2021-22 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త లెవీని ప్రతిపాదించింది. అది వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్. సెస్ అనేది ఒక ప్రత్యేక ప్రయోజనం ఆశించి ప్రభుత్వం వేసే పన్ను. ప్రాథమికమైన పన్ను రేట్లతో సెస్‌కు నిమిత్తం ఉండదు. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిధులు సేకరించడం.. కొత్త వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (Agriculture Infrastructure Development Cess-AIDC) ఉద్దేశ్యం. వ్యవసాయరంగంలోకి ఎక్కువగా ప్రైవేటు పెట్టుబడులు రావడం లేదని భావిస్తున్న కేంద్రం ఇప్పుడు ఆ కొరతను తీర్చడానికి సెస్ విధిస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కొన్ని వస్తువులపై AIDC ని ప్రతిపాదించారు. అయితే ఈ సెస్‌ను వర్తింపజేస్తున్నప్పుడు వినియోగదారులపై అదనపు భారం పడకుండా చూసుకున్నారు.
బంగారం, వెండి, దిగుమతి చేసుకునే యాపిల్, ఆల్కహాల్ (బీరు మినహా), పప్పుధాన్యాలు, పామాయిల్, యూరియా, బ్రాండెడ్‌తో సహా పెట్రోల్ / డీజిల్ వంటి 29 ఉత్పత్తులపై ఇక కొత్త సెస్ విధించబడుతుంది. అయితే 25 ఉత్పత్తులపై బేసిక్ కస్టమ్ డ్యూటీని (బిసిడి) తగ్గించారు. అన్ బ్రాండెడ్, బ్రాండెడ్ పెట్రోల్-డీజిల్‌లపై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ (బిఇడి)తో పాటు ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (సాడ్) తగ్గించబడ్డాయి. కొత్త సెస్ కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ద్వారా సర్దుబాటు అవుతుంది, కాబట్టి ఈ సెస్ వల్ల వినియోగదారులకు సంబంధించి పన్నులేవీ పెరగవు. వారిపై ఏ భారమూ ఉండబోదు.
రాజ్యాంగంలోని 270, 271 అధికరణాలను ఉపయోగించుకుని కేంద్రం సెస్ సేకరించి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ చేస్తుంది. ఏదేమైనా, సెస్ ద్వారా సమకూరే డబ్బును నిర్దిష్ట ప్రయోజనం కోసం ఉపయోగించడానికై ప్రత్యేకంగా ఏర్పాటు చేసే నిధికి బదిలీ చేయవలసి ఉంటుంది. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి – ఒకటి ఉపయోగాలు. ఇంకొకటి దాని ప్రభావం. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతో పాటు ఆ ఉత్పత్తిని సమర్థవంతంగా పరిరక్షించడం, ప్రాసెస్ చేయడం కోసం ఈ సెస్‌ను ఉపయోగిస్తారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ సెస్‌ను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ సెస్‌ను ప్రతిపాదించడం గమనార్హం. బహుశా రైతుల అభివృద్ధి కోసం ఎంతో చొరవ చూపుతున్నామన్న సందేశం పంపడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం కావచ్చు. కానీ మరోవైపు ఈ సెస్ ద్వారా సేకరించిన డబ్బుపై అధికారాలు కేంద్రానికే దఖలు పడనున్నాయి. కనుక ఈ సెస్‌లో రాష్ట్రాలకు వాటా ఉండదు. వ్యవసాయంపై విధించే సెస్ అవిభాజ్య కేంద్ర ఆదాయ వనరుల్లో భాగంగా ఉండబోతోంది.
సెస్ కోసం కస్టమ్స్ లేదా ఎక్సైజ్ సుంకాలలో సర్దుబాటు జరిగినప్పుడు, రాష్ట్రాలకు లభించే వాటా కాస్తా కుంచించుకుపోతుంది. బ్రాండెడ్ పెట్రోల్ ఉదాహరణే తీసుకోండి. కొత్త AIDC (సెస్) లీటరుకు రూ. 2.50 చొప్పున వసూలు చేయగా, బేసిక్ ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం తగ్గించబడ్డాయి. పెట్రోల్ విక్రయంపై లీటరుకు ఈ రూ. 2.50లో 41 శాతం (అంటే లీటరుకు రూ. 1.02) రాష్ట్రాలకు లభిస్తుండగా, మిగిలిన మొత్తం కేంద్రం వాటాగా ఉండేది. ఇప్పుడు, కేంద్రం మొత్తంగా రూ. 2.50ని AIDCగా వసూలు చేస్తుంది. కాబట్టి రాష్ట్రాల వాటా కుదించుకుపోతుంది.

రాష్ట్రాల వాటాకు కోత!

AIDC (సెస్) సర్దుబాటు కుడి జేబు నుంచి ఎడమ జేబులోకి మాత్రమే కావడంతో 29 వస్తువుల అమ్మకపు ధరలు పెద్దగా మారే అవకాశం లేదు. అంతిమ ధరలోని పన్ను భాగం చాలా ఉత్పత్తుల విషయంలో ఒకే విధంగా ఉంటుంది. అయితే, బంగారం, వెండి కొనాలని మీరు యోచిస్తున్నట్లయితే, డ్యూటీ భాగం 2.5 శాతం తగ్గుతుంది. కనుక బంగారం, వెండి ధరలలో ఇది కొంత తగ్గుదలకు దారితీస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో, సెస్ విధించడం వల్ల పెట్రోల్, డీజిల్‌లపై కేంద్ర పన్నులు కొన్ని పైసల మేరకు తగ్గిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. AIDC పరిధిలోకి వచ్చే అన్ని ఇతర ఉత్పత్తులకు సంబంధించి వినియోగదారులు తమ బిల్లులో ఎటువంటి మార్పునీ చూసే అవకాశం లేదు. అయితే పన్ను / సుంకం రిటర్నులను దాఖలు చేసేటప్పుడు దిగుమతిదారు లేదా ఉత్పత్తిదారు నిర్దిష్టంగా ఆ సర్దుబాటును చూపాల్సి ఉంటుంది.
వినియోగదారులపై భారం ఉండదు కనుక వారు సెస్ విషయంలో ఆందోళన చెందాల్సిందేమీ లేదు. కానీ రాష్ట్రాలకు కేంద్రం నుంచి పన్నుల రూపంలో సమకూరే ఆదాయంలో ఎంతో కొంత కోత పడే అవకాశం ఉంటుంది. ఇది కొన్ని రాష్ట్రాల సంక్షేమ పథకాలను ప్రభావితం చేయవచ్చు. ఏదేమైనా, రాష్ట్రాలు కూడా పెద్దగా ఆదాయం కోల్పోయేదేమీ ఉండబోదని కేంద్రం హామీ ఇస్తోంది. వాస్తవానికి, ఈ సెస్ ద్వారా రాష్ట్రాలకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఈ సెస్‌ ద్వారా ఆయా రాష్ట్రాలకు నిధులు కేటాయించబడతాయి.
ఇక మన దేశంలో, పంట ఉత్పత్తుల్లో వృథా వల్ల ఏటా రూ. 44 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. ఈ నష్టాలను అరికట్టేందుకు వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచవలసి ఉంటుందనీ, అందుకుగాను రాగల ఐదేళ్లలో రూ. 1,68,727 కోట్ల మేరకు వ్యయం జరగాలనీ జాతీయ మౌలిక వసతుల టాస్క్‌ఫోర్స్ కమిటీ (Task Force on National Infrastructure Pipeline -NIP) సూచించింది. కాబట్టి ఈ సెస్ ద్వారా సమకూరే నిధులతో మున్ముందు వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాల కల్పన మెరుగుపడవచ్చు. ఆ మేరకు ఈ సెస్ విధింపు రైతులకు, వ్యవసాయరంగానికి మేలే చేస్తుందని ఆశించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here