ఇది ఒక మహిళారైతు విజయగాధ. ఉత్తర్ ప్రదేశ్‌లోని విఠల్‌పూర్‌కు చెందిన కనక్ లత (57) దుర్గ్, ఆర్యమాన్ రకాల టమాటాలను పండిస్తారు. వాటిని యు.కె, ఒమన్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. తన సేంద్రియ టమాటాల అమ్మకం ద్వారా ఆమె రూ. 2.5 లక్షల లాభం సంపాదిస్తుండడం విశేషం.
2017లో భర్త వాసుదేవ్ పాండే ఒక సహకార బ్యాంకు ఉద్యోగం నుండి రిటైర్ అయిన తరువాత కనక్ లతా-వాసుదేవ్ పాండే దంపతులు తమ కొడుకు దగ్గర కొన్ని నెలలు గడపడానికి యుఎస్ఎ వెళ్లారు. అయితే, కొంతకాలం తర్వాత రిటైర్మెంట్ గడపడానికి వారు తిరిగి భారతదేశానికి వచ్చేశారు. అలా ఈ దంపతులు ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ సమీపంలో ఉన్న విఠల్‌పూర్ గ్రామానికి చేరారు. తిరిగి రావడమైతే వచ్చారు కానీ కుటుంబం ఖర్చులను భరించటానికి పెన్షన్ లాంటిదేదీ లేకపోవడంతో, భార్యాభర్తలు తమ 1.5 ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇద్దరికీ అందుకు అవసరమైన అనుభవం లేదు.
“మా ఇద్దరి కుటుంబాలకూ వ్యవసాయ నేపథ్యం ఉంది, మా తాతగారు, ఇతర బంధువులు పొలంలో ఎల్లవేళలా కష్టపడటం నేను చూశాను. కానీ మాకు మాత్రం వ్యవసాయంపై అవగాహన తక్కువ” అని కనక్ లత చెప్పారు. ఏమైతేనేం ఆమె తమ పొలంలో గోధుమలు, బఠానీలు, టమాటాలు సాగు చేశారు. కానీ వచ్చిన దిగుబడితో ఆమె సంతృప్తి చెందలేదు.

కనక్ లత పొలంలో పండిన టమాటాలు

“దిగుబడి చాలా తక్కువ. పంట నిలకడగా లేదు. భూసారం పేలవంగా ఉంది. అంతగా సారవంతం కాని భూమిలో కూరగాయలను పండించడం ఏమిటని పొరుగు రైతులు మమ్మల్ని తిట్టారు” ఆమె చెప్పారు. ఇలా కొన్ని ఎదురుదెబ్బల తరువాత కనక్ లత వ్యవసాయంపై తన పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. సేంద్రియ పద్ధతులతో ప్రతిరోజూ సగటున 7 క్వింటాళ్లకు పైబడి పంట దిగుబడిని సాధించే రీతిలో శాస్త్రీయ విధానాలను అనుసరించారు. వారి సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు సమీప మార్కెట్లలో డిమాండ్ పెరగడమే కాకుండా, యుకె, ఒమన్‌ దేశాలలోని వినియోగదారులను కూడా అవి ఆకర్షించాయి.
పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి కనక్ లత చాలా శ్రమించారు. ఇందుకోసం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) అసోసియేట్ వెంచర్ అయిన నవ చేతన అగ్రో సెంటర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను సంప్రదించారు. సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ పొందారు. ఆమె తన పొలంలో అవసరమైన మార్పులు చేపట్టేందుకై ఢిల్లీలోని Prayatn Sanstha రూ.50 వేల మొత్తాన్ని రుణంగా సమకూర్చింది.
“నేను టమాటాలను సాగు చేసేందుకు సేంద్రియ ఎరువు, వర్మి కంపోస్టులతో భూమిని సారవంతంగా మార్చాలనుకున్నాను. ఇతర ప్రకృతి పద్ధతులతో భూసారం పెంచాలని నిర్ణయించుకున్నాను” అని కనక్ చెప్పారు. ఆగష్టు 2020లో ఆమె దుర్గ్, ఆర్యమాన్ అనే రెండు రకాల టమోటాలను తన పొలంలో సాగు చేయడం ప్రారంభించారు . “నేను ఇటీవల దుర్గ్ రకాన్ని పండించాను, అది మార్కెట్‌లో వెంటనే ప్రాచుర్యం పొందింది. నేను దాంతో ఒక క్రేట్‌కు సాధారణ టమాటాలతో పోలిస్తే 100 రూపాయల చొప్పున ఎక్కువ సంపాదించాను. ఈ రకం టమాటాలు పులుపు తక్కువగా ఉండి మరింత జ్యుసిగా, రుచిగా ఉంటాయి. వాటి లోపలి గుజ్జు మందంగా ఉంటుంది. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కూడా” అని కనక్ లత వివరించారు.
ఇదిలావుండగా యు.పి మేవరం జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ (డిహెచ్‌ఓ) కూడా కనక్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ఈ టమాటాల నమూనాలను తీసుకున్నారు. ఈ టమాటాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచకుండానే కనీసం రెండు వారాల పాటు నిల్వ ఉంటాయనీ, ఇతర దేశీ రకాలతో పోల్చితే ఇవి పొడవుగా, గుండ్రంగా ఉంటాయనీ ఆయన తెలిపారు.
కనక్ తన పొలం నుంచి ఒక్కోసారి 50 క్రేట్ల దాకా టమాటాలను కోస్తుంటారు. ఒక్కో క్రేట్ పాతిక కిలోలు. “రుణాలు, ఇతర పెట్టుబడులను తిరిగి చెల్లించటానికి అవసరమైన ఆదాయాన్ని నేను సంపాదిస్తున్నాను. త్వరలో ఇంకా మంచి లాభాలు వస్తాయి. టమాటాలపై సుమారు 2.5 లక్షల రూపాయల మేర లాభం సంపాదించగలనని నేను ఆశిస్తున్నాను, ”అని ఆమె చెప్పారు.

తన పొలంలో మహిళారైతు కనక్ లత

“మల్చింగ్, బిందు సేద్యం, ఇతర శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా కనక్ లత ఈ విజయాన్ని సాధించారు. టమాటాలను రాజ్‌భవన్‌కు పంపించినప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్ సైతం కనక్ కృషిని ప్రశంసించారు. తను పండిస్తున్న వినూత్నమైన టమాటాల కారణంగా కనక్ వార్తల్లో నిలిచారు”అని నవ చేతన అగ్రో సెంటర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సీఈఓ ముఖేశ్ పాండే అంటారు. కనక్ విజయం ఈ ప్రాంతంలోని ఇతర రైతులకు కూడా స్ఫూర్తినిచ్చిందని ఆయన చెప్పారు. “వారు తరువాతి సీజన్లో ఈ టమాటా రకాన్ని పెంచుతారు” అని ఆయన తెలిపారు.
వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడమే కాకుండా, లేబర్ కొరత, నీటి సరఫరా, సాంకేతిక ఇబ్బందులు వంటి సమస్యలను కనక్ అధిగమించారు. ఈ విజయం ఇచ్చిన సంతృప్తితో కనక్ లత క్యాప్సికమ్, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, బ్లాక్ టమాటాల సాగుతో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
“వ్యవసాయరంగ నిపుణుల మార్గదర్శకత్వం వల్ల నేను విజయాన్ని సాధించగలిగాను. వినియోగదారులు మా వ్యవసాయ ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు. నేను రిపీట్ కస్టమర్లను పొందడం చాలా సంతృప్తినిచ్చింది. పరిస్థితులు ఆశావహంగా ఉన్నాయి. ఈ ప్రయత్నంలో నా భర్త నాకు ఎంతగానో సహాయం చేశారు ” అని ఆమె చెబుతారు.
పదవీ విరమణ తర్వాత చాలా మంది నిరాశకు గురవుతున్నారని, అలా కాకుండా రిటైర్మెంట్ అన్నది జీవితపు కొత్త దశగా భావించాలని కనక్ భర్త వాసుదేవ్ అభిప్రాయపడ్డారు. “సాధారణంగా చాలా మంది పదవీ విరమణ చేసినప్పుడు జీవితంలో ఇక తమ పాత్ర ముగిసిపోయిందని భావిస్తుంటారు. కానీ తమ అభిరుచుల మేరకు, తమ ఉద్యోగ జీవితంలో చేయలేని కార్యకలాపాలను ప్రయత్నించడం ద్వారా రిటైర్మెంట్ తర్వాతి జీవితం గడపాలి” అని ఆయన అంటారు.
నీరు, విద్యుత్ ఆదా అయ్యే సాగు నీటి పారుదల పద్ధతులను అనుసరించాలని కనక్ లత రైతులను కోరుతున్నారు. “మీర్జాపూర్ ఒక కొండ ప్రాంతం. ఇక్కడి రైతులు తరచు నీటి కొరతను ఎదుర్కొంటారు. బిందు సేద్యాన్ని అనుసరించడం ద్వారా తక్కువ నీరు ఖర్చవుతుంది. అది దిగుబడి పెంచడానికి కూడా సహాయపడుతుంది. రైతులు శాస్త్రీయ పద్ధతులను విశ్వసించడం, అనుసరించడం మొదలు పెట్టాలి” అని కనక్ లత వ్యాఖ్యానించారు. వ్యవసాయంలో అనుభవం లేకపోయినా కనక్ లత పట్టుదలతో సేంద్రియ పద్ధతులను అనుసరించి, కొత్త టమాటా రకాలను పండించడం ద్వారా అధిక దిగుబడిని సాధించి రైతులకు స్ఫూర్తిగా నిలవడం అభినందనీయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here