హిందూ నూతన సంవత్సరారంభాన్ని పురస్కరించుకుని 2021 ఏప్రిల్ 13 న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) భూసారం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. సంఘ్ అనుబంధ సంస్థ ‘అక్షయ్ కృషి పరివార్’ ఈ ప్రచారోద్యమాన్ని చేపడుతోంది. భూసార పరిరక్షణ, రసాయన ఎరువుల దుష్ర్పభావాల గురించి వివరించడం ద్వారా దేశవ్యాప్తంగా రైతులతో కనెక్ట్ కావడం ఈ ప్రచార కార్యక్రమ లక్ష్యం..
గత నాలుగు సంవత్సరాలుగా వివిధ సంబంధిత వర్గాలతో చర్చించిన తరువాత ఈ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు. అనేక గ్రామాల్లో ఉగాది రోజున భూమి పూజతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. “రైతుల ఆర్థిక పరిస్థితి బాగా లేదు. పంట ఉత్పత్తిని పెంచడానికి వారు వివిధ రకాలైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు. కాని రసాయనాల వాడకం అంతిమంగా భూసారాన్ని దెబ్బతీస్తోంది. అంతేకాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా అది ప్రభావితం చేస్తోంది”అని ఆర్ఎస్ఎస్ ప్రచారోద్యమ జాతీయ కన్వీనర్ జయరామ్ సింగ్ పాటిదార్ అన్నారు. సేంద్రియంగా పండించిన పంటకు మార్కెట్‌లో మంచి ధరను లభిస్తోందని ఆయన చెప్పారు. ఈ ప్రచారం ద్వారా, రైతులకు భూసార పరిరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తామనీ, రసాయనాలను ఎందుకు ఉపయోగించకూడదో అవగాహన కల్పిస్తామనీ ఆయన తెలిపారు. గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భగవతి ప్రకాశ్ మాట్లాడుతూ, జీవ వ్యవసాయం వల్ల పంట దిగుబడి తగ్గుతుందంటూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. భూసారాన్ని ప్రభావితం చేయడంతో పాటు రసాయనాల వాడకం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తున్నాయన్నారు. వర్క్‌షాప్‌లు, సెమినార్లు, క్షేత్ర ప్రదర్శనల ద్వారా రసాయన ఎరువుల కంటే బయో ఫార్మింగ్, సాంప్రదాయ పద్ధతులను అనుసరించడం ఎలా ఎక్కువ దిగుబడిని ఇవ్వగలదో రైతులకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. భూమి ఉత్పాదక సామర్థ్యాన్ని కాపాడడంతో పాటు, బయో ఫార్మింగ్ దీర్ఘకాలంలో రైతుల ఆదాయాన్ని పెంచడానికి సహాయపడుతుందని భగవతి ప్రకాశ్ వివరించారు.

RSS Chief Sri Mohan Bhagwat

రైతులు ఎంతగా కష్టించినా రసాయనాల వాడకం వల్ల దిగుబడి తగ్గడమే కాక అది భూసారాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని ప్రచారోద్యమం ద్వారా వివరించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. అందుకు ప్రత్యామ్నాయంగా బయో ఫార్మింగ్ రూపంలో సంఘ్ రైతులకు ఒక పరిష్కారాన్ని అందిస్తోంది. గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని రైతులను కోరుతోంది. శ్రీ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ శ్రీ మోహన్ భాగవత్ కూడా పలు సందర్భాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించాలని ఉద్బోధించారు. 2021 ఫిబ్రవరి చివరి వారంలో, ఆదిలాబాద్ జిల్లాలో, Eklavya Foundation నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మోహన్‌జీ భాగవత్ సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యతను వివరించారు. పంటలకు కనీస మద్దతు ధర లభించినప్పటికీ రైతులు రసాయన వ్యవసాయం వల్ల అంతిమంగా నష్టపోక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here