దేశంలో ఇక బయో-సీఎన్‌జీ ట్రాక్టర్ల యుగం ప్రారంభం కానుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2021 ఫిబ్రవరి 12న ఢిల్లీలో బయో సీఎన్‌జీ ట్రాక్టర్‌ (CNG Tractor)ను ఆవిష్కరించారు. ఈ ట్రాక్టర్‌ ఉపయోగించడం ద్వారా ఇంధన వ్యయంలో సంవత్సరానికి లక్షన్నర రూపాయల దాకా ఆదా కాగలదని అంచనా. రామాట్ టెక్నో సొల్యూషన్స్, టామసెట్టో అచిల్ ఇండియా సంయుక్తంగా ఈ సీఎన్‌జీ ట్రాక్టర్‌‌కు రూపకల్పన చేశాయి.
ట్రాక్టర్‌ను సిఎన్‌జీగా మార్చడం వల్ల కలిగే పలు ప్రయోజనాలను మంత్రి గడ్కరీ ఈ సందర్భంగా వివరించారు. ఇది డీజిల్ నుండి బయో సిఎన్‌జిగా మార్చబడిన ట్రాక్టర్ అని ఆయన తెలిపారు. డీజిల్ నుండి బయో సీఎన్జీకి ట్రాక్టర్ మార్పిడి చేయడం వల్ల రైతుకు ఖర్చులు తగ్గుతాయనీ, తద్వారా ఆదాయం పెరుగుతుందని ఆయన వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాల కల్పనకు కూడా ఇది తోడ్పడుతుందన్నారు. ఇది స్వచ్ఛమైన ఇంధనంతో నడుస్తుందనీ, ఇందులో కార్బన్‌, సల్ఫర్ వంటి కాలుష్య కారకాలు చాలా తక్కువగా ఉంటాయనీ, 85 శాతం దాకా దీని వల్ల కాలుష్యం తగ్గుతుందనీ ఆయన తెలిపారు. అంతేగాక, పెట్రోల్ ధరల హెచ్చుతగ్గులతో పోల్చితే సిఎన్‌జీ ధరలు మరింత స్థిరంగా ఉంటాయని ఆయన అన్నారు. సిఎన్‌జీ వాహనాల సగటు మైలేజ్, డీజిల్ లేదా పెట్రోల్ వాహనాల కంటే చాలా ఎక్కువని ఆయన పేర్కొన్నారు. సీఎన్జీ వాహనాల మెయింటెన్స్‌ కూడా చాలా తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.

వ్యవసాయ కార్యకలాపాల్లో సీఎన్‌జీ ట్రాక్టర్‌ను ఉపయోగించడం వల్ల రైతుకు రూ. 1 లక్ష నుండి లక్షన్నర దాకా వ్యయం ఆదా అవుతుందని గడ్కరీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం నెరవేరే దిశలో సీఎన్జీ ట్రాక్టర్ ఆవిష్కరణ మరో ముందడుగు అవుతుందన్నారు. మున్ముందు వ్యవసాయంలో ఉపయోగించే ప్రతి యంత్రాన్నీ సీఎన్జీ ఇంధనానికి మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటిదాకా రైతులు పంట వ్యర్థాలను తగులబెడుతూ వచ్చారు. దీంతో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఇప్పుడు రైతులు తమ పంటవ్యర్థాలను బయో సీఎన్జీ తయారుచేసేందుకు విక్రయించే వీలు కలుగుతుంది. ఇది కూడా రైతులకు అదనపు ఆదాయాన్ని చేకూర్చుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
కాగా, ఈ ట్రాక్టర్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు, నరేంద్ర సింగ్ తోమర్, పరషోత్తం రూపాలా, ధర్మేంద్ర ప్రధాన్, వి కె సింగ్ కూడా పాల్గొన్నారు.

India’s First ‘CNG Tractor’ Video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here