మట్టిని నమ్ముకున్నవారికి నేలతల్లే తోవ చూపిస్తుంది. ప్రకృతిమాత కరుణ రైతన్నలకు ఎప్పటికైనా తప్పక సిరుల వర్షం కురిపిస్తుంది. వెంకట్ వట్టి విజయగాథ దీనికి ఒక ఉదాహరణ. హైదరాబాద్‌‌కు చెందిన ఆయన మొదట్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆ తర్వాత ఐటీ రంగానికి మారారు. సుమారు పదహారేళ్లు విదేశాల్లో పనిచేసి వచ్చారు. ఆయన ఐటీని వదిలేసి ప్రకృతి సహజ వ్యవసాయం చేశారు. అంతేకాదు వందలాది మంది రైతులకు దన్నుగా నిలిచి ఆదాయం పెరిగేలా చేశారు.
ఇటీవలికాలంలో ఇమ్యునిటీ పెంపొందడం కోసం చాలామంది ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో పండించిన కూరగాయలు, పండ్లు, ఆహారధాన్యాల వైపు మొగ్గు చూపారు. ఆర్గానిక్ విధానంలో పండిన పంటలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. వెంకట్ సరిగ్గా ఇక్కడే కొత్తగా ఆలోచించారు. వివిధ ప్రాంతాల్లో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ చేసే సుమారు 70 మంది రైతులను సంప్రదించారు. వారి తోడ్పాటుతో ఆర్డరు చేసే కస్టమర్ల ఇళ్లకే తాజా కూరగాయలు, పండ్లు పంపించే ఏర్పాటు చేశారు. ఇందుకుగాను Farm2Fridge (ఫార్మ్ టు ఫ్రిజ్) పేరుతో ఆయన ఒక మొబైల్ యాప్‌కు రూపకల్పన చేశారు. ఇదే పేరుతో ఒక వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు. హైదరాబాద్, వైజాగ్, గుంటూరు, విజయవాడల్లోని వినియోగదారులకు రసాయనాలు వాడని ఆర్గానిక్ కూరగాయలను, ఆహారధాన్యాలను Farm2Fridge ద్వారా అందించడం మొదలుపెట్టారు. ఆరోగ్యకరమైన తాజా కూరగాయలు, పండ్లు సరసమైన ధరలకే నేరుగా ఇంటికే వస్తుండడంతో వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది.
కస్టమర్ ఆర్డర్ చేశాకే రైతు తన పొలంలోని కూరగాయలను కానీ పండ్లను కానీ తెంపడం Farm2Fridge సేవల ప్రత్యేకత. వారానికొకసారి కస్టమర్‌ ఆర్డర్ చేస్తే తాజా తాజా కూరగాయలు వారి ఫ్రిజ్‌కే చేరతాయన్నమాట. అలా క్రమేపి farm-to-fork (పొలం నుండి పళ్లంలోకి) మోడల్‌కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా 5 వేల మందికి పైగా కస్టమర్లు ఈ పద్ధతిలో ఇళ్లకే ఆర్గానిక్ కూరగాయల వంటివాటిని తెప్పించుకుంటుండడం విశేషం. పండించే పంటలకు గిట్టుబాటు ధరలు రావడంతో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడం మొదలైంది. నేలతల్లిని నమ్ముకున్న రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు కస్టమర్లకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడంలో Farm2Fridge సఫలత సాధించింది.
నిజానికి వ్యవసాయంలో వెంకట్‌కు పూర్వ అనుభవమేదీ లేదు. కెమికల్స్ ఉపయోగించకుండా పంటలు పండించేందుకు రైతులను ఒప్పించడం అంత సులభమేం కాదు. ఇందుకు ఆయన స్వయంగా ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. లోగడ ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన ఒక ప్రాజెక్టు కోసం పని చేస్తున్నప్పుడు ఆయన ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్‌ని కలవడం తటస్థించింది. పాలేకర్ నుండి ఆయన స్ఫూర్తి పొందారు. టెక్నాలజీని వ్యవసాయంతో అనుసంధానం చేసేందుకు సంబంధించిన ఈ ప్రాజెక్టులో పని చేయడం వెంకట్‌ను కొత్త ఆలోచనలకు పురికొల్పింది.ప్రకృతి వ్యవసాయం మంచిదని ప్రచారం చేయడమొక్కటే సరిపోదు.. దాన్ని మనం కూడా ఆచరించి చూపించాలి…అని ఆయన తీర్మానించుకున్నారు. అలా 2011లోనే ఆయన హైదరాబాద్‌ సమీపంలో 30 ఎకరాలను లీజుకు తీసుకుని పాలేకర్ విధానంలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన అంతర పంటలు, డ్రిప్ ఇరిగేషన్, మల్టీ లేయరింగ్, సహజ క్రిమిసంహారకాల వాడకం వంటి అంశాలలో మంచి పరిజ్ఞానం సంపాదించారు. ఐదేళ్ల పాటు ఆయన ఈ తరహా వ్యవసాయంలో అనుభవం గడించారు. ఇందులో ఆయన ఒడిదుడుకుల ఎదుర్కొన్న సందర్భాలూ లేకపోలేదు. అయితే అవన్నీ ముందుకుసాగేందుకు కావలసిన అనుభవాన్నిచ్చాయి.
అలా కొంతకాలం తర్వాత 2016లో ఆయన రెండు FPO (Farmer Producing Organisations)లను కలుపుకుని Farm2Fridge కంపెనీని ప్రారంభించారు. దీనికి ఆయనే సీఈఓ. తనతో పాటు 17 మంది చిన్న, సన్నకారు రైతులను కూడా ఆయన కలుపుకున్నారు. వీరిని ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లించేందుకు ఆయన రైతులకు ఉచితంగా విత్తనాల వంటి వ్యవసాయ ఉత్పాదకాలు అందించారు. అల్గోరిథిమ్స్ ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో ఆయా పంటలకు ఉండబోయే డిమాండ్‌ను ఆయన అంచనా కట్టారు. పొటెన్షియల్ కస్టమర్లను గుర్తించారు. ఏ కూరగాయలకు ఎప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉంటుందో గమనించారు. సరఫరాకు తగిన రవాణా సదుపాయాలు కల్పించారు. రైతులను సన్నద్ధం చేశారు. దీంతో వెంకట్ Farm2Fridge సక్సెస్ అయింది.
కోవిడ్ 19 విజృంభించినప్పుడు ప్రజలు ఆర్గానిక్ ఆహారంవైపు మళ్లడం పెరిగింది. వ్యాధి నిరోధకశక్తిని అందించే ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు, ఆహార ధాన్యాలకు ఆదరణ పెరిగింది. ఇది కూడా వెంకట్‌కు కలిసి వచ్చింది. తన పదిహేను మంది టీమ్‌తో రోజుకు 800 డెలివరీస్ చేసే స్థాయికి చేరారు. ఇందుకుగాను ఆయన బృందం రోజుకు 18 గంటల పాటు శ్రమించేది. ఇప్పుడు హైదరాబాద్‌లోని చాలా సూపర్ మార్కెట్లకు కూడా ఆయన ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు సరఫరా చేస్తున్నారు.వెంకట్ ప్రతి 15 రోజులకొకసారి రైతులకు చెల్లింపులు జరుపుతారు. మార్కెట్‌కు తీసకువెళ్లి విక్రయిస్తే అంతంత మాత్రంగా ఆదాయం వచ్చేవాటికి కూడా ఆయన తన పద్ధతిలో లాభసాటి రాబడి రాబట్టగలుగుతున్నారు. ప్రతి ఆరు నెలలకొకసారి వెంకట్ రైతుల భూముల నుండి మట్టి, నీటి శాంపుళ్లను తెప్పించి ల్యాబ్‌కు పంపుతుంటారు. వారు రసాయనాలు వాడడం లేదని దీని ద్వారా ధ్రువీకరించుకుంటారు. మొదట సీఏ చేసిన వెంకట్ ఆ తర్వాత ఒరాకల్‌లో ఫంక్షనల్ కన్సల్టెంట్‌గా చేరారు. కొన్నాళ్లకు ప్రపంచబ్యాంకు ప్రాజెక్టు చేశారు. ఐటీలో ఆకర్షణీయమైన వేతనాన్ని వదులుకుని వెంకట్ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లినప్పుడు ఆయన బంధువులు, మిత్రులు వారించారు. కానీ వెంకట్ ముందుకే సాగారు. తన వ్యవసాయ ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను చుట్టివచ్చారు. చాలా మంది రైతులు తగిన వనరులు లేకపోవడంతో కొత్త వ్యవసాయ పద్ధతులను అనుసరించలేకపోతున్నారని వెంకట్ దృష్టికి వచ్చింది. రైతులు తమ వ్యవసాయం పట్ల సంతృప్తిగాను, సంతోషంగానూ లేరనీ, తమ పిల్లలు వ్యవసాయంలో కొనసాగకూడదనుకుంటున్నారనీ వెంకట్ గమనించారు. కానీ పాలేకర్ పద్ధతిలో ఆధునిక సాంకేతికతను జోడించే చేసే ప్రకృతి వ్యవసాయం రైతన్నలకు తప్పక వరప్రదాయని అవుతుందని ఆయన దృఢంగా చెబుతున్నారు. సుమారు 2,500 మంది రైతులకు ఆయన ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వడం, తన లాభంలో 65 శాతం రైతులకే అందించడం చెప్పుకోవలసిన విశేషాలు. నిజానికి ఆర్గానిక్ వ్యవసాయంలో ఒక జంట నెలకు 30 వేల రూపాయలు సంపాదించడం కష్టమేం కాదంటారు వెంకట్. మధ్యదళారులు లేరు కాబట్టి వినియోగదారులకు నేరుగా మన కూరగాయలు పంపించడం వల్ల రైతులకు కలిసివస్తుందని ఆయన చెబుతున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని ఆయన అంటారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినవాటికి.. మార్కెట్‌లో దొరికేవాటికన్నా 10 శాతం దాకా ఎక్కువ ధర ఉంటుందని ఆయన వివరిస్తున్నారు. అయితే ఆ మేరకు ధర ఎక్కువ చెల్లించేందుకు కస్టమర్లు కూడా సుముఖంగానే ఉంటారని ఆయన అంటున్నారు. అవును. డాక్టర్లకు, మందులకు పెట్టేకన్నా మన ఆరోగ్యం కోసం ఆ మాత్రం ఎక్కువ చెల్లిస్తే పోయేదేముంటుందీ! రసాయనాల విషాహారం తినడం కన్నా అమృతప్రాయమైన సేంద్రియ ఆహారం తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here