వ్యవసాయరంగంలో మహిళల పాత్ర కీలకమే అయినా వారి శ్రామిక శక్తికి పెద్దగా గుర్తింపు ఉండదు. ఇలాంటి వాతావరణంలో ఒడిశాలోని ఝార్సుగుడ జిల్లాకు చెందిన సరోజినీ ఓరామ్ (Sarojini Oram of Jharsuguda district) వ్యవసాయరంగంలో మహిళా సామర్థ్యానికి మచ్చుతునకగా నిలిచారు. అది కూడా కరోనా మహమ్మారి సృష్టించిన పెను చీకటుల మధ్య. లైకేరా బ్లాక్‌లోని ఐతపాలి గ్రామానికి చెందిన ఈ 40 ఏళ్ల మహిళ ఏటా రెండు పంటలను సాగు చేస్తున్నారు. వరి తరువాత, ఆమె తన 1.5 ఎకరాల భూమిలో పుచ్చకాయతో పాటు కూరగాయలను కూడా పండిస్తున్నారు. ఈ ఏడాది పుచ్చకాయ అమ్మకాల ద్వారా గత రెండు నెలల్లోనే ఆమె రూ. 55,000 లాభం ఆర్జించడం విశేషం. ఝార్సుగుడా వ్యవసాయ ఉత్పత్తి క్లస్టర్ (ఏపీసీ) (Agriculture Production Cluster-APC) కింద 10 స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)కు చెందిన 98 మంది మహిళా రైతుల కల్యాణి ప్రొడ్యూసర్ గ్రూపులో సరోజిని ఒకరు.
ఈ వేసవిలో ఈ వ్యవసాయ ఉత్పత్తి సంఘానికి చెందిన 23 మంది మహిళా రైతులు మెరుగైన పద్ధతులను అనుసరించి 38 ఎకరాల భూమిలో క్లస్టర్ మోడ్‌లో పుచ్చకాయ సాగు చేశారు. ఇంతకు ముందు మహిళా రైతులు తమ కూరగాయలకు మంచి ధర పొందటానికి నానా అవస్థలూ పడేవారు. అయితే వ్యవసాయ ఉత్పత్తిదారుల క్లస్టర్లను (Agriculture Production Cluster) నేరుగా మార్కెట్‌తోను, ట్రేడర్లతోను అనుసంధానించాక ఆ సమస్య తీరిపోయింది. ప్రస్తుతం పారదర్శకమైన పద్ధతిలో రైతుల పంట ఉత్పత్తులను ట్రేడర్లే వచ్చి తీసుకువెళుతున్నారు.
“వరి తరువాత, నేను పుచ్చకాయ సాగు చేశాను. ఇప్పుడు మొత్తం 150 క్వింటాళ్ల పంట అమ్ముడైంది. ఈసారి మేము మా పంట ఉత్పత్తులను అమ్మడానికి పెద్దగా కష్టపడలేదు. అదనపు శ్రమ, రవాణా ఖర్చులు కూడా ఆదా అయ్యాయి. బెండ ఇప్పుడు మార్కెట్‌కు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది”అని సరోజిని చెప్పారు.

Mission Shakti Commissioner cum Director Sujata R Karthikeyan

ఝర్సుగుడాలో ఇప్పుడు 47 ప్రొడ్యూసర్ గ్రూపులు ఉన్నాయి. వీటిలో రెండు బ్లాకులకు చెందిన 6000 మంది మహిళా రైతులు ఉన్నారు. అంతా కలిసి ఏకకాలంలో నిర్వహించే వ్యవసాయ పద్ధతి వల్ల అధిక నాణ్యతతో కూడిన పంటలు పండుతాయి. అంతేకాక అధిక దిగుబడి కూడా సాధ్యపడుతుంది. ఇది వంద క్వింటాళ్ల మేరకు సీజనల్ కూరగాయల దిగుబడినిస్తుండడం విశేషం. గిరిజన ప్రాంతాల్లో APCలను ప్రోత్సహించడం ద్వారా మహిళా రైతులకు జీవనోపాధిని కల్పించడం కోసం ఒడిశా ప్రభుత్వం ‘మిషన్ శక్తి’ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సమష్టి సాగు, సమష్టి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ఈ కార్యక్రమం ప్రత్యేకత. స్వీయ నియంత్రిత రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్‌పిఓ) / ప్రొడ్యూసర్ కంపెనీల ద్వారా ఈ మిషన్ మహిళా రైతుల జీవనోపాధిని పెంచుతోంది. నిర్దేశిత ప్రాంతంలో 3,000 నుండి 5,000 మంది వరకు చిన్న రైతులు ఇందులో భాగస్వాములుగా ఉంటారు.
‘మిషన్ శక్తి’ కమిషనర్ కమ్ డైరెక్టర్ సుజాతా ఆర్ కార్తికేయన్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ అనేక పథకాల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలు చేస్తోందని చెప్పారు. గిరిజనులు అధికంగా ఉన్న12 జిల్లాల్లోని 40 వెనుకబడిన బ్లాకులలో దీన్ని చేపట్టామనీ, లక్ష మంది మహిళా రైతుల వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయడమే దీని లక్ష్యమనీ ఆమె తెలిపారు.
“పంట వ్యవస్థల వైవిధ్యీకరణ, స్థానిక ఇన్‌పుట్ సేవల వంటి మౌలిక వసతుల కల్పనకు మిషన్ శక్తి తోడ్పడుతుంది. రసాయన క్రిమిసంహారకాలు వాడకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించడం, మెరుగైన సాగు విధానాలను అవలంబించడం కోసం మిషన్ శక్తి మహిళారైతులను ప్రోత్సహిస్తుంది. పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చేయడం కోసం మార్కెటింగ్‌ను వ్యవస్థీకృతం చేయడం కూడా ఇందులో భాగం. దీని ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం మిషన్ శక్తి లక్ష్యం” అని ఆమె చెప్పారు. మొదటి దశలో ఒడిశాలోని కంధమాల్, రాయగడ, కలహండి, కోరాపుట్, కియోంజర్, మయూరభంజ్, ధెంకనాల్, బలంగీర్, నువాపాడా, ఝార్సుగుడ, సంబల్పూర్, బౌధ్‌లలో మిషన్ శక్తి కార్యక్రమాన్ని చేపట్టారు. 2020 ఏప్రిల్ 1 నుండి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రెండేళ్ల పాటు అమలు చేస్తారు. ఇప్పటి వరకు స్వయం సహాయక బృందాలకు చెందిన 45 వేల మంది మహిళలు ఇందులో భాగస్వాములయ్యారు. 363 ప్రొడ్యూసర్ గ్రూపులకు చెందిన మహిళలు ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా 12 APC జిల్లాలకు చెందిన 30 ప్రొడ్యూసర్ కంపెనీలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు వ్యవసాయం, పశువుల పెంపకం రంగాలకు సంబంధించి సుమారు లక్ష మంది APC సభ్యులకు తగిన శిక్షణనిచ్చి వారి సామర్థ్యం పెంచే పని కూడా చేపడుతున్నారు.

మిషన్ శక్తి పథకం కింద మహిళారైతుల వ్యవసాయం

అలాగే, మెరుగైన పద్ధతుల్లో కూరగాయల సాగు, పశువుల పెంపకం కోసం సుమారు 3 వేల స్వయం సహాయక బృందాలకు ‘మిషన్ శక్తి’ కింద రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతి Agriculture Production Clusterలో 20 నుండి 25 వరకు వ్యవసాయ ఉత్పత్తిదారుల బృందాలు లేదా సంఘాలు ఉంటాయి. ఈ గ్రూపులన్నీ సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తాయి. అందరూ కలిసికట్టుగా పనిచేసి పంటలు పండించడం, వాటిని మార్కెట్ చేసుకోవడం వల్ల ఒక వ్యవస్థ రూపొందుతుంది. ఇది మహిళారైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదివరలో రైతులు స్థానిక మార్కెట్లలోను, సిటీ మార్కెట్లలోను తమ కూరగాయలను అమ్ముకోవడం అనేక సమస్యలతో కూడి ఉండేది. తక్కువ మొత్తంలో కూరగాయలను కొనుగోలు చేసేందుకు ట్రేడర్లు ముందుకు వచ్చేవారు కాదు. స్థానిక మార్కెట్లలో వారి కూరగాయలకు గిరాకీ ఉండేది కాదు.
రైతుల పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ఒక తక్షణ అవసరంగా గుర్తించామని ‘మిషన్ శక్తి’ డిప్యూటీ సెక్రటరీ బినోద్ కుమార్ జెనా చెప్పారు. సరైన యంత్రాంగం లేకపోవడం వల్ల రైతులు తమ పొలం పనులు వదిలేసి ఎక్కువ రోజులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడం కోసం మార్కెట్ల వెంట తిరగవలసి వచ్చేదని ఆయన తెలిపారు. అయితే Agriculture Production Clusterల ఏర్పాటు తర్వాత మార్కెటింగ్ పరిస్థితులు మెరుగుపడ్డాయని ఆయన వివరించారు. కాగా, సుస్థిర వ్యవసాయ పద్ధతులకు సంబంధించి రైతుల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం పలు స్వచ్ఛంద సంస్థలను కూడా ఇందులో భాగస్వాములను చేసింది.
“వాణిజ్య పంటల సాగు, తెగుళ్ల సహజ నిర్వహణ, సేంద్రియ ఎరువులు, షార్టింగ్ / గ్రేడింగ్, ప్యాకేజింగ్ తయారీతో పాటు అగ్రిగేషన్, మార్కెటింగ్ అనుసంధానం కోసం రైతులకు శిక్షణ ఇస్తున్నాము” అని Social Education for Women’s Awareness (SEWA) కార్యదర్శి సుశీల్ కుమార్ దశ్ చెప్పారు. లైకేరా, కోలాబిరా బ్లాకులలో కల్యాణి గ్రూపుతో సహా మహిళా రైతులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలను ప్రోత్సహించేందుకు సేవా (SEWA) పనిచేస్తోంది.
ఒడిశాలో మిషన్ శక్తి ఇలా గిరిజన మహిళా రైతులకు అండగా నిలుస్తోంది. ‘మిషన్ శక్తి’ అన్నది మహిళల అభ్యున్నతి కోసం ఒడిశా ప్రభుత్వం చేపట్టిన ఒక బృహత్ కార్యక్రమం. అందులో భాగంగా గిరిజన మహిళా రైతుల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని అమలు చేయడం విశేషం.

మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Mission Shakti Bhawan
At- Gandamunda, Po-Baramunda, Bhubaneswar,
Odisha, Pin-751030.
Telephone: 0674 – 2974093
Email Id: missionshakti.od@gov.in
pmumissionshakti@gmail.com

(Express News Service సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here