పర్యావరణ అనుకూల, రసాయన రహిత వ్యవసాయం పట్ల క్రమేపి రైతులలో ఆసక్తి పెరుగుతోంది. వినియోగదారులు కూడా సేంద్రియ వ్యవసాయోత్పత్తులను ఆదరించడం ప్రారంభమైంది. ఇది ఇటీవలికాలం ధోరణి. కానీ 70 ఏళ్ల రతన్ లాల్ డాగా (Ratan Lal Daga) ఇందుకు ఒక మినహాయింపు. రతన్ లాల్ 2003లోనే తన సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించారు. అలా ఆయన ఈ రంగంలో ఒక మార్గదర్శకుడుగా నిలుస్తారు. ఇతరుల మాదిరిగానే, రాజస్థాన్‌లోని భన్సర్ కుతారి గ్రామానికి చెందిన రతన్ లాల్ కూడా 60 ఎకరాల తన పూర్వికుల భూమిలో వ్యవసాయం చేపట్టిన ఒక సాంప్రదాయ రైతు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వర్క్‌షాపులకు హాజరు కావడం, దేశమంతటా ప్రయాణించడం ద్వారా ఇతర రైతుల నుండి వివిధ వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడం ఆయనకు అలవాటు.
2000లో అలాంటి ఒక సందర్భంలో, ఆయన బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సేంద్రియ వ్యవసాయంపై జరిగిన ఒక సమావేశానికి హాజరయ్యారు. ఆ రెండు గంటలు తన వ్యవసాయ గమనాన్ని శాశ్వతంగా మారుస్తాయని అప్పటికి ఆయనకు తెలియదు.
“వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందుల ప్రతికూల ప్రభావం గురించి వైస్-ఛాన్సలర్ వివరంగా మాట్లాడారు. ఆర్గానిక్ వ్యవసాయం అనేది అప్పటికి అంతగా తెలియని భావన. కానీ, రసాయన వ్యవసాయం తాలూకు ప్రతికూల ప్రభావాలన్నీ అప్పటికే నాకు అనుభవంలోకి వచ్చిన విషయాలు”అని రతన్ చెప్పారు.
భూసారం, దాని ఉత్పాదకత క్షీణిస్తూ ఉండటంతో తన రసాయన ఎరువుల వాడకం గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిన సంగతి ఆయన గమనించారు. “అధిక మోతాదులో రసాయనాలను వాడటం సర్వసాధారణమై పోయింది. రోజు రోజుకు నేల గిడసబారడం, సాగుకు ఎక్కువ నీరు అవసరం కావడం, పంటలు ఎక్కువగా తెగుళ్ళ బారిన పడడం మాకు అనుభవంలోకి వచ్చాయి. అంతేకాకుండా, రసాయన ఎరువులు ఉపయోగిస్తున్నప్పుడు వ్యవసాయ శ్రామికులు తమ చర్మంపై దద్దుర్లు, దురదలు వస్తున్నాయని తరచుగా ఫిర్యాదు చేస్తారు. అవి విషపూరితం కావడమే అందుకు కారణం”అని రతన్ లాల్ వివరించారు.
తన పొలంలో పనిచేసే శ్రామికులు కూడా తరచు ఆసుపత్రులకు వెళ్లేవారని రతన్ గుర్తు చేసుకున్నారు. “వైస్-ఛాన్సలర్ చేసిన ప్రసంగం అర్ధవంతంగా తోచింది. పంట నాణ్యత తగ్గడానికి కారణమేమిటో నాకు పూర్తిగా అర్థమైంది. దీంతో సేంద్రియ వ్యవసాయానికి మారాలని నేను వెంటనే నిర్ణయించుకున్నాను, ”అని ఆయన చెప్పారు. ప్రస్తుతం, రతన్ తన మొత్తం భూమిలో సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబిస్తున్నారు. సొంతంగా తయారుచేసుకున్న సేంద్రియ ఎరువులతో పాటు పెరుగుతో తయారు చేసిన ఎరువుల మిశ్రమాలను ఉపయోగించి ఆయన 20 రకాల పండ్లు, కూరగాయలు, ఇతర పంటలను పండిస్తారు. సేంద్రియ వ్యవసాయంలో ఆయన నైపుణ్యం ఆయనకు సంవత్సరానికి 80 లక్షల దాకా సంపాదించి పెడుతోంది.

ఆర్గానిక్ ఎరువుల తయారీ విధానంపై రతన్ లాల్ డాగా శిక్షణ

అయితే, రతన్ ఆర్గానిక్ సాగు ప్రయాణం అంతా ఒడిదొడుకులు లేనిదేమీ కాదు. తన పొలంలో అకస్మాత్తుగా మార్పు చేయడంతో రతన్‌కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. “దిగుబడి చాలా తగ్గిపోయింది. కొన్ని సందర్భాల్లో పంట మొత్తంగానూ పోయింది. నేలలో సూక్ష్మజీవులు, సూక్ష్మపోషకాలు లేకపోవడమే దీనికి కారణం. ఒక్కసారిగా రసాయన ఎరువుల వాడకం మానేయడం వల్ల పంటలకు అవసరమైన పోషణ అందదు”అని రతన్ చెప్పారు.
దీంతో చేసేదిలేక ఆయన తిరిగి రసాయన సాగుకే మారిపోయారు. కానీ ప్రకృతి సహజమైన పద్ధతుల ద్వారా భూసారం పెంచడానికి క్రమంగా ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. రసాయన ఎరువులు, పురుగుమందులను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఆవు పేడ, కంపోస్ట్, ఇతర సేంద్రియ పదార్థాలను వాడి భూసారాన్ని పునరుద్ధరించడానికి నిరంతరం ప్రయత్నించారు.
“నేను క్రమంగా 2003 నాటికి రసాయనాలను ఉపయోగించడం మానేసి పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి వెళ్ళాను. అయినప్పటికీ, 2007-08 నాటికి మాత్రమే నేల పూర్తిగా విషపదార్థాల నుండి విముక్తి పొందింది. అప్పటి నుంచి పంటల్లో రసాయన మూలకాల జాడలు కనిపించడం తగ్గింది”అని రతన్ చెప్పారు.
ఈ పరివర్తన గురించి మాట్లాడుతూ, 2000 సంవత్సరం ప్రారంభం రోజుల్లో ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల గురించి తక్కువ అవగాహన ఉందని రతన్ వివరించారు. అందుకే ఆర్గానిక్ సాగును అనుసరించడానికి సరైన మార్గాలను కనుగొనేందుకు రతన్ చాలా కష్టపడ్డారు. “నేను సాగు పద్ధతులపై చాలా పరిశోధన చేశాను. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులతో కనెక్ట్ అయ్యాను. ఇంతలో, పంట దిగుబడి పడిపోయింది. అది మళ్లీ పెరగడానికి కొంత సమయం పట్టింది”అని ఆయన చెప్పారు.
సేంద్రియ ఉత్పత్తులకు ఎక్కువ ధర చెల్లించడానికి ఆ రోజుల్లో వినియోగదారులు కూడా సిద్ధంగా లేరని ఆయన తెలిపారు. “వినియోగదారులు తేడాను అర్థం చేసుకోవడానికి ఆర్గానిక్ కూరగాయలు, పండ్లను కొనుగోలు చేసి తిని చూడడం చాలా ముఖ్యం. కొనుగోలుదారులు వాటి రుచి, నాణ్యత ఎలాంటిదో గ్రహించిన తర్వాత, వాటిని కొనడానికి ముందుకు వచ్చారు”అని రతన్ వివరించారు.

ప్రత్యేకమైన ఎరువుల తయారీ

రతన్ కష్టం వృథా పోలేదు. భూసారం పెంచే ఉత్తమమైన పోషకాలను అందించేందుకు ప్రత్యేకమైన మిశ్రమాలను ఆయన తయారు చేశారు. “నేను పప్పుల పిండి, ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, ఇతర సహజ పదార్థాల మిశ్రమంతో తయారైన జీవామృతాన్ని ఉపయోగిస్తున్నాను. అయినప్పటికీ, నేల ద్వారా గ్రహించే పోషకాలతో మొక్కల్లో నాణ్యత ఎలా పెంచాలో నేను ఆలోచిస్తూనే ఉన్నాను. నేను మట్టిని మానవ శరీరంగా భావించాను. అందుకే సహజమైన పోషకాలు కలిగిన పదార్థాలతో ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించాను.”అని ఆయన చెప్పారు.
పశుగ్రాస అవశేషాలు, వ్యవసాయ వ్యర్థాలు, వేరుశనగ సారం, పెరుగు, ఇతర వస్తువుల నుండి రతన్ తనదైన ఎరువు మిశ్రమాన్ని తయారుచేయడం ప్రారంభించారు. పలుమార్లు చేస్తూ వచ్చిన ప్రయోగాలు చివరికి మంచి ఎరువును తయారు చేయడానికి తోడ్పడ్డాయి. తురత్ ఫురత్ ఖాద్ (turat furat khaad) పేరుతో ఆయన ఈ సరికొత్త ఎరువును తయారుచేయగలిగారు.
“ఇది జీవామృతం, కాయధాన్యాలు, వేప ఆకులు, ఉసిరి, బొప్పాయి, రేగు వంటి మిగిలిపోయిన పండ్ల తాలూకు మిశ్రమం. మరొక మిశ్రమం పేరు దూధ్ హర్యాలి ఖాద్. ఐదు లీటర్ల పాలు, పెరుగు కలపి, రాగి పాత్రలో పులియబెట్టి సుమారు పది రోజులు ఉంచుతాను. అప్పుడు ఈ మిశ్రమం ఆకుపచ్చగా మారుతుంది. ఇది రసాయన ఎరువు అయిన DAPకి బదులుగా పనిచేస్తుంది”అని ఆయన తెలిపారు. జీవామృతంలో ఉపయోగించే పప్పుపిండిని ఇందులో కాయధాన్యాలు భర్తీ చేశానని రతన్ చెప్పారు. “ఇది పప్పుల పిండి వల్ల కలిగే మొక్కలలో ఫంగస్ వచ్చే అవకాశాలను తగ్గించింది. తెగుళ్లను నివారించడానికి నేను మొక్కలపై పసుపు నీటిని కూడా పిచికారీ చేస్తాను ”అని ఆయన వివరించారు.
ఇటువంటి ప్రయోగాలు విస్తృతమైన వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ఆయనకు సహాయపడ్డాయి. రతన్ పొలంలో నిమ్మ, దానిమ్మ, శీతాపలం, మామిడి, సజ్జ, పప్పుధాన్యాలు, పెసర, నువ్వులు, జీలకర్ర, కొత్తిమీర, మెంతితో పాటు కూరగాయలు కూడా సాగవుతాయి. “సేంద్రియ పద్ధతులు మంచి దిగుబడిని ఇస్తాయి. ఈ ప్రాంతంలోని రైతుల సగటు గోధుమల దిగుబడి 17 క్వింటాళ్లు. అయితే నేను నా పొలంలో 20 క్వింటాళ్లు పండిస్తున్నాను”అని ఆయన చెప్పారు, నేలలోని పోషకాల సహజ మార్పిడికి సహాయపడే అంతర పంట వ్యవసాయ పద్ధతిని ఆయన అవలంబించారు.
వినూత్న సేంద్రియ పద్ధతులతో ఉత్పత్తి వ్యయం తగ్గిందని రతన్ చెబుతారు. “మా పొలంలోని వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను కొనుగోలుదారులు అభినందిస్తున్నారు. నహౌర్, పాలి, బాల్టోరా, జోధ్‌పూర్ వంటి పొరుగు ప్రాంతాల నుండి కూడా వినియోగదారులు మా పొలానికి వస్తుంటారు”అని ఆయన చెప్పారు.
రతన్ వ్యవసాయ విజయాలు ఆయనకు పలు అవార్డులను కూడా సంపాదించిపెట్టాయి. ఆయన ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయవేత్తగా ప్రసిద్ధి కూడా పొందారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి భైరోన్ సింగ్ షెఖావత్ ఆయనను స్వదేశీ గౌరవ్ అవార్డుతో సత్కరించారు, 2017లో ఆయనకు మేవార్ గౌరవ్ అవార్డు కూడా లభించింది.

రతన్ లాల్ డాగా కుటుంబం

సేంద్రియ ఎరువుల తయారీలో శిక్షణ

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్), సెంట్రల్ ఆరిడ్ జోన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (కాజ్రీ) – జోధ్‌పూర్ వంటి వ్యవసాయ సంస్థలలో నేను ఉపన్యాసాలు ఇస్తున్నాను. నా ప్రేరణతో 70 మంది దాకా రైతులు పొరుగు ప్రాంతాలలో సేంద్రియ వ్యవసాయానికి మారారు”అని ఆయన సంతృప్తిగా చెబుతారు.
జోధ్‌పూర్‌కు చెందిన గంగా ఆర్గానిక్స్ (Ganga organics) వ్యవస్థాపకురాలు భావనా శర్మ రతన్‌కు విద్యార్థి. “జనం ఆయనను దాదాజీ అని పిలుస్తారు. నేను assistant researcherగా పనిచేశాను. కాని రతన్ గారి నుండి సేంద్రియ వ్యవసాయంలో పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించాను. 2016 నుండి నేను ఇదే పనిలో ఉన్నాను. ప్రత్యేకించి తక్కువ వర్షపాతం నమోదయ్యే పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల రైతులకు సేంద్రియ ఎరువులను విక్రయిస్తున్నాను”అని ఆమె చెప్పారు. సేంద్రియ ఎరువులు అటువంటి పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో దిగుబడిని పెంచడానికి సహాయపడతాయని ఆమె వివరించారు.
రతన్ వ్యవసాయ క్షేత్రానికి పలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, శ్రామికులు, విద్యార్థులు, ఇతర రాష్ట్రాల రైతులతో సహా వందలాది మంది సందర్శకులు వస్తుంటారు. “విద్యార్థులు సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ పొందటానికి తరచు ఇక్కడ 15-20 రోజులు గడుపుతారు” అని రతన్ చెప్పారు.
ఏదేమైనా, సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించడం కోసం రైతులకు సహాయపడటానికి మరిన్ని ప్రయత్నాలు అవసరమని రతన్ అభిప్రాయపడ్డారు. “సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించేందుకు రైతులు సుముఖత చూపకపోవడానికి ప్రధాన కారణం కలుపు మొక్కల పెరుగుదల. వాటిని అదుపు చేయడం చాలా కష్టం అవుతోంది. అందువల్ల, కలుపు మొక్కలు, అనవసరమైన గడ్డిని తొలగించే మార్గాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నాను” అని ఆయన చెప్పారు.
“ఆర్గానిక్ వ్యవసాయం ఆవశ్యకతను రైతులు అర్థం చేసుకోవాలి. వారు ఉపయోగించే విషపూరితమైన రసాయనాల వల్ల ప్రజల అనారోగ్యానికి వారు కారణమవుతారు” అని రతన్ అభిప్రాయపడ్డారు.
“జనం కూడా తమ ఇళ్లలో సేంద్రియ ఆహారం పెంచుకోవాలి. రసాయన రహిత ఆహార ప్రాముఖ్యతను గ్రహించేందుకు ఇది తోడ్పడుతుంది”అని రతన్ అంటారు.

మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.

RATAN LAL DAGA
Radhika, Ummed Club Road, Jodhpur-342006,
Rajasthan. Cell: 09414125193

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here