బుక్కెడు బువ్వనిచ్చే భూమి తల్లికి ఇంకెంత గర్భశోకం? రసాయనాలతో ఇప్పటికే భూగర్భాన్ని కలుషితం చేసేశాం. రసాయన కాసారంగా మారిన నేలలో పండే ప్రతి గింజా మన ఆరోగ్యాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఇప్పటికే ఈ విషయం పలు సందర్భల్లో నిర్థారణ అయింది కూడా. మందులతో పండించిన ఆహారం మన శరీరాల్ని ఇప్పటికే గుల్ల చేసేసుకున్నాం. ఇంకెంతకాలం మనకీ రసాయనాల భోజనం?

ప్రపంచ వ్యాప్తంగా రసాయనాల వాడకంతో భూసారం అంతా నిర్వీర్యం అయిపోయిందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పటికైనా భూసారాన్ని పెంచకపోతే.. భవిష్యత్ పంటలు విషంతో నిండిపోవడం తథ్యం.. ఈ క్రమకంలోనే ప్రకృతి పంటలు.. ఆర్గానిక్ ఫలసాయం, సేంద్రీయ పద్ధతులపై ప్రపంచం ముందుకొస్తోంది.. ప్రకృతి వ్యవసాయాన్ని ఓ ఉద్యమంలా నిర్వహిస్తోంది. ఇకపై మనం తినే ప్రతి గింజా సహజసిద్ధంగా పండినదై ఉండాలనే ఆకాంక్ష అనేక మందిలో కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ విధానాలపై రైతుల్లో అవగాహన పెంచాలని సూచిస్తున్నాయి. అక్కడితో ఆగిపోకుండా రైతులకు రెట్టింపు ఆదాయం, నాణ్యమైన పంటలు, భూసారాన్ని పెంచడం, మెరుగైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం వైపు ప్రణాళికలు రచిస్తున్నాయి. త్వరలోనే సేంద్రీయ వ్యవసాయ విధానం తీసుకొస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించడం ఆహ్వానించదగ్గ విషయం. ఆర్గానిక్ వ్యవసాయంపై ఉన్నతాధికారులతో ఏపీ వ్యవసాయ మంత్రి కన్నబాబు సుదీర్ఘంగా చర్చించడం గమనార్హం. కొత్త పంటల సాగు ప్రారంభం నుంచే రైతులను సేంద్రీయ వ్యవసాయ విధానంపై ప్రోత్సహించాలనే సూచనలు మంత్రి కన్నబాబు ఉన్నతస్థాయి సమావేశంలో రావడం విశేషం. ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం ముదావహమే కదా..

ఇప్పటికైనా పంటల్ని రసాయనాల్లో ముంచేయడం మానుకుంటే మంచిదని ఎందరో నిపుణులు సూచిస్తున్నారు. సహజసిద్ధమైన పంటలతో భవిష్యత్తరాలను ఆరోగ్య సమాజంగా నిర్మించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరం చేయిచేయి కలిపే ఉద్యమం రావాలి. రసాయనాలకు గుడ్ బై చెబుదాం.. సేంద్రీయ వ్యవసాయ విధానంపై మరింతగా అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతైనా ఉంది. భూసారాన్ని పెంచకపోతే మన జీవితమే మరింత నిస్సారంగా మారిపోతుందనడంలో సందేహం లేదు. అందుకే ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకుందాం.. ఆర్గానిక్ పంటల వైపు వడివడిగా అడుగులు వేద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here