రసాయన ఎరువులు, పురుగు మందుల దుష్ప్రభావానికి గురై నానా అవస్థలూ పడిన ఆ ఊరు ఆ తర్వాత దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. సంప్రదాయ వ్యవసాయానికి దిక్సూచిగా మారింది. ఆ ఊరు పేరు ఏనబావి. వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని ఈ ఊరు రసాయన రహిత గ్రామం (chemical-free village) గా ప్రసిద్ధి పొందింది. ఇది తెలంగాణలోని మొట్ట మొదటి ఆర్గానిక్ గ్రామం.
ఇలా ఊరు ఊరంతా రసాయనాలను వదిలి సంప్రదాయ వ్యవసాయం వైపు మళ్లడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. 13 సంవత్సరాల కిందట ఈ ఊళ్లో అన్నీ సమస్యలే. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతో సాగే వ్యవసాయం వల్ల ఈ గ్రామంలో ఆరోగ్య సమస్యలు పెరిగాయి. పొలాల్లో పనిచేసే మహిళలు రసాయనాల వల్ల చివరికి గర్భస్రావాలకు కూడా గురయ్యారు. ఊపిరితిత్తుల సమస్యలూ తలెత్తాయి. దురదలు, దద్దుర్లు, తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం, మగతగా ఉండడం వంటి ఆరోగ్యసమస్యలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రైతన్నలు నిలవునా అప్పుల పాలయ్యారు. వరుస పంటనష్టాలతో ఆత్మహత్యలూ సంభవించాయి. అలాంటి దుర్భర పరిస్థితుల్లో గ్రామ పెద్ద పొన్నం మల్లయ్య రైతులను సంప్రదించడం మొదలుపెట్టారు. ఇక రసాయనాల విషం నుండి బయటపడాలని రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఇదంతా ఒక్కరోజులో జరిగిందేమీ కాదు. రసాయనాలను వదలడం వరకూ సరే. కానీ సేంద్రియ వ్యవసాయం లాభసాటి అవుతుందా… అన్నది రైతులకు ఎదురైన మొదటి ప్రశ్న. అవును. సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టి మరింత రుణభారంతో కృంగిపోకూడదు కదా! ఈ తర్జన భర్జనలు జరుగుతుండగా రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేందుకు Centre for Sustainable Agriculture (CSA), Centre for Rural Operations and Programs Society (CROPS) అండగా నిలిచాయి. రైతుల మనసుల్లోని సందేహాలను తీర్చాయి. చివరికి రైతులు సరేనన్నారు. అలా మొదలైంది ఆ ఊళ్లో సుస్థిర వ్యవసాయం. ఈ ఊళ్లో మొత్తం 50 కి పైగా రైతులున్నారు. అంతా కలిపి సుమారు 300 ఎకరాల వ్యవసాయం ఉంది. వీరంతా సంప్రదాయ వ్యవసాయ పద్ధతులవైపు అడుగులు వేశారు. దేశీ విత్తనాలు, సహజమైన ఎరువులు, పురుగు మందులతో సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు. వ్యవసాయంలో పశువులకు మళ్లీ ప్రాముఖ్యం పెరిగింది. ప్రతి ఇంటికీ ఐదు ఆవులదాకా సమకూర్చుకున్నారు. రైతుల నుండి మిగులు పాలను సేకరించడానికి ఒక ప్రైవేటు డెయిరీ ముందుకు వచ్చింది. అలా వ్యవసాయ ఆదాయం నెమ్మదిగా పెరిగింది.ఆవు పేడతో వారు సహజమైన ఎరువు తయారు చేసుకున్నారు. వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు, వేప వంటివాటితో పంటల తెగుళ్లకు కావలసిన పురుగు మందులు సిద్ధం చేసుకున్నారు. బంతి వంటి మొక్కలతో ఆర్గానిక్ కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. వీటి ఘాటైన వాసలతో తెగుళ్లు సోకడం తగ్గింది. అంతకుముందు ఎకరాకు రసాయన ఎరువుల కోసం రూ. 3,500 దాకా ఖర్చు చేయవలసి వచ్చేంది. సేంద్రియ ఎరువు వాడడం మొదలు పెట్టాక ఆ ఖర్చు కాస్తా రూ. 500కు తగ్గింది.
మొదట్లో ఏనబావిలో ఒకే ఒక చెరువు ఉండేది. అందులో నీరున్నప్పడు రైతులు ఒకే ఒక పంట వేసుకుని పత్తి మాత్రం పండించేవారు. కానీ ఆ తర్వాత వారు నిపుణుల సలహాతో వాన నీటి నిల్వ పద్ధతులు పాటించారు. దీంతో భూగర్భజలం పెరిగింది. అలా వారు 26 బోరు బావులు, 11 బావులు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూతా పచ్చదనం పెరిగింది. బీటీ కాటన్ మానేసి దేశీ పత్తి, కంది, కూరగాయల వంటి పంటలు పండించడం మొదలుపెట్టారు. వారు పండించిన ఆర్గానిక్ కాటన్‌కు మంచి ధర వచ్చింది. అప్పట్లో పశువులు బీటీ కాటన్ ఆకులు తినడం వల్ల పశువులు జబ్బు పడేవి. ఇప్పుడా బెడద లేదు. ఊళ్లో జనానికి కూడా చర్మవ్యాధుల సమస్య తీరింది. సాధారణంగా బీటీ పత్తిని ఆశించే పింక్ బోల్‌వార్మ్ తెగులు వారి పంటల జోలికే రాదు.గిట్టుబాటు ధర కోసం ఏనబావి రైతులు “సహజ ఆహార” పేరుతో సొంత బ్రాండ్ ఏర్పర్చుకున్నారు. రసాయన ఎరువులు వాడని పంటలు కావడంతో వారి దిగుబడి పెరిగింది. ఉత్పత్తులకు డిమాండ్ కూడా హెచ్చింది. మద్దతు ధర కంటే వారికి సుమారు వెయ్యేసి రూపాయలు ఎక్కువ ధర వస్తోంది. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం లాభసాటి కావడంతో ప్రతి ఇంటికీ ట్రాక్టర్ సమకూరింది. ఇప్పుడెవరికీ అప్పులన్నవే లేవు. వీరి పంటలు సింగపూర్‌కి సైతం ఎగుమతి అవుతున్నాయి.
ఏనబావి చూపిన మార్గంలో పరిసర గ్రామాలూ నడవడం మొదలుపెట్టాయి. సిరిపురం, మాణిక్యపురం, జీడికల్, వనపర్తి వంటి ఊళ్లు కూడా ఏనబావిని ఆదర్శంగా తీసుకున్నాయి. బయో ఫెర్టిలైజర్స్ ఉపయోగించి చేసే జీరో బడ్జెట్ వ్యవసాయం కచ్చితంగా లాభసాటి అవుతుందని ఏనబావి నిరూపించింది. సుస్థిర వ్యవసాయానికి ఇప్పుడు ఏనబావి ఒక చిరునామాగా నిలిచింది. సేంద్రియ వ్యవసాయంవైపు ఊరిని మరలించిన పొన్నం మల్లయ్యను ఆస్ట్రేలియా, అమెరికా వంటి పలు దేశాలు ఆహ్వానించి ఆర్గానిక్ సాగు మెళకువలు తెలుకోవడం చెప్పుకోవలసిన మరో విశేషం.