మట్టి అవసరం లేకుండానే మొక్కల్ని పెంచే విధానాన్ని ఏరోపోనిక్స్‌ సాగు పద్ధతి అంటారు. గాల్లోనే వేలాడే మొక్కల వేర్లకు పొగమంచుతో కూడిన పోషకాలను మొక్కలకు అందించడం ఈ విధానంలో అతి ముఖ్యమైనది. అచ్చుంగా హైడ్రోపోనిక్స్ మాదిరిగానే ఏరోపోనిక్స్‌ సాగులో కూడా మట్టి కానీ, కొబ్బరిపొట్టు గానీ మరే ఇతర ఎదిగే ఆధార కల్పించడం ఏరోపోనిక్స్‌ విధానంలో ఉండదు.

అత్యధిక పోషక విలువలతో కూడి కూరగాయలు, పూలను మట్టి, కొబ్బరిపొట్టు లాంటి వాటిలో కాకుండా గాల్లోనే మొక్కల్ని పెంచే ఈ ఆధునిక సాగు విధానాన్ని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐఐహెచ్‌ఆర్‌) శాస్త్రవేత్తలు బెంగళూరులో ఈ కొత్త నమూనా ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఏరోపొనిక్స్‌ పై  తొలిసారిగా శాస్త్రీయ విధానంలో అధ్యయనం చేయడం కోసం ఆస్ట్రేలియాలోని పశ్చిమ సిడ్నీ యూనివర్శిటీతోను, కోజికోడ్‌ లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ స్పైస్‌ రీసెర్చ్‌ తో అవగాహనా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.ఏరోపొనిక్స్‌ సాగు విధానం పశ్చిమ దేశాల్లో ఇప్పటికే ఊపందుకుంటోంది. అయితే.. మన దేశంలో మాత్రం కొన్ని సంస్థలు గుట్టుగా ప్రయోగాలు చేస్తుండడంతో ఇంకా మొగ్గ దశలోనే ఉందనే చెప్పాలని ఐఐహెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దేబి శర్మ అంటున్నారు. ఏరోపొనిక్స్‌ సాగు విధానంలో ఉత్తమమైన పోషకాలతో కూడిన ద్రావణంలో మొక్కల వేర్లు కలిసిపోయి ఉంటాయి. మొక్కల వేర్లు ఆ ద్రావణంలోని పోషకాలను మొత్తం మొక్కకు అందేలా చేస్తాయి. ఇలా పెరిగిన మొక్కల నుంచి ఉత్తమమైన చిన్న చిన్న పండ్లు, కాయగూరలు, పూలు పండుతాయని వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్శిటీ సీనియర్ సైంటిస్ట్‌ ఒకరు వివరించారు. పూర్తిగా మూసి ఉన్న లేదా పాక్షికంగా మూసి ఉండే పాలీహౌస్‌ లలో ఈ ఏరోపొనిక్స్‌ విధానంలో కాయగూరలు, పండ్లు, పూల సాగు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.గాల్లో ఉండే మొక్కల వేర్లపై ఉత్తమ పోషకాలతో కూడిన నీటి ద్రావణాన్ని చేతితో గానీ లేదా ఆటోమేటిక్‌ స్ప్రేయర్లతో కానా పిచికారి చేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కలకు మరింత అధికంగా ఆక్సిజన్‌ అందుతుంది. తద్వారా మొక్కల ఎదుగుదల మరింత ఏపుగా, వేగంగా ఉంటుంది. దాంతో పాటు మొక్కలకు వ్యాధికారక ఇన్‌ ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా సమకూరుతుంది. ఇలా ఏరోపొనిక్స్‌ విధానంలో పెంచిన మొక్కల నుంచి అత్యధిక పంట దిగుబడులు వచ్చాయని శాస్త్రవేత్తలు వివరించారు.ఏరోపొనిక్స్‌ ఫార్మింగ్‌ అనే మాట గ్రీకు నుంచి వచ్చింది. ఏరోపొనిక్స్‌ విధానంలో మొక్కలు వేగంగా, ఎక్కువగా ఎదుగుతాయి. ఈ విధానంలో మొక్కలకు నీటి వినియోగం చాలా తక్కువ అవుతుంది. ఏరోపొనిక్స్‌ సాగు విధానం 1920లో అధ్యయన విషయంగా ప్రారంభించారు. ఏరోపొనిక్స్‌ విధానంలో సాగు చేస్తే.. పర్యావరణానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇతర సాగు విధానాలకు అవసరమయ్యే నేల కన్నా 98 శాతం తక్కువ నేలలోనే ఏరోపొనిక్స్ సాగు చేయవచ్చు. అలాగే మామూలు వ్యవసాయం కన్నా 98 శాతం తక్కు నీటి వినియోగంతోనే పంట పండించవచ్చు. ఇండోర్‌ లోనే ఏరోపొనిక్స్‌ సాగు ఉంటుంది కనుక వెలుతురు, ఉష్ణోగ్రత, నీరు లాంటి వాటిని నియంత్రించేందుకు వీలవుతుంది. సాధారణ పంట దిగుబడుల కన్నా ఏరోపొనిక్స్‌ విధానంలో మరింత ఎక్కువ దిగుబడి వస్తుంది. మామూలు సాగులో కన్నా మూడు రెట్ల వేగంగా మొక్కలు ఎదుగుతాయి. తద్వారా పంట, ఆదాయం కూడా మన చేతికి త్వరగా అందుతాయి.ఏరోపొనిక్స్‌ విధానంలో మన ఇళ్లలో కూడా మొక్కల్ని సాగు చేసుకోవచ్చు. ఇందుకు అవసరమైన పరికరాలు మార్కెట్లో ఇప్పటికే హార్డ్‌ వేర్ షాపుల్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇంట్లో ఏరోపొనిక్స్‌ సాగు ఒక హాబీలా కూడా చేసుకోవచ్చు. ఏరోపొనిక్స్‌ సాగులో అనుభవం వచ్చిన తర్వాత దాన్ని మరింత ఆధునికంగా, స్మాల్ స్కేల్‌ పద్దతిలో చేసుకుంటే.. ఆదాయం కూడా మెండుగాను వస్తుంది. ఏరోపొనిక్స్ సాగులో తులసి, అల్లం, సుగంధ ఆకు రోజ్‌ మెరి, వాము, ఆవాలు, పుదీన, పండ్లు, వంకాయ, పాలకూర, బ్రొకోలీ, బీట్స్‌, ఉల్లి, దోసకాయ, కాలీఫ్లవర్‌, క్యాబేజి, ద్రాక్ష, బంగాళాదుంప, ముల్లంగి లాంటి ఆకు కూరలు, కాయగూర పంటలు బాగా పండించుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here