ప్రవాహానికి వ్యతిరేకంగా వెళితే, ఆ ఎదురీత వల్ల తరచు జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. అయితే రిస్క్ తీసుకుని, పర్యవసానాలను దృఢంగా ఎదుర్కొనేవారూ ఉంటారు. అలాంటివారు ఒక ప్రత్యేకతను ప్రదర్శించి విజయం సాధిస్తారు. బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన 34 ఏళ్ల శీతల్ సూర్యవంశీ ఇందుకు ఒక ఉదాహరణ.
కుటుంబం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ శీతల్ తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని జామ సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. అది కూడా పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లి వద్ద ఉన్న సాంప్రదాయక ‘షుగర్ బెల్ట్’ లో. ఈ ప్రాంతంలో చెరకు తప్ప ఇంకేదీ సాగు చేయరు. వేరే పంటల గురించి ఆలోచించరు కూడా. కానీ శీతల్ సూర్యవంశీ చెరకు కాకుండా జామ వేయాలనుకున్నారు. అది కూడా ఆర్గానిక్ విధానాల్లో. చివరికి తన ప్రయత్నం ఫలించింది. శీతల్ తన సంపాదనను రెట్టింపు చేసుకోవడంలో విజయం సాధించారు.
“సతారాలోని ఒక ప్రైవేట్ కళాశాల నుండి 2009-10లో పట్టభద్రుడనయ్యాక 2015 దాకా ఒక బహుళజాతి కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగం చేసాను. ఆ తర్వాత వ్యవసాయానికి మారి కొన్ని ప్రయోగాలు చేయాలనుకున్నాను. అందులో భాగంగా అప్పటిదాకా సాగుతూ వస్తున్న చెరకు సాగును మార్చాలనుకున్నాను” అని శీతల్ చెప్పారు.
సాంప్రదాయ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన శీతల్, చెరకు సాగుతో ఆశించినంత పెద్ద లాభాలేవీ రావని త్వరలోనే గ్రహించారు. అయితే తమ ప్రాంతంలో చెరకు సాగు చేయడం సంప్రదాయం. దాన్ని వెంటనే మార్చడం అంత సులువేం కాదు.
“చెరకు పంటకు మంచి దిగుబడి రావాలంటే చాలా నీరు అవసరం. పంట 17-18 నెలల్లో వస్తుంది. ఇది చాలా పెద్ద వ్యవధి. పైపెచ్చు చెరకును చక్కర కర్మాగారాలకు తరలించి అమ్ముకోవాలి. దానికి చెల్లించే డబ్బు కూడా 3 లేదా 4 నెలల తరువాతే బ్యాంకు ఖాతాలో పడుతుంది. అప్పటిదాకా రైతు వేచి ఉండాల్సిందే” అని చెబుతారు శీతల్.
“చెరకుపై ఎకరానికి ఏడాదికి రూ. 70,000 నుండి రూ. 75,000 దాకా ఆదాయం వస్తుంది. ఇక్కడ చాలా మంది రైతులు 10 నుండి 15 ఎకరాలదాకా భూమి కలిగి ఉంటారు. కనుక వారు ఏటా రూ . 9 నుండి 10 లక్షలు సంపాదిస్తారు. దీంతో వారు సంప్రదాయికంగా చెరకు సాగుకే అలవాటు పడిపోయారు. వారు మరో పంట సాగుకు ప్రయత్నం చేయకపోవడానికి ఇదొక కారణం. చిన్నరైతులకు ఇది నిజానికి గిట్టుబాటు కాదు” అని ఆయన చెప్పారు.

తన జామతోటలో శీతల్ సూర్యవంశీ

ప్రవాహానికి వ్యతిరేకంగా ఎదురీత

2015 లో, తన ఉద్యోగాన్ని వదిలేసిన శీతల్ సూర్యవంశీ తన పొలంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని భావించారు.
“మొదట్లో, నేను ద్రాక్ష సాగు చేద్దామనుకున్నాను, కానీ అప్పుడు అహ్మద్‌నగర్‌కు చెందిన ఒక స్నేహితుడు జామ వేయమని సూచించాడు. ఎందుకంటే షిర్డీ, ఆ పరిసర ప్రాంతాలలో దీనికి చాలా డిమాండ్ ఉంది. సాంగ్లీలోని నేల, వాతావరణ పరిస్థితులు కూడా ఈ పంటకు అనువుగా ఉంటాయి” అని తన అనుభవాన్ని వివరించారు శీతల్.
తాన స్థిరమైన ఉద్యోగంలోనే కొనసాగాలని తన కుటుంబం కోరుకుందనీ, ప్రయోగాలేవీ వద్దంటూ పోరు పెట్టిందనీ ఆయన చెప్పారు. “నా నెలవారీ ఆదాయంతో నేను కొనసాగాలని కుటుంబ సభ్యులు సూచించారు. సంప్రదాయ సేద్యం వదిలి కొత్త పంటలతో ప్రయోగాలు చేయడాన్ని మా తండ్రిగారు గట్టిగా వ్యతిరేకించారు” అని శీతల్ గుర్తు చేసుకున్నారు.
చివరికి రెండు ఎకరాల్లో మాత్రం కొత్త పంట వేసుకునేందుకు శీతల్ తన తండ్రిని ఒప్పించారు. మిగిలిన ఎనిమిది ఎకరాల్లో ఆయన చెరకునే పండించవలసి వచ్చింది.
“నేను ఒక్కో ఎకరంలో రెండు వేర్వేరు రకాల జామ వేశాను. పండ్లపై స్ప్రే చేసే విష రసాయనాల జోలికిపోకుండా పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించాను” అని శీతల్ చెప్పారు.
మొదటి పంట సీజన్‌లో శీతల్ తన 10 టన్నుల జామ దిగుబడిని అమ్మడం ద్వారా రూ. 3 లక్షలు సంపాదించగలిగారు. “అన్ని పెట్టుబడులు, ఖర్చులు పోను, 14 నెలల్లో రూ. 1.5 లక్షల లాభం సంపాదించాను. అది కూడా కేవలం రెండు ఎకరాల నుండే” అని గర్వంగా చెబుతారు శీతల్.

కల నిజమైన క్షణం

“సీజన్‌లో నా పండ్ల అమ్మకాలతో రోజుకు 10,000 రూపాయల దాకా సంపాదిస్తాను. ఇప్పుడు నేను ఆర్థికంగా బాగా స్థిరపడ్డాను. నన్ను చూసి చాలా మంది రైతులు నా విధానాలను అవలంబించారు” అని శీతల్ చెప్పారు. ఆ చుట్టు పక్కల 25 ఎకరాల్లో జామ సాగు చేసేందుకు కావలసిన మొక్కలను శీతల్ ఇతర రైతులకు అందించడం ఒక విశేషం.
“పంట పద్ధతిని మార్చడంపై నాకు అనుమానాలు ఉండేవి. మొదట్లో నేను ద్రాక్ష పండించటానికి ప్రయత్నించాను. కానీ అది ఆశించినంత విజయవంతం కాలేదు” అని సాంగ్లీలోని మరో రైతు వికాస్ చవాన్ చెప్పారు.
ఆ తర్వాత సేంద్రియ పద్ధతుల్లో 1.5 ఎకరాల భూమిలో జామ సాగు చేశానని వికాస్ చెప్పారు. “ఇందులో తెగుళ్ళను నివారించడానికి పెద్దగా చేయవలసిందేమీ ఉండదు. కొన్ని రకాల సేంద్రియ మిశ్రమాలు అందుకు సరిపోతాయి. జామ సాగు చేయడం ఎంతో తేలిక” అని ఆయన తెలిపారు.
మరో రైతు అభిజిత్ జగ్దలే కూడా శీతల్‌ సూర్యవంశీని చూసి జామ సాగు మొదలుపెట్టారు. ఇది తనకు రెండో సీజన్. “నేను ఒక ఎకరంలో 2,000 చెట్లు పెంచుతున్నాను. ఇది మొదలుపెట్టి 18 నెలలైంది. లాభాలు ఇలాగే కొనసాగితే జామ సాగును మరింత పెంచాలని ప్లాన్ చేస్తున్నాను” అని చెప్పారు అభిజిత్.
మొత్తం మీద ప్రయోగాలు చేసి తాను అనుకున్నది సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని శీతల్ చెబుతారు. “నా కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉంది. నా తండ్రికీ నమ్మకం కుదిరింది. మంచి లాభాలు కనుక వస్తే రిస్క్ చేయడం మంచిదేనని ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారు. పైగా నేనిప్పుడు నా చుట్టూ ఉన్న ఇతర రైతులకు సంప్రదాయ పంటలను వదిలి కొత్త ప్రయోగాలు చేయాలంటూ ప్రోత్సహిస్తున్నాను. ఇది నాకు బోనస్‌లాంటిది” అని ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తారు శీతల్ సూర్యవంశీ.

శీతల్ సూర్యవంశీ తోటలో పండిన జామకాయలు

తెలంగాణలో జోరుగా జామ సాగు

తెలంగాణలో కూడా తైవాన్‌ జామ సాగు ఇటీవల బాగా పెరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటకు చెందిన రైతు సాధినేని అప్పారావు విజయవంతంగా జామ సాగు చేస్తున్నారు. ఆయన మూడేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెం నర్సరీ నుంచి మొక్కలు తెప్పించుకుని ఎకరానికి 12వందల మొక్కల చొప్పున ఐదెకరాల్లో తైవాన్‌ జామ మొక్కలు నాటారు. ప్రభుత్వం 80శాతం సబ్సిడీపై అందించిన డ్రిప్‌ ఏర్పాటు చేసుకున్నారు. పది నెలలు తిరిగేసరికల్లా తొలి కాత చేతికొచ్చింది. ఎకరానికి తొలి సంవత్సరం 2 నుంచి 3 టన్నుల దిగుబడి వచ్చిందని అప్పారావు తెలిపారు. పెట్టుబడి, ఖర్చులు పోను ఏటా ఎకరానికి రూ. 80 వేలకు పైగానే మిగులుతుందని ఆయన చెబుతున్నారు.
అలాగే బొత్తలపాలెం గ్రామ రైతు పడిగెపాటి వెంకటరెడ్డి నాలుగు ఎకరాల్లో తైవాన్‌ జామ సాగుచేస్తున్నారు. మూడేళ్లుగా దిగుబడి బాగుండి మంచి ఆదాయం వస్తోంది. వ్యాపారులు నేరుగా తోట దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఇక నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన గిరిజన మహిళా రైతు బాణోతు రాజేశ్వరి 1.2 ఎకరాల్లో తైవాన్‌ జామ సాగుచేస్తున్నారు. మొదటి రెండు సంవత్సరాల్లోనే పెట్టుబడి మొత్తం తిరిగి రావడంతో పాటు ప్రతి సీజన్‌లో సుమారు లక్షన్నర దాకా లాభం వస్తోందని ఆమె చెబుతున్నారు. ఇక కస్తాల గ్రామానికి చెందిన బొమ్మర బోయిన సైదులు కూడా నాలుగు ఎకరాల్లో తైవాన్‌ జామ సాగు చేస్తున్నారు. ఒక్కో చెట్టు 50 కిలోల దిగుబడి ఇస్తోంది. వ్యాపారులే నేరుగా తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అలాగే దేవరకొండ మండలంలోని కొమ్మెపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటయ్య రెండేండ్లుగా రెండెకరాల్లో జామ సాగు చేస్తున్నారు. వారంలో మూడుసార్లు జామకాయలు విక్రయిస్తున్నారు. ఖర్చులు పోను అశించిన లాభం వస్తోందని చెబుతున్నారు వెంకటయ్య. సంప్రదాయ పంటల స్థానే రైతులు జామ వంటివి సాగు చేసేందుకు ఉత్సాహం చూపడం ఒక సానుకూల పరిణామం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here