అది రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాలోని పీప్ ల్యాండ్ గ్రామం. వేసవి వచ్చిందంటే చాలు ప్రభుత్వం సరఫరా చేసే నీటి ట్యాంకర్ల వద్ద ఎన్ని ఎక్కువ బకెట్లు వీలైతే అన్నింట్లో నీళ్లు పట్టుకోవాలనే ఆతృతే ఆ గ్రాస్థుల్లో కనిపించేది. ఆ క్రమంలో నిత్యం గ్రామస్థుల మధ్య తరచూ పోరాటాలే జరిగేవి. నీటి ఎద్దడి కారణంగా ప్రతి వేసవిలోనూ పీప్ ల్యాండ్ లో ఇవే దృశ్యాలు పునరావృతం అయ్యేవి. రైతుల ఆత్మహత్యల గురించి పత్రికల్లో వచ్చే వార్తలు.. నీటి కోసం తమ గ్రామస్థుల మధ్య జరిగే చిన్నపాటి యుద్ధాలు 27 ఏళ్ల పీప్ ల్యాండ్ యువకుడు భువనేశ్ ఓజాను చాలా కల్లోలపరిచాయి.
ఇలాంటి చేదు అనుభవాలే భువనేశ్వర్ ఓజా ‘గ్రీన్ క్యాంపెయిన్’ చేసేందుకు పురికొల్పాయి. సహజ వనరులను విచ్చలవిడిగా కొల్లగొట్టి.. దెబ్బతీసిన పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు నడుం బిగించేలా ఓజాను కార్యోన్ముఖుడ్ని చేశాయివృక్ష సంపద కనుమరుగైపోయిందని కొందరు పర్యావరణవేత్తలు, గ్రామంలోని పెద్దలతో మాట్లాడినప్పుడు భువనేశ్ ఓజాకు తెలిపారు. దాంతో భూగర్భజలాలు కూడా బాగా తగ్గిపోయాయని వివరించారు. భువనేశ్ ఓజా ప్రస్తుతం ఉదయ్ పూర్ కేంద్రంగా పనిచేస్తున్నాడు. సహజ వనరులను విచక్షణా రహితంగా కొల్లగొట్టడం వల్ల అటవీ ప్రాంతం, భూగర్భ జలాలు తగ్గిపోయి.. వాతావరణం బాగా దెబ్బతిన్నది. అలాంటి పీప్ ల్యాండ్ గ్రామంలో వ్యవసాయం చేసే పరిస్థితి లేక అనేక మంది రైతులు ఉపాధిని వెదుక్కుంటూ పొట్ట చేత పట్టుకుని నగరాలకు వలస వెళ్లిపోయారు.కేంద్ర భూగర్భ జల బోర్డు నివేదిక ప్రకారం 2012లో ఉదయ్ పూర్ జిల్లాలోని 17 బ్లాకులకు గాను ఐదు బ్లాకుల్లో సహజ వనరుల దోపిడీ ఎక్కువగా జరిగిన కేటగిరిలో చేరిపోయాయి. వాటిలో మూడు బ్లాకుల పరిస్థితి అత్యంత దయనీయంగాను, మరో రెండు బ్లాకులు పాక్షికంగా గడ్డుపరిస్థితులున్న కేటగిరిలోకి చేరాయి. ఇలాంటి సమయంలోనే భువనేశ్ ఓజా పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది. ఇక బీటెక్ డిగ్రీలో చేరాలా? లేక ప్రకృతిని పరిరక్షణ కోసం కృషి చేయాలా? అనే సందిగ్ధంలో పడ్డాడు ఓజా. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగి అయిన తన తండ్రి ఉంటున్న ఉదయ్ పూర్ లోనే ఉండిపోయి.. జీవవైవిధ్యాన్ని పరిరక్షించే పని చేయాలని ఓజా నిర్ణయించుకున్నాడు. భువనేశ్ ఓజా, అతని మిత్రులు కలిసి తమ పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా 2013 మార్చి 10న ఉదయ్ పూర్ లోని తమ కాలనీలో తొలిసారిగా ఓ మొక్కను నాటారు. తర్వాత కొద్ది కాలంలోనే తమ కాలనీలో అనేక మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఇతరుల్లో అవగాహన, ఉత్సాహం కలిగించడం కోసం తాము నాటిన మొక్కలతో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
సహజ వనరులను న్యాయబద్ధంగా ఎలా వినియోగించుకోవాలో.. ఎలా సంరక్షించుకోవాలో.. జీవవైవిధ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో.. తద్వారా పచ్చదనాన్ని ఎలా పెంపొందించాలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘పుకార్ ఫౌండేషన్’ సంస్థను భువనేశ్వర్ ఓజా స్థాపించాడు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో పుకార్ సంస్తకు 10 వేల మంది వాలంటీర్లు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి కృషి ఫలితంగా 12 వందల మంది రైతులు సంప్రదాయ వ్యవసాయ విధానాల్లో సాగును పునఃప్రారంభించారు. పుకార్ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ, భూమిని, జలవనరులను సక్రమంగా వినియోగించడంపైనే కొనసాగేవి. ఈ క్రమంలో ప్రతి ఆదివారంనాడు తమ గ్రీన్ మిషన్ సంస్థలో కొత్త వాలంటీర్లను చేర్చుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుంచి మొదలు ఇప్పటి దాకా పుకార్ ఫౌండేషన్ లో వివిధ రంగాలకు చెందిన 10 వేల మంది సభ్యులుగా చేరి, మొక్కలు నాటుతూ పచ్చని ఉదయ్ పూర్ నగరంగా మార్చేందుకు కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో పుకార్ ఫౌండేషన్ వాలంటీర్లు నగరంలో వృథాగా పడిఉన్న ప్రభుత్వ పార్కులను శుభ్రంచేసి, స్థానికంగా లభించే మొక్కలు నాటేవారమని భువనేశ్వర్ ఓజా చెప్పాడు. జపాన్ వృక్ష శాస్త్రజ్ఞుడు అకిరా మియావకి సూచించిన విధానం ప్రకారం.. రెండు మూడేళ్లలోనే బాగా ఎదిగే స్థానిక రకాల మొక్కల్ని పుకార్ ఫౌండేషన్ నాటుతోంది. ఇలాంటి మినీ అడవులు పట్టణాల్లోని కొద్దిపాటి స్థలాలు అనువైనవని అంటాడు ఓజా. వాతావరణంలోని కర్బనాన్ని కనుమరుగు చేయడానికి, ఉష్ణోగ్రతలను తగ్గించడానికి, శబ్దకాలుష్యాన్ని తగ్గించడానికి, పక్షులు, జీవజాలాన్ని ఆకర్షించడానికి ఈ మినీ అడవులు ఎంతో బాగా ఉపయోగపడతాయని ఓజా చెబుతాడు. పుకార్ ఫౌండేషన్ వాలంటీర్లు 2019లో స్థానికంగా దొరికే 50 రకాలకు చెందిన 3 వేల మొక్కల్ని నాటారు.
పుకార్ ఫౌండేషన్ కృషిని రిటైర్డ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ డాక్టర్ సతీష్ శర్మ అభినందించారు. పుకార్ సభ్యులు ప్రశంసనీయమైన పని చేస్తున్నారని మెచ్చుకున్నారు. నగరాల్లో కాలుష్యం, జనాభా పెరుగుదల వత్తిడి ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో పచ్చదనం ఆవశ్యకత ఎంతైనా ఉందని, పుకార్ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయం అంటున్నారు.
ఉదయ్ పూర్ నగరంలో గ్రీన్ డ్రైవ్ ఊపందుకోవడంతో.. పచ్చదనం పర్యావరణ పరిరక్షణపై గిరిజనుల్లో కూడా అవగాహన కల్పించాలని భువనేశ్వర్ ఓజా భావించాడు. దీంతో పెర్మాకల్చర్ నిపుణులతో ఆన్ లైన్ లో చర్చలు ప్రారంభించాడు. కొందరు గిరిజన రైతులను ఓజా కలిశాడు. గిరిజన సంప్రదాయ పద్దతితో వ్యవసాయ విధానాల గురించి వారిని అడిగి తెలుసుకున్నాడు. గిరిజన యువకులు తమ మూలాలకు దూరం అయిపోతున్నారని, తమ ప్రాంతాల్లో లభించే ఔషధ మొక్కల గురించి గిరిజన యువతకు అవగాహన తగ్గిపోతోందని ఓజా అర్థం చేసుకున్నాడు. ఆ క్రమంలో పుకార్ ఫౌండేషన్ సభ్యులు ఉదయ్ పూర్ చుట్టూ ఉండే ఆరావళి శ్రేణిలో మొక్కలి నాటారు. 2019 నుంచి ఉదయ్ పూర్ సమీపంలోని అల్సిగఢ్ గ్రామపంచాయతీలోని గిరిజన రైతులతో కలిసి పుకార్ ఫౌండేషన్ పనిచేయడం ప్రారంభించింది.ఆరావళి శ్రేణిలో చెట్లను నరికేయడంతో అక్కడి నేల బంజరుగా మారిపోయింది. వర్షపు నీరు నేలలో ఇంకకుండా కిందికి జారిపోయేది. దీంతో భూమి క్షీణత చోటుచేసుకుంది. దాంతో గిరిజన రైతులు రుతుపవనాల సమయంలో కేవలం మొక్కజొన్న పంట మాత్రమే వేయగలిగేవారు. దీంతో వారికి పెద్దగా ఆదాయం వచ్చేది కాదని భువనేశ్ చెప్పాడు. 2019లో పుకార్ సభ్యులు అల్సిగఢ్ లోని మూడు పర్వతాల్లో నేల, నీటి సంరక్షణ కోసం 15 వేల సీతాఫలం మొక్కలు నాటారు. 400 చిన్న చిన్న కందకాలు ఏర్పాటు చేసి, ఒక్కో దాని ముందు రెండేసి సీతాఫలం మొక్కలు నాటారు. దీంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. సీతాఫలం మొక్కలు కూడా ఏపుగా ఎదగడమే కాకుండా మంచి దిగుబడినిచ్చాయని ఓజా వివరించాడు. కొన్ని నెలల క్రితమే పుకార్ ఫౌండేషన్ స్థానిక రకాలకు చెందిన 4 వేల జామ, మామిడి, గూస్ బెరి, నేరేడు, దానిమ్మ, నిమ్మ, సీతాఫలం, వెదురు మొక్కల్ని వారి వారి పొలాల్లో నాటేందుకు 140 మంది రైతులకు ఉచితంగా పంపిణీ చేసింది. జల సంరక్షణ కోసం రైతులు తమ తమ పొలాల్లో చిన్న చిన్న కందకాలు తవ్వుకునేలా పుకార్ సంస్త సహాయ సహకారాలు అందిస్తోంది. రైతులు తమ స్వస్థలాలను వదిలేసి, ఉపాధి కోసంపట్టణాలకు వలస పోకుండా చూడడం, స్థిర వ్యవసాయం జరిగేలా చేయడమే లక్ష్యంగా పుకార్ ఫౌండేషన్ పనిచేస్తోందని భువనేశ్వర్ ఓజా చెబుతున్నాడు.