“నేను రైతును కావడం నా అదృష్టం”అంటారు మహారాష్ట్రకు చెందిన పరమానంద్ గవానే. మిరజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలంకి గ్రామం ఆయన సొంతూరు. నిజానికి మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రం. అలాంటి చోట కేవలం రెండు ఎకరాల నుండి 15 టన్నుల మామిడి పండ్లను పండిస్తూ పరమానంద్ అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఆయన సాగు చేస్తున్న ప్రతి ఎకరంలో కేసర్ మామిడి రకానికి చెందిన చెట్లు 900 దాకా ఉన్నాయి.
62 ఏళ్ల పరమానంద్ గవానే మామిడి సాగులో అల్ట్రా హై-డెన్సిటీ ప్లాంటింగ్ (యుహెచ్‌డిపి) పద్ధతిని అవలంబించారు. ప్రపంచవ్యాప్తంగా మామిడి తోటల పెంపకం కొరకు ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఇతర సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పోల్చితే ultra high-density planting (UHDP) విధానం 200% ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా, అది పండు రుచిని, తాజాదనాన్ని కోల్పోనీకుండా చేస్తుంది.
గత సంవత్సరం, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు, రాయ్‌పూర్ వంటి పలు నగరాలకు చెందిన కొనుగోలుదారులు పరమానంద్ తోటలో పండిన పండ్లను కొనుగోలు చేశారు. వాటిలో ఒక్కొక్కటీ 250 నుండి 400 గ్రాముల బరువున్న మామిడి పండ్లు ఉన్నాయి. తొలిసారి 2015లో కాత వచ్చినప్పుడు ఎకరానికి 3 టన్నుల దిగుబడి వచ్చింది. కాగా, ఇప్పుడది 2020లో ఎకరానికి 7.5 టన్నులకు పెరిగింది. సరైన యాజమాన్య పద్ధతులను అనుసరిస్తే ఎకరానికి 10 టన్నుల మామిడి పండ్ల దిగుబడిని సైతం సాధించగలమని పరమానంద్ అభిప్రాయపడ్డారు.
గతంలో పరమానంద్ కేవలం ద్రాక్ష మాత్రమే సాగు చేసేవారు. ఆయన ఒకసారి లింగ్నూర్ గ్రామంలో ఒక రైతు అధిక సాంద్రత కలిగిన తోటల పద్ధతిని అనుసరించడం చూశారు. అయితే ఆ రైతు ఆ పద్ధతిని గురించిన వివరాలు చెప్పేందుకు పెద్దగా ఇష్టపడలేదు. దీంతో పరమానంద్ తన విధానాలను తాను సొంతంగా అవలంబించాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా తన పద్ధతులు కనుక విజయవంతమైతే తన పండ్ల తోటను అందరి కోసం తెరచి ఉంచడంతో పాటు తన సాగు అనుభవాలను కూడా తోటి రైతులతో పంచుకోవాలని నిశ్చయించుకున్నారు. అలా ఆయన ఇప్పుడు ప్రతి నెలా తన వ్యవసాయ క్షేత్రానికి 50 మంది దాకా రైతులను ఆహ్వానిస్తారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ గత సంవత్సరం ఆయన తోటను 2 వేల మందికి పైగా సందర్శించడం విశేషం. మే, జూన్ నెలల్లో చెట్లు పండ్లతో నిండుగా ఉన్నప్పుడు ఈ సందర్శకుల సంఖ్య గరిష్ఠంగా ఉంటుంది.

తన మామిడి తోటలో పరమానంద్ గవానే

పరమానంద్ తోట చాలా విలక్షణమైంది. ఎందుకంటే భారతదేశంలోని చాలా UHDP తోటల్లో 700 లకు మించి చెట్లు ఉండవు. సాంప్రదాయ పద్ధతిలోనైతే ఎకరానికి 40 చెట్లను మాత్రమే పెంచుతారు. “మిరజ్ పరిసరాల్లోని వేడిమితో కూడిన పొడి వాతావరణం, ఇక్కడి మట్టి UHDPను అనుసరించేందుకు అనువైన ప్రదేశంగా ఉంటుంది. కేసర్ మామిడి రకాన్ని పెంచడానికి ఈ అధిక సాంద్రత పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఇతర రకాలైన అమ్రపాలి, మల్లికా, సింధు వంటివి కూడా ఇలా పండించవచ్చు. ఏదేమైనా, ఈ పద్ధతిలో సరైన యాజమాన్య పద్ధతులను అనుసరిస్తూ సంవత్సరానికి రెండుసార్లు చెట్ల కొమ్మలను కత్తిరించాల్సిన అవసరం ఉంటుందని రత్నగిరి హార్టికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ డీన్ డాక్టర్ బి. ఆర్ సాల్వి చెప్పారు. ఈ పద్ధతిలో కొమ్మలను కత్తిరిస్తూ సాధారణంగా 7 అడుగులకు మించి చెట్లు పెరగకుండా చేస్తారు. సాంప్రదాయ సాగు పద్ధతుల్లో మామిడి పూర్తి స్థాయిలో కాతకు రావాలంటే 7 నుండి 8 సంవత్సరాలు పడుతుంది. కానీ అధిక సాంద్రత పద్ధతిలో మామిడి తోటలు 3 నుండి 4 సంవత్సరాలలోనే పూర్తి కాతకు వస్తాయి.
ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికాల్లో యుహెచ్‌డిపి పద్ధతిని చాలా సంవత్సరాలుగా ఆనుసరిస్తూ వస్తున్నారు. కాగా, ఇప్పుడిప్పుడే మన దేశంలో కొంత మంది ఔత్సాహిక రైతులు సాగులో అధిక సాంద్రత పద్ధతిని అవలంబిస్తున్నారు. పరమానంద్ గవానే కథనం ప్రకారం, UHDP పద్ధతి ఉత్పాదకతను (దిగుబడి) మెరుగుపరుస్తుంది. అలాగే నీటి వినియోగాన్ని కూడా ఇది 50 శాతం తగ్గిస్తుంది.
ఈ పద్ధతిలో మామిడి చెట్లను చక్కగా వరుసలలో సాగు చేసి పండిస్తారు. బిందు సేద్యం తాలూకు పైపులు చెట్లకు చుట్టుపక్కల అమర్చి ఉంటాయి. “నేను 70 శాతం సేంద్రియ పద్ధతులను, 30 శాతం రసాయన (ఎరువుల) విధానాలను మిశ్రమంగా అనుసరిస్తున్నాను. శిలీంద్ర సంహారకాల (fungicide)ను కూడా వాడతాను.” అని పరమానంద్ చెప్పారు. “ఈ పద్ధతిలో మనం వేసే ఎరువులు చెట్లకు ఎక్కువ మోతాదులో అందుతాయి” అని ఆయన వివరిస్తారు.

ఎకరానికి 6 లక్షలు లాభం

పరమానంద్ ఎకరానికి 1,00,000 రూపాయల దాకా ఖర్చు చేస్తారు. ఇందులో ప్రధానంగా ఎరువులు, లేబర్ ఖర్చుల వంటివి ఉంటాయి ఈ పెట్టుబడితో ఆయన ఎకరానికి 6,00,000 రూపాయల దాకా సంపాదిస్తారు. గతేడాది మరో రెండు ఎకరాల్లో ఆయన మామిడి మొక్కలు నాటారు. ఆయన వ్యవసాయ క్షేత్రానికి సాధారణ సందర్శకులలో ఒకరు విశాల్ పరమ్నే (32). ఆయన ఇటీవలి కాలం వరకు కొల్హాపూర్‌కు చెందిన డాక్టర్ జె జె మాగ్డమ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ప్రస్తుతం టెస్సోల్వ్ సెమీ కండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆయన డిజైన్ ఇంజనీర్‌గా ఉన్నారు. పరమానంద్ యుహెచ్‌డిపి పద్ధతి నచ్చి తన వెల్లంకి గ్రామంలోని నాలుగు ఎకరాల భూమిలో విశాల్ పరమ్నే మామిడి తోట వేసుకోవాలని యోచిస్తున్నారు.
“పరమానంద్ గవానే సర్ మామిడి తోటలాంటిది మా ప్రాంతంలో అరుదు. ఎందుకంటే ఆయన నాలుగు ఎకరాల తోటలో 3,600 మామిడి పండ్ల చెట్లు ఉన్నాయి. చాలా మంది రైతులు ఇక్కడ ద్రాక్ష మాత్రమే పండిస్తారు” అని విశాల్ పరమ్నే చెబుతారు.

మొదటి సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రకారం కత్తిరింపు, కాత వచ్చిన వెంటనే చెట్ల ఎదుగుదలను పెంపొందించేందుకు ఏటా సరైన నిర్వహణ, సెప్టెంబరులో చెట్ల పెరుగుదలను ఆపడం వంటి కొన్ని ముఖ్యమైన సాంకేతిక అంశాలు ఈ అధిక సాంద్రత విధానంలో భాగం. తేమ లేమిని నివారించడం, ఫలదీకరణ సాంకేతికత ద్వారా తగిన మోతాదులో అవసరమైన పరిమాణంలో పోషకాలను అందించడం కోసం బిందు సేద్యం ఉపయోగపడుతుంది. ఈ అధిక సాంద్రత పద్ధతికి బిందుసేద్యం ఎంతో ఉపయుక్తకరం. నాణ్యమైన పండ్లతో అధిక దిగుబడిని పొందటానికిది చాలా అవసరం. గవానే కథనం ప్రకారం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లోని అనేక మంది రైతులు తన పద్ధతిని అనుసరిస్తున్నారు. మామిడి తోటలకు సంబంధించి UHDP విధానం 200లకు పైగా ఎకరాలలో విస్తరించి ఉంది.
కేసర్‌తో పాటు, పరమానంద్ గవానే సంవత్సరానికి రెండుసార్లు కాత కాసే ఉత్తరాంధ్రకు చెందిన రుమానియా రకాలను కూడా తన తోటలో పెంచుతున్నారు. వీటితో పాటు బేనిషాన్, టామీ అట్కిన్స్ (ఫ్లోరిడా, యుఎస్ఎ) పండ్ల రకాల మామిడి చెట్లు కూడా ఆయన తోటలో ఉన్నాయి.

సూపర్ UHDP

పరమానంద్ గవానేకు ఇద్దరు కొడుకులు. ఒక అబ్బాయి సివిల్ ఇంజనీర్ శివానంద్. మరొక అబ్బాయి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ మాధవానంద్. వీరిద్దరి తోడ్పాటుతో ఆయన సోనాకా, ఎస్ఎస్ ద్రాక్ష రకాలను కూడా తొమ్మిది ఎకరాలలో సాగు చేస్తున్నారు. అలాగే ఒక మామిడి ప్లాంట్ నర్సరీని కూడా నడుపుతున్నారు. “నేను ప్రతి సంవత్సరం కేసర్ రకానికి చెందిన 40,000 మామిడి మొక్కలను అమ్ముతున్నాను” అని ఆయన చెప్పారు.
యుహెచ్‌డిపిని పద్ధతిని అనుసరించడం ద్వారా మామిడి సాగులో విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇసుక లేదా సున్నపు రాతి నేలలు, ఆల్కలీన్ లేదా నీరు నిల్వ ఉండే నేలలు మినహా మిగతా అన్ని నేలల్లోనూ అధిక సాంద్రత మొక్కల విధానాన్ని అనుసరించవచ్చని వ్యవసాయ నిపుణులు అంచున్నారు. పరమానంద్ గవనే ఎకరానికి 674 మొక్కలకు భిన్నంగా ఎకరానికి 12 ft by 4 ft చొప్పున నాటారు.

UHDP సాంకేతిక పరిజ్ఞానంలో ఇన్‌పుట్‌ల (ఉత్పాదకాల) నిర్వహణ కీలకం. బిందు సేద్యం దీనికెంతో ఉపయోగపడుతుంది. ఎరువులు అందించడం సరేసరి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో అల్ఫోన్సో, అలంపూర్, బేనిషాన్, తోతాపురి రకాలకు ఈ UHDP విధానాన్ని అనుసరించవచ్చు. అలాగే బిహార్‌లో బొంబాయి, హిమ్‌సాగర్, లంగ్డా, చౌసా రకాల మామిడి పండ్ల తోటలకు ఈ పద్ధతిని అవలంబించవచ్చు. ఇక గోవాలో మన్‌కౌరద్; గుజరాత్‌లో అల్ఫోన్సో, కేసర్ ; కర్ణాటకలో అల్ఫోన్సో, బెంగళూర, నీలం, మల్లికా; తమిళనాడులో అల్ఫోన్సో, బంగినపల్లి, నీలం, బాంబే గ్రీన్, దశహరి, లంగ్డా; ఉత్తర ప్రదేశ్‌లో, మహారాష్ట్రల్లో అల్ఫోన్సో, కేసర్, రత్న మామిడి రకాల సాగుకు UHDP అనువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
UHDPలో చాలా ముఖ్యమైన, క్లిష్టమైన ప్రక్రియ ఏమిటంటే కొమ్మలు, రెమ్మల కత్తిరింపు. మధ్య, దక్షిణ భారత దేశంలో జూన్ 15 లోపు పండ్లను తెంపిన వెంటనే ఈ పని చేయాలి. “కత్తిరింపు చేసిన ఒక నెల తరువాత, కొత్తగా పుట్టుకొచ్చిన రెమ్మలు సన్నబడటం చాలా అవసరం” అని పరమానంద్ చెబుతారు. సూపర్ యుహెచ్‌డిపి ద్వారా ప్రయోజనం పొందిన పరమానంద్ గవానే, ఇది ఉత్పాదకతను 2-3 రెట్లు పెంచుతుందని గట్టిగా చెబుతున్నారు. మన రైతులు కూడా నిపుణుల సలహా సంప్రదింపులతో ఈ విధానాన్ని పాటిస్తే మామిడి సాగు తప్పక విజయవంతమౌతుంది.

మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.
Reach Parmanand Gavane on +91 74482 31351

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here