దేశీ ఆవు పెరుగుతో ఎంత లాభం ఉందో తెలుసా? మరీ ముఖ్యంగా రసాయన ఎరువులు వినియోగించే రైతులకు దేశీ ఆవు పెరుగు ఎంత ప్రయోజనం కలిగిస్తుందో.. మరెంత డబ్బు ఆదా చేసిపెడుతుందో తెలుసా? 50 కిలోల యూరియా కంటే, రెండు కిలోల దేశీ ఆవు పెరుగుతో చేసిన ప్రయోగం మేలైన ఫలితాలు ఇస్తోందని రుజువైంది. 50 కిలోల యూరియాకి బదులు రెండు కిలోల దేశీ ఆవు పెరుగులో 15 రోజులు రాగి ముక్క ఉంచి, తర్వాత ఆ పెరుగును వంద లీటర్ల నీటితో కలిపి ఎకరం పంటపై పిచికారీ చేయాలి. పెరుగును ఆ విధంగా చల్లడం వల్ల మొక్కలు వరుసగా 45 రోజులు ఆకుపచ్చగా ఉంటాయి. అదే యూరియా అయితే 25 రోజులు మాత్రమే మొక్కను పచ్చగా ఉంచగలుగుతుంది. ఇలా పులియబెట్టిన దేశీ ఆవు పెరుగుతో సహజసిద్ధమైన ప్రకృతి పంటలు పండించవచ్చు.

పంటతో పాటు పాడి కూడా ఉన్న అన్నదాతలు ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగలుగుతారన్న విషయం పూర్వకాలం నుంచీ మన దేశంలో అందరికీ తెలిసిన విషయమే. దేశీ ఆవు పాలను తోడు పెట్టి, తయారైన పెరుగును మట్టికుండలో వేయాలి. దాంటో రాగి లేదా కంచుతో తయారు చేసిన అట్లకాడ, లేదా గరిటె వేసి 10–15 రోజులు పులియబెట్టాలి. తెల్లగా ఉన్న పెరుగు పచ్చగా మారిన తర్వాత ఆ పెరుగును చిలికి, తగినంత నీరు కలిపి ద్రావణంగా తయారు చేసుకోవాలి. అలా తయారైన పుల్ల మజ్జిగతో చక్కని ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సాధించవచ్చని బీహార్‌ రైతులు అనుభవంతో చెబుతున్నారు. ఇలా తయారు చేసిన ద్రావణాన్ని బీహార్‌ రైతులు ‘తుటియా’ అని పిలుస్తారు.పులిసిన దేశీ ఆవు పెరుగు పంట పొలానికి అన్ని రకాల పోషకాలూ అందిస్తున్నట్లు రుజువైంది. దాంతో పాటు పురుగుమందుగా కూడా దేశీ ఆవు పుల్ల మజ్జిగ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేటతెల్లమైంది. పులిసిన దేశీ ఆవు పెరుగును వాడడం ద్వారా కూరగాయ పంటలు, పండ్ల తోటల సాగులో అధిక ఆదాయం సంపాదించవచ్చు. పులిసిన దేశీ ఆవు పెరుగు వినియోగాన్ని బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలోని మచ్చాయ్‌ గ్రామానికి చెందిన రైతు శాస్త్రవేత్త దినేష్‌ కుమార్‌ ఆవిష్కరించారు. ఆ ప్రాంత రైతు సమాఖ్యల సంఘానికి ఆయన అధ్యక్షుడు. దినేశ్‌ 2011లో పెరుగు ద్రావణాన్ని తయారు చేశారు. అప్పటి నుంచీ ఆయన పంటలకు రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలకు బదులు పెరుగు ద్రావణాన్నే వాడుతున్నారు. ముందుగా దినేశ్‌ తమ గ్రామంలోని ఐదారుగురు రైతులతో కలిసి పెరుగు ద్రావణాన్ని వినియోగించారు. ఫలితాలు బాగా వస్తుండడంతో ఇతర రైతులకు కూడా ఆయన పెరుగు ద్రావణం తయారీ, వినియోగాన్ని నేర్పిస్తున్నారు.

యూరియా, డీఏపీ, ఫాస్పేట్‌ లాంటి రసాయన ఎరువులు, రసాయన పురుగుల మందులేవీ వాడకుండా.. జీవామృతం కూడా వినియోగించకుండా కేవలం ‘పెరుగు ఎరువు’తోనే అనేక సంవత్సరాలుగా బీహార్‌లోని అనేక జిల్లాల రైతులు పంటలు పండిస్తుండడం విశేషం. పెరుగు ఎరువు వాడిన రైతులు తమ పంటల ఎదుగుదల, దిగుబడి విషయం నిశ్చింతగా ఉంటున్నారు. పుల్ల మజ్జిగ వినియోగిస్తుండడంతో తమ కడుపులో చల్ల కదలకుండా ఉందని బీహార్ రైతులు ఆనందంగా చెబుతున్నారు.పైరు ఏపుగా ఎదిగేందుకు, చీడ పీడల్ని సమర్థవంతంగా నియంత్రించడంలో పులిసిన దేశీ ఆవు మజ్జిగ బాగా పనిచేస్తుండడంతో దాన్ని ఉపయోగించే రైతులూ పెరిగారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌, వైశాలి, సమస్తిపూర్‌, బెగుసరాయ్‌, దర్బంగా తదితర జిల్లాల్లో దాదాపు లక్ష మంది రైతులు పంటల సాగులో పెరుగు ద్రావణం వాడుతున్నారు. ఖరీఫ్‌, రబీ రెండు పంటల్లోనూ 60 వేల మంది రైతులు పెరుగు ద్రావణాన్ని వినియోగిస్తుండడం గమనార్హం. పెరుగు ఎరువుతో మంచి ఫలితాలు వస్తుండడంతో రైతు సంఘాల ద్వారా రైతులు ప్రచారం చేస్తున్నారు. పెరుగు ద్రావణం తయారీపై శిక్షణ కార్యక్రమాలు కూడా వారు నిర్వహిస్తున్నారు.

పుల్లగా మారిన దేశీ ఆవు పెరుగు ద్రావణాన్ని 40 రోజుల వయస్సు నుంచీ పైరుపై పిచికారి చేసుకోవాలి. వానపాముల ఎరువుతో కలిపి మొక్కల వేర్ల వద్ద, పాదుల్లో కూడా వేసుకోవాలి. ఢిల్లీకి చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కూడా తమ సేంద్రీయ పంట ఉత్పత్తుల కోసం పెరుగు ద్రావణాన్నే వినిగిస్తున్నారని వ్యవసాయ శాస్త్రవేత్త దీనేశ్‌ తెలిపారు.

పంటల సాగులో దేశీ ఆవు పెరుగు వినియోగంపై పరిశోధనలు చేసేందుకు పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుకు వస్తుండడం గమనార్హం. శాస్త్రవేత్తలు పరిశోధనలు పూర్తి చేసి, ఆమోద ముద్ర వేస్తే పెరుగు ద్రావణం వినియోగం మరింతగా పెరుగుతుందని దినేశ్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెరుగు ద్రావణం వినియోగాన్ని మరింతగా ప్రచారంలోకి తెచ్చేందుకు దినేశ్‌ విశేషంగా కృషిచేస్తున్నారు.

దేశీ ఆవు పెరుగు ద్రావణం ద్వారా పంటలకు నత్రజని, భాస్వరం, పొటాషియం లాంటి ప్రధాన పోషకాలు సమకూరతాయని దినేశ్‌ వివరిస్తున్నారు. ఒక ఎకరాకు ద్రవ రూప రసాయనాల కోసం రైతులు సుమారు 1,100 రూపాయలు ఖర్చు చేస్తున్నారని, అదే రెండు లీటర్ల దేశీ ఆవు పెరుగుతో ద్రావణం తయారు చేసుకుని వినియోగిస్తే ఖర్చు బాగా తగ్గిపోతుందని, దిగుబడి ఎక్కువగా వస్తుందని దినేశ్‌ అంటున్నారు.

పులిసిన దేశీ ఆవు పెరుగు ద్రావణం వాడిన వ్యవసాయ క్షేత్రాల్లో పంటలకు ఎలాంటి హానీ ఉండదని దినేశ్‌ వివరించారు. పంటలకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారాయన. పెరుగు ద్రావణం వాడకంతో రైతులకు రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలకు పెట్టే ఖర్చు ఆదా తగ్గిపోతుందని అంటారాయన. యూరియా లాంటి రసాయన ఎరువుల కోసం చేసే ఖర్చుతో పోల్చితే పెరుగు ద్రావణం చాలా చౌకగా అయిపోతుంది.మామిడి తోటల్లో, కూరగాయల సాగులో పెరుగు ద్రావణం వినియోగించినప్పుడు సాగు ఖర్చు తగ్గిందని, దిగుబడి కూడా బాగా వచ్చిందని మచ్చాయ్‌కు చెందిన రైతులు జగన్నాథ్‌ ప్రసాద్‌, అజిత్‌కుమార్‌, కిరణ్మయి చెప్పారు. ఎక్కువ పొలాల్లో పంట సాగు చేసే రైతులతో పాటు నగరాలు, పట్టణాల్లో మేడలపైన సేంద్రీయ విధానంలో ఇంటి పంటలు పండించుకునే అర్బన్‌ ఫార్మర్ల వినియోగానికి కూడా పెరుగు ద్రావణం ఎంతో అనుకూలంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

సిక్కిం రాష్ట్రం మొత్తం దేశీ ఆవు పెరుగును చాలా ఏళ్లుగా పంటల సాగు కోసం ఉపయోగిస్తోంది. సిక్కిం రాష్ట్రంలో పూర్తిగా యూరియాను నిషేధించారు.

అన్నదాతలూ దేశీ ఆవు పెరుగును మనం కూడా ఉపయోగించి ఫలితం ఎలా ఉంటోందో అనుభవపూర్వకంగా చూద్దాం.. ఆ పైన మన అనుభవాలను మరింత మందితో పంచుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here