మన దేశంలో రైతులు పంటకోతలు పూర్తయ్యాక వరిగడ్డిని తగులబెట్టడం పరిపాటి. దీని వల్ల పొగ కమ్ముకుని కాలుష్య సమస్య తలెత్తుతోంది. ఉత్తరాదిలోనైతే హర్యాణా, పంజాబ్ రైతులు గడ్డిని తగులబెట్టడం వల్ల ఏటా ఢిల్లీ పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేస్తోంది. వరి పంట కోత అనంతరం రబీ సాగుకు మధ్య వ్యవధి చాలా తక్కువగా ఉండడం మూలాన ఆ ప్రాంతాల రైతులు గడ్డిని తగలబెట్టి పొలాలను తదుపరి పంటకు తయారు చేసుకుంటారు.
గడ్డిని ఇలా విచక్షణారహితంగా మండించడంతో అక్కడ కాలుష్యం పెను సమస్యగా పరిణమించింది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 2018 లో వ్యవసాయ వ్యర్థాల యాజమాన్యం (సిఆర్ఎం) పద్ధతులను కొన్నిటిని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందుకు ఏటా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా కేటాయిస్తున్నారు కూడా. మరోవైపు గడ్డి తగులబెడితే కేసులు పెట్టడం కూడా మొదలుపెట్టారు. కానీ వరి గడ్డిని తగులబెట్టడం చాలా చోట్ల ఇంకా కొనసాగుతూనే ఉంది. వరిగడ్డి ద్వారా కూడా రైతులకు ఎంతో కొంత ఆదాయం లభించేలా చేయడమొక్కటే దీనికి శాశ్వత పరిష్కారం. బయో-సీఎన్జీ తయారీలో వరిగడ్డి వాడకం వల్ల కొంత మేరకు దీనికి పరిష్కారం లభించవచ్చు. అలాగే వరిగడ్డితో కాగితాన్ని తయారుచేయడం మరొక చక్కని పరిష్కారం అవుతుంది. ఇందుకు థాయ్‌లాండ్‌కు చెందిన పాంగ్‌ థాయ్ ఫ్యాక్టరీ ఒక అద్భుతమైన మార్గం చూపుతోంది. ఈ కంపెనీ వరిగడ్డి నుండి బయో-డిగ్రేడబుల్ కాగితాన్ని తయారుచేస్తోంది. వాడి పారేసాక 30 రోజుల్లోనే ఇది మట్టిలో కలిసిపోతుంది. ఈ కాగితం పూర్తిగా రసాయనరహితం. నీరు, నూనె, గ్రీజు వంటి పదార్థాలతో నింపినప్పటికీ ఈ కాగితంతో తయారైన ప్లేట్లు, కప్పులు రెండు గంటల పాటు తడవకుండా ఉంటాయి.

ప్యాకేజింగ్ ఉత్పత్తులతో పాటు, ఫాంగ్ థాయ్ ఫ్యాక్టరీ నోట్‌బుక్‌లు, క్యాలెండర్‌లు, సావనీర్లు వంటి వాటికి సరిపోయే నాణ్యమైన కాగితాన్ని కూడా గడ్డితో తయారుచేయడం విశేషం. ఈ కాగితం మంచి డిజైన్లలోనూ లభిస్తోంది. పాంగ్‌ థాయ్ ఫ్యాక్టరీ ఇలా తన వినూత్నమైన ఉత్పత్తులతో మార్కెట్ సామర్థ్యాన్ని క్రమంగా విస్తరించుకుంటోంది.
థాయ్‌లాండ్‌లోని (Hua Suea Mae Tha Lampang ప్రావిన్స్) బాన్ సాంఖా (Ban Samkha) గ్రామంలో కూడా లోగడ విచ్చలవిడిగా వరిగడ్డిని తగులబెట్టడం జరిగేది. దీని వల్ల Co2 ఉద్గారాలు వెలువడేవి. పంటకాలం తర్వాత రైతులకు పని ఉండేది కాదు. కుటుంబాల పోషణకు తగినంత ఆదాయం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ఫాంగ్‌ థాయ్ ఫ్యాక్టరీ వరిగడ్డితో కాగితం తయారుచేసే ఆలోచనతో ముందుకు వచ్చింది. University of Chiang Mai సహకారం తీసుకుంది. రెండేళ్ల పాటు నిపుణుల సహాయంతో పరిశోధనలు నిర్వహించి ఒక సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి పరిచి 2018లో వరిగడ్డి కాగితం పరిశ్రమను నెలకొల్పింది. గడ్డితో నాణ్యమైన కాగితం తయారవడం అలా మొదలైంది. అంతేగాక ఈ కంపెనీ కాగితం తయారుచేసే ఇతర పరిశ్రమలకు ప్రాసెస్ చేసిన గుజ్జును (wet pulp) విక్రయించడం సైతం ప్రారంభించింది. దీంతో బాన్ సాంఖాలో వరిగడ్డి తగులబెట్టే సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కూడా లభించినట్లైంది. వరిగడ్డి కాగితం తయారీ ద్వారా ఈ కంపెనీ ఏటా 28,000 టన్నుల కర్బన ఉద్గారాలను (CO2 emissions) నియంత్రిస్తుండడం మరో విశేషం. సంప్రదాయ పేపర్ తయారీ పరిశ్రమలు చెప్పలేనంత కాలుష్యాన్ని వాతావరణంలో వెదజల్లుతున్న సంగతి తెలిసిందే.
బాన్ సాంఖా గ్రామంలో 160 కుటుంబాలు నివాసం ఉంటాయి. కాగితం పరిశ్రమ వల్ల ఆ కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరింది. వరిగడ్డిని మండించే సమస్య కూడా తీరిపోయింది. ఇప్పుడు బాన్ సాంఖా అక్కడ ఆదర్శగ్రామంగా గుర్తింపు పొందింది. ఇందుకుగాను థాయ్ కంపెనీకి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన SEED Low Carbon Award – 2019 తో పాటు Waste Beneficiation క్యాటగిరీలో గ్లోబల్ అవార్డులు కూడా దక్కాయి. అన్నట్టు ఈ కంపెనీ మన దేశానికి కూడా వరిగడ్డితో తయారు చేసిన గుజ్జును ఎగుమతి చేయడం విశేషం. ఈ గుజ్జును కాగితం తయారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. ఇలా వ్యర్థాలను ఉపయోగించుకుని సంపదను సృష్టించడమెలాగో థాయ్‌లాండ్ మనకు నేర్పుతోంది. దీన్ని మన దేశంలో కూడా అంతటా అనుసరించవచ్చు. గుజ్జును థాయ్‌లాండ్ నుండి తెప్పించుకునే బదులు ఇక్కడే సులువుగా తయారు చేసుకోవచ్చు. దీంతో వరిగడ్డి మండించడాన్ని నివారించవచ్చు. మన రైతులకు అదనపు ఆదాయమార్గాన్ని కూడా చూపించవచ్చు. ఇందుకు కావలసిందల్లా ఒక సంకల్పం.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Contact details:
Fang Thai Factory Limited
Hua Sua, Lampang, Thailand
Phone: +66 818990394
Email: fangthaifactory@gmail.com
Website: https://www.fangthaifactory.com/

ఫాంగ్ థాయ్ ఫ్యాక్టరీలో వరిగడ్డి కాగితం తయారీ వీడియో:

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here