నల్లబియ్యం మన నేలల్లో పండుతుందా? పంట దిగుబడి ఎంత వస్తుంది? దీన్ని సాగు చేస్తే లాభమేనా? వంటి సందేహాలు తీరాలంటే ‘కృషి భారతం’ వ్యవస్థాపకుడు శ్రీమాన్ గూడూరు కౌటిల్య కృష్ణన్ సాగు చేస్తున్న పొలాన్ని చూసి రావలసిందే. నల్లబియ్యం మనకు కాస్త కొత్తే అయినా మణిపూర్, ఒడిశా, పశ్చమ బెంగాల్, జార్కండ్ ప్రాంతాల్లో దీన్ని పండిస్తారు. అయితే వేదాల్లో వ్యవసాయం గురించి చెప్పిన అంశాల ఆధారంగా కౌటిల్య కృష్ణన్ నల్లబియ్యంపై కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఖాసీంపేట గ్రామంలోని తన మూడు ఎకరాల పొలంలో కృష్ణ వ్రీహీ (నల్లబియ్యం)ని పండించడంలో ఆయన విజయం సాధించారు. ఆర్థికంగా కూడా ఇది లాభదాయకమేనని చెబుతున్నారు కౌటిల్య కృష్ణన్. తెలంగాణలో అనుసరించే పురాతనమైన సాగు పద్ధతులతో పాటు వేద వ్యవసాయ విధానాలను కూడా కౌటిల్య కృష్ణన్ అనుసరిస్తున్నారు. కృషి పరాశర, శూరపాల వృక్షాయుర్వేదం, కాశ్యపేయ కృష్ణసూక్తి వంటి సంప్రదాయ గ్రంథాలలో చెప్పబడిన వ్యవసాయ విధానాలను ఆయన ఆకళింపు చేసుకున్నారు. తన వైదిక సేద్యంలో ఆయన పాలు, తేనె, హోమ భస్మం వంటి ద్రవ్యాలను ఉపయోగిస్తారు. ఆవు పేడను ఎరువుగా వాడతారు. కాగా, వేద వ్యవసాయం ద్వారా తన పొలంలో 100 శాతం పంట పండిందని కౌటిల్య కృష్ణన్ చెప్పారు. తెలుగునేలపై వేద వ్యవసాయ ప్రయోగాలతో విజయం సాధించిన కౌటిల్య కృష్ణన్‌ను కరీంనగర్ కలెక్టర్ శశాంక్ అభినందించారు. కృష్ణ వ్రీహీ (నల్ల బియ్యం) పండించడంలో సఫలమైనందుకు కౌటిల్య కృష్ణన్‌ను కలెక్టర్ సత్కరించారు. పొలాన్ని సందర్శించి పంటను పరిశీలించారు. మిగతా రైతులకు కూడా కౌటిల్య ఆదర్శంగా నిలుస్తున్నారని శశాంక్ ప్రశంసించారు. కౌటిల్య కృష్ణన్ మాట్లాడుతూ, పూర్తి స్థాయిలో వేద వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆశించినట్లుగా పంట పండిందన్నారు.

కౌటిల్య కృష్ణన్‌ను సత్కరిస్తున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్

కౌటిల్య కృష్ణన్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి మ్యాథమేటిక్స్‌లో పీజీ చేశారు. ప్రస్తుతం తిరుప‌తి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎంఏ యజుర్వేదం చ‌దువుతున్న కౌటిల్య కృష్ణన్ వేదాలలో చెప్పబడిన అంశాల ఆధారంగా వ్య‌వ‌సాయంలో ప్ర‌యోగాలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణ వ్రీహి అని వ్యవహరించే నల్ల బియ్యాన్ని ఆయన సాగు చేయడం మొదలుపెట్టారు. కృష్ణ బియ్యానికి ఈ మధ్యే జియోగ్రాఫిక‌ల్ ఇండికేష‌న్‌ ట్యాగ్ (Geographical Indication (GI) tag) కూడా వచ్చింది. మణిపూర్‌కు చెందిన నల్ల బియ్యం రకం Chak-Hao GI ట్యాగ్ పొందింది. మణిపూర్‍‌లో ‘చాక్ హావో’ పేరుతో వ్యవహరించే నల్లబియ్యాన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. దీన్ని సంప్రదాయ వైద్యులు మందుల్లోనూ వాడతారు. ఫైబర్ కంటెంట్ ఎక్కువ కావడం వల్ల ఈ బియ్యం ఉడకడానికి 40-45 నిమిషాల సమయం పడుతుంది. సాగు కోసం ఈ వరి విత్తనాలను ముందుగా నీటిలో నానబెట్టి ఆ తర్వాత పొలంలో చల్లుతారు. లేదా నారు పోసి ఆ తర్వాత నాట్లు వేస్తారు.
ప్రాచీన చైనా రాజకుటుంబాలు కేవలం నల్లబియ్యాన్నే ఆహారంగా తీసుకునేవట. అందుకే చైనాలో సామాన్య ప్రజలెవ్వరూ నల్లబియ్యం వాడకూడదని నిషేధించారని పరిశోధకులు చెబుతారు. జపాన్ పరిశోధకులు నల్లబియ్యంపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. నల్లబియ్యం వరి వంగడం జపాన్ నుండే ఇతర దేశాలకు వ్యాపించి ఉండవచ్చునని వారి అభిప్రాయం.
కాగా, ఇతర వరి రకాలతో పోల్చినపుడు నల్లబియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. హృదయవ్యాధులు, కేన్సర్, ఊబకాయం మొదలైన ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో కృష్ణ బియ్యం తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఈ బియ్యంతో వండిన అన్నం క్యాన్సర్ నివారకంగా పని చేస్తుందని ప్రముఖ చైనీస్ క్యాన్సర్ స్పెషలిస్టు లీ పింగ్ లువో కనుగొన్నారు. ఈ అన్నం వల్ల కొన్ని రకాల కణుతులు త్వరగా తగ్గుతాయని రుజువైంది. యాంథోసయనిన్ అత్యధికంగాగల ధాన్యాల్లో నల్లబియ్యం ఒకటి. కృష్ణ బియ్యంలో 18 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరొటిన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయని కౌటిల్య కృష్ణన్ చెబుతున్నారు. ప్రధానంగా ఈ బియ్యంలో ఉండే anthocyanins క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తాయని ఆయన తెలిపారు.

నల్లబియ్యం వరి పొలంలో కౌటిల్య కృష్ణన్

USDA పరిశీలనను అనుసరించి 100 గ్రాముల కృష్ణ బియ్యంలో క్రింది పోషకాలు ఉంటాయి. శక్తి : 356 కిలో కేలరీలు, ప్రొటీన్లు : 8.8 నుంచి 12.5 గ్రాములు, లిపిడ్స్ : 3.33 గ్రాములు, ఐరన్ : 2.4 మిల్లీ గ్రాములు, అమిలోజ్ : 8.27 శాతం, కాల్షియం : 24.06 మిల్లీ గ్రాములు, మెగ్నీసియం : 58.46 మిల్లీ గ్రాములు, యాంథోసయనిన్స్ : 69 నుంచి 74 మిల్లీ గ్రాములు ఉంటాయి. కృష్ణ బియ్యం దేశవాళీది కావడంతో తెగుళ్లు సోకే అనకాశం చాలా తక్కువ. రుచి పరంగా కూడా ఇది ఎంతో బాగుంటుంది. విత్తనాలు నూటికి నూరు శాతం మొలకెత్తుతాయి. భారతదేశం వాతావరణ పరిస్థితులకు దీని సాగు అనుగుణంగా ఉంటుంది. పైగా దీని సాగుకు నీరు ఎక్కువగా అవసరం లేదు. ఎలాంటి భూమిలోనైనా పంట బాగా పండుతుంది. దిగుబడి కూడా బాగా వస్తుంది. విత్తనాలను నిల్వ చేసుకుని రైతులు మరో పంట వేసుకోవచ్చు. నల్లబియ్యం వంరిసాగు వర్షాభావాన్ని సైతం ఎదుర్కొంటుందని మణిపూర్‌కు చెందిన రైతు పాట్షంఘం దేవకంఠ చెబుతున్నారు. నల్లబియ్యం రకాలను సంరక్షించినందుకుగాను 2012లో ఆయన ‘ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్‌ రైట్స్ యాక్ట్’ అవార్డు కూడా అందుకున్నారు.
అస్సాంలోని గోల్పర జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నల్లబియ్యాన్ని ప్రయోగాత్మకంగా పండించింది. అక్కడ 13.2 హెక్టార్ల విస్తీర్ణంలో నల్లబియ్యాన్ని సాగు చేయగా 12 టన్నుల దిగుబడి వచ్చింది. అంటే సుమారుగా హెక్టారుకు టన్ను చొప్పున దిగుబడి వచ్చిందన్నమాట. మార్కెట్‌లో నల్ల బియ్యం కిలోకు 300 దాకా ధర పలుకుతోంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా సాగు చేస్తే రైతులకు ఇది లాభదాయకమేనని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.
నల్ల బియ్యానికి ఉన్న పలు విశిష్టతల దృష్ట్యా ఇలాంటి దేశీయ వరి రకాలను కాపాడటానికి రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని కౌటిల్య కృ‌ష్ణ‌న్ సూచిస్తున్నారు. ‘కృ‌షి భార‌తం’ సంస్థ‌ను నెల‌కొల్పిన కౌటిల్య కృష్ణన్ వేద వ్యవసాయ ప్రయోగాలతో పాటు ఏటా ‘వృ‌ష‌భోత్స‌వాల‌’ను కూడా నిర్వ‌హిస్తున్నారు. ఏదేమైనా విద్యావంతుడైన కౌటిల్య కృష్ణన్ ఇలా దేశీ వంగడాలతో వ్యవసాయ ప్రయోగాలు చేయడం, రైతులకు తోడుగా నిలవడం అభినందనీయం.

మరిన్ని వివరాల కోసం ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Sriman Guduru Kautilya Krishnan
Mobile: 086867 43452
kautilya.krishnan123@gmail.com
contact@krishibharatham.org
https://www.facebook.com/KrishibharathamTrust
http://krishibharatham.org/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here