తొక్కే కదా అని తీసిపారేయడానికి వీల్లేదు! పండ్ల తొక్కలను చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కమలాల సంగతి చూద్దాం. సీజన్‌లో కమలా పండ్లు విరివిగా దొరుకుతాయి. ఈ పండులో ఉండే విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కమలాపండ్లే కాదు, వాటి పైతొక్కల కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అవి ఎరువుగాను, క్రిమిసంహారకంగాను పనికివస్తాయి. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేసుకోవచ్చు కూడా. ఈ ఎరువు ప్రత్యేకించి పుష్పించే మొక్కలకు మంచి బలం ఇస్తుంది. సాధారణంగా నారింజ కొని, తినేసి, తొక్కని విసిరివేస్తుంటారు. కానీ ఈ పండు తొక్క, మొక్కలలో కనిపించే పలు తెగుళ్ళను నివారించడానికి పనికివస్తుంది. అంతేకాదు, మొక్కలు త్వరగా వికసించేలా చేస్తుంది. మిద్దె పంటలకు, పెరటి తోటలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఆరెంజ్ తొక్కలతో ప్రయోజనాలు

నారింజ పైతొక్కను ముక్కలుగా కత్తిరించి మొక్క అడుగు భాగంలో ఉంచినప్పుడు, దాని ఘాటైన వాసన పచ్చదొమ వంటి అనేక తెగుళ్ళను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే, నారింజ పైతొక్కలో ఉండే లిమోనేన్ అనే పదార్థం తెగుళ్లను కప్పి ఉంచే మైనపు పూతను నాశనం చేస్తుంది. అదనంగా, తోటకి అందమైన సీతాకోకచిలుకలను ఆకర్షించడానికి కూడా నారింజ పైతొక్కను ఉపయోగించవచ్చు. నారింజ నుండి వచ్చే సువాసన సీతాకోకచిలుకలకు బాగా ఇష్టం. పులియబెట్టే ప్రక్రియను వేగవంతం చేయడానికి కంపోస్ట్‌లలో నారింజ పైతొక్కని వాడటం మంచిదని గార్డెనింగ్ నిపుణులు చెబుతున్నారు. నారింజ తొక్కలను మొక్కల పాదుల్లో వేర్లకు అంటకుండా పాతిపెట్టడం ద్వారా, మొక్కకు అవసరమైన నత్రజని, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. అలా చేయడం వల్ల మొక్కలు త్వరగా వికసిస్తాయి. అంతేకాక పువ్వులు రాలిపోకుండా కూడా ఇది తోడ్పడుతుంది. ప్రత్యేకించి నారింజ తొక్కలను పాదుల్లో ఉంచడం టమోటా మొక్కలకు ఎంతో మేలు చేస్తుంది.

నారింజ తొక్కలతో ద్రావణం తయారీ

అర లీటరు నీటిలో రెండు నారింజ కాయలను సన్నటి ముక్కలుగా కోసి రెండు రోజులు నాననివ్వాలి. మూడవ రోజు, దాన్ని సారాన్ని మాత్రమే తీసుకొని మరొక కంటైనర్‌లో వేసుకోవాలి. ఆకుపేను వంటివాటిని నివారించడానికి ఈ ద్రావణాన్ని తీసుకుని ఒక గ్లాసు నీటిని చేర్చి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. వేర్లకు తాకకుండా మొక్కల పాదుల అంచుల్లో కూడా దీన్ని పోయవచ్చు. ఇలా చేయడం వల్ల అప్పటిదాకా పుష్పించని మొక్కలు త్వరగా పూచి వికసిస్తాయి.

నారింజ తొక్కలతో ఇంట్లోనే మంచి ఎరువును కూడా తయారు చేసుకోవచ్చు. నారింజ తొక్కలను నీడన బాగా ఆరబెట్టి మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇది మొక్కలకు ఒక అద్భుతమైన హార్మోన్‌గా పనిచేస్తుంది. ఇంకో పద్ధతిలో ఆరెంజ్ తొక్కను లీటరు నీటిలో రుబ్బుకోవచ్చు. ఈ కల్కాన్ని లేదా పేస్టును నీటితో చేర్చి, సాయంత్రం వేళల్లో, వేర్లను తాకకుండా (చివరల్లో లేదా అంచుల్లో) మొక్కల మొదళ్లలో పోయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల నేల మరింత సారవంతంగా మారటమే కాకుండా కొన్ని వారాల్లోనే మొక్కలకు మంచి దిగుబడి వస్తుంది. చాలా మొక్కల్లో స్త్రీపుష్పాలు (female flowers) వికసించకుండా ఉండే సమస్య ఉంటుంది. ఆరెంజ్ పైతొక్క దీనికి గొప్ప ఔషధంగా చెప్పుకోవచ్చు. మొక్కలపై దీన్ని పిచికారీ చేయడం కూడా ఎంతో ప్రయోజనకరం. నారింజ పైతొక్కలని ఎప్పుడూ నీడలోనే ఎండబెట్టడం మంచిది. అలా చేయడం వల్ల అందులోని పోషకాలు పోకుండా ఉంటాయి. నారింజ వాసన పిల్లులకు, కుక్కలకు, చాలా కీటకాలకు సరిపడదు. కనుక నారింజ తొక్కలను మీ గార్డెన్‌లో ఉంచితే అవి మొక్కలకు దరిదాపుల్లోకి కూడా రావు.
నారింజ తొక్కలతో వెనిగార్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది మంచి బయో ఎంజైమ్‌గా ఉపయోగపడుతుంది.
ఇందుకు కావలసినవి- నారింజ తొక్కలు- కిలో. నీరు ఐదు- లీటర్లు. పాత బెల్లం – ఒక చిన్న ముక్క. ఈస్ట్ – అర చెంచా. ఒక పెద్ద ప్లాస్టిక్ పాత్ర.
మూత గట్టిగా ఉండే వెడల్పాటి ప్లాస్టిక్ పాత్రని తీసుకోవాలి. నీరు పోసి నారింజ తొక్కలను, ఈస్టును, బెల్లం ముక్కతో పాటు అందులో వేయాలి. గాలి చొరకుండా గట్టిగా మూత బిగించాలి. ప్రతి రోజూ ఒకసారి మూత తీసి మళ్లీ పెట్టేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ప్లాస్టిక్ పాత్రలో ఉత్పన్నమయ్యే వాయువులు బయటకు వెళ్లిపోతాయి. (ప్లాస్టిక్ కాకుండా గాజుసీసా అయితే అది ఒక్కోసారి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది) ఇలా మూడు నెలల పాటు చేయాలి. మొదటి నెలలో మాత్రం తప్పనిసరిగా రోజూ మూత తీసి మళ్లీ పెట్టాలి. రెండు, మూడు నెలల్లో మూడేసి రోజులకు ఒకసారి తీసినా చాలు. మూడు నెలల తర్వాత పాత్రలోని ద్రావణంపై పేరుకునే తేటను తీసి మరో పాత్రలో పోయాలి. దాన్ని కూడా మరో నెలన్నర పాటు పులియబెట్టాలి. ఆ తర్వాత తయారైన బయో ఎంజైమ్‌ను ఒక మోతాదుకు నాలుగు రెట్ల చొప్పున నీరు కలుపుకుని వాడుకోవచ్చు. ఈ ద్రావణాన్ని స్ర్పే చేస్తే ఇంట్లోకి పురుగులు, దోమలు చేరవు. అంట్లు తోముకోవడానికి కూడా ఇది పనికివస్తుంది. ఇది పాత్రల మరకలను, జిడ్డును ఇట్టే తొలగించి వేస్తుంది. ద్రావణం ఘాటును తగ్గించేందుకు కాస్త కుంకుడు రసాన్ని చేర్చుకోవచ్చు. నారింజతో పాటు నిమ్మ తొక్కలను ఉపయోగించి కూడా ఈ బయో ఎంజైమ్‌ను తయారు చేసుకోవచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here