సాధారణంగా ఒక్కో ప్రాంతం ఒక్కో పంటకు పేరు పడుతుంది. ఉదాహరణకు గుంటూరు జిల్లా మిరపకు ప్రసిద్ధి. శ్రీకాకుళం జీడిపప్పుకు పెట్టింది పేరు. ఇలా దేశంలోని వివిధ జిల్లాల్లో స్థానికంగా సాగు అయ్యే పంట ఉత్పత్తులను గుర్తించి, వాటిని క్లస్టర్లుగా అభివృద్ధి పరచాలని కేంద్రం సంకల్పించింది. ఆయా జిల్లాల్లోని ఆయా వ్యవసాయోత్పత్తులను గుర్తించి వివిధ పథకాల ద్వారా ప్రోత్సహించాలనీ, నాణ్యత పెంచి విలువను జోడించి ఎగుమతులతో అంతర్జాతీయంగానూ వాటికి గిరాకీ కల్పించాలనీ, తద్వారా ‘బ్రాండ్ ఇండియా’ (Brand India)ను ప్రమోట్ చేయాలనీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యసాధన కోసం తాజాగా One-District-One-Focus-Product (ODOFP) విధానాన్ని ప్రకటించింది.
వివిధ ప్రభుత్వ పథకాలను సమన్వయపరచడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం తద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించడం కూడా ఈ విధానం ఉద్దేశ్యం. అంతర్జాతీయంగా విదేశాలకు వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేయాలంటే కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను పాటించవలసి ఉంటుంది. క్రిమిసంహారకాల అవశేషాలు ఉంటే ఎగుమతులకు అవకాశం ఉండదు. అందుకే ప్రధానంగా ఆర్గానిక్ వ్యసాయాన్ని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని 728 జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన, జంతు, పౌల్ట్రీ, పాలు, మత్స్య, ఆక్వాకల్చర్, సముద్ర రంగాలకు సంబంధించి స్థూలంగా 15 ఉత్పత్తులను గుర్తించారు. 226 జిల్లాలకు పండ్లను, 107 జిల్లాలకు కూరగాయలను, 105 జిల్లాలకు సుగంధ ద్రవ్యాలను కేటాయించారు. ఇక ఈ జాబితాలో 40 జిల్లాలకు ప్రధాన ఆహార పంట వరిని, 5 జిల్లాలకు గోధుమను గుర్తించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఒన్ డిస్ట్రిక్ట్ ఒన్ ఫోకస్ ప్రొడక్ట్ (ODOFP)’ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు 11 వేర్వేరు వ్యవసాయ ఉత్పత్తులను మంజూరు చేశారు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖలతో సంప్రదించి రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (Indian Council of Agricultural Research-ICAR) నుండి సమాచారం తీసుకున్న తరువాత ఈ ఉత్పత్తులను కేంద్రం ఖరారు చేసింది.
PM Formlisation of Micro Food Processing Enterprises Scheme (ఎఫ్‌ఎంఇ) పథకం కింద, ODOFP ఉత్పత్తులకు మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌ సౌకర్యాలను కల్పించడం కోసం రెండు లక్షల సూక్ష్మ సంస్థలకు (Micro Food Processing Enterprises) రాగల ఐదేళ్ల కాలంలో రుణంతో కూడిన సబ్సిడీని ఇచ్చి ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకుగాను రూ. 10,000 కోట్లు కేటాయించారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు ODOFP క్రింద మంజూరు చేసిన వ్యవసాయ ఉత్పత్తులు ఇలా ఉన్నాయి.
వేరుశనగ (అనంతపురం), టమాటా (చిత్తూరు), కొబ్బరి (తూర్పు గోదావరి), అరటి (కడప), ఉల్లి (కర్నూలు), సిట్రస్ పండ్లు (నెల్లూరు), జీడిపప్పు (శ్రీకాకుళం), చెరకు (విశాఖపట్నం) , ఆక్వా (పశ్చిమ గోదావరి), మామిడి (కృష్ణా, విజయనగరం), మిరప, పసుపు (గుంటూరు, ప్రకాశం).
ఈ వ్యవసాయ ఉత్పత్తులను క్లస్టర్ విధానంలో ప్రోత్సహిస్తారు. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ PM-FME పథకం (PM ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్) క్రింద ODOFP ఉత్పత్తులకు ఆర్థిక సహకారం అందిస్తారు. Mission for Integrated Development of Horticulture (MIDH), National Food Security Mission’ (NFSM), Rashtriya Krishi Vikas Yojana (RKVY), Paramparagat Krishi Vikas Yojna (PKVY) వంటి పథకాల క్రింద ఆయా జిల్లాల్లో One-District-One-Focus-Product (ODOFP) వ్యవసాయోత్పత్తులకు ప్రభుత్వ సహాయం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ODOFPని అమలు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. వ్యవసాయోత్పత్తుల విలువ పెంపుతో పాటు వాటి ఎగుమతులను పెంచడానికి ఇది తోడ్పడుతుంది.

ఇదిలావుండగా, ఈ ODOFP జాబితాలో కొన్ని లోపాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు దేశంలో ఆంధ్రప్రదేశ్ వరి సాగుకు ప్రసిద్ధి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏపీలో గుర్తించిన వ్యవసాయోత్పత్తుల జాబితాలో వరి ప్రస్తావన లేదు. వరి ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్‌‌ జిల్లాల్లో ప్రోత్సహించడం మన రైతులకే కాక ‘బ్రాండ్ ఇండియా’కి కూడా ఉపకరిస్తుంది. ఇక కొత్త సాగు చట్టాల అమలును సుప్రీంకోర్టు నిలుపుదల చేసినందున రైతుల నుండి వ్యాపార సంస్థలు నేరుగా వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు. అయితే ఆయా రాష్ట్రాలు APMC Act నిబంధనలలో తగిన మార్పులు చేసుకోవచ్చుననీ, దాని ద్వారా ODOFP క్రింద లబ్ధి పొందవచ్చుననీ కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ODOFP క్రింద గుర్తించిన వ్యవసాయోత్పత్తులపై ఎలాంటి పన్నులు, సర్‌చార్జీలు ఉండవు. అవి ప్రధానంగా ఎగుమతి కోసం ఉద్దేశించినవి. ఇది ODOFPలో ఒక సానుకూల అంశం.
ఇక దేశవ్యాప్తంగా గుర్తించిన ఆయా వ్యవసాయోత్పత్తుల జాబితాలో జిల్లాల సంఖ్య క్రింది విధంగా ఉంది.
(i) వరి – 40 జిల్లాలు
(ii) గోధుమ – 5 జిల్లాలు
(iii) ముడి – పోషకాహార ధాన్యాలు- 25 జిల్లాలు
(iv) పప్పుధాన్యాలు – 16 జిల్లాలు
(v) వాణిజ్య పంటలు – 22 జిల్లాలు
(vi) నూనెగింజలు – 41 జిల్లాలు
(vii) కూరగాయలు – 107 జిల్లాలు
(viii) సుగంధ ద్రవ్యాలు – 105 జిల్లాలు
(ix) తోటల పెంపకం – 28 జిల్లాలు
(x) పండ్లు – 226 జిల్లాలు
(xi) పూల పెంపకం – 2 జిల్లాలు
(xii) తేనె – 9 జిల్లాలు
(xi) పశుసంవర్ధకం / పాల ఉత్పత్తులు – 40 జిల్లాలు
(xi) ఆక్వాకల్చర్ / మెరైన్ ఫిషరీస్ – 29 జిల్లాలు
(xii) ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు – 33 జిల్లాలు

మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Ministry of Food Processing Industries, Government of India
https://mofpi.nic.in/pmfme/one-district-one-product
https://odop.mofpi.gov.in/odop/
ఫోన్- 011 2649 2216

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here