చౌడు భూమిని సారవంతం చేయడంలో విజయం సాధించారు హైదరాబాద్‌కు చెందిన 60 ఏళ్ల రైతు ఎం.ఎస్‌. సుబ్రహ్మణ్యం రాజు. సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన సుబ్రహ్మణ్యం రాజు తాను వ్యవసాయదారుడ్ని అని చెప్పుకోవడానికే ఇష్టపడతారు. అందులోనూ ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించడం అంటే ఆయనకు మక్కువ. వ్యయసాయంలో కొత్త కొత్త పద్ధతులు పాటించడం అంటే సుబ్రహ్మణ్యం రాజుకు మరింత ఇష్టం. అలా తమ చౌడు భూముల్ని సారవంతం చేసి, చక్కని పంట దిగుబడులు సాధిస్తున్నారు సుబ్రహ్మణ్యం రాజు. తమ పొలాల్నే కాకుండా చుట్టపక్కల మరి కొందరికి చెందిన 400 ఎకరాల చౌడు భూములను కూడా ప్రయోగాత్మకంగా సారవంతం చేసి చూపించారు. వ్యవసాయం చేయడంలో ఎంతో అనుభవం ఉన్న సుబ్రహ్మణ్యం రాజు ఆరేళ్ల క్రితమే పూర్తిగా ఆర్గానిక్‌ ఫార్మింగ్ మొదలుపెట్టారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఊహించని విజయాలు సాధిస్తున్నారు.

పీహెచ్‌ (పొటెన్షియన్‌ ఆఫ్ హైడ్రోజన్‌) స్థాయి 8 అంతకన్నా ఎక్కువ ఉన్న చౌడుభూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చిన తన అనుభవాన్ని సుబ్రహ్మణ్యంరాజు వెల్లడించారు. వందలాది చౌడుభూములను ఎకరాలను ఆయన సారవంతమైన నేలలుగా మార్చగలిగారు.

చౌడుభూమి అంటే ఏమిటి?:

చౌడుభూమి ఎలా ఉంటుందంటే.. నీరు ఏమాత్రం భూమి లోపలికి ఇంకదు.. అలాగే నీటిని నేల అంతా పాకనివ్వదు. చౌడుభూమి పై పొర దృఢంగా ఉంటుంది. నీటిని విస్తరించకుండా చేయడం వల్ల చౌడుభూమి గట్టిగా మారిపోతుంది. చౌడుభూమిలోని మొక్కల్లో ఎదుగుదల ఉండదు. ఒకవేళ కొద్దో గొప్పో ఎదిగినా మొక్కలు బలహీనంగా ఉంటాయి. ఆపైన చౌడుభూమిలోని మొక్కల్ని తెగుళ్లు కూడా బాగా పట్టిపీడిస్తాయి. ఈ కారణాల వల్ల చౌడుభూమిలో వేసే పంటల్లో దిగుబడి చాలా తక్కువగా అయినా వస్తుంది.. లేదా మొక్కలైనా చనిపోతాయి. చౌడుభూముల్లో నాటిన విత్తనాలు సరిగా మొలకెత్తవు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి లక్షలాది చౌడుభూములు ఉన్నాయని సుబ్రహ్మణ్యంరాజు చెబుతున్నారు.నేల పైపొర ఎప్పుడైతే గట్టిగా మారుతుందో అప్పుడు భూమి లోపలికి నీరు చొచ్చుకుపోయే అవకాశాలు క్రమేపీ తగ్గిపోతాయి. తద్వారా డ్రై డేస్‌లో కూడా భూమిపైనే నీరు నిల్వ ఉండిపోతుంది. సాగునీరు, మంచి డ్రైనేజ్ సౌకర్యాలు సరిగా లేని భూమిలో పంటలు పండించడం కష్టం. ఇలాంటి నేలలో మొక్కల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు కూడా క్రమేపీ తగ్గిపోతాయి. ఇలా వందలాది ఎకరాల చౌడుభూముల్లో రైతులు పంటలు పండించలేక, లేదా పండక వృథాగా వదిలిపెట్టేస్తున్నారు.

చౌడుభూముల్లో ముందుగా పీహెచ్‌ స్థాయిల్ని సమతుల్యం చేసుకోవాలని సుబ్రహ్మణ్యంరాజు చెబుతున్నారు. భూమిని వ్యవసాయయోగ్యం చేయాలంటే పీహెచ్‌ స్థాయి 7 ఉండడం తప్పనిసరి అన్నారు. పీహెచ్‌ స్థాయి 6 కన్నా తక్కువ ఉన్న నేలలు టీ, బెర్రీస్ పంటలకు అనువుగా ఉంటాయని తన సుదీర్ఘ వ్యవసాయ ప్రయోగ అనుభవంతో సుబ్రహ్మణ్యంరాజు విశ్లేషిస్తున్నారు. కాల్‌కేరియస్‌ సాయిల్‌ (కాల్షియం కార్బొనేట్‌, కాల్షియం బై కార్బోనేట్‌)లో మామూలు చౌడు భూములకన్నా ఎక్కువగా పీహెచ్‌ స్థాయిలు ఉంటాయని, అలాంటి భూమిలో మొక్కలు ఆరోగ్యంగా ఎదిగే అవకాశం లేదన్నారు. ఇలాంటి భూములను కూడా ఆర్గానిక్ విధానాల్లో తాను సరిచేయగలనని చెప్పారు.

సుబ్రహ్మణ్యంరాజు ఆరేళ్లుగా చౌడుభూములను సారవంతమైన భూములుగా మార్చడంలో ఆర్గానిక్‌ విధానాల్లో ప్రయోగాలు చేశారు. అందులో నాలుగేళ్లుగా ఆయన నేరుగా చౌడుభూములను సారవంతం చేసి చూపిస్తున్నారు.

సుబ్రహ్మణ్యంరాజు సీక్రెట్ ఏంటి?:

చౌడుభూముల్ని సారవంతం చేసే క్రమంలో సుబ్రహ్మణ్యంరాజు ముందు కాస్త కష్టపడాల్సి వచ్చిందనే చెప్పాలి. తన విధానంలో భూమిని సారవంతం చేయడానికి ఎకరానికి ఒక సీజన్‌కు రెండు నుంచి ఆరు వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు భూమిలోని పీహెచ్‌ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. అలా రెండు సీజన్లలో తన విధానాన్ని ఆచరిస్తే ఆ తర్వాత ఖర్చు తగ్గుతుందని చెప్పారు.

నేలను తటస్థీకరించి, వ్యవసాయ యోగ్యం చేయడానికి సుబ్రహ్మణ్యంరాజు మైక్రో ఆర్గానిజమ్‌, బాక్టీరియా, ఆర్గానిక్ కంపోస్ట్‌ను వినియోగించారు. ఈ విధానాన్ని రైతులకు అర్థమయ్యేలా వివరించడానికి పలువురు రైతుల చౌడుభూముల్లోకి తానే స్వయంగా వెళ్లారు. భూమిలో ఏ పంట పండించాలనే దానిపై పీహెచ్‌ స్థాయిల్ని పెంచాలా లేదా తగ్గించాలా అనేది ఆధారపడి ఉంటుందన్నారు.రాజు టెక్నిక్స్‌ ఇవీ:

  1. నీటి కోత టెక్నిక్స్‌పై దృష్టిపెట్టాలి: భూసారం క్షీణించి, చాలా కాలంగా వృథాగా ఉండిపోయిన భూమికి నీటి కోత విధానం ఆచరించడం చాలా ముఖ్యం. ఏ పంట వేయాలన్నా ముందే ఆ భూమిలో నీటి కోత విధానం నిర్వహించాలి.
  2. ఏ పంట వేయాలి?: నీటి కోత విధానం పూర్తయిన తర్వాత ఆ భూమిలో ఏ పంట వేయాలనేది సరిగా నిర్ణయించుకోవాలి. ఏ పంట సాగు చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి భూమిలోని పీహెచ్‌ స్థాయిల్ని సరిచేసుకోవాలి. విభిన్న రకాల మొక్కలు నాటడం కూడా ఆ భూమిలో సారం పెరగడానికి దోహదం చేస్తుంది.
  3. పొలంలో జంతువులు తిరిగేలా చూడడం: నిజానికి ఏ భూమి అయినా సారవంతం కావాలంటే జంతువుల పాత్ర అత్యంత ప్రధానమైనది. ఆవులు, కోళ్లు తదితర జంతువులు, పక్షుల తిరిగిన నేలలో పంట ఉత్పత్తి సామర్ధ్యం బాగా పెరుగుతుంది. జంతువులు, పక్షుల ద్వారా నేలకు కావాల్సినంత బలవర్ధకమైన కంపోస్ట్‌ ఎరువు లభిస్తుంది. దాంతో పంట దిగుబడి కూడా ఇబ్బడిముబ్బడిగా వస్తుంది.

ఇలాంటి ఆర్గానిక్‌ విధానాలతో చౌడుభూముల్ని వ్యవసాయయోగ్యంగా మార్చుకుందామా మరి!

మరింత సమాచారం కొరకు.. agriinfoindia@gmail.com ద్వారా తెలుసుకోవచ్చు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here