్పటికే మూడు సంవత్సరాలు రుణం చెల్లించాము”అని రెడ్డి వివరించారు.
30 మంది రైతుల పొలాలకు నీరు అందడం చూసి ఇతర రైతులు కూడా వారితో చేరారు. మూడేళ్ల తరువాత, ఇప్పుడు గ్రామంలోని సుమారు 800 ఎకరాలకు ఇలా పైపుల ద్వారా సాగు నీరు అందుతోంది.“వర్షం లేదు, పంట లేదు” అనే పరిస్థితి నుండి ఇవాళ గ్రామంలో రెండు మూడు పంటలు సాగు కావడం విశేషం. వెంకటేశ్వర రెడ్డి సాధించిన ఈ విజయం ఆయనకు ఎంతో మంచిపేరు తెచ్చిపెట్టింది. దీంతో ఆయన ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నీటి పారుదలకు భరోసా ఉండి, ఏడాదికి కనీసం రెండు పంటలు పండిస్తున్న గ్రామస్థులు ఇప్పుడు ఎఫ్‌పీఓ (రైతు ఉత్పత్తిదారుల సంఘం)ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. “మా పంట ఉత్పత్తులను విక్రయించడంలోను, తయారీదారుల నుండి నేరుగా పంట ఇన్‌పుట్‌లను కొనుగోలు చేయడంలోను మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించాలని మేము కోరుకుంటున్నాము” అని వెంకటేశ్వర రెడ్డి చెప్పారు.
“మేము 40 మంది రైతులతో నాగలి ఎఫ్‌పిఓ (Farmer Producer Organisation)ను ఏర్పాటు చేసుకున్నాము. ఈ సంవత్సరం ఇంకా 300 మందిని అందులో చేర్చుకోబోతున్నాము”అని ఆయన తెలిపారు.
అయితే ఈ విజయగాథలో మరో కోణం కూడా ఉంది. వేరే ప్రాంతంలోని రైతుల కోసం ఉద్దేశించిన కాలువ నీటిని ఇలా మళ్లించడం సబబు కాదని ఒక రైతు నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఎస్ వెంకటేశ్వర రెడ్డి చొరవ, పట్టుదల, కృషి మల్లేపల్లి గ్రామాన్ని సస్యశ్యామలం చేశాయన్నది మాత్రం నిజం.

(Business Line సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here