రోజువారీ అవసరాలకు మాత్రమే ఆ కుటుంబం ఇప్పుడు డబ్బులు వెచ్చిస్తోంది. అవి కూడా వంటనూనెలు, సుగంధ ద్రవ్యాలకు మాత్రమే వారు డబ్బులు ఖర్చుచేస్తున్నారు. ఆ కుటుంబం మాత్రమే కాదు ఆ ఊరిలోని అనేక మంది ఇలాగే ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవనం గడుపుతున్నారు. ఇదంతా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కృషి ఫలితమే అని చెప్పాలి. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు వాడే రోజుల్లో ఆ గ్రామంలోని రైతులందరూ నష్టాలు, కష్టాలు పడేవారు. అయితే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పార్థసారధి నారా ప్రకృతి వ్యవసాయంలో చేసిన కృషి ఫలితంగా వారంతా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. తన కుటుంబాన్ని, గ్రామాన్ని ప్రకృతి పంటల వైపు ఆకర్షితులయ్యేలా కత నడిపించిన మన యువ రైతు గురించి, పార్థసారథి చేసిన కృషి గురించి తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్‌ రాయలసీమ ప్రాంతానికి చెందిన అనంతపురం జిల్లాలోని ఉప్పనేసినపల్లిలో పార్థసారథి నారా పుట్టాడు. పార్థసారథి తాత, తండ్రులు అంతా వ్యవసాయ కుటుంబం. ఆ కుటుంబం 90 ఎకరాల్లో రసాయనాలు వినియోగించి వ్యవసాయం చేసేవారు. పార్థసారథి తాతగారు వ్యవసాయ కార్యకలాపాల్లో దిట్ట. ఆయన క్రమపద్ధతిలో చేసే వ్యవసాయంలో పార్థసారథి కుటుంబానికి కరువు కాలాల్లో కూడా ఆహారలోటు అనే ప్రశ్నే తలెత్తలేదు. పైగా ఆ రోజుల్లోనే ఆయన చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయల పంటలు పండించేవారు. తమ తాత, తండ్రులు పండించే 90 ఎకరాలు తర్వాతి కాలంలో ఆ కమతాన్ని 120 ఎకరాలకు పెంచారు. ఆ కమతంలో ప్రతిరోజూ 30 మంది కూలీలు పనిచేసేవారు. 1990 దశకంలో ప్రకృతి పంటల నుంచి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించి చేసే వ్యవసాయం వైపు మారిపోయారు. రసాయనాల వాడకం మొదలవడంతో పార్థసారథి తండ్రి, చిన్నాన్నలకు వ్యవసాయ పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. దాంతో ఆర్థిక ఇబ్బందులూ పెరిగిపోయాయి. పార్థసారథి కుటుంబం ప్రకృతి వ్యవసాయం చేసే రోజుల్లో తమ కమతంపై కుటుంబాలు ఆధారపడి బతికేవి. రసాయన ఎరువుల గుప్పిట్లో తమ కుటుంబం చిక్కడంతో ఖర్చులు పెరిగిపోయాయి. కుటుంబానికి ఆర్థిక, సామాజిక ఇబ్బందులూ మొదలయ్యాయి.

ఇలాంటి కష్ట దశలో పార్థసారథి ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించడం మొదలెట్టారు. అలా తమ కుటుంబంతో పాటు వందలాది మంది రైతులను కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేలా పార్థసారథి చేయగలిగాడు.

పార్థసారథి 2001లో రాయలసీమ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. ఆ రోజుల్లో ఐటీ సెక్టార్‌లో అంతగా ఉద్యోగాలు వచ్చేవి కావు. దాంతో కుటుంబానికి తాను ఆర్థికంగా చేయూతనివ్వలేకపోయాడు. దీంతో తమ కుటుంబాన్ని అప్పుల నుంచి ఎలా బయట పడేయాలనే దారుల్ని పార్థసార్థి వెతికాడు. తమ జిల్లాలోనే కొందరు రైతులు సాంప్రదాయ పంటలు వేరుసెనగ, కంది, వరి పంటలతో పాటు హార్టీకల్చర్ విధానంలో బొప్పాయి పంట పండిస్తున్నారని పార్థసారథి తెలుసుకున్నాడు. అదే విధానంలో పంటలు పండించిన పార్థసారథి 2002లో 10 లక్షల విలువైన ఫలసాయం సాధించాడు. అయితే.. మార్కెటింగ్ అనుభవం లేక తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనేవారిని గుర్తించేందుకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. ఇక 2004లో పార్థసారథి ఐటీ జాబ్ సంపాదించి అమెరికా వెళ్లిపోయాడు. అయినప్పటికీ అతని ఆలోచనలు అన్నీ వ్యవసాయానికి పూర్వ వైభవం ఎలా తీసుకురావాలా? అనే ఆలోచనల చుట్టూనే తిరిగేవి. ఇలాంటి ఆలోచనల పరంపరలోనే కేవలం నాలుగేళ్లకు అంటే 2008లో పార్థసారథి మన దేశానికి తిరిగి వచ్చి, బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసేవాడు. బెంగళూరులో ఉంటూనే వారం విడిచి వారం వారాంతాల్లో తన సొంతూరు వచ్చేవాడు. అక్కడ అరటి పంటతో పాటు బత్తాయి తోటను ఐదేళ్ల పాటు సేంద్రీయ విధానం పెంచాడు. తమ పొలంలోని కొంత భూమిని అరటి పంట పండించేందుకు అద్దెకిచ్చాడు. తాము పండించిన పంటలో 40 శాతం మాత్రమే అమ్మగలిగేవాడు. ఓ 30 శాతం పంట వృథా అయ్యేది. మిగిలిన 30శాతం పంటను తమ కుటుంబం వినియోగించుకుంటూనే స్నేహితులకు పంచిపెట్టేవాడు. పార్థసారథి పంట పండించేందు 2009లో 7 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే.. పంటను వ్యాపారులకు 11 లక్షల రూపాయలకు అమ్మేందుకు ఒప్పందం చేసుసుకున్నాడు. అయితే.. పంట కొనేందుకు ఒప్పందం చేసుకున్న వ్యాపారి 6 లక్షలు మాత్రమే చెల్లించాడు. దీంతో కొంత నష్టాన్ని పార్థసారథి చవిచూడాల్సి వచ్చింది.ఇలా ఉండగా.. ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలో తెలంగాణలో శిక్షణ ఇస్తున్నారని 2012 లో పార్థసారథి ఓ తెలుగు మ్యాగజైన్‌లో చదివి తెలుసుకున్నాడు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై పార్థసారథి ముందుగా తన కుటుంబ సభ్యులతో చర్చించాడు. వారంతా అందుకు సరే అన్నారు. జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (జేబీఎన్‌ఎఫ్‌) శిక్షణను పార్థసారథి 2013లో పూర్తిచేసుకున్నాడు. అందులో అంతర పంటల సాగు విధానాలు, ఆవుపేడ, గోమూత్రం, బెల్లం, శనగపిండి, నీటితో తయారు చేసే జీవామృతం వినియోగించి పంటలు పండించడం ప్రారంభించాడు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పార్థసారథి పొలంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా వచ్చాయి. ప్రకృతి వ్యవసాయ విధానంలో తాను పండించిన టాక్సిన్ ఫ్రీ పండ్లకు మంచి లాభాలు ఆర్జించాడు.

2015 నాటికి తమ మొత్తం వ్యవసాయం రసాయన రహిత ప్రకృతి పంటల పండించే దిశగా అడుగులు వేశాడు. గతంలో ఒక్కో అరటి చెట్టు నుంచి 40-50 కిలోల పంట మాత్రమే వచ్చేది. అయితే.. ప్రకృతి విధానంలో 70 కిలోల వరకూ ఉత్పత్తి సాధించాడు. తర్వాత పార్థసారథి, ఆయన కుటుంబం ఓ 3 ఎకరాల్లో పైలెట్ ప్రాజెక్టుగా కూరగాయ పంటలు వేశారు. అందులో కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా పంట వచ్చింది. ఆ పంటను పట్టణాల్లోని మార్కెట్లలో విక్రయించాడు. పార్థసారథి ప్రకృతి పంటలకు పట్టణాల్లో మంచి ఆదరణ వచ్చింది. తన ఆర్గానిక్‌ కూరగాయల్ని తీసుకున్న వినియోగదారుల నుంచి రెండు వారాల్లో 4 వేల మందికి పైగా ఫోన్‌ కాల్స్‌ చేసి ప్రశంసించినట్లు పార్థసారథి ఆనందంతో చెప్పాడు. తన వ్యవసాయ విధానాన్ని వ్యవసాయాదికారులు, వ్యవసాయశాస్త్ర విద్యార్థుకు కూడా అభినందించారన్నాడు. దీంతో 20 ఎకరాల్లో ప్రకృతి పంటల కూరగాయలు పండిస్తున్నాడు.ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల గ్రూపులో చేరిన తర్వాత పార్థసారథికి ఓ విషయం బాగా అర్థం అయింది. ఆర్గానిక్ పంటల్ని ఎలా ఎక్కడ విక్రయించాలో తెలియక పలువురు ఇబ్బందులు పడుతున్నారని పార్థసారథి తెలుసుకున్నాడు. అలాగే ఆర్గానిక్‌ విధానాలు, మార్కెటింగ్‌ విషయాలపై ఆ రైతులకు అనేక అనుమానాలు ఉండేవి. వారి అనుమానాలను పటాపంచలు చేసేందుకు, వారందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు  అనంతపురం జిల్లాలో ఆర్గానిక్ పంటల విక్రయానికి పట్టణ ప్రాంతాల్లో మంచి మార్కెట్ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. అలా కొందరు రైతులతో కలిసి తమ గ్రామానికి చుట్టుపక్కల 40 కిలోమీటర్ల పరిధిలోని పట్టణాల్లో రైతులే నిర్వహించే బజార్లలో 2016- 17లో రసాయన రహిత పంటల్ని విక్రయించడం ప్రారంభించాడు. అనంతరం బెంగళూరులోని గేటెడ్ కమ్యూనిటీస్‌లో కూడా తమ ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయం ప్రారంభించాడు. అదే ఏడాది పార్థసారథి ‘అనంత నేచురల్స్‌’ పేరిట రైతు ఉత్పత్తుల కంపెనీ ప్రారంభించాడు. తమ ఆర్గానిక్‌ వ్యవసాయోత్పత్తుల వ్యాపారం ఊపందుకోవడంతో పార్థసారథి తన ఐటీ జాబ్‌కు రాజీనామా చేశాడు. ఇక అప్పటి నుంచి ఆర్గానిక్‌ వ్యవసాయం చేయడంలో 150 మంది రైతులకు సహాయం చేశాడు. స్వచ్ఛమైన, తాజా ఆర్గానిక్‌ ఉత్పత్తుల విక్రయం ద్వారా పార్థసారథి ఆదాయం సంవత్సరానికి కోటి రూపాయలు వస్తోంది. ఆర్గానిక్ వ్యాపారం ద్వారా అనంత నేచురల్స్‌ సంస్థ 10 లక్షల లాభాలు ఆర్జిస్తోంది. దాన్ని మరింత లాభాల దిశగా నడిపించాలని చూస్తున్నారు.

ఇలాంటి రివల్యూషన్‌నే తాను కోరుకున్నానని పార్థసారథి అన్నాడు. అప్పులు, అనారోగ్యాల బారి నుంచి విముక్తి పొందాలంటే ప్రకృతి వ్యవసాయమే మేలైనదని పార్థసారథి చెబుతున్నాడు.పార్థసారథితో మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే..  www.ananthanaturals.comలో సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here