దేశంలో 100వ కిసాన్ రైలు పట్టాలెక్కింది. మ‌హారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని శాలిమార్‌కు న‌డిచే ఈ కిసాన్ రైలును 2020 డిసెంబర్ 28న వీడియో కాన్ఫరెన్సు ద్వారా పచ్చ జెండా ఊపి ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రులు న‌రేంద్ర సింహ్ తోమ‌ర్‌, పీయూష్ గోయ‌ల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ, కిసాన్ రైల్ స‌ర్వీసు మన రైతుల ఆదాయాన్ని పెంచే దిశ‌లో ఒక పెద్ద అడుగు అని వ్యాఖ్యానించారు. క‌రోనా కాలంలో సైతం గ‌త నాలుగు నెల‌ల్లో 100 కిసాన్ రైళ్ళ‌ను ప్రవేశపెట్టడం ప‌ట్ల ఆయ‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఈ రైల్ సర్వీసు వ్య‌వ‌సాయానికి సంబంధించిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఒక పెద్ద మార్పును తెస్తుంద‌న్నారు. అంతేగాక దేశంలో శీత‌లీక‌ర‌ణ స‌దుపాయంతో కూడిన స‌ర‌ఫ‌రా సామర్థ్యాన్ని కూడా ఇది పెంచుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు…

కిసాన్ రైళ్ల ద్వారా రైతులు తమ పంట‌ల‌ను ఇప్పుడు ఇత‌ర రాష్ట్రాల‌లో కూడా అమ్ముకోగ‌లుగుతార‌ని, ఈ ప్ర‌క్రియ‌లో రైతుల రైలు (కిసాన్ రైల్) తో పాటు వ్యావ‌సాయ‌క విమానాలు (కృషి ఉడాన్‌)ల‌ది ప్ర‌ధాన పాత్ర అని ప్రధాని మోదీ అన్నారు. కిసాన్ రైలు అంటే, అది త్వ‌ర‌గా పాడ‌యిపోయే పండ్లు, కాయ‌గూర‌లు, పాలు, చేప‌ల వంటివాటిని పూర్తి భ‌ద్ర‌త‌తో చేర‌వేసే ఒక చల‌న‌శీల శీత‌లీక‌ర‌ణ నిల్వ స‌దుపాయమేనని ఆయ‌న అన్నారు. శీత‌లీక‌ర‌ణ నిల్వ సంబంధమైన సాంకేతిక విజ్ఞానం ఇదివరకు కూడా అందుబాటులో ఉన్నా ఇప్పుడు మాత్రమే దాన్ని కిసాన్ రైల్ వ్యవస్థ ద్వారా సరిగా వినియోగించుకోవ‌డం జ‌రుగుతోందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

100వ కిసాన్ రైల్‌ను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

కిసాన్ రైలు ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన ల‌క్ష‌లాది చిన్న రైతుల‌కు ఒక పెద్ద సౌక‌ర్యంగా ఉంటుందని అని ఆయన చెప్పారు. ఈ సౌక‌ర్యం అటు రైతుల‌కు, ఇటు స్థానిక చిన్న వ్యాపార‌స్తుల‌కు కూడా అందుబాటులో ఉంటుందన్నారు. నిపుణులతో చర్చిస్తూ, ఇత‌ర దేశాల‌కు చెందిన అనుభవాలను పరిశీలించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని భార‌త‌ వ్య‌వ‌సాయ రంగంలోకి తీసుకురావ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న వివరించారు. రైల్వే స్టేషన్‌ల ప‌రిస‌ర ప్రాంతాలలో పెరిశ‌బుల్‌ రైల్ కార్గో సెంట‌ర్‌లను నిర్మించ‌డం జ‌రుగుతోందని ఆయన తెలిపారు. వాటిలో రైతులు తమ ఉత్ప‌త్తిని నిల్వ చేసుకోవచ్చునన్నారు. పండ్లు, కూరగాయల వంటివి పళ్ల రసాలు, ప‌చ్చ‌ళ్లు, సాస్‌, చిప్స్ వగైరాలను తయారు చేసే కొత్త పారిశ్రామికవేత్తల దగ్గరకు చేరాలని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

సంస్కరణలతో వ్యవసాయ సంబంధిత వ్యాపారం విస్తరణ

నిల్వసదుపాయంతో కూడిన మౌలిక సౌకర్యాలపైన, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించే ప్రోసెసింగ్ ప‌రిశ్ర‌మ‌ల‌పైన శ్రద్ధ తీసుకోవడం ప్ర‌భుత్వ ప్రాథమ్యంగా ఉందని ప్ర‌ధాని వివరించారు. ఇలాంటి 6,500 పథకాలను పీఎమ్ కృషి సంపద యోజనలో భాగంగా ఆమోదించడం జరిగిందన్నారు. ఆత్మనిర్భ‌ర్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా రూ. 10,000 కోట్లను మైక్రో ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమల కోసం మంజూరు చేశామని ఆయ‌న తెలిపారు.
వ్య‌వ‌సాయ ప్ర‌ధాన వ్యాపారాలలోనూ, వ్య‌వ‌సాయ ప్ర‌ధాన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నలోనూ మ‌హిళాస్వ‌యంస‌హాయ స‌ముదాయాల వంటి స‌హ‌కార స‌మూహాలు, ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేష‌న్స్ (ఎఫ్‌పిఓ) వంటివాటికి ప్రాధాన్యం కల్పిస్తున్నామని ఆయ‌న చెప్పారు. ఇటీవ‌లి సంస్క‌ర‌ణ‌లు వ్య‌వ‌సాయ సంబంధ వ్యాపారం విస్త‌రించ‌డానికి తోడ్పడతాయని ప్రధాని మోదీ అన్నారు. వాటి వల్ల ఈ స‌మూహాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయ‌న చెప్పారు. వ్య‌వ‌సాయ రంగంలో ప్రైవేటు పెట్టుబ‌డి ఈ స‌మూహాల‌కు స‌హాయం అందించాల‌న్న ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నానికి తోడ్పాటుగా ఉండ‌గ‌ల‌ద‌ని ఆయ‌న అన్నారు.
“మేము భార‌త‌ వ్య‌వ‌సాయరంగాన్ని, రైతాంగాన్ని బలోపేతం చేసే దారిలో ముందుకు సాగిపోతూనే ఉంటాము” అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here