ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకోడేరు గ్రామానికి చెందిన ఒక రైతు నల్ల బియ్యం సాగు చేయడంలో విజయం సాధించారు. ఆయన పొలంలోని పంట కోతకు సిద్ధమవుతోంది. చాలా మంది ఆక్వాకల్చర్‌‌కు మారుతున్న ఈ తరుణంలో, ఈ ప్రాంతంలో నల్ల బియ్యం పండించడం విశేషమే. ఏది ఏమైనా ఔత్సాహిక రైతు ఆరేపల్లి వెంకట్రామయ్య ఈ కొత్త వరి రకంతో తన ప్రయోగాలను కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. మొదట చిన్నజీయర్ స్వామి ఇచ్చిన ప్రసాదంలో నల్ల బియ్యంతో వండిన అన్నాన్ని చూశారు వెంకట్రామయ్య. ఆ ప్రసాదం నల్ల బియ్యంతో తయారు చేయబడింది. దీంతో ఆసక్తి కలిగి ఆ బియ్యం తాలూకు వివరాలు తెలుసుకురమ్మని తన కొడుకును చిన్న జీయర్ ఆశ్రమానికి పంపారు వెంకట్రామయ్య. ఈ వంగడాన్ని తమ నల్ల రేగడి భూమిలో పండించాలనుకుంటున్నట్లు వెంకట్రామయ్య కుమారుడు స్వామీజీకి చెప్పారు. వెంకట్రామయ్య కోరిన కొన్ని నల్లవడ్లను ఇస్తూ ఈ వంగడాన్ని రసాయనాలు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేయాలని షరతు పెట్టారు చిన్న జీయర్ స్వామీజీ. కానీ నల్ల బియ్యం పండించేందుకు వెంకట్రామయ్య చేసిన తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తరువాత, ఆయన హైదరాబాద్ నుండి సేకరించిన కొద్దిపాటి వడ్లతో వెంకట్రామయ్య మళ్లీ తన ప్రయోగాత్మక సాగును కొనసాగించారు.
“నేను 100 గ్రాముల వరి విత్తనాలతో ఈ సాగు ప్రారంభించాను. వాటితో 20 కిలోల కంటే ఎక్కువ నల్ల బియ్యాన్ని పండించాను.” అని వెంకట్రామయ్య చెప్పారు. ఆయనకు ఈ 20 కిలోల నల్ల బియ్యం పండించేందుకు మూడు పంటల సమయం అంటే 18 నెలలు పట్టింది. ప్రస్తుతం వేసిన పంట కోసం, ఆయన 250 గ్రాముల వడ్లని మాత్రమే ఉపయోగించారు. నల్ల బియ్యం వరి రకం ఎత్తుగా పెరుగుతుందని, అది బలమైన గాలులకు తట్టుకోలేక వాలిపోతుందని ఆయన గుర్తించారు. దీంతో ఈ రకానికి అనుగుణంగా, ఆయన దానిని రోడ్డు పక్కన ఉన్న 30 సెంట్ల భూమిలో సాగు చేశారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించి వేపనూనె, ఆవుమూత్రం, ఆవుపేడ, బెల్లం వంటివాటిని ఉపయోగించారు. అయితే కొంత మేరకు DAP, పొటాష్, యూరియాలను కూడా వాడారు. “నాకు ఉన్న పరిమిత వనరులతో, వీలైనంత వరకు నేను సేంద్రియ పద్ధతులను అనుసరించాను. ప్రస్తుతం పంట బాగానే ఉంది కాని ఈదురు గాలులు వీస్తే ఏమవుతుందో చూడాలి” అని వెంకట్రామయ్య అన్నారు. ఏ అవాంతరాలూ లేకపోతే ఈసారి కనీసం 20 బస్తాల నల్ల బియ్యం దిగుబడి వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. మామూలుగా ఎకరానికి 40 బస్తాల వరి పండితే మంచి దిగుబడి కింద లెఖ్క. అలా చూస్తే 30 సెంట్ల భూమి నుండి ఇరవై బస్తాల దిగుబడి రావడమంటే బంపర్ క్రాప్ అనే అనుకోవాలి.
ఇక సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన నల్ల బియ్యం క్యాన్సర్ రోగులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, రక్తపోటు సమస్యలున్నవారు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నవారికి మంచిదని వెంకట్రామయ్య చెబుతున్నారు. ప్రస్తుతం తన పంట కోసం కొంత DAP, యూరియాలను ఉపయోగించిన మాట వాస్తవమేనని వెంకట్రామయ్య అంగీకరించారు. నిజానికి ఆ మాత్రం కూడా రసాయన ఎరువులను కూడా ఉపయోగించకూడదని ఆయన భావిస్తున్నారు. బ్లాక్ రైస్ ధాన్యం నలుపు రంగులో ఉన్నప్పటికీ, మిల్లింగ్ చేసేటప్పుడు పై పొట్టును తొలగించి తెల్లవిగా చేసుకోవచ్చునని ఆయన చెబుతున్నారు.
సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే నల్ల వరి సాగులో పెద్దగా ఖర్చు ఉండదని వెంకట్రామయ్య వివరించారు. తన పొలంలో నల్లబియ్యం సాగుకు కేవలం 40 కిలోల సేంద్రియ ఉత్పాదకాలను మాత్రమే ఉపయోగించానని ఆయన తెలిపారు. ఇదిలావుంటే, వెంకట్రామయ్య నల్ల వరి క్షేత్రం సమీప ప్రాంతాలవారినందర్నీ విశేషంగా ఆకర్షిస్తోంది. చాలా మంది వచ్చి నల్ల వరి పంటను ఆసక్తిగా చూసి వెళుతున్నారు. ఇప్పుడు తన వద్ద మరిన్ని రకాల నల్ల బియ్యం వడ్లు ఉన్నాయని, త్వరలోనే వాటితో మరిన్ని ప్రయోగాలు చేయబోతున్నామని వెంకట్రామయ్య తెలిపారు. అయితే, దీంతో అన్నం వండుకోవాలంటే మాత్రం నల్ల బియ్యాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వరి అన్నమే ప్రధాన ఆహారమైనా నల్ల బియ్యం మాత్రం పూర్తిగా కొత్తదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here