చారిత్రకంగా ఎంతో విశిష్టత కలిగిన తూర్పు గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయంలో కూడా ముందంజ వేస్తోంది. ఈ జిల్లాలో ప్రస్తుతం వేలాదిగా రైతులు జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యాన్ని అనుసరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుభాష్ పాలేకర్ ప్రకృతి సాగు విధానాన్ని ప్రోత్సహిస్తుండడంతో పలువురు రైతులు రసాయనాల వాడకం వదిలేసి సేంద్రియ వ్యవసాయం వైపు మరలుతున్నారు. వరి, బొప్పాయి. కూరగాయలు ఇతర పంటలను రైతులు ఆర్గానిక్ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ZBNF ప్రాజెక్ట్ మేనేజర్ కె పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం 2015-16 నుండి ఈ జిల్లా రైతులు గణనీయమైన సంఖ్యలో ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. వారు రసాయన ఎరువులను, క్రిమిసంహారక మందులను ఉపయోగించడం పూర్తిగా మానేశారు.
గోమూత్రం, గోమయం, వేపాకును మాత్రమే వాడి రైతులు భూసారాన్ని పెంపొందించగలిగారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి తొలినాళ్లలోనే వారు ఎకరానికి సగటున 24 బస్తాల వరి దిగుబడిని సాధించారు. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడిన పొలాల్లో ఇది సుమారు 30 బస్తాలుగా ఉంటుంది. కాస్త దిగుబడి తగ్గినా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన ఆహారధాన్యాల నాణ్యత హెచ్చు. పైగా భూసారం దెబ్బతినేదేమీ ఉండదు. సేంద్రియ విధానంలో పండిన పంటలకు ధర కూడా ఎక్కువ పలుకుతుంది. దీంతో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారు. అన్ని చోట్లా ఇలాగే ఉండదు. భూసారం ఎక్కువగా ఉన్న కొన్ని చోట్ల దిగుబడి 40 బస్తాలుగా కూడా ఉంటుంది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. రెండు ఆవులు పెంచేందుకు కావలసిన షెడ్ నిర్మాణం కోసం రూ. 6000లను సబ్సిడీ కింద ఇస్తోంది. రెండు కంటే ఎక్కువ ఆవులు పెంచాలనుకుంటే రూ. 12 వేలను షెడ్ ఏర్పాటు చేసుకునేందుకు సహాయంగా మంజూరు చేస్తోంది.
రైతులు సహజ ఎరువైన ద్రవ జీవామృతం కోసం గోశాల నుండి వ్యవసాయక్షేత్రం దాకా ఒక చిన్న కాలువను కూడా నిర్మించుకోవలసి ఉంటుంది. ఇక ప్రకృతి ఎరువు తయారు చేసే వెంచర్ ప్రారభించేందుకుగాను ప్రభుత్వం రైతులకు రూ.50 వేల చొప్పున సబ్సిడీగా అందిస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా సింగంపల్లి గ్రామానికి చెందిన రైతు బి.ఎస్ ప్రసాద్‌ నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అంతకుముందు రసాయనాలు వినియోగించే ప్రసాద్ ఇప్పుడు పూర్తిగా మానేశారు. ఆరు ఎకరాల్లో పామాయిల్ తోట వేశారు. రెండకరాలు చేపల చెరువు కూడా ఉంది. పామాయిల్ తోటలో అంతర పంటలు కూడా వేశారు. మంచి రాబడి వచ్చింది. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని తాళ్లపాలెం గ్రామ సర్పంచ్ శాంతకుమారి ప్రకృతి సేద్యం ద్వారా రు. 2.05 లక్షలు సంపాదించగలిగారు. ఇది అంతకుముందు ఆదాయంతో పోల్చితే ఇది ఒకటిన్నర రెట్లు ఎక్కువ.
ప్రాజెక్ట్ మేనేజర్ పార్థసారథ్ జిల్లా రైతుల్లో జెడ్‌బిఎన్‌ఎఫ్‌పై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అవగాహన తరగతులు, క్షేత్ర సందర్శనలు, వీడియో ప్రదర్శనలు వంటివి ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని, భూసారాన్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్తు ఉండదన్న సంగతి రైతులకు సరిగా చెప్పగలిగితే వారు తప్పకుండా ప్రకృతి వ్యవసాయంవైపు సాగుతారని పార్థసారథి అంటారు. అంతేకాదు, రసాయనాల వినియోగం వల్ల ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుందన్న విషయాన్ని అందరికీ తెలియజెప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రకృతి వ్యవసాయంలో శాంతకుమారి

ఇదిలావుండగా, తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ, రంపచోడవరం, అమలాపురం, రాజోలు, ఐ పోలవరం వంటి ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం కొనసాగుతోంది. కోనసీమలో బొప్పాయి, అరటి, మామిడి వంటివాటిని రైతులు ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. మధ్యలో కరోనా లాక్‌డౌన్ వల్ల వ్యవసాయ కూలీలు దొరక్క ZBNF రైతులు ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మెరుగయ్యాయి. మొత్తం మీద హానికరమైన రసాయనాలను వదిలి ప్రకృతి సాగుతో తూర్పు గోదావరి జిల్లా రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here