సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, పెద్ద జీతం, అమెరికాలో సెటిల్ కావడం, డాలర్లు సంపాదించడం…సాధారణంగా ఇది చాలామంది కనే కల. కానీ వాటన్నిటినీ వదిలి ప్రకృతి ఒడిలో సాగే జీవితాన్ని ఎంచుకున్నారు దేవరపల్లి హరికృష్ణ. తరతరాల వారసత్వంగా వచ్చిన వ్యవసాయమే ఆత్మ సంతృప్తినిస్తుందని ఆయన భావించారు. అమెరికా ఉద్యోగాన్ని సైతం వదులుకుని పొలంబాట పట్టారు. ప్రకృతి వ్యవసాయంలో అద్భుత విజయం సాధించి యువతకు ఒక ఆదర్శంగా నిలిచారు.
తెలంగాణ కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందనపల్లికి చెందిన దేవరపల్లి హరికృష్ణ (39) ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. చదువు పూర్తి అయ్యాక ఆయన హైదరాబాద్‌లో పదేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. ఆ తర్వాత ఐదేళ్లు అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేశారు.

కంప్యూటర్ ఇంజనీరింగ్ చేలినప్పటికీ హరికృష్ణకు వ్యవసాయమంటే మొదటి నుంచీ ఎంతో ఇష్టం. చదువుకుంటున్న రోజుల నుంచీ హరికృష్ణ పొలం పనుల్లో తండ్రి వెంకటేశ్వర రావుకు సాయపడేవారు. అయితే రెండేళ్ల కిందట ఆయన ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది హరికృష్ణ తల్లిదండ్రులకు ఏ మాత్రం ఇష్టం లేదు. రెండు చేతులా సంపాదించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేయడం వారికి నచ్చలేదు. దీంతో తల్లిదండ్రుల మాట తీసేయలేక అడపాదడపా మాత్రమే ఆయన వ్యవసాయం పనులు చూసేవారు. కానీ ఏడాది కిందట తండ్రి మరణించడంతో హరికృష్ణ పూర్తి రైతుగా మారారు. గ్రామంలో తమకున్న 35 ఎకరాల పొలంలో ఆయన పలు రకాల పంటలను పండించడం మొదలుపెట్టారు. వరి, పసుపు, మిర్చి, కొకోవా, ఆయిల్ పామ్, కొబ్బరి, అరటి వంటివి ఆయన సాగు చేస్తున్నారు. ఒకే రకం పంట కాకుండా అంతర పంటలు వేసుకోవడంపై ఆయన దృష్టి నిలిపారు. అలాగే ఆర్గానిక్ వ్యవసాయంవైపు మళ్లారు. మొదట్లో ప్రకృతి సేద్యం వల్ల దిగుబడి 30 శాతం దాకా తగ్గింది. చాలా మంది బంధుమిత్రులు ఆర్గానిక్ వ్యవసాయం వద్దంటూ హరికృష్ణను వారించారు. అయితే హరికృష్ణ తన పట్టుదల వీడలేదు. అవే సేంద్రియ పద్ధతులను ఉపయోగించి కొన్నాళ్లలోనే అధిక దిగుబడి సాధించి చూపారు. ఇప్పుడు తన పొలంలో దిగుబడి రెట్టింపు అయింది. జెడ్‌బిఎన్ఎఫ్ ఆవిష్కర్త సుభాష్ పాలేకర్ తనకు స్ఫూర్తి అని మెరిసే కళ్లతో చెబుతారు హరికృష్ణ.

“నేను పొలంలో కెమికల్ పెస్టిసైడ్లను, ఎరువులను వాడను. కేవలం ఆర్గానిక్ పదార్థాలనే ఉపయోగిస్తాను. భూసారం పెంచడడం కోసం పంట వ్యర్థాలను, జీలుగు వంటి హరిత ఎరువులను మాత్రమే వాడతాను. చాలామంది రైతులు వరి కోతలయ్యాక గడ్డిని, ఇతర అవశేషాలను తగులబెడుతుంటారు. ఇది నేల సారాన్ని దెబ్బతీయడమేగాక కాలుష్యానికి కూడా కారణమౌతుంది” అని వివరిస్తారు హరికృష్ణ. పంట వ్యర్థాలను పోషకాలుగా మార్చుకునే అద్భుతమైన గుణం నేలకు ఉంటుందని ఆయన అంటారు. పంట అవశేషాలు బయోమాస్ ఫెర్టిలైజర్లుగా ఉపయోగపడతాయని ఆయన సూచిస్తారు. పర్యావరహణ హిత విధానాలు ఉండగా, రైతులు పర్యవసానాలను గమనించకుండా సులువైన దగ్గరి మార్గాలను ఎంచుకోవడం వల్ల భూసారం పాడవుతోందన్నది ఆయన అభిప్రాయం.
కూరగాయల్లో మోతాదుకు మించిన రసాయన ఎరువులు, పురుగు మందుల అవశేషాలు ఉండడం వల్ల ఏలూరులో జనం అస్వస్థతకు గురైన ఇటీవలి ఉదంతం మనకు కనువిప్పు కావాలంటారు హరికృష్ణ. సేంద్రియ పంటల ప్రాముఖ్యతను ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలని ఆయన చెబుతారు. ఆర్గానిక్ విధానంలో పండించిన ఆహార ధాన్యాలను, కూరగాయలను వినియోగదారులు కొనుగోలు చేయడం పెరిగితే రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మరలుతారని ఆయన సూచిస్తారు.

హరికృష్ణ వ్యవసాయక్షేత్రంలో కొకోవా చెట్టు
హరికృష్ణ తను పండించే ఆహార దినుసులను హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, విజయవాడ, గుంటూరు, రామగుండం తదితర ప్రాంతాల మార్కెట్లకు పంపుతుంటారు. అలాగే పసుపు, మిర్చీ ప్రాసెస్ చేసి పసుపుగానూ, కారంపొడిగానూ మార్చుతారు. తెలిసిన ఎన్ఆర్‌ఐలు తరచు తమకి కావలసిన కారం, పసుపులను హరికృష్ణ నుంచే కొనుగోలు చేస్తుంటారు. వ్యవసాయం చేయడం ఒక్కటే కాకుండా పండించిన పంటను సరిగా మార్కెట్ చేసుకోవడం రైతులకు తెలియాలంటారు హరికృష్ణ.
తన పని తాను చేసుకుపోవడమే కాక ప్రకృతి వ్యవసాయం విశిష్టతను పదుగురికీ వివరిస్తుంటారు హరికృష్ణ. విజయవంతంగా ఆయన ఆర్గానిక్ సాగు చూసిన మరి కొందరు రైతులు కూడా, దమ్మపేట్ మండలంలో, ప్రకృతి వ్యవసాయంవైపు మరలడం విశేషం. అలాగే ప్రకృతి వ్యవసాయ విశిష్టతపై ప్రసంగించేందుకు హరికృష్ణను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఆహ్వానించడం ఆసక్తికరం. ఇటీవల 2020 జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తనతో వ్యవసాయంపై సంభాషించేందుకు ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆహ్వానించిన ఐదుగురు ఆర్గానిక్ రైతులలో హరికృష్ణ కూడా ఒకరు.

మొదట్లో సందేహించినా ఆ తర్వాత కుటుంబం కూడా హరికృష్ణకు తోడుగా నిలిచింది. భార్య రేఖ సైతం హరికృష్ణ ప్రకృతి వ్యవసాయం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటారు. హరికృష్ణ వంటి విద్యాధికులు ఇలా సాహసంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం రైతులకు స్ఫూర్తిదాయకం. హరికృష్ణ విజయగాధ ప్రత్యేకించి యువతకు మంచి ప్రేరణగా నిలుస్తుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here