ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాల సాగు కోసం రసాయన ఎరువుల వాడకాన్ని నివారించాలనీ, రైతులకు ఈ విషయంలో సమాజం పట్ల ఒక బాధ్యత ఉందనీ పలువురు అభిప్రాయపడ్డారు. సూర్యాపేటలో 2021 ఫిబ్రవర్ 14న జాతీయ స్థాయి రైతుల సమావేశం జరిగింది. అంతర్జాతీయ పప్పుధాన్యాల దినోత్సవం సందర్భంగా KVK రైతు మిత్ర ఫౌండేషన్, గాంధీ గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్తంగా “సస్టైనబుల్ అగ్రికల్చర్” (సుస్థిర వ్యవసాయం) అంశంపై ఈ జాతీయ స్థాయి రైతుల సమావేశాన్ని నిర్వహించాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 90 ఉత్తమ ఆదర్శ రైతు దంపతులకు ఈ కార్యక్రమంలో ‘పుడమి మిత్ర’ అవార్డులను ప్రదానం చేశారు. సూర్యాపేటలోని సీతారామ ఫంక్షన్ హల్‌ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇంధన శాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయంలో ప్రతీ రైతూ ఒక శాస్త్రవేత్తే అని ఆయన వ్యాఖ్యానించారు.
రసాయన ఎరువుల నుండి సేంద్రియ వ్యవసాయానికి మారిన తరువాత తాము సాధించిన విజయాలను రైతులు ఈ సమావేశంలో వివరించారు. రసాయన ఎరువుల వాడకాన్ని నివారించాలంటూ ఈ రైతులు పిలుపునిచ్చారు. రసాయనాలతో కూడిన సాగు అనారోగ్యకరమైన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడంతో పాటు భూసారాన్ని తగ్గిస్తుందని వారు హెచ్చరించారు.

ఆదిలాబాద్‌కు చెందిన జి రామేశ్వర్ అనే రైతు మాట్లాడుతూ, అధిక దిగుబడి సాధించడం కంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ముఖ్యమని సూచించారు. ఈ విషయాన్ని రైతులు తప్పక గుర్తుంచుకోవాలనీ, అధిక రసాయన ఎరువులు ఉపయోగించి పండించిన ఆహారధాన్యాలు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయనీ ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ఎరువుల అధిక వినియోగం భూసారాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. సేంద్రియ వ్యవసాయంలో పంటల దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ, ఇది భూసారం పరంగా మన వ్యవసాయ భూములను కాపాడుతుందన్నారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యం కూడా కాపాడబడుతుందని రామేశ్వర్ పేర్కొన్నారు.
గుంటూరుకు చెందిన మహిళా రైతు ఆర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, తాను బ్రాహ్మణ వర్గానికి చెందిన మహిళనైనప్పటికీ వ్యవసాయంలో ప్రవేశించానని చెప్పారు. మొదట మిద్దెపంటతో కూరగాయల సాగు చేపట్టాననీ, తన మొదటి ప్రయత్నమే విజయవంతమైందనీ ఆమె తెలిపారు. ఆ విశ్వాసంతోనే తన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు ఇవ్వడానికి బదులు సొంతంగా సాగు చేసేందుకు నిర్ణయించుకున్నానని నాగలక్ష్మి వివరించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వి సంబయ్య మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్లుగా సేంద్రియ వ్యవసాయ పద్ధతును అనుసరిస్తూ సాగు చేస్తున్నానని చెప్పారు. సాంబయ్య నుండి ప్రేరణ పొంది, 150 మంది దాకా రైతులు భూపాలపల్లి వద్ద సేంద్రియ-ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం విశేషం. కాగా, ప్రకృతి వ్యవసాయం చేపట్టేందుకు ఆసక్తి ఉన్న ప్రతి రైతుకూ ఒక ఆవు చొప్పున ఇవ్వాలని సాంబయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
సాగులో వినూత్నమైన పద్ధతులను అనుసరించిన తర్వాత తన ఆదాయం సంవత్సరానికి రూ .11 నుండి రూ .11 లక్షలకు పెరిగిందని నాగర్ కర్నూల్‌కు చెందిన లావణ్య అనే మహిళా రైతు చెప్పారు. సాంప్రదాయ పద్ధతులతో సాగు చేసినప్పుడు ఆమెకు సంవత్సరంలో కేవలం 11 రూపాయల ఆదాయం మాత్రమే లభించింది. దీంతో ఆమె ఆర్గానిక్ సాగు విధానాలు చేపట్టారు. తన నాలుగు ఎకరాల భూమిలో 30 రకాల పంటలను పంటలను ఆమె పండించారు. లావణ్య తన పంటల కోసం మార్కెట్ నుండి విత్తనాలను కొనుగోలు చేయరు. తన పొలంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా పండిన పంట తాలూకు విత్తనాలనే ఆమె ఉపయోగిస్తారు. ఇలా కార్యక్రమంలో పాల్గొన్న రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇతర రైతులకు స్ఫూర్తినిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here