వ్యవసాయం లాభసాటి కావాలంటే సమగ్ర వ్యవసాయ విధానాలు అవసరం. ఒకే పంటపై ఆధారపడడం చాలా సందర్భాల్లో రైతుకు గిట్టుబాటు కావడం లేదు. అందుకే అంతరపంటలలతో నిర్వహించే సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అంతరపంటలతో భారత మసాలా దినుసుల పరిశోధన సంస్థ (Indian Institute of Spices Research-IISR) అభివృద్ధి పరచిన ఒక నూతన సేంద్రియ వ్యవసాయ విధానం అత్యుత్తమమైనదిగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) అవార్డు అందుకుని గుర్తింపు పొందింది. అఖిల భారత సేంద్రియ వ్యవసాయ యంత్రాంగ పథకం 2020 కింద చేపట్టిన పలు వ్యవసాయ విధానాలలో ఐఐఎస్ఆర్ రూపకల్పన చేసిన సేంద్రియ సాగు పద్ధతి ఎంపిక కావడం విశేషం.
ఈ విధానంలో భాగంగా కొలికోడ్‌ (కేరళ)లోని తమ ఇన్స్టిట్యూట్ క్యాంపస్‌లో కొబ్బరి తోటల మధ్య పసుపు, అరటి, కర్రపెండలం, అలసందలు, పశుగ్రాసం వంటివాటిని అంతరపంటలుగా వేశారు. వీటికి ఆవు పేడను ఆర్గానిక్ మెన్యూర్‌గా వాడారు. ఆవు పేడతో తయారు చేసిన సేంద్రియ ఎరువును సరఫరా చేసేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. చిన్న, సన్నకారు రైతులకు లాభసాటిగా ఉండాలనే ఉద్దేశ్యంతో Integrated Organic Farming System (IFS) కింద ఈ విధానాన్ని రూపొందించారు.
ఈ విధానంలో రెండు హెచ్ఎఫ్ (Holstein Friesians) ఆవులు, ఒక జెర్సీ ఆవుతో పాటు కేరళకు చెందిన రెండు కాసరగడ్, వెచూర్ దేశీ గోవులను కూడా పెంచారు. పబ్లిక్ కౌంటర్‌ ద్వారా ఆవుపాల అమ్మకాలు జరిపారు. తమ వ్యవసాయ క్షేత్రంలోని వ్యవసాయ ఉత్పత్తులనూ విక్రయించారు. ఒక ఎకరం విస్తీర్ణంలో నిర్వహించిన ఈ తరహా అంతరపంటల వ్యవసాయం ద్వారా ఐఐఎస్ఆర్ రూ. 1.3 లక్షల లాభం సంపాదించగలిగింది. దీంతో ఈ సెంటర్‌కు ICAR అవార్డు దక్కింది.


కొబ్బరి సాగుకు ప్రభుత్వాలు ఎలాగూ భారీ సబ్సిడీని సమకూర్చుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా గుంతలు తీసేందుకు, ఇతర ఖర్చుల కోసం ఎకరానికి మూడేళ్లకిగాను రూ.30 వేలకి పైగా సబ్సిడీ కింద ప్రభుత్వం అందిస్తోంది. దీంతో పాటు డ్రిప్‌ కోసం ఇచ్చే సబ్సిడీ కూడా ఉంటుంది. అటు Coconut Development Board రైతుకు అయ్యే ఖర్చులో 25 శాతం దాకా సబ్సిడీ ఇస్తోంది. దీంతో కొబ్బరి సాగు లాభసాటిగానే ఉంటోంది. ఈ కొబ్బరి సాగులో పసుపు, కర్రపెండలం, అరటి వంటివాటిని అంతర పంటలుగా వేసుకుంటే మరింత లాభదాయకం అవుతుందని భారత మసాలా దినుసుల పరిశోధన సంస్థ చెబుతోంది.
IISRకి చెందిన సి కె టంకమణి, వి శ్రీనివాసన్, ఎస్ షణ్ముగవేల్, ఎస్ శరతంబాల్‌లతో కూడిన బృందం ఈ నూతన సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచింది. పసుపు పంటను ఈ సెంటర్‌లో స్థానిక స్వయం సహాయ మహిళా బృందం సహాయంతో నిర్వహించారు. దీంతో స్థానికులకు ఉపాధి లభించినట్లైంది. అంతరపంటలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చు. ఆవుపేడతో తయారైన సేంద్రియ ఎరువు వాడకం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. ఆర్గానిక్ ఉత్పత్తులకు ఇప్పుడు మంచి గిరాకీ ఉన్నందున ఈ విధానంలో పండించే పంటలకు మంచి ధర కూడా వస్తుంది. కాబట్టి ఆర్గానిక్ మెన్యూర్ వాడకం రైతులకు ప్రయోజనకారిగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here