పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రైతులకు అందించే ఆర్థిక ప్రయోజనం తాలూకు తదుపరి విడతను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 2020 డిసెంబర్ 25న రూ. 18,000 కోట్లను 9 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి, 1 లక్ష 10 వేల కోట్ల రూపాయలకు పైగా నగదును రైతుల ఖాతాలలోకి జమ చేశామని ప్రధాని ఈ సందర్భంగా వివరించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఈ పథకం కింద రైతులకు ప్రయోజనం కలగకపోవడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ప్రధాని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 70 లక్షలకు పైగా రైతులు ఈ ప్రయోజనాన్ని అందుకోలేక పోయినందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. బెంగాల్‌కు చెందిన 23 లక్షల రైతులు ఈ పథకం కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పెట్టుకొన్నారని ఆయన తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరణ ప్రక్రియను ఎంతో కాలంగా ఆపివేసిందన్నారు.

కేరళలో మండీలు లేవు…

పశ్చిమ బెంగాల్‌లో రైతుల హితాన్ని గురించి నోరెత్తని పార్టీలు, దిల్లీకి వచ్చి రైతులను గురించి మాట్లాడుతున్నాయని అని ఆయన దుయ్యబట్టారు. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న విపక్షాలు కేరళలో ఎపిఎమ్‌సి- మండీలేవీ లేవనే సంగతిని మరచి పోతున్నాయని ఆయన విమర్శించారు.

రైతుల ఉత్పాదక వ్యయం (ఇన్‌పుట్ కాస్ట్) ను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు. ‘భూసారం కార్డు’, ‘యూరియాకు వేపపూత, ‘సోలార్ పంపుల పంపిణీ ’ వంటి ప్రభుత్వం చేపట్టిన రైతు కార్యక్రమాలను గురించి ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమాలు రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడంలో సహాయకారిగా నిలచాయని అని ఆయన పేర్కొన్నారు. రైతులకు పంట బీమా దక్కేటట్టు చూడడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆయన అన్నారు. ప్రస్తుతం, కోట్లాది రైతులు పిఎమ్ పంట బీమా పథకం తాలూకు ప్రయోజనాన్ని అందుకొంటున్నారని ఆయన చెప్పారు. చాలాకాలం నుంచి ఉన్న స్వామినాథన్ కమిటీ నివేదిక సిఫారసుల ప్రకారం, రైతుల కోసం ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్ల మొత్తాన్ని ఎమ్ఎస్‌పి‌గా ప్రభుత్వం ఖరారు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఎమ్ఎస్‌పి పరిధిలోని పంటల సంఖ్యను కూడా పెంచామని ఆయన తెలిపారు.

రైతుల కోసం కొత్త మార్కెట్లు…

రైతులు తమ పంటలను విక్రయించేందుకు కొత్త మార్కెట్లను కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం దేశంలో ఒక వేయికి పైగా వ్యావసాయక మండీలను ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా జోడించిందని ఆయన తెలిపారు. వీటిలో, 1 లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగిందన్నారు. చిన్న రైతుల సముదాయాలను ఏర్పాటు చేసే దిశలో ప్రభుత్వం కృషి చేసిందని, తద్వారా వారు వారి వారి ప్రాంతాల్లో ఒక సామూహిక శక్తిగా పనిచేయడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం, దేశం లో 10,000కు పైగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పిఓ) లను ఏర్పాటు చేసేందుకు ఒక ప్రచారోద్యమం నడుస్తోందనీ, వాటికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతోందనీ ఆయన తెలిపారు.
దేశంలోని రైతులు ప్రస్తుతం ఒక పక్కా ఇంటిని, టాయిలెట్‌ను, నల్లా ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని అందుకొంటున్నారని ప్రధాని అన్నారు. అలాగే రైతులు ఉచిత విద్యుత్తు కనెక్షన్ ద్వారా, ఉచిత గ్యాస్ కనెక్షన్ ద్వారా కూడా పెద్ద ప్రయోజనాన్ని పొందారన్నారు. ‘ఆయుష్మాన్ భారత్ పథకం’లో భాగంగా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నామనీ, రైతుల జీవితాలలో ఇది ఒక పెద్ద ఉపశమనాన్ని కలిగించిందని అని ఆయన చెప్పారు.

రైతులు కోరుకున్న చోట విక్రయించవచ్చు…

వ్యావసాయక సంస్కరణల ద్వారా రైతుల కోసం ఉత్తమమైన ఎంపికల కోసం అవకాశం కల్పించామని ప్రధాని అన్నారు. కొత్త సాగు చట్టాలు వచ్చిన తరువాత రైతులు తాము పండించిన పంటలకు వారు కోరుకొన్న చోట అమ్ముకోవచ్చని మోదీ వివరించారు. నూతన చట్టాల తరువాత, రైతులు వారి ఉత్పత్తిని ఎమ్ఎస్‌పికి గాని, మార్కెట్‌లో విక్రయించడం గాని, ఎగుమతి చేయడం గాని, వ్యాపారులకు అమ్ముకోవడం గాని, మరో రాష్ట్రంలో విక్రయించడంగాని, ఎఫ్‌పిఓ ద్వారా అమ్మడంగాని చేయవచ్చని, లేదంటే బిస్కట్ లు, చిప్స్, జామ్ వంటి ఇతర వినియోగదారీ ఉత్పత్తుల వేల్యూచెయిన్‌లో భాగం కావచ్చుననీ ఆయన వివరించారు.
వ్యవసాయ సంస్కరణలను స్వాగతించి, వాటికి పూర్తి మద్దతు పలికిన రైతులందరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. వారిని తాను నష్టపోనివ్వనని ఆయన హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు, అస్సాం, రాజస్థాన్, జమ్ము- కశ్మీర్‌లలో ఇటీవల జరిగిన ఎన్నికలలో పాలుపంచుకొని, ఒక రకంగా, రైతులను తప్పుదోవ పట్టించిన పార్టీలన్నిటినీ తిరస్కరించారని మోదీ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here