తండ్రి అడుగుజాడల్లో నడవడమే కాదు, తండ్రి సంప్రదాయ వృత్తికి కూడా ప్రాచుర్యం కల్పించి ఒక సూపర్ బ్రాండ్‌నే సృష్టించారు భూపిందర్ సింగ్ బర్గాడీ. ఒక కుమారుడు (భూపిందర్ సింగ్ బర్గాడీ), తన తండ్రి (సుఖ్‌దేవ్ సింగ్ బర్గాడీ) పేరును ఎలా నిలబెట్టారో తెలుసుకోవాలంటే ఈ కథనం ఆసాంతం చదవాల్సిందే. ఇవాళ పంజాబ్‌లోనే కాదు, దేశవిదేశాల్లో సైతం ఆర్గానిక్ బెల్లం బ్రాండ్‌గా “బర్గాడీ” ప్రసిద్ధి పొందిందంటే అందుకు భూపిందర్ సింగ్ (Bhupinder Singh Bargari) (పై ఫోటో) నిరంతర కృషి కారణం.
పాత రోజుల్లో చెరకు రసం తీయడానికి ఎడ్లని ఉపయోగించేవారు. ఎడ్ల గానుగలతో చెరకు రసం నుంచి బెల్లం తయారీ జరిగేది. ఆ తర్వాత యంత్రాలు వచ్చాయి. కాలం మారుతున్నకొద్దీ బెల్లం తయారీలో రసాయాలను, కృత్రిమమైన రంగును విచక్షణారహితంగా ఉపయోగించడం మొదలైంది. దీంతో ముడి బెల్లం తన సహజసిద్ధమైన రుచిని కోల్పోయింది. నెమ్మదిగా జనం చక్కెర వైపు ఆకర్షితులయ్యారు. అయితే, ఇవాళ్టికి కూడా చక్కెర కంటే బెల్లాన్నే ఎక్కువగా ఇష్టపడేవారున్నారు. చెరకు రసం నుండి సంప్రదాయ పద్ధతుల్లో తయారయ్యే బెల్లానికి, దానికి ఉండే గిరాకీ దానికి ఉంటూనే వస్తోంది. బెల్లం తయారీకి సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తారంటే చాలు, దానికి ఉండే డిమాండ్ తక్కువదేమీ కాదు. సరిగ్గా ఈ సూత్రమే సుఖ్‌దేవ్ సింగ్ బర్గాడీ, ఆయన కుమారుడు భూపిందర్ సింగ్ బర్గాడీ అపూర్వ వ్యాపార విజయానికి దోహదపడింది.
1972లో పంజాబ్‌కు చెందిన సుఖ్‌దేవ్ సింగ్ రైతుల పనిముట్లని పదునుపెట్టే పని చేసేవారు. బదులుగా ధాన్యం, కూరగాయలు లేదా రైతులు ఇచ్చే వాటిని ఆయన తన పనికి వేతనంగా తీసుకునేవారు. కొంత కాలం తరువాత, ఆయన ఒక ఇంజిన్ కొని దాని ద్వారా బెల్లం తయారు చేయడం ప్రారంభించారు. బెల్లం తయారీలో ఆయన అనుసరించిన స్వచ్ఛమైన సంప్రదాయక పద్ధతులు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. రసాయనాలను ఏ మాత్రం వాడకుండా ఆయన తయారు చేసే బెల్లం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధి పొందింది. దీంతో కొంతమంది గ్రామస్థులు అయనకు చెరకు ఇచ్చి బెల్లం తయారు చేసివ్వమని కోరడం మొదలుపెట్టారు. సుఖ్‌దేవ్ సింగ్ ఏడాదిలో ఈ పనిని ప్రధానంగా నవంబర్ నుండి మార్చి వరకు చేసేవారు.

కుమార్తె వివాహం కోసం తయారు చేసిన మిఠాయి

ఇదిలావుడగా, సుఖ్‌దేవ్ సింగ్ 2011లో తన కూతురి పెళ్లి చేశారు. ఆ సమయంలో, ఆయన తమ బంధువులు, స్నేహితులందరికీ పెళ్లికార్డులతో పాటు దేశీనెయ్యితోను, డ్రైఫ్రూట్స్‌తోను తయారు చేసిన ప్రత్యేకమైన బెల్లాన్ని (Special Dryfruit Gur) అందజేశారు. ప్రతి ఒక్కరూ ఆ మిఠాయిని ఎంతో ఇష్టపడ్డారు. తమ కోసం కూడా అలాంటి బెల్లం తయారు చేసివ్వమంటూ చాలా మంది సుఖ్‌దేవ్ సింగ్‌ను కోరడం మొదలుపెట్టారు. ఆ దశలో, ఆయన కుమారుడు- భూపిందర్ సింగ్ బర్గాడీ తన తండ్రి ప్రారంభించిన బెల్లం తయారీని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. అలా వారిద్దరూ కలిసి రెండు రకాల బెల్లం తయారు చేయడం ప్రారంభించారు. ఒకటి మామూలు బెల్లమైతే మరొకటి డ్రైఫ్రూట్స్ బెల్లం. రెండూ ఆర్గానిక్ పద్ధతుల్లో తయారయ్యేవే.
చెరకు రసం నుంచి బెల్లం తయారు చేసే క్రమంలో బెండకాయ రసాన్ని వాడడమన్నది బర్గాడీ కుటుంబం సంప్రదాయంగా అనుసరిస్తూ వస్తున్న పద్ధతి. ఈ పద్ధతి వల్లే బర్గాడీ కుటుంబం తయారు చేసే బెల్లం మిగతా వ్యాపారుల బెల్లం కంటే విలక్షణమైందిగా నిలిచింది. దీని వల్లే రసాయనాలు, కృత్రిమమైన రంగు ఉపయోగించి తయారుచేసిన బెల్లం కంటే బర్గాడీ బెల్లం నాణ్యమైందని పేరు పడింది. ఈ ఆర్గానిక్ పద్ధతితో సుఖ్‌దేవ్ సింగ్, భూపిందర్ సింగ్‌లకు మంచి ప్రాచుర్యం లభించింది.
భూపిందర్ సింగ్ బర్గాడీ కేవలం తండ్రి అడుగుజాడలను అనుసరించడం మాత్రమే కాదు, బెల్లం తయారీ ప్రక్రియను ఆయన ప్రామాణికంగా రూపొందించారు.

భూపిందర్ సింగ్ కేవలం తండ్రి వ్యాపారాన్ని నిర్వహించటమే కాకుండా స్కూల్ టీచర్‌గా కూడా పని చేస్తారు. ఆయన బి.ఎడ్‌తో పాటు MA పూర్తి చేశారు. ఆ తరువాత ETT టీచర్ పరీక్ష కూడా ఉత్తీర్ణులయ్యారు. రోజూ స్కూలు వేళల తరువాత ఆయన బెల్లం వ్యాపారం కోసం సమయాన్ని వెచ్చిస్తారు.
బెల్లం ప్రాచుర్యాన్ని మరింత పెంచేందుకు భూపిందర్ 2 ఎకరాల విస్తీర్ణంలో C085 రకానికి చెందిన చెరకును సాగు చేయడం ప్రారంభించారు. ఒక స్వయం సహాయక రైతుల బృందాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆయన బృందంలోని రైతు సభ్యులను చెరకు సాగు చేసేందుకు ప్రోత్సహించారు. భూపిందర్ తీసుకున్న ఈ చొరవ వల్ల ఆ సమీప ప్రాంతాల్లో చెరకు వ్యవసాయం బాగా పెరిగింది. ఇది రైతులకు, బర్గాడీ కుటుంబానికి మంచి లాభాలను ఆర్జించి పెట్టింది.
గత 5 సంవత్సరాల్లో బర్గాడీ కుటుంబం తయారు చేసే బెల్లం, పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన పోటీల్లో 4 సార్లు మొదటి బహుమతి, ఒకసారి రెండవ బహుమతి గెలుచుకోవడం విశేషం. అత్యుత్తమమైన బెల్లం తయారీకిగాను 2014లో ‘ఉద్యమీ కిసాన్ స్టేట్ అవార్డు’ను కూడా ఈ కుటుంబం గెలుచుకుంది. లక్నోలోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్‌కేన్ రీసెర్చ్‌’లో జరిగిన జాతీయ బెల్లం సమ్మేళనంలో భూపిందర్ సింగ్ పాల్గొని తన మార్కెటింగ్ పద్ధతులను వివరించారు. బెల్లం మార్కెటింగ్ విషయంలో అవగాహన పెంచడానికి గత మార్చిలో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PAU) నిర్వహించిన ఒక కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. రైతుల అభివృద్ది కోసం అవసరమైన మార్కెటింగ్ పరిజ్ఞానంపై ఆయన అవగాహన కల్పించారు.

బర్గాడీ బెల్లం ప్రాసెసింగ్ ప్లాంట్…

ప్రస్తుతం, భూపిందర్ కోట్ కపురా-బతిండా రహదారి వద్ద తన సొంత బెల్లం ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఆయన సాంప్రదాయ పద్ధతిని అనుసరించి స్వచ్ఛమైన గుడ్ (బెల్లం) ను ప్రాసెస్ చేస్తారు. శీతాకాలంలో బెల్లానికీ, బెల్లం పొడికీ డిమాండ్ పెరుగుతుంది. స్వచ్ఛమైన బెల్లంతో తయారు చేసిన ‘టీ’ మన శరీరంపై ఎటువంటి హానికరమైన ప్రభావాన్నీ చూపదు. అది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అందుకే ఆ ప్రాంతానికి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నిపుణులు కూడా వారి పేషంట్లకు బర్గాడీ కుటుంబం తయారుచేసిన గడ్ (బెల్లం) వాడమంటూ సిఫారసు చేయడం ప్రారంభించారు.

చిరుధాన్యాల ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా…

బెల్లం యూనిట్‌తో పాటు భూపిందర్ సింగ్‌కు చిరు ధాన్యాల ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఉంది. అక్కడ ఆయన స్వయం సహాయక రైతు సంఘాల సభ్యులు పండించిన గోధుమ, మొక్కజొన్న, బార్లీ, జొన్న, ఆవాల వంటివాటిని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెసింగ్ ప్లాంట్‌తో పాటు, ఆయన ఒక స్టోరును కూడా ప్రారంభించారు. దీని ద్వారా భూపిందర్ తను ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను విక్రయిస్తారు.
తమ కుటుంబం తయారు చేస్తున్న బెల్లాన్ని వైద్యులు సైతం మెరుగైన జీర్ణక్రియ కోసం సిఫారసు చేయడం చూశాక భూపిందర్ దానిని ఒక బ్రాండ్‌గా ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆవిర్భవించిందే “బర్గాడీ బెల్లం” (Bargari Gur). ప్రస్తుతం ఈ పేరుతోనే ఆయన తమ బెల్లం విక్రయించడం ప్రారంభించారు.
భూపిందర్ Bargari Gur పేరుతో ఒక Facebook పేజీని కూడా నిర్వహిస్తారు. దీని ద్వారా ఆయన తమ బెల్లం తయారీ విధానాల గురించి, తమ ఇతర ఉత్పత్తుల గురించి వివరిస్తారు. తమ వినియోగదారులతో సంబంధాలు కొనసాగిస్తారు. తమ వ్యాపారంలో ఎప్పటికప్పుడు సానుకూల మార్పులను తీసుకురావడానికి భూపిందర్ పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆహార సాంకేతిక పరిజ్ఞానం, ఆహార ప్రాసెసింగ్, ఇంజనీరింగ్ విభాగాలతో కూడా నిరంతరం సంబంధాలను కలిగి ఉంటారు.
ఈ రోజు తాను తన జీవితంలో సాధించింది ఏమైనా ఉందీ అంటే అదంతా తన తండ్రి సుఖ్‌దేవ్ సింగ్ బర్గాడీ వల్లనేనని వినమ్రంగా చెబుతారు భూపిందర్ సింగ్.

చెరకు చేనులో భూపిందర్ సింగ్

విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహించడమే కాకుండా, భూపిందర్ సింగ్ బర్గాడీ మంచి టీచర్ కూడా రాణించారు. ఫరీద్‌కోట్ జిల్లాలోని కోథే కేహర్ సింగ్ గ్రామస్థులకు, అక్కడి పిల్లలకు ఆయన అవసరమైన సహాయం అందిస్తూ ఉంటారు. భూపిందర్ సామాజిక స్ఫూర్తిని గురించి స్థానిక వార్తాపత్రికలో పలు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. తోటి రైతులకు సహాయం చేయడమే కాకుండా, యువతకు స్ఫూర్తినివ్వాలనీ, తన సాంకేతిక పరిజ్ఞానంతో వారికి తోడ్పడాలనీ భూపిందర్ కోరుకుంటారు.
“రైతులు తమ ముడి ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ప్రారంభించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఆహార ప్రాసెసింగ్‌కు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉండబోతోంది. ఆహార ప్రాసెసింగ్‌తో పాటు అవసరమైన ఇతర అంశాల సమాచారాన్ని రైతులకు అందించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే” అని భూపిందర్ సింగ్ చెబుతారు.
వ్యాపార కౌశల్యంతో పాటు సామాజిక దృక్పథం కూడా కలిగి ఉన్న భూపిందర్ సింగ్ వంటివారు నేటి యువతరానికి తప్పక స్ఫూర్తినిస్తారు.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Bhupinder Singh Bargari
Address: Bargari Gur, Opposite of Grain Market,
KKP Road, Bargari, Faridkot, Punjab.
Phone: +91 94634 00098
bhupinderbrg@gmail.com

బెల్లం ప్రాసెసింగ్‌పై భూపిందర్ సింగ్ బర్గాడీ (పంజాబీ) వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here